Share News

నల్ల మల్లెల గంధమా

ABN , Publish Date - Aug 24 , 2026 | 02:50 AM

సీకటి గొంగడి గప్పుకొని సూరు కింద కూసున్నది రాత్రి! పదాన్ని బానిసను చేసే నీ రాగం కోసం కరిమబ్బు గురి చూసి విసిరిన...

నల్ల మల్లెల గంధమా

సీకటి గొంగడి గప్పుకొని

సూరు కింద కూసున్నది రాత్రి!

పదాన్ని బానిసను చేసే నీ రాగం కోసం

కరిమబ్బు గురి చూసి విసిరిన

ఎన్నెల సినుకే తల్లి నీ పాట!

నల్లరేగడి మన్ను పెయి మీద చెమట ముత్యాలు మెరిసి

తునికి పండ్ల తీయని గొంతులో జాలువారిన

పచ్చ పచ్చని సేను సేనంతా పరవశాల పైరగాలి నీ పాట

తల్లి గారి తొవ్వమరిసిన తగదప్పని కట్టం

ఇరాం లేదు ఇంట్లేం లేదు. ఉన్నాయి మొండి రెక్కలే!

ఉడుకుడుకు గంజిల

ఉప్పేసుకొని తాగినట్టు

నెగుల నియ్యని దునియల

నెరివడ్డ బతుకు

కంకాయి పొదలే అవ్వా!

నీ కన్నీటి నదులే అవ్వా!

పిల్ల తొవ్వల గుండెల నిండా

నీ పాదాల గాయాలకు పసరు పూసి నిమిరిన

నల్లాలం పూల పాయిరం

ఎండినదొక్కకు గుంజి కట్టిన నడికట్టు

ఆకలిని కట్టేసిన అగ్గెన గండ్ల కాలం

పెరిగి పెరిగి బరువెక్కే జల్మ

బతుకంతా కన్నీటి గంగల మునిగి

పాడే మీద తేలిపోతివి

నాకు జ్వరం భూతం పట్టినప్పుడల్లా

నువు శివ మూగిన నరసింహస్వామై నాకు కావలి

నా చుట్టూ పసుపు కుంకుమల పొలి

నీ నోట పలికే పదాలు నీ పాదాలకు మోకరిల్లి

ఎన్నిల వాకిట్ల ఎగిసి

మొగులునందుకుంటున్నాయి

నీ సనుబాలు నా రక్తంలో పొంగి

పాటలై పారుతున్నాయి

నీ రాగ మద్దుకున్న నా గొంతు

వెయ్యావుళ్ళ పయ్య కోడె రంకె

అవ్వా నీ పాట

ఏడు మోటల బాయి లోంచి తోడిన

ఏడు రంగుల కస్తూరి కవనగంధర్వ

సింగిడి పూత

తైదల అంజయ్య

98668 62983

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Aug 24 , 2026 | 02:50 AM