అవార్డుల ఆర్భాటమే తప్ప సాంస్కృతిక నిర్మాణమేదీ!
ABN , Publish Date - Jun 01 , 2026 | 02:10 AM
పన్నెండేళ్ళ క్రితం జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కేవలం రాజకీయ పటాన్ని మాత్రమే మార్చలేదు. అది తెలుగు సమాజ భాషా సాంస్కృతిక మానసిక స్థితిని కూడా విభజించింది. రెంటినీ రెండువైపులా భిన్నమైన....
పన్నెండేళ్ళ క్రితం జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కేవలం రాజకీయ పటాన్ని మాత్రమే మార్చలేదు. అది తెలుగు సమాజ భాషా సాంస్కృతిక మానసిక స్థితిని కూడా విభజించింది. రెంటినీ రెండువైపులా భిన్నమైన వేర్వేరు దారుల్లో నడిపించింది. యాసలు వేరయినా ఒకే భాష మాట్లాడే ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత, వారి సాహిత్యం, సంస్కృతి, కళా దృక్పథాలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకున్నాయి.
ప్రత్యేక రాష్ట్ర పోరాట కాలం నుంచి తెలంగాణలో ‘అస్తిత్వం’ ప్రధాన ప్రశ్నగా మారితే, విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ‘పునర్నిర్మాణం’ ప్రధాన ఆందోళనగా నిలిచింది. ఈ రెండు దశ దిశల ప్రభావం సాహితీ సాంస్కృతిక రంగాలపై స్పష్టంగా పడింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఒక దీర్ఘకాల ఉద్యమ ఫలితం. ఆ ఉద్యమానికి మూలశక్తి కేవలం రాజకీయ నాయకత్వం కాదు. పాట, కవిత, జానపదం, కథ, వీధి నాటకం, ప్రజాగీతం తదితర సాంస్కృతిక రూపాలు కూడా అత్యంత ప్రధానమైన భూమిక పోషించాయి. ఎందరో కవులు గాయకులూ పాడిన గీతాలు, దళిత బహుజన రచయితల స్వరాలు ఇవన్నీ తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల గుండెల్లో నిలిపాయి. అందుకే రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ముందుగా గుర్తించింది ఆడి పాడిన సాంస్కృతిక బృందాలనే. తర్వాత తెలంగాణ భాషా సంస్కృతి శాఖ పరిమితంగా పనిచేయడం, తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటవడం, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ, పునాస పత్రికప్రచురణ తెలంగాణా సాహిత్యానికి ఆశాజనకమైన సందర్్భాలు. ఆ తర్వాతి కాలంలో కాళోజీ, దాశరథి, సినారె, గద్దర్ వంటి మహనీయుల పేర్లతో అవార్డులు ప్రకటించడం ఇవన్నీ ఒక సాంస్కృతిక ప్రకటనలాగే కనిపించాయి.
కాళోజీ అవార్డు తెలంగాణ ప్రజాస్వభావానికి ప్రతీకగానూ, దాశరథి అవార్డు ఉద్యమ కవిత్వానికి గౌరవ సూచికగానూ భావించారు. గద్దర్ పేరిట సినీ పురస్కారాలను ప్రవేశపెట్టడం కూడా సాధారణ పరిపాలనా చర్య కాదు. దాన్ని తెలంగాణ తన సాంస్కృతిక స్వరూపాన్ని ప్రత్యేకంగా చాటుకోవాలన్న ప్రయత్నంగానే చూడాలి. బతుకమ్మ, బోనాలు వంటి పండుగలను అధికారిక రాష్ట్రోత్సవాలుగా మలచడం ద్వారా జానపద సంస్కృతికి రాజకీయ గుర్తింపు, వేదిక లభించాయి.
అయితే ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఈ అవార్డులు, ఉత్సవాలు, సభలు నిజంగా సాహిత్య సాంస్కృతిక రంగాన్ని లోతుగా బలపరిచాయా? లేక ప్రతీకాత్మక సత్కారాలకే పరిమితమయ్యాయా? మరోవైపు అనేకమంది సాహితీ వేత్తలు సాంస్కృతిక సృజనకారులు అవార్డులకోసం పదవులకోసం మంత్రుల చుట్టూ వారి తాబేదార్లచుట్టూ అధికారాల పీఠాల చుట్టూ ప్రదక్షిణలు చేసే మహాపాదచారులుగా మారిపోయారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో కనిపించిన ప్రతిఘటనాత్మక సాహితీ సాంస్కృతిక శక్తి రాష్ట్రం ఏర్పడ్డాక కొంతవరకు ప్రభుత్వ వ్యవస్థలో కలిసిపోయిందన్న విమర్శ వినిపిస్తూనే వుంది. ఉద్యమ గీతాలు శ్రుతులు మారి అధికార వేదికలపై వినిపించాయి. అదే సమయంలో విమర్శనాత్మక స్వరం బలహీనపడింది. అకాడమీ ఏర్పడ్డా పరిశోధనాత్మక సాహిత్య నిర్మాణం, ఆధునిక సాంకేతికతను సంతరించుకుని దృశ్యమాధ్యమాన్ని సాహిత్యంతో మేళవించడంలో విఫలమైంది. పరిశీలిస్తే ప్రజా ఉద్యమ సంస్కృతి క్రమంగా అధికార సంస్కృతిగా మారిన వైనం కనిపిస్తుంది.
అయినా తెలంగాణలో ఒక ముఖ్యమైన మార్పు మాత్రం స్పష్టంగా కనిపించింది. అధికారికంగా ప్రత్యేక దృష్టి, ప్రయత్నాలు లేకున్నా తెలంగాణ భాషకు గౌరవం పెరిగింది. ఒకప్పుడు యాసగా ‘స్లాంగ్’గా కొట్టిపారేసిన పలుకుబడులు ఇప్పుడు సాహిత్యంలో, సినిమాల్లో, టెలివిజన్‌లో ప్రధాన ప్రవాహంగా మారాయి. దళిత, బీసీ, గిరిజన, ముస్లిం రచయితలకు కొత్త వేదికలు లభించాయి. గ్రామీణ జీవితానుభవాలు సాహిత్యంలో మరింత బలంగా ప్రతిఫలించాయి. యూట్యూబ్, డిజిటల్ మీడియా ద్వారా ప్రజాగీతాలు కొత్త తరానికి చేరాయి. ఇది తెలంగాణ సాంస్కృతిక క్రమంలో నిర్లక్ష్యం చేయలేని మార్పు.
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మాత్రం దీనికి పూర్తి భిన్నం. విభజన తర్వాత ఈ రాష్ట్రం రాజధాని నిర్మాణం, ఆర్థిక లోటు, పరిపాలనా పునర్వ్యవస్థీకరణ వంటి అంశాల్లో మునిగిపోయింది. ఆ కారణంగా సాహిత్య సాంస్కృతిక రంగం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో వెనుకబడింది. ఒకరకంగా వాటికి ఎలాంటి ప్రాధాన్యత లేకుండానే పోయింది. కళారత్న, ఉగాది పురస్కారాలు వంటి సంప్రదాయ సత్కారాలు కొనసాగినా, అవి ఒక స్పష్టమైన సాంస్కృతిక దిశను ప్రతిబింబించలేకపోయాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన సమస్య ‘సాంస్కృతిక విజన్’ లోపం. తెలంగాణలోలాగా ప్రత్యేక అస్తిత్వ రాజకీయాల నేపథ్యం లేకపోవడంవల్ల అక్కడ కొత్త ప్రాంతీయ సాహిత్యోద్యమం పెద్దగా కనిపించలేదు. సాహిత్య రంగం ఎక్కువగా వ్యక్తిగత రచయితల కృషి, ప్రైవేట్ సాహిత్య సంస్థలు, చిన్న ప్రచురణకర్తలు, డిజిటల్ వేదికలపై ఆధారపడింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక సాంస్కృతిక సంస్థల నిర్మాణం జరగలేదు.
రెండు రాష్ట్రాల పరిస్థితిని పరిశీలిస్తే ఒక ఉమ్మడి లోటు స్పష్టంగా కనిపిస్తుంది: శాశ్వత సాంస్కృతిక మౌలిక వసతుల కొరత. ప్రపంచ స్థాయి తెలుగు సాహిత్య ఆర్కైవ్స్, డిజిటల్ పుస్తక భాండాగారాలు, రచయితల ఫెలోషిప్‌లు, అనువాద అకాడమీలు, ప్రజా కళల పరిశోధన కేంద్రాలు, బాలసాహిత్య మ్యూజియంలు వంటి దీర్ఘకాలిక ప్రణాళికలు ఇంకా కలలుగానే మిగిలిపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ భోపాల్‌లోని ‘భారత్ భవన్’, కలకత్తాలోని ‘నందన్’ లాంటి కేంద్రాల్ని నిర్మించుకోలేకపోవడం దురదృష్టమే. అవార్డులు ప్రకటించడం సులభం కానీ సృజనాత్మక సమాజ నిర్మాణం కోసం అవసరమైన మౌలిక వ్యవస్థలను నెలకొల్పడం కష్టం. అదే రెండు రాష్ట్రాల్లోనూ పూర్తిగా సాధ్యపడలేదు. ఒకరకంగా మొదలే అవలేదు.
అయితే ఆశాజనకమైన అంశం ఏమిటంటే, ప్రభుత్వాలకంటే బయట కొత్త స్వచ్ఛంద సాహిత్య చైతన్యం పెరుగుతోంది. దళిత బహుజన రచయితల వేదికలు, మహిళా రచయితల సమూహాలు, స్వతంత్ర ప్రచురణ సంస్థలు, చిన్న పత్రికలు, యూట్యూబ్ సాహిత్య చానెల్లు, డిజిటల్ పఠన వేదికలు కొత్త తరం సాహిత్యాన్ని ముందుకు తీసుకువస్తున్నాయి. తెలంగాణలో ప్రజాగీతాల కొత్త తరంగం కనిపిస్తుంటే, ఆంధ్రాలో యువ కవిత్వం, స్వీయ ప్రచురణ ధోరణి పెరుగుతోంది.
అయితే చివరికి ఒక ప్రశ్న మిగులుతోంది. ప్రభుత్వం దృష్టిలో సాహిత్యం అంటే కేవలం అవార్డులా? సంస్కృతి అంటే కేవలం ఉత్సవాలా?
అసలు సాంస్కృతిక అభివృద్ధి అంటే ప్రజల భాషకు గౌరవం ఇవ్వడం, విభిన్న స్వరాలకు వేదిక కల్పించడం, విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహించడం, భావి తరాలకు జ్ఞాపకాలను భద్రపరచడం. అవార్డులు అవసరమే కానీ అవే సాహిత్యాభివృద్ధి కాదు. ఒక సమాజం తన భాషను, తన జానపదాన్ని, తన విభిన్న స్వరాలను ఎంత సజీవంగా ఉంచుకుంటుందో అదే నిజమైన సాంస్కృతిక ప్రగతి. తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు అదే కీలక మలుపు వద్ద నిలిచున్నాయి.
సాహితీ సాంస్కృతిక దిశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలూ తక్షణం చేపట్టాల్సిన కొన్ని ప్రాధాన్య కార్యక్రమాలు ఉన్నాయి. మొదటిగా రెండు రాష్ట్రాలు కలిసి ఒక ‘ప్రపంచ తెలుగు డిజిటల్ ఆర్కైవ్’ను నిర్మించాలి. రెండవది ప్రతి జిల్లాలో ‘ప్రజా సంస్కృతి కేంద్రాలు’ స్థాపించాలి. మూడవది అనువాద రంగాన్ని అత్యంత ప్రాధాన్యంగా చూడాలి. నాలుగవది బాలసాహిత్యాన్ని అత్యవసర సాంస్కృతిక రంగంగా గుర్తించాలి. ఐదవది జానపద కళలను ‘జీవిత సంస్కృతి’గా చూడాలి. ఒక జాతి తన జానపదాన్ని కోల్పోతే, చరిత్రను కోల్పోయినట్లే. ఆరవది, సాహిత్య అకాడమీలు, సాంస్కృతిక సంస్థలు రాజకీయ ప్రభావాలకు అతీతంగా స్వతంత్రంగా పనిచేయాలి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు అత్యవసరంగా కావలసింది కొత్త సాంస్కృతిక పునరుజ్జీవనం. అది కేవలం ప్రభుత్వ కార్యక్రమాల ద్వారానే కాదు; రచయితలు, కళాకారులు, పాఠకులు, విద్యాసంస్థలు, డిజిటల్ వేదికలు కలిసి నిర్మించాల్సిన సామూహిక చైతన్యం. అవార్డులు రావచ్చు, సభలు ముగిసిపోవచ్చు. కానీ ఒక సమాజం తన భాషను ప్రేమిస్తూ, తన జ్ఞాపకాలను కాపాడుకుంటూ, కొత్త తరాలకు సృజనాత్మక స్వేచ్ఛను అందిస్తే అదే నిజమైన సాంస్కృతిక అభ్యుదయం.
(జూన్ 2 రాష్ట్ర విభజన సందర్భం)
వారాల ఆనంద్
94405 01281
ఇవి కూడా చదవండి..
టీఎంసీలో అంతర్గత కుమ్ములాటలే అభిషేక్ బెనర్జీపై దాడికి కారణం... బీజేపీ
పాక్ కుట్ర.. ఉగ్రవాదులకు సాయంగా భారత్‌లోకి టెలికం సిగ్నల్స్