ఆరుద్ర మహాసముద్రం
ABN , Publish Date - Aug 31 , 2026 | 01:30 AM
‘‘క విత కోసమె నేను పుట్టాను, క్రాంతి కోసం కలం పట్టాను’’ అన్న ఆరుద్ర పుట్టింది 1925 ఆగస్టు 31. ప్రయోగ వాదిగా, అంత్య ప్రాసల ముద్ర ఆరుద్రగా పలు ప్రక్రియా వైవిధ్య సంభరితుడుగా, సినిమా కవిగా తెలుగు సాహిత్యంలో...
‘‘క విత కోసమె నేను పుట్టాను, క్రాంతి కోసం కలం పట్టాను’’ అన్న ఆరుద్ర పుట్టింది 1925 ఆగస్టు 31. ప్రయోగ వాదిగా, అంత్య ప్రాసల ముద్ర ఆరుద్రగా పలు ప్రక్రియా వైవిధ్య సంభరితుడుగా, సినిమా కవిగా తెలుగు సాహిత్యంలో ఆరుద్ర ప్రత్యేక స్థానాన్ని పదిలపరచుకొన్నాడు.
‘‘నీలాల నింగిలో ఎర్ర జెండా తోడ, విశ్వ వీణా రవపు విజయ గానమ్ముతో విజయ శంఖారావ విశ్వగీతమ్ముతో కొత్త మార్గాలపై, కొత్త మార్గాలకై కదలవే, కదలవే’’ అని బావుటా ఎగరేసి కవిత్వపు కాగడాను తన 17వ యేట 1942 లోనే పట్టి పురోగమించారు. ఆయన ఇంటరు మొదటి సంవత్సరం వరకే చదివారు. ఇంటరులో ఆయనకు ఇంగ్లీషు చెప్పిన గురువు రోణంకి అప్పలస్వామి. ఆరుద్ర తన ‘త్వమేవాహం’ కావ్యాన్ని వారికే అంకితమిచ్చారు. ఆరుద్ర 1948 జులై 10 తర్వాతే ‘త్వమేవాహా’న్ని మొదలుపెట్టినప్పటికీ ప్రథమ ముద్రణ వెలువడింది జులై 1949. ‘త్వమేవాహం’ అప్పట్లో సంచలనం. నిజాముకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ పోరాటం నేపథ్యంగా రాయబడిన కావ్యమది. భాషలో ఆరుద్ర ప్రయోగాలు పాఠకులను అదిరిపాటుకు గురి చేశాయి. ‘‘బ్రెయిన్‌లో బ్రెన్ గన్, రెయిన్‌లా ఆలోచనల ట్రైన్, స్పయినల్ కార్డులో స్పెయిన్, గ్లూమీ తిమిరాలు చెరిషించి, సైతాను మనల్ని పరిషించునపుడు, నిర్వేదనా పవనాలు వర్షించు, బ్రెయిన్‌లో స్టెన్ గన్లా చెట్లూ చిట్టెలుకలు, చెయిన్సులో మగవాళ్లు, చెరచబడ్డ ఆడవాళ్లు, స్నో తెలుపు, డ్యూతెలుపు’’ – ఇలా బుల్లెట్లలా పదాలు దూసుకొచ్చేసరికి ఆ ఇంగ్లీషు మాటల దూకుడు, ఆ ప్రతీకలు ఆనాటి పాఠకులకు కొరుకుడుపడక వింతగా చూశారు. ఆరుద్ర హృదయాంతర్గత వేదనను, మెదడులోని అలజడిని దాశరథి వివరించిన తరువాత కొంతమందికి అర్థమైంది. దాశరథి ‘అగ్నిధార’, సోమసుందర్ ‘వజ్రాయుధం’ రెండూ తెలంగాణా పోరాట నేపథ్యంలో 1949 లోనే వెలువడ్డాయి.
‘‘మేధాశోధన నాళికలో కాలాన్ని పోసి, మండుతున్న గుండెల మీద మరగ బెడతాను. మానవాళికి పనికి వచ్చే ఫలితాల కోసం పాటుపడతాను, పాటకడతాను, కాలాన్ని పట్టి తెచ్చి రాటకేసి కట్టేస్తాను. కాలాన్ని మీకు బానిసగా చేస్తాను. కళ్లల్లో జ్యోతులు వెలిగిస్తాను. భూతల స్వర్గానికి తలుపులు తీస్తా’’నని తన ఆకాంక్షను కావ్యారంభంలోనే చెప్పారు. కావ్యంలో ప్రతీకల ప్రయోగం అద్భుతం. కాలానికి సంకేతం గడియారం. గడియారం మన సంఘం. ఇసుక గడియారం, నీటి గడియారాలు పాత కాలపు సంఘాలు. గంటలు శ్రీమంతులు. నిముషాలు మధ్యతరగతి వాళ్లు. సెకండ్లు శ్రామికులు. చిన్నముల్లు శ్రీమంతుల మనస్తత్వానికి సూచి. పెద్దముల్లు మిడిల్ క్లాసు వాళ్ల భావాలకు బరామీటరు. సెకండ్ల ముల్లు శ్రామిక జనుల ఫిలాసఫీకి కొలబద్ద. స్టాప్ వాచి విప్లవాన్ని టైం చేసే సాధనం. పెండ్యులం నిలకడలేని ఊగిసలాట మనస్తత్వానికి ప్రతీక. ‘కీ’ విప్లవానికి ప్రోద్బలకారణం. కాలాన్ని ప్రవాహంగా కూడా భావించారు ఆరుద్ర. మృత్యువుతో పోరాడే తెలంగాణా పౌరుల చైతన్యంతో కవి ‘త్వమేవాహ’మన్నాడీ కావ్యంలో. అంటే నువ్వేనేనని అభేదాన్ని చెప్పాడు. ‘‘ఈమె అయస్కాంతకాంత’’ అనే ఖండికలో పన్నెండు పాదాలు పన్నెండు అంకెలకు గుర్తు.
పాదానికి ఐదక్షరాలు. ఒక అంకె నుండి ఒక అంకెకు రావటానికి పట్టే ఐదు సెకండ్లకు సూచిక. మొత్తం అరవై అక్షరాలు. అరవై సెకండ్లకు సంకేతంగా నిలుస్తాయి. ఇది గడుసైన శిల్పం. ఆరుద్ర ‘టెక్నిక్’ లేని కవిత్వాన్ని ఊహించలేనన్నాడు. కెప్టెన్‌ను తండేల్ అనటం, విమానాన్ని గాలిగెద్ద అనటం, డ్రెడ్జర్‌ను తవ్వోడ అనటం లాంటి పద ప్రయోగాలు ఉన్నాయి. దీనిలోనే ఛందః ప్రయోగాలూ ఉన్నాయి. వచన కవితలా సాగిస్తూ ఇది పద్యమే అని అనుమానం రాకుండా మత్తకోకిల, ఉత్సాహం, కవిరాజ విరాజితం, పృథ్వీవృత్తం, తరలం, మందారదామం, లయగ్రాహి, దండకం, కందం లాంటివి పద్యాలు పేర్లు పెట్టకుండా రాశారు. కుందుర్తి ‘నగరంలో వాన’లో కూడా ఇలా ఛందః ప్రయోగాలు చేశాడు. వచన కవిత్వమనే అభిప్రాయాన్ని కలిగించారు. ఛందస్సుల రహస్యం తెలిసిన వారే అలా రాయగలరు. ‘‘ప్రజ భయపడకూడదు ఇల నిజం గెలుస్తుంది కనుక నీతి వెలుస్తుంది. జరామరణాలిక కల. ధ్వజం కొస నిరంతర సమధర్మం చూస్తాం’’. ఇది కందపద్యం – దీనిలోని సందేశంతోనే ‘త్వమేవాహం’ ముగుస్తుంది.

నిర్దేశించిన భావాలను వాక్యాలు బట్వాడా చేయలేవనుకున్నప్పుడు, ఆంగ్ల పదబంధాలను ఉపయోగించటానికి ఆరుద్ర వెనకాడలేదు. ఈ విధానం, ఆరుద్ర మరొక కావ్యం ‘సినీవాలి’ లోనూ కొనసాగింది. ‘సినీవాలి’ అంటే అమావాస్య నాడు కనపడే నెలవంక. ఇది నాలుగేళ్ల కొకసారి మాత్రమే కనిపిస్తుంది. చీకటిలో వెలుగు రేఖ ఉన్నట్లే కష్టాల్లో కూడా ఆశారేఖ ఉంటుందనే అర్థంలో కవి ఈ పదాన్ని గ్రహించాడు. డిగ్రీ చదువుకున్న మధ్యతరగతి యువకుడు సూర్యారావు ఉద్యోగాన్వేషణకు పట్టణానికి వెళ్తాడు. క్లర్కు ఉద్యోగం వస్తుంది. నగరంలో గుమస్తా బతుకు బాధలను నగర జీవనాన్ని ఈ కావ్యంలో ఆరుద్ర చిత్రించారు. పఠాభి ‘ఫిడేలు రాగాల డజన్’ కావ్యంలో నగర జీవన చిత్రణ ఆరుద్రకు స్ఫూర్తి. ఇందులో నాయకుడు మధ్యతరగతి యువకుడు. కలలబేరగాడు. ఇతడేమంటాడంటే– ‘‘దావానలతుల్యోజ్వల భావానల కీలలోన పడుతూ ఉంటా, భావాలకు బానిసనై కావాలని గాలిమేడ కడుతూ ఉంటా’’నంటాడు. ఇది కంద పద్యం. ఇలా ఆరుద్ర ఛందః ప్రయోగాలు చాలా ఉన్నాయి. ‘సినీవాలి’ కావ్యంలో నాటకీయత ఉంది. పాత్రలు సూర్యారావు, తండ్రి, ముగ్గురు వధువులు, కవి. సూర్యారావు, ఆ యువతులతో జరిపిన సంభాషణలు ఆలోచనాత్మకంగా ఉంటాయి. తండ్రి: ‘‘అబ్బాయీ! నీ చీకటి బ్రతుకులో పెళ్ళామనే పెట్రోమాక్సు లైట్ కావాలి. జీవితం రేడియో సెట్టుకి భర్త ఏరియల్, భార్య ఎర్త్’’ అంటాడు. ‘‘భార్యభర్తలనే ఏరియల్సు, ఎర్తు ఉన్నా ఏకాభిప్రాయమనే విద్యుచ్ఛక్తి లేకపోతే సెట్టు పలకటం సున్నా’’ అని అంటాడు అబ్బాయి. పాత్రల సంభాషణలు చమత్కారవంతంగా ఉంటాయి. పాత్రల ప్రవేశానికి మధ్య కవి వ్యాఖ్యానం ద్విపదల్లో ఉంది. ‘‘ఆర్జించుకొన్నట్టి ఆవేదనాగ్ని బూర్జువా సరదాల బూజు ధరించ’’ ఇలా కావ్యం మొత్తం మీద 61 ద్విపదలను రాశారు. అది ఆరుద్ర ప్రత్యేకత, జీవఫలం ప్రేమ – అనేది ఈ కావ్యసందేశం – కొంతమంది అనుకున్నట్లుగా ఈ కావ్యం విషాదాంతం కాదు. ‘‘అయ్యా! మృత్యువుగారూ! పిల్లవాణ్ణి దయచేసి కనికరించండి. లేమి కారుతోంది చూడండి. కలల పంచ నుండి కారే సంతృప్తి ధార, నిద్దుర బిందెలలో పట్టుకోనీయండి’’ – అన్న వాక్యాలతో కావ్యం ముగుస్తుంది.
ఆరుద్ర ‘కూనలమ్మ పదాలు’కు ఎన్నో అనుకరణలు వచ్చాయి. జనం నాలుకల మీద నాట్యమాడేవి చాలా ఉన్నాయి. ‘‘ఆశ పెరిగిననాడు, అహం పెరిగినవాడు తనకు తానే కీడు ఓ కూనలమ్మా! బ్రూటుకేసిన ఓటు, బురదలో గిరవాటు, కడకు తెచ్చును చేటు – ఓ కూనలమ్మా! సగము క్యాపిటలిస్టు, సగము కమ్యూనిష్టు, ఎందు కొచ్చిన రొష్టు – ఓ కూనలమ్మా!’’ అన్నారు. కవిత్వపరంగా ఇవికాక – ‘ఆరుద్ర రచన’ (కవితలు) 1985 సంకలనం. విశాఖపట్నంపై 1942లో బాంబులు పడినప్పుడు ‘మరణశాసనం’ కవితలో, ‘‘కాలంకాగితమ్మై/ దివాకరుడు స్టాంపయితే/ నా దస్తావేజు మీద/ రేరాజే రాజముద్ర’’ అంటారు. ఆయన నాట్యశాస్త్రంపై రాసిన ‘హస్తలక్షణ పదాలు’ విశిష్టమైన రచన. ఇందులో భరత నాట్యంలో ముద్రలకు సంబంధించినవి ఆరుద్ర 31 హస్తలక్షణపదాలను చెప్పారు. వీటిలో ఆరుద్రముద్ర ‘బాలగోపాల’’ అన్నది.
నన్నయ్య, విశ్వనాథల మధ్యాక్కరలకంటే భిన్నంగా మంచి గమకంతో ఉండేట్లు మార్పు చేసి రాశారు ఆరుద్ర. వారు సవరించిన విశేషం వారి మాటల్లోనే: ‘‘భగణమ్ముపై నొక్క లఘువుపాదుకొలుపును మంచి బిగువు (భల–చంద్రగణం)/ నగణమ్ములఘువులను రెండు నడకకై చేర్చుకొననిండు (నలల–చంద్రగణం)/ సొగసుగా ఇంద్రగణమందు చొప్పించుకో మాత్ర లైదు/ చిగురించ శుభలక్షణాలు చెప్పరా మధ్యాక్కరాలు’’ – ఇదీ వారి మార్పు. ఇది వారి ప్రయోగం. భార్య రామలక్ష్మి మీద ‘కే.రా త్రిశతి’ పేరుతో మూడువందల కంద పద్యాలను రాశారు. నిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ అయినప్పుడు ఆరుద్ర ఐసియు బెడ్ మీద పడుకొనే వీటిని రాశారు.
‘సమగ్రాంధ్ర సాహిత్యం’ పుస్తకంలో ఆరుద్ర ప్రత్యేకత వ్యవహార శైలి. అలాగే అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య వేమనలను చేర్చి సాహిత్య చరిత్ర రాయటం. అంతకుముందు సాహిత్య చరిత్రల్లోకి ఈ కవులు ఎక్కలేదు. ఈ పరిశోధనలో శీర్షికలను చూస్తేనే దీని లోతును ఊహించవచ్చు. ‘ఆరుద్ర వ్యాస పీఠం’, ‘గురజాడ గురుపీఠం’, ‘రాముడికి సీత ఏమవుతుంది?’, ‘వేమన్న వేదం’... ఇలా ఆరుద్ర రచనల పట్టికకే పేజీలు పడతాయి. ఆరుద్ర దృశ్య నాటికలలో ‘శ్రీకృష్ణదేవ రాయ రూపవాణీ రూపకం’ను గుమ్మడి వగైరా నటులు ప్రదర్శించారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో వరుసగా వందరోజులు ప్రదర్శింపబడింది. ఆరుద్ర కథలు, నాటికలు, నాటకాలు, డిటెక్టివ్ కథలు, డిటెక్టివ్ నవలలు చాలా ఉన్నాయి. ‘ఆడదాని భార్య’ ఆరుద్ర రాసిన అపురూపమైన డిటెక్టివ్ నవల.
ఇక ఆరుద్ర సినిమా పాటలూ వందల సంఖ్యలో ఉన్నాయి. మొదటిపాట, ‘బీదలపాట్లు’ (1972) సినిమాలో ‘‘ఓ చిలుక రాజా! లయ నీ పెళ్ళెప్పుడయ్యా!’’ అనేది. ఆరుద్ర రాసిన పెళ్లి పాటలు ఫేమస్. ‘‘పందిట్లో పెళ్లవుతున్నాదీ, కనువిందవుతున్నాదీ!’’, ‘‘శ్రీకారం చుట్టుకుంది పెండ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చనుంది కొత్త జీవితం’’ ఇది చివరిపాట. ఆరుద్రతో వ్యక్తిగతంగా నాకెంతో అనుబంధం ఉంది. ఈ జన్మదినం సందర్భంగా మరోసారి వారిని ఇలా తలచుకుంటూ ఈ అక్షర రూప నివాళి.
(నేటితో ఆరుద్ర శతజయంతి సంవత్సరం ముగింపు)
లగడపాటి సంగయ్య
94907 69242
భిన్నత్వంలో ఏకత్వం ఇండియా డీఎన్ఏలోనే ఉంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
దేశానికి డ్రగ్స్ పీడ వదిలిపోవాలి.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని