అసోంలో హిమంత హాలాహలం
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:44 AM
సోషల్ మీడియా వివేక రాహిత్య ప్రమాణాల ప్రకారం చూసినా భారతీయ జనతా పార్టీ అసోం శాఖ ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో నాగరిక విలువల మరింత భ్రష్టత్వానికి అద్దం పట్టింది. ఇరవై నాలుగు...
సోషల్ మీడియా వివేక రాహిత్య ప్రమాణాల ప్రకారం చూసినా భారతీయ జనతా పార్టీ అసోం శాఖ ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో నాగరిక విలువల మరింత భ్రష్టత్వానికి అద్దం పట్టింది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే తొలగించివేసిన ఆ వీడియోలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఇద్దరు వ్యక్తుల (ఒకరు చిన్న టోపీ ధరించిన వ్యక్తి కాగా మరొకరు నిండు గడ్డంతో ఉన్న వ్యక్తి)పై ఎయిర్ రైఫిల్‌ను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గురిపెట్టి ఉన్న దృశ్యం కనిపిస్తుంది. బంగ్లాదేశీ ముస్లిం వలసకారులకు వ్యతిరేకంగాను, అసోం ప్రజల అస్తిత్వాన్ని కాపాడడమే లక్ష్యంగా ఆ వీడియోను రూపొందించినట్టు చెబుతున్నారు. అయితే అందులోని హింసాత్మక మతతత్వ దృశ్యాలను గమనిస్తే అంతకంటే కక్షపూరిత ప్రవర్తన మరొకటి ఉండదని స్పష్టమవుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన నాయకుడు ముస్లింలపై తుపాకీ గురిపెట్టడమనేది రాజ్యాంగ బాధ్యతల ఉల్లంఘనకు ఒక భయంకర ఉదాహరణ.
జిత్తులమారి నాయకుడు అయిన హిమంత అటువంటి వీడియో ఉన్న విషయం తన దృష్టికి రాలేదని అన్నారు. ఆయన వాదాన్ని అంగీకరించేవారు బహుశా ఎవరూ ఉండరు. బీజేపీ అసోం విభాగం స్వయంగా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వీడియో అది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోను తొలగించే సమయానికి దాన్ని పదిలక్షల మందికి పైగా వీక్షించారు. హిమంత రాజకీయ వైఖరులు తెలిసినవారు ఆ వీడియో గురించి ఆశ్చర్యపోరు. ఇప్పటికి చాలా నెలలుగా ‘మియా’ (అసోంలో బెంగాలీ మాట్లాడే ముస్లింల గురించి మొరటుగా ప్రస్తావించే పదమది) లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక విషపూరిత ప్రచారానికి హిమంత నాయకత్వం వహిస్తున్నారు. ఆర్థిక కార్యకలాపాల నుంచి ‘మియా’లను బహిష్కరించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. దుకాణదారులు, కూరగాయల విక్రేతలు, ఆటో రిక్షా డ్రైవర్లు మొదలైన వారందరినీ ఆర్థిక జీవనం నుంచి బహిష్కరించాలని ఆయన నిక్కచ్చిగా చెబుతున్నారు. ఇటువంటి వైఖరిని అనుసరిస్తున్నందుకు ఆయనేమీ విచారం వ్యక్తం చేయలేదు. ఎటువంటి సంజాయిషీలు ఇవ్వలేదు. అసోం సాంస్కృతిక–నాగరికతా విలువలను సంరక్షించుకునేందుకు ‘మియా’ల బహిష్కరణ తప్పనిసరి అని ఆయన గట్టిగా వాదిస్తున్నారు.
ముస్లింలను నిందిస్తూ తాను నిరంతరమూ చేస్తోన్న వ్యాఖ్యలు, ప్రకటనలు మొదలైనవి ఎన్నికలలో లబ్ధి చేకూరుస్తాయని హిమంత విశ్వసిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అధికార దుర్వినియోగంతో ముఖ్యమంత్రి, ఆయన కుటుంబమూ అపరిమితమైన ఆస్తులు సమకూర్చుకున్నారని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. హిమంత రెచ్చగొడుతున్న మతతత్వ భావోద్రేకాలు ఆ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడమే కాకుండా, వారి మధ్య మతపరమైన విభేదాలనూ సృష్టిస్తున్నాయి. ‘బయటి వ్యక్తి’పై ఆగ్రహం, అసహ్యం అసోం సామాజిక జీవన రంగాలలో దశాబ్దాల నుంచీ భాగంగా ఉంటూ వస్తోంది. తమ గడ్డపై తమ సంఖ్య తగ్గిపోతుండడం, బెంగాలీ భాష మాట్లాడేవారి సంఖ్య పెరిగిపోతూ, తమపై వారు ఆధిపత్యం చలాయించడాన్ని అస్సామీ భాష మాట్లాడే ప్రజలు సహజంగానే సహించలేకపోతున్నారు. వారి నిరసనలకు తననుతాను ఒక లౌడ్ స్పీకర్‌గా నిలుపుకోవడంలో హిమంత సఫలమయ్యారు. అసోం జనాభాలో ముస్లింలు 38 శాతం మంది ఉన్నారు. ఈ కారణంగా జనాభాపరమైన మార్పులు, అస్సామీ సంస్కృతి మనుగడకు ఎదురవుతున్న సవాళ్ల విషయమై నిజమైన, ఊహాత్మక భయాందోళనలను రెచ్చగొట్టడం చాలా సులువు.
ఈ కారణంగానే సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షమైన ఆ విద్వేషపూరిత వీడియో సందేశం తీవ్ర స్థాయిలో సమస్యాత్మకమైంది. అసోం వెలుపల విద్వేష ప్రసంగంగా పరిగణన అవుతున్నది అసోంలో మాత్రం ఆ గడ్డ ప్రజల చారిత్రక, భాషాపరమైన, సాంస్కృతిక, ఆర్థిక హక్కులను కాపాడేందుకు ఉద్దేశించినది అవుతున్నది. ప్రస్తావిత వీడియో మైనారిటీలకు వ్యతిరేకంగా ఆగ్రహాన్ని రెచ్చగొట్టేదిగా కాకుండా నిత్య జీవితంలో రోజువారీ అనుభవాల ఆధారంగా ఏర్పడే రాజకీయ అవగాహనను ప్రతిబింబించేదిగా సమర్థనీయమవుతున్నది. 2002లో గుజరాత్ అల్లర్లను గుజరాతీ అస్మిత (ఆత్మగౌరవం)ను రక్షించేందుకు చెలరేగినవిగా అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ సమర్థించారు. ఇప్పుడు అసోం పరిణామాలలోనూ అటువంటి వైఖరే వ్యక్తమవుతోంది. అస్సామీ భాషా సంస్కృతులను సంరక్షించేందుకు రాజకీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలలో భాగమే ఆ పరిణామాలు.
మరి ఆ వివాదాస్పద వీడియో వ్యవహారంపై బీజేపీ జాతీయ నాయకత్వం మౌనం వహించడంలో ఆశ్చర్యమేమీ లేదు. అంతర్జాతీయంగా మద్దతు పొందేందుకు ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’ అనే నినాదం ఉపయోగపడవచ్చుగానీ ఎన్నికలు జరగనున్న అసోంలో రాజకీయ లబ్ధిని సమకూర్చుకునేందుకే మతతత్వ భావోద్రేకాలను రెచ్చగొట్టడం అనివార్యమవుతోంది. కనుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అసోంను సందర్శించిన ప్రతిసారీ ‘అక్రమ చొరబాటుదారుల’ గురించి ఆ రాష్ట్ర ప్రజలను హెచ్చరిస్తూ ఉంటారు. అంతర్జాతీయ సరిహద్దుల వద్ద కాపలా ఉండేది కేంద్ర బలగాలే అన్న వాస్తవాన్ని బీజేపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తారు.
లౌకికవాద రాజకీయ నాయకులు సైతం మెజారిటీవాద రాజకీయాల ప్రాబల్యానికి తలొగ్గక తప్పలేదు. ఆ వివాదాస్పద వీడియోకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రజాస్వామిక చైతన్యశీలురు అయిన పౌరులు కొంతమంది సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం నొకదాన్ని దాఖలు చేశారు. అయితే రాజకీయ వర్గాలలో హిమంత మతతత్వ రాజకీయాల నెదుర్కొనేందుకు సంకోచిస్తున్నారు. అలా చేస్తే తాము హిందూ ఓటర్లకు మరింతగా దూరమవుతామని వారు భయపడుతున్నారు. రాజకీయ ప్రయోజనాలకు ముస్లింలను బుజ్జగిస్తున్నదని గతంలో కాంగ్రెస్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతుండేవి. ఇప్పుడు మెజారిటీ హిందూ ఓటర్ల మద్దతుకు పోటీ పడడమే రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది. హైదరాబాద్‌లో హిమంతపై పోలీసులకు అసదుద్దీన్ ఓవైసీ ఫిర్యాదు చేశారు. తమ పార్టీ ఎన్నికలలో విజయం సాధించేందుకు హిందూ ఓటర్ల మద్దతు అవసరం లేదు కనుకనే ఆయన ఆ పని చేయగలిగారు.
ఇటువంటి పరిస్థితుల వల్లే హిమంత నిర్భయంగా ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేయగలుగుతున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీకి ఫిరాయించిన ఈ అసోం నాయకుడు శీఘ్రగతిన పరిపూర్ణ హిందూత్వ నాయకుడిగా ప్రభవించారు. ఆయనలో ఈ మార్పు, సమకాలీన భారత రాజకీయాలలోని అవకాశవాద ధోరణులను ఎత్తి చూపుతున్నది. హిమంత బిశ్వశర్మ 2015లో కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. ఒక వ్యక్తిగత సమావేశంలో రాహుల్ తనను అవమానించడం వల్లే తాను ఆ పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నానని తన రాజీనామా ప్రకటనలో పేర్కొన్నారు. ఆ సమావేశంలో అసోం సమస్యలను వినడానికి బదులుగా తన కుక్కపిల్లకు బిస్కట్లు పెట్టేందుకే రాహుల్ ప్రాధాన్యమిచ్చారని హిమంత వెల్లడించారు. నిజమేమిటంటే అసోం నాయకుడి రాజకీయ ఆకాంక్షలు నెరవేరేందుకు కాంగ్రెస్ నాయకత్వం సహకరించలేదు. భారతీయ జనతా పార్టీయే అందుకు భద్రమైన ప్రత్యామ్నాయమని భావించి, కాంగ్రెస్‌ను విడనాడారు. హిమంతను వెన్వెంటనే చేర్చుకున్న బీజేపీ, గతంలో ఆయనపై తాను అవినీతి ఆరోపణలు చేసిన విషయాన్ని మరచిపోయింది. తమ పార్టీలోకి రావడంతో బీజేపీ దృష్టిలో ఆయన నీతిమంతుడు అయిపోయారు!
ఇంకా షష్టిపూర్తి చేసుకోని హిమంత శర్మ సమర్థుడైన రాజకీయవేత్త. బీజేపీ తరువాయి తరం నాయకుల శ్రేణిలో అగ్రగామిగా ఉన్న రాజకీయ ధురంధరుడు. అయితే ఈ కొత్తతరం నాయకులు, అటల్–ఆడ్వాణీ కాలం నాటి బీజేపీ నాయకుల వలే సమస్త వర్గాలనూ కలుపుకుని పోయేందుకు ప్రయత్నించేవారు కాదు, నైతిక సదాచారులు కాదు, రాజ్యాంగ విలువలకు నిబద్ధమయ్యే వారూ కాదు. రాజకీయ అధికార సాధనే పరమ ధ్యేయంగా ఉన్నవారు. ఈ తరం నేతలకు లక్ష్యాలే కానీ, వాటి సాధనా మార్గాలు ఎంత మాత్రం ముఖ్యం కాదు. కనుకనే ఈశాన్య భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ప్రధాన ముఖంగా హిమంత వెలుగొందుతున్నారు. ఎన్నికలలో విజయాలను కైవసం చేసుకోవడంలో ఆరితేరిన అనుభవజ్ఞుడు, పార్టీని ముందుకు నడిపించడంలో దిట్ట. ఎదురయ్యే సమస్యలను ఇట్టే పరిష్కరించగల వ్యవహార దక్షుడు. తత్కారణంగానే హిమంతను తమకొక అమూల్యమైన రాజకీయ ఆస్తిగా బీజేపీ భావిస్తోంది. హిమంత తన ప్రకటనలు, ప్రసంగాలు, ఎన్నికల ప్రచారంలో పదే పదే ముస్లిం వ్యతిరేక విద్వేషపూరిత మాటలు ఉపయోగించడం నిష్పాక్షిక ఆలోచనాశీలురు అయిన పౌరులను కలవరపరుస్తుండగా, ఆ పార్టీ వర్గాలకు మాత్రం సమ్మతంగా ఉన్నాయి. ముస్లింల ముఖాన పుల్లవిరుపుగా మాట్లాడే హిమంత రాజకీయాలు తమ ‘హిందూ రాష్ట్ర’ స్వప్న సాకారానికి దోహదం చేసేవిగా బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.
తాజా కలం: కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నట్టు హిమంత బిశ్వశర్మ ప్రకటించినప్పుడు ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తమ జాతీయ నాయకత్వాన్ని ఇలా హెచ్చరించారు. ‘హిమంత భావితరం నాయకుడు. అటువంటి నాయకుడిని మనం కోల్పోతున్నాం’ అని. ‘భవిష్యత్తు ముఖం’ అయిన ఈ నాయకుడు ఒక దశాబ్ద కాలంగా వర్తమానాన్ని కలవరపరుస్తున్నాడు!
రాజ్‌దీప్ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
ఇవి కూడా చదవండి..
114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు