‘సంఘ్’లో ఆ ధర్మాగ్రహం ఏదీ?
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:51 AM
సంఘ్ పరివార్ అగ్ర నాయకుడు ఒకరితో నా మొట్టమొదటి ముఖాముఖీ సంభాషణ 1989లో జరిగింది. దివంగత అశోక్ సింఘాల్ (నాడు విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు) పాల్గొంటున్న విలేఖర్ల సమావేశానికి...
సంఘ్ పరివార్ అగ్ర నాయకుడు ఒకరితో నా మొట్టమొదటి ముఖాముఖీ సంభాషణ 1989లో జరిగింది. దివంగత అశోక్ సింఘాల్ (నాడు విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు) పాల్గొంటున్న విలేఖర్ల సమావేశానికి నన్ను పంపించారు. రామ జన్మభూమి ఉద్యమం దేశాన్ని ఊపేస్తున్న రోజులవి. రామశిల పూజా కార్యక్రమం ద్వారా రామ భక్తులను వీహెచ్‌పీ సంఘటితం చేస్తోంది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ‘పవిత్ర’ ఇటుకలు, విరాళాలు ఇవ్వాలని దేశ ప్రజలకు వీహెచ్‌పీ ప్రభావశీలంగా విజ్ఞప్తి చేసింది.
అయోధ్యలో ఆలయ నిర్మాణానికై ప్రజల నుంచి సేకరిస్తున్న విరాళాలకు లెక్కలు సరిగ్గా నిర్వహిస్తున్నారా? అని ఆ పత్రికా గోష్ఠిలో సింఘాల్‌ను ప్రశ్నించాను. నా ప్రశ్నకు ఆయన వెన్వెంటనే తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘ఇదేమి ప్రశ్న’ అని ఆయన తీక్షణ స్వరంతో నన్ను తిరిగి ప్రశ్నించారు. ‘కోట్లాది హిందువుల మనోభావాలతో మేము ఆటలాడుతున్నామని మీరు భావిస్తున్నారా?’ అని సింఘాల్ అన్నారు. ఆయన మాటల్లో ఆగ్రహమే కాదు, మనస్తాపమూ ధ్వనించింది. మత విశ్వాసాలను అడ్డుపెట్టుకుని తాము ఎటువంటి తప్పూ చేయబోమని, హిందువుల శ్రీరామ భక్తిని తాము నిష్కామంగా గౌరవిస్తామన్న భావోధృతి సింఘాల్ ప్రతిస్పందనలో ఉన్నది. ఈ కారణంగానే ఇంచుమించు నాలుగు దశాబ్దాలుగా ఆ మాటామంతీ నా మనసులో నిలిచిపోయింది.
1989లో ఏ ప్రశ్న అయితే సింఘాల్ ధర్మాగ్రహానికి కారణమయిందో ఇప్పుడు అదే ప్రశ్నను రామాలయ సంరక్షకులకు సంధిస్తున్నారు. అపారంగా వచ్చిన విరాళాలకు సరైన లెక్కలు చూపుతారా? వాటి వినియోగంపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉన్నదా? కోట్లాది భక్తుల విశ్వాసం, విరాళాల ఆలంబనతో నిర్మాణమైన ఆలయంలో నిధుల చోరీ, దుర్వినియోగం ఎలా జరిగింది? ఈ ప్రశ్నాస్త్రాలకు గురవుతున్న వ్యక్తి శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్. విరాళాల బాగోతం రచ్చకెక్కడంతో ఆ బాధ్యతల నుంచి వైదొలగాల్సిన అగత్యం ఆయనకు ఏర్పడింది. అశోక్ సింఘాల్ సన్నిహిత సహచరుడు అయిన చంపత్‌రాయ్ జీవితం వీహెచ్‌పీతో ముడివడి ఉంది. రామ్ మందిర్ ఉద్యమానికి అంకితమైన వ్యక్తిగా ప్రజల నుంచి గౌరవాదరాలు పొందుతున్న సదాచారి ఆయన. రాయ్ వ్యక్తిగతంగా నిరాడంబరుడు, నిజాయితీపరుడు అని ఆయనతో పరిచయమున్నవారందరూ చెబుతారు. అయితే వ్యక్తిగత సత్ప్రవర్తన సంస్థాగత సామర్థ్యానికి ప్రత్యామ్నాయం కాదు. భారీ నిధులను సక్రమంగా నిర్వహించేందుకు వ్యక్తిగత నిజాయితీ మాత్రమే సరిపోదు. ప్రజలు సమకూర్చిన నిధులు సురక్షితంగా సద్వినియోగమవ్వాలంటే వాటి లెక్కలు సక్రమంగా ఉండాలి.
వాటి నిర్వహణ వృత్తి నైపుణ్యాలతో జరగాలి, మరీ ముఖ్యంగా ఆ నిధులపై కఠినమైన పర్యవేక్షణ ఉండితీరాలి. వీటిలో ఏ మాత్రం లోటుపాట్లు ఉన్నా పర్యవసానాలు కేవలం పాలనా పరమైన పొరపాట్లకే పరిమితం కాకుండా నేరపూరిత నిర్ల్యక్షంగా పరిణమిస్తాయి. కోట్లాది భక్తుల నమ్మకాలకు ద్రోహం చేయటం కిందకు వస్తాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రజలు ఇచ్చిన వందల కోట్ల రూపాయల నిధులు ఆలయ ప్రాంగణంలోనే తస్కరణకు గురికావడం భక్తులకు నమ్మక ద్రోహం చేయడమే కాదూ? ఇదిగో ఈ కారణంగానే అయోధ్య అవినీతి సంఘ్ పరివార్‌కు ఒక కళంకమయింది. భారతదేశ ప్రజా జీవితంలో ఒక గొప్ప ప్రభావశక్తిగా ఎదిగిన అనంతరం సంఘ్ పరివార్, బహుశా ప్రప్రథమంగా ఎదుర్కొంటున్న కీర్తిప్రతిష్ఠల సంక్షోభమిది. దశాబ్దాలుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తనకొక విలక్షణ కీర్తిని పెంపొందించుకుంటూ వస్తోంది. సంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన కార్యాచరణ ఉన్న సంస్థ తమది అని సంఘీయులు సగర్వంగా చెప్పుకోవడం కద్దు. క్రమశిక్షణ, సేవ, జాతి నిర్మాణానికి అంకితమైన సాంస్కృతిక ఉద్యమం తమది అని వారు చెప్పుకుంటారు. ధర్మరక్షణకు అంకితమైన సంస్థ తమది అని, జాతి విశాల ప్రయోజనాలకు నిస్వార్థంగా పనిచేసేందుకు సుశిక్షితులైనవారే తమ కార్యకర్తలు అని సంఘ్ చెబుతుంది.
సంఘ్ చెప్పుకుంటున్న ఈ నైతిక ఆధిక్యతే ఇప్పుడు క్లిష్ట పరీక్ష నెదుర్కొంటున్నది. అయోధ్య ఆలయంలో నిధుల చోరీని ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలె సరిగానే ఖండించారు. ఆ అక్రమానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. హిందూ సమాజాన్ని అపఖ్యాతిపాలు చేసేందుకై అయోధ్య ఉదంతాన్ని ఉపయోగించుకోవడానికి ‘హిందూ–వ్యతిరేక’, ‘జాతి–వ్యతిరేక’ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని కూడా ఆయన అదే సమయంలో హెచ్చరించారు. ఇది విన్న వెంటనే ఒక ప్రశ్న అడగడం తప్పనిసరి: ‘కుట్రలా? అవి ఎక్కడ జరుగుతున్నాయి హోసబాలె గారూ?’ అశేష భక్తులు అపారంగా ఇచ్చిన నిధుల అపహరణ, దుర్వినియోగాన్ని బహిర్గతం చేయడం హిందూధర్మంపై దాడి ఎలా అవుతుంది? హిందూ ధర్మ పుణ్య పురుషుడి ఆలయ పవిత్రతను కాపాడేందుకే ఆ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించడం జరుగుతోంది. బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నవారికి ఇబ్బందులు సృష్టించిన కారణంగా జవాబుదారీతనం హిందూ ధర్మ వ్యతిరేకత అయిపోదు.
రామ్ మందిర్ ఉద్యమ లక్ష్య పరిపూర్తి అయినవేళ దానికి నైతిక మార్గదర్శకత్వం వహించినట్టు చెప్పుకున్న ఆరెస్సెస్, ఇప్పుడు ఆ ఉద్యమం సంక్షోభంలో పడిన సమయంలో అందుకు కారణమైన సంస్థాగత వైఫల్యాల బాధ్యత నుంచి దూరం జరగడం సబబేనా? ఈ ప్రశ్న ఎందుకంటే రామ జన్మభూమి ఉద్యమం కేవలం మరో రాజకీయ ఉద్యమం కాదు. అది సంఘ్ పరివార్ భావజాల కార్యాచరణ. ఆ భావజాలానికి అనుగుణంగా భారత్‌ను రూపొందించడమే దాని లక్ష్యం. వీహెచ్‌పీ ఆ లక్ష్యానికి మద్దతుగా ప్రజలను సమీకరించింది.
భారతీయ జనతా పార్టీ మున్నెన్నడూ లేని రీతిలో ఆ ఉద్యమ ఆలంబనతో ఎన్నికలలో విజయాలను సాధించింది. పరాకాష్ఠగా దేశ పాలనాధికారాన్ని స్వాయత్తం చేసుకున్నది. అయోధ్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన భావాలను సమకూర్చినది ఆరెస్సెస్సే. జనవరి 2024లో అయోధ్య రామాలయంలో బాల రాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ఆ ఆలయ ఆరంభం చరిత్రలో హిందువులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే దిశగా ఒక ‘నాగరికతా న్యాయ చర్య’ అని కూడా ఆయన పేర్కొన్నారు.
శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్‌లో నియమితులు అయిన వారందరూ సంఘ్ పరివార్, కేంద్ర ప్రభుత్వ విశ్వాసం పొందినవారేననడంలో సందేహం లేదు. ఆరెస్సెస్, బీజేపీ, వీహెచ్‌పీ నాయకత్వాలే వారిని ఎంపిక చేసి నియమించడం జరిగింది. మరి ట్రస్ట్ కార్యకలాపాలలో చోటుచేసుకున్న అవినీతికి కొంతమంది ఉద్యోగులను బాధ్యులను చేయడం సమంజసమేనా? ఒక సంస్థ లేదా ఉద్యమ విజయాలకే కాకుండా దాని వైఫల్యాలకు కూడా బాధ్యత వహించడం నైతిక విధి కాదా?
సరే, అయోధ్య రామాలయ నిర్వహణ తీరుతెన్నులపై ప్రశ్నలు కొత్తవేమీ కావు. అయోధ్యలో భూ సంబంధ లావాదేవీలపై ఆరోపణలు తొలుత 2022లోనే వచ్చాయి. ఆలయ పాలనలో పారదర్శకతపై అవి తీవ్ర అనుమానాలకు తావిచ్చాయి. ఆ ఆరోపణలు అంతిమంగా న్యాయ విచారణలో రుజువవుతాయా లేదా అన్నది అటుంచి, అసలు అవి వెలుగులోకి వచ్చినప్పుడే ఆలయ వ్యవహారాలపై మరింత జాగరూకత వహించి ఉండాల్సింది. కోట్లాది ప్రజల విశ్వాసంతో ముడివడి ఉన్న సంస్థల నిర్వహణలో ఎటువంటి అపారదర్శకతకు ఆస్కారముండకూడదు. అయోధ్య ఆలయంలో అవినీతి కేవలం నేరారోపణ అర్హత కంటే విస్తృత అంశం. ఎవరు ఆ అవినీతికి పాల్పడింది, ఎవరు శిక్షార్హులు అనే విష యాలను దర్యాప్తు అధికారులు, న్యాయ స్థానాలు నిర్ణయిస్తాయి. ఇక్కడ పరిగణనలోకి తీసుకోవల్సిన అంశం సంస్థాగత జవాబుదారీతనం. ఇది ముఖ్యం.
సంఘ్ పరివార్ భావజాల సాఫల్యానికి ప్రతీక అయోధ్య. రామాలయంలో నిధుల చోరీ జరిగిందన్న ఆరోపణ రుజువయితే మత విశ్వాసాలతో ముడివడి ఉన్న సంస్థలు సైతం అధికార ప్రాపకంతో అవినీతి మయమవుతాయనే సత్యం నిర్ధారితమవుతుంది. ఈ కారణంగానే రామమందిర్ ఉద్యమంతో రాజకీయంగా, నైతికంగా లబ్ధి పొందినవారు, ఆలయంలో జరిగిన అవినీతికి ఉద్యోగులే బాధ్యులని అనడం న్యాయ విరుద్ధమేకాదు, అనైతికం కూడా. అయోధ్య రామాలయానికి కొత్త పరిపాలనా వ్యవస్థ ఏర్పాటవుతుంది. దాని ఆర్థిక వ్యవస్థలను చక్కదిద్ది పటిష్ఠం చేస్తారు. నిధుల తస్కరణకు పాల్పడినట్టు రుజువు అయిన వారికి తప్పక శిక్షలు పడతాయి. అయితే దెబ్బతిన్న పేరు ప్రతిష్ఠల పునరుద్ధరణ సంస్థలు, వ్యవస్థలను చక్కదిద్దినంత తేలిక కాదు.
శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేడు భారతదేశ ప్రజా జీవనంలో మున్నెన్నడూ లేని రీతిలో ఒక ప్రభావశక్తిగా వెలుగొందుతోంది. ఆ ప్రభావ ప్రాబల్యాలతో పాటు దాని బాధ్యతలు కూడా అంతేస్థాయిలో పెరిగాయి. రాజకీయ పార్టీలు, ఇతర సంస్థల నుంచి తాను ఒకప్పుడు ఎటువంటి నైతిక ప్రమాణాలను డిమాండ్ చేసిందో సంఘ్ ఇప్పుడు అవే నైతిక ప్రమాణాలను తనకూ వర్తింపజేసుకోవాలి. ఆలోచనలలోను, ఆచరణలోను అత్యున్నత నైతిక ప్రమాణాలను పాటించవలసిన బాధ్యత ఇప్పుడు సంఘ్‌పై ఉన్నది.
దాదాపు నలభై ఏళ్ల క్రితం అయోధ్య ఉద్యమ ఆర్థిక వ్యవహారాలలో జవాబుదారీతనం గురించి నేను అడిగిన ప్రశ్నను అశోక్ సింఘాల్ ఆగ్రహంతో కొట్టివేశారు. హిందువుల విశ్వాసాన్ని రామ మందిర్ ఉద్యమం దగా చేయదని ఆయన నైతిక ధీమాతో చెప్పారు. మరి ఈ రోజు అయోధ్య విరాళాల విషయంలో జవాబుదారీతనంపై ప్రశ్నకు సంఘ్ పరివార్ నాయకుడు ఎవరైనా అటువంటి నైతిక అధికారంతో సమాధానమివ్వగలరా? రాజకీయ అధికారం తాత్కాలికమైనది. దాన్ని నేడు గెలవవచ్చు, రేపు కోల్పోవచ్చు, పిదప మళ్లీ సాధించుకోవచ్చు. నైతిక పలుకుబడి భిన్నమైనది. అరుదైన ఈ గుణశీలత ఒకసారి క్షీణిస్తే దానిని మళ్లీ పొందడం చాలా చాలా కష్టం. అనంతంగా అసాధ్యం.
రాజ్‌దీప్ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
ఈ వార్తలనూ చదవండి:
చైనా కొత్త చిప్.. ఎన్విడియా చిప్ కంటే 478 రెట్లు వేగం
ఆ ముగ్గురు గ్రేట్ సైంటిస్టులకు ఘన నివాళి.. అంతరిక్షంలోకి సూక్ష్మ విగ్రహాలు..