అశబ్ద దేహం
ABN , Publish Date - Nov 16 , 2026 | 05:40 AM
అర్థం నుంచి కాస్త పక్కకు జరుగుతాను నిరర్థక వాక్యంలోకి తూలిపోతాను నిండుగా చుట్టచుట్టుకుని పడుకుంటాను కపాలంలో అనుభవాల పానుపు మీద...
అర్థం నుంచి కాస్త పక్కకు జరుగుతాను
నిరర్థక వాక్యంలోకి తూలిపోతాను
నిండుగా చుట్టచుట్టుకుని పడుకుంటాను కపాలంలో
అనుభవాల పానుపు మీద
అర్థం తలుపు చాటున నుంచుని
తొంగి చూస్తుంటుంది ఒయ్యారంగా
ఆ పెదాల మీద పడి విషాన్ని జుర్రుకుని
ప్రాణాలు పోగొట్టుకున్నాను చాలాసార్లు
ఆ దేహాన్ని పదాలతో తడిమి వాక్యాన్నై అల్లుకుని
ఊపిరాడకుండా చేశాను కూడా ఎన్నోసార్లు
దేహ మోహంలో
నయన లయల విలయంలో
నన్ను నేను పట్టుకుని విప్పుకుని
సెగలు కక్కుతూ కొట్టుకుపోయాను
బూడిద వాక్యంలా మిగిలిపోయాను
అర్థందేముంది?
వాక్య వాక్యానికీ మారిపోతుంది
పదాల మధ్య
అగాధాల్లో జారిపడిపోతుంది
అన్ని వాక్యాలూ ముగిశాక
మూగబోతుంది
తుది నిశ్శబ్దాన్ని తీసి
తీగ మీద ఆరేసి వెళ్ళిపోతుంది
మధ్యాహ్నపు గాలి
పరపరా నిమిరినప్పుడు
అర్ధరాత్రి వెన్నెల లేచీకటి తెరలను
చీల్చుకుపోతున్ననప్పుడు
ఆల్చిప్ప హృదయంలో శబ్దరాహిత్యాల ముత్యాలవాన
పదాల్ని తుడిచేస్తూ పోతేనే వాక్యం
అర్థాన్ని మొదటి వాక్యం దగ్గరే పాతరేస్తే
వాక్యానికి మోక్షం
నువ్వు అర్థం కానట్లు చూస్తూ ఉండు
నేను వాక్యం వెన్నెముకకు
దేహాన్ని తొడిగి వెళ్ళిపోతాను
నువ్వు అర్థంతో పని లేకుండా
నిశ్శబ్దంగా వీస్తావు
ఊపిరిగాలుల రూపంతో
అశబ్ద దేహంలో
పసునూరు శ్రీధర్‌బాబు
81213 03903
ఈ వార్తలనూ చదవండి:
మియామి ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ.. ఇద్దరికి గాయాలు
చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..