Share News

ఈ ప్రశ్నకు బదులేది?

ABN , Publish Date - Jul 15 , 2026 | 05:10 AM

కోట్లాది ప్రజల ఆరాధ్యదైవం, ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ అభిమానుల ఇలవేలుపు అయోధ్య బాల రాముడి దేవాలయంలో జరిగిన సంఘటనలు రామభక్తుల మనసు కలచివేశాయి. పార్లమెంట్‌లో ఒకప్పుడు ...

ఈ ప్రశ్నకు బదులేది?

కోట్లాది ప్రజల ఆరాధ్యదైవం, ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ అభిమానుల ఇలవేలుపు అయోధ్య బాల రాముడి దేవాలయంలో జరిగిన సంఘటనలు రామభక్తుల మనసు కలచివేశాయి. పార్లమెంట్‌లో ఒకప్పుడు రెండుస్థానాలకే పరిమితమైన బీజేపీ నేడు ప్రతి ఎన్నికలోనూ ఘనవిజయం సాధించటం వెనుక ఉన్న మహాశక్తి.. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా రామ జన్మభూమి విముక్తి కోసం జరిపిన మహోద్యమమే. అద్వానీ, మురళీమనోహర్ జోషిల రథయాత్రలు, ఉమాభారతి, సాధ్వీ రీతాంబర, వినయ్ కథియార్, అశోక్ సింఘాల్ తదితర రాజకీయ, వీహెచ్‌పీ నేతలు, లక్షల మంది రామభక్తులు దశాబ్దాలపాటు పోరాడి సాధించుకున్నది అయోధ్య రామజన్మ భూమి. 1992 డిసెంబర్ 6న లక్షమందికి పైగా కార్యకర్తలతో శాంతియుతంగా ప్రారంభమైన ప్రదర్శన, అనంతర పరిణామాల వలన వేలాదిమంది కరసేవకులు రక్షణ వలయాన్ని ఛేదించుకొని ముందుకువెళ్లటంతో ఆ మసీదు నేలకొరిగింది. మసీదుపై తొలిదెబ్బ వేసినవారు కృష్ణా జిల్లా, పెదముత్తేవి వాస్తవ్యులు లక్ష్మణయతీంద్రులు. వీరు రాష్ట్రమంతా తిరుగుతూ రామజన్మభూమి సాధన కోసం పాటుపడ్డారు. మసీదును కూల్చిన సమయంలో అస్వస్థతకు గురై కొద్దిరోజుల్లోనే పరమపదించారు.

1980లలో రామమందిర నిర్మాణానికి అశోక్ సింఘాల్ పిలుపు మేరకు ‘జై శ్రీరామ్’ అని రాసిన ఇటుకలను దేశవ్యాప్తంగా సేకరించటం ప్రారంభించారు. అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ అయోధ్యలో ‘శిలాన్యాస్’కి అనుమతించడంతో 1989 నవంబర్ 9న అశోక్ సింఘాల్, గిరిరాజ్‌ కిశోర్ నేతృత్వంలో వీహెచ్‌పీ నేతలు, సాధువులు పునాదితీసి శిలాన్యాసం చేశారు. ఆ తర్వాత నుంచి అయోధ్య రామాలయ నిర్మాణమే ధ్యేయంగా అద్వానీ జరిపిన రథయాత్రలు, మురళీమనోహర్ జోషి ‘ఏక్తా యాత్ర’ దేశ ప్రజలను ఉత్తేజపరిచాయి. బీజేపీ పెరుగుదలకు ఇవే ప్రధాన కారణాలు. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అద్భుతమైన రామాలయ నిర్మాణం పూర్తయింది. 2024 జనవరి 22న నరేంద్రమోదీ ‘బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ’ చేశారు. మూడు సంవత్సరాలు కాకమునుపే బాలరామునికి చెందిన అపారమైన సంపదను అక్కడ ‘భక్తులుగా, సేవకులు’గా పనిచేస్తున్నవారే తస్కరించటం కోట్లాది రామభక్తుల మనసును గాయపరిచింది. రామాలయ నిర్మాణానికి వచ్చిన విరాళాలు, బంగారం, వెండి, తదితర సామగ్రి అంతా దుర్వినియోగం అయిందన్న ఆరోపణలు, అనుమానాలు వెల్లువెత్తాయి. ఎందుకంటే ‘రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు’ ముద్రతో అనేకమంది విరాళాలు వసూలు చేశారు.


రామాలయంలో జరిగిన అవకతవకలపై రోజుకొక వార్త వస్తున్నా, రామజన్మభూమి విముక్తికోసం దశాబ్దాలపాటు పోరాటం చేసిన వీహెచ్‌పీ నేతలుగానీ, రామ నామం శ్వాసగా దేశమంతా తమ పరిపాలనలోకి తెచ్చుకున్న బీజేపీ నాయకులు గానీ స్పందించక మౌనం వహించడం రామభక్తులకు మనస్తాపం కలిగిస్తోంది. ప్రధానమంత్రి మోదీ ఈ దేవాలయ విషయాల్లో జోక్యం చేసుకుని సరిదిద్దాలి. మొత్తం వ్యవస్థనే సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ‘తిరుమల’ దేవస్థానంలో జరిగే ‘పరకామణి’ సేవ లాగే ఇక్కడ కూడా ప్రవేశపెడితే రాముని సంపదను కాపాడవచ్చు. దేశవ్యాప్తంగా ఎవరి ఖర్చు వారు భరించుకుని వచ్చి పలు సేవలు అందించడానికి భక్తులు సిద్ధంగా ఉన్నారు.

అద్దంకి శ్రీరామ కుమార్

ఆకాశవాణి విశ్రాంత వార్తా ప్రతినిధి

Also Read:

ఇథనాల్‌పై నెపం పెట్టొద్దు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

మత్స్యకారుల కన్నీళ్లపై జగన్ రాజకీయాలు మానుకోవాలి: పల్లా

Updated Date - Jul 15 , 2026 | 05:10 AM