కృత్రిమ మేధకు దొంగతనమే మేత!
ABN , Publish Date - Oct 08 , 2026 | 01:23 AM
కృత్రిమ మేధస్సు (ఏఐ) గురించి వినగానే అదొక అద్భుతమైన మాయ అని, యంత్రాలు మనుషుల్లాగా ఆలోచిస్తున్నాయని మనం అనుకుంటాం. కానీ, 2026లో రచయిత...
కృత్రిమ మేధస్సు (ఏఐ) గురించి వినగానే అదొక అద్భుతమైన మాయ అని, యంత్రాలు మనుషుల్లాగా ఆలోచిస్తున్నాయని మనం అనుకుంటాం. కానీ, 2026లో రచయిత క్రెయిగ్ వాన్‌పెల్ట్ రాసిన పరిశోధనా పత్రం... ఏఐ వెనుక ఉన్న భయంకరమైన వాస్తవాలను అత్యంత సరళంగా బట్టబయలు చేసింది. ఏఐ అనేది కేవలం మామూలు సాఫ్ట్‌వేర్ కాదు, సమాజంలోని మనుషుల సృజనాత్మకతను, శ్రమను కార్పొరేట్ లాభాల కోసం దోచుకునే క్రూరమైన పెట్టుబడిదారీ ఆయుధంగా ఈ పత్రం వివరిస్తుంది.
ఏఐ దానంతట అది కొత్తగా ఏదీ సృష్టించదు. వందల ఏళ్లుగా రచయితలు, కవులు, కళాకారులు తమ మెదళ్లను కరిగించి రాసిన కోట్లాది పుస్తకాలను, సమాచారాన్ని బడా కార్పొరేట్ కంపెనీలు ఉచితంగా దొంగిలించాయి. వాటితో తమ యంత్రాలకు శిక్షణ ఇచ్చాయి. అంటే, గత కాలపు మనుషుల శ్రమను లాభాలుగా మార్చుకుని, నేడు కథలు రాయాలనుకునే సజీవ రచయితల ఉపాధిని దెబ్బతీస్తున్నాయి.
ఏఐకి ప్రాణం, ఆత్మ, ఆలోచన ఉండవు. హాలీవుడ్ సినిమాల్లోని జాంబీల్లాగా ఇవి కేవలం బతికున్న మనుషుల సమాచారాన్ని మింగేసి బతుకుతాయి. అందుకే రచయిత క్రెయిగ్ వాన్‌పెల్ట్ వీటిని ‘సైబర్ జాంబీలు’ అన్నాడు. మనిషి కథ రాస్తే అందులో అతని జీవితం, ఆకలి, బాధ ఉంటాయి. కానీ ఏఐ... ఇంటర్నెట్‌లోని పదాలను లెక్కలు వేసుకుని కలుపుతుంది తప్ప, అందులో ఆత్మ ఉండదు. ఈ యంత్రాలు నడిచే పెద్ద డేటా సెంటర్లను, మనుషుల ఆలోచనలను పాతరేసిన ‘శ్మశాన వాటికలు’ (నెక్రోపాలిస్)గా రచయిత అభివర్ణించాడు. ఏఐ వల్ల సమాజంలో రచయితలు, డిజైనర్లు, కోడర్లు వంటి ‘జ్ఞాన కార్మికులు’ (కాగ్నిటేరియట్) తీవ్రంగా నష్టపోతున్నారు. ‘యంత్రం ఉచితంగా కథలు రాస్తుంటే మీకెందుకు డబ్బులు ఇవ్వాలి?’ అని కార్పొరేట్లు ప్రశ్నిస్తున్నారు. ఏఐ వల్ల కళలు సామాన్యులకు కూడా చేరువవుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యీకరణ అని టెక్ కంపెనీలు చెప్పేమాట పచ్చి అబద్ధం. ఇది కేవలం వారి గుత్తాధిపత్యం. సమాజాన్ని ప్రశ్నించే విషయాలను ఈ యంత్రాలు సెన్సార్ చేస్తాయి. మన స్వేచ్ఛను లాగేసుకుని యంత్రాల చేతిలో పెట్టడమే దీని అసలు లక్ష్యం.
కళ అనేది సమాజంలోని మానవ సంబంధాలు, పోరాటాల నుంచి వస్తుంది. రచయిత క్రైమ్ థ్రిల్లర్ రాసినా, రాజకీయ కథ రాసినా అందులో అతని సామాజిక స్పృహ ఉంటుంది. కానీ ఏఐకి ఇలాంటి అనుభవాలు శూన్యం. సమాజం, జీవితం తెలియని యంత్రం పుట్టించే కళకు ఆత్మ ఉండదు. కార్పొరేట్ సంస్థలు ఏఐని సృష్టికర్తగా ప్రచారం చేస్తున్నాయి. కానీ అది సృష్టికర్త కాదు, ఇతరుల శ్రమను కాపీ కొట్టే అనుకర్త మాత్రమే. పెట్టుబడిదారీ వ్యవస్థలో లాభమే ముఖ్యం. కళను కూడా వస్తువులానే చూస్తారు. నిజమైన రచయితకు పారితోషికం ఇవ్వాలి, అతని హక్కులను గౌరవించాలి. అదే ఏఐ అయితే ఉచితంగా, వేగంగా వేలాది పేజీలు రాసిస్తుంది. యంత్రం జీతం అడగదు, సమ్మె చేయదు కాబట్టే కార్పొరేట్లు దీనిని ప్రజలపై రుద్దుతున్నారు.
చేనేత కార్మికులు యంత్రాల వల్ల ఎలా కూలీలుగా మారారో, ఇప్పుడు రచయితలను కూడా ‘ప్రాంప్ట్ ఇంజినీర్లు’గా మారుస్తున్నారు. యంత్రం రాసిన చెత్తను సరిదిద్దే ప్రూఫ్ రీడర్ స్థాయికి అతడిని దిగజార్చుతున్నారు. మనిషికీ మనిషికీ మధ్య ఉండే భావోద్వేగ బంధమే కళకు మూలం. ఆ బంధం లేని ఏఐ రచనలు కేవలం ఖాళీ డబ్బాల్లాంటివి. ఇది టెక్నాలజీకి వ్యతిరేకం కాదు. సమాజం మొత్తానికి ఉపయోగపడేలా ఉంటే టెక్నాలజీ మంచిదే. కానీ కొద్దిమంది లాభాల కోసం మనుషుల శ్రమను దోచుకోవడమే అసలు సమస్య. మనిషిలోని సృజనాత్మకతను, ఆలోచనను ఏ యంత్రమూ ఎప్పటికీ భర్తీ చేయలేదు.
కార్ల్‌మార్క్స్ చెప్పిన ‘పరాయీకరణ‘ సిద్ధాంతాన్ని ఫ్రాంక్ షిల్లింగర్ 2025లో రాసిన వ్యాసం ద్వారా ఏఐకి అద్భుతంగా అన్వయించాడు. ఫ్యాక్టరీలో కార్మికుడు తాను తయారు చేసిన వస్తువుపై హక్కు కోల్పోవడాన్ని మొదటి దశ పరాయీకరణ అంటారు. ఇది భౌతికమైనది. కానీ ఇప్పుడు ఏఐ ద్వారా జరుగుతున్నది రెండో దశ పరాయీకరణ. ఇది మానసికమైనది. సృజనాత్మక రంగాల్లో మనిషి తన సొంత ఆలోచనలకు, రచనలకు తానే పరాయివాడిగా మారిపోతున్నాడు. ఉదాహరణకు, ఒక యువ రచయిత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో పెద్ద ధారావాహిక రాయాలనుకున్నాడు. స్వయంగా రాస్తే అందులో అతని అనుభవాలు, బాధ అక్షరాలుగా మారతాయి. కానీ ఏఐ వాడితే, అతను కేవలం కమాండ్ ఇస్తాడు. ఏఐ వెంటనే కథ రాసిస్తుంది. ఆ కథకు పాఠకుల నుంచి ప్రశంసలు వచ్చినా, రచయిత మనసులో వెలితి మిగిలిపోతుంది. ‘ఇది నేను నా రక్తం చిందించి రాసిన కథ’ అని అతను గర్వంగా చెప్పుకోలేడు. ఈ నిస్సహాయ స్థితే రెండో దశ పరాయీకరణ.
తెలుగులో గొప్ప నవలలు తీసుకుంటే, అందులో జీవిత మథనం, తత్వశాస్త్రం అణువణువునా ఉంటాయి. ఏఐకి ఇలాంటి జీవితానుభవం ఉండదు. పైగా, మన ఆలోచనలను కూడా యంత్రమే నియంత్రిస్తోంది. ఏదైనా కవిత రాస్తున్నప్పుడు మనం ఒక పదం ఆలోచించే లోపే అది నాలుగు పదాలు చూపుతుంది. అంటే మన ఆలోచనా పరిధిని కార్పొరేట్ అల్గారిథమ్స్ శాసిస్తున్నాయి. మార్కెట్ ఒత్తిడికి తలొగ్గి రచయితలు ఏఐ వాడటం వల్ల కథల సంఖ్య పెరుగుతోంది కానీ, నాణ్యత చచ్చిపోతోంది. కళ ద్వారా ఏర్పడే అద్భుతమైన మానవ సంబంధాన్ని ఏఐ ముక్కలు చేస్తోంది.
మనుషుల జ్ఞానాన్ని ఏఐ దొంగిలిస్తోందనే విషయంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద న్యాయ పోరాటం నడుస్తోంది. ఓపెన్ ఏఐ (చాట్‌జీపీటీ), మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ సంస్థలపై న్యూయార్క్ టైమ్స్ పత్రిక, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ రచయిత జార్జ్ ఆర్.ఆర్ మార్టిన్ లాంటి ప్రఖ్యాతులు కాపీరైట్ కేసులు వేశారు. ఈ టెక్ కంపెనీలు తమ యంత్రాలకు శిక్షణ ఇవ్వడానికి ఇంటర్నెట్‌లోని కోట్లాది పుస్తకాలను, వార్తలను ఉచితంగా దొంగిలించాయి. న్యూయార్క్ టైమ్స్ వందల ఏళ్లుగా ఎంతో డబ్బు, శ్రమ వెచ్చించి సేకరించిన వార్తలను ఏఐ కాపీ కొట్టేస్తోంది. ఎవరైనా చాట్‌జీపీటీని అడిగితే ఆ పత్రిక వార్తలను ఉన్నది ఉన్నట్లుగా ఇచ్చేస్తోంది. దీనివల్ల పాఠకులు తగ్గిపోయి, పత్రిక తీవ్రంగా నష్టపోతోంది. అసలు సృష్టికర్త కష్టాన్ని దొంగిలించి, ఆ సృష్టికర్తకే పోటీగా మారడం అంటే ఇదే!
అలాగే జార్జ్ ఆర్.ఆర్ మార్టిన్ జీవితకాలం కష్టపడి రాసిన పుస్తకాలను కూడా ఏఐకి మేతగా వేశారు. ఇప్పుడు చాట్‌జీపీటీ ఆయన శైలిని కాపీకొట్టి సులభంగా కథలు రాస్తోంది. భవిష్యత్తులో రచయితల అవసరమే లేకుండా చేసేందుకే ఈ టెక్ కంపెనీలు కుట్ర చేస్తున్నాయి. ఇదంతా చట్టాల ప్రకారం ‘సద్వినియోగం’ కిందకు వస్తుందని కంపెనీలు అబద్ధాలు ఆడుతున్నాయి. మనిషి– పది పుస్తకాలు చదివి ప్రేరణ పొందడం వేరు, యంత్రం– కోట్లాది పదాలను లెక్కలు వేసుకుని దొంగిలించడం వేరు.
ఏఐపై జరుగుతున్న ఈ న్యాయ పోరాటం కేవలం చట్టాలకు సంబంధించినది కాదు... మనిషిలోని సృజనాత్మకతను బతికించుకోవడానికి, కళను సజీవంగా ఉంచుకోవడానికి జరుగుతున్నది. మన గుండెల్లోంచి పుట్టాల్సిన అక్షరాలను యంత్రాలకు అప్పగించకూడదు. రాసిన ప్రతి అక్షరం వెనుక ‘ఇది నా శ్రమ’ అని గర్వంగా చెప్పుకోగలిగినప్పుడే నిజమైన కళకు, సజీవ మానవుడికి సార్థకత.
ఈ దోపిడీని అర్థం చేసుకోవడానికి కార్ల్‌మార్క్స్ చెప్పిన ‘మృత శ్రమ’, ‘సజీవ శ్రమ’ అనే రెండు భావనలు తెలుసుకోవాలి. ఒక వడ్రంగి తన చేతులతో, కష్టపడి ఒక కుర్చీని తయారు చేస్తే అందులో అతని రక్తం, చెమట ఉంటాయి. దానిని ‘సజీవ శ్రమ’ అంటారు. కొన్నాళ్ల తర్వాత ఒక ఫ్యాక్టరీ యజమాని పెద్ద యంత్రాన్ని తెచ్చి రోజుకు వేల కుర్చీలు తయారు చేస్తాడు. ఆ యంత్రాన్ని గతంలో ఎంతోమంది కార్మికులు, ఇంజనీర్లు కష్టపడి తయారు చేశారు. ఆ గత శ్రమనే ‘మృత శ్రమ’ అంటారు. యజమాని ఈ మృత శ్రమను (యంత్రాన్ని) ఉపయోగించుకుని, ఇప్పుడు బతికున్న వడ్రంగి (సజీవ శ్రమ) ఉపాధిని లాగేసుకుంటాడు. ఏఐ చేస్తున్నది కచ్చితంగా ఇదే.
పెట్టుబడిదారీ వ్యవస్థ ఎప్పుడూ మృత శ్రమ పక్షానే నిలబడుతుంది. ఎందుకంటే... ప్రశ్నించే గుణం లేని లాభదాయకమైన యంత్రాలే దానికి ప్రాణం. కానీ నెత్తురు, మాంసాలున్న మనిషి జీవితపు కొలిమిలో కాలి పదునెక్కిన అక్షరానికి ఉండే సామాజిక చైతన్యాన్ని, ఏ అల్గారిథమ్‌లూ ఎన్నటికీ భర్తీ చేయలేవు. ఏఐ అనేది కేవలం సాంకేతిక పరికరం మాత్రమే కాదు, అది పెట్టుబడిదారీ వ్యవస్థ తన ఉనికిని కాపాడుకోవడానికి, మనిషి మెదడును సైతం సరుకుగా మార్చడానికి ప్రయోగిస్తున్న అత్యున్నత సాంస్కృతిక ఆయుధం.
ఇది కేవలం కాపీరైట్ల కోసం సాగే న్యాయ పోరాటం కాదు. మనిషిగా మన కళను, మన సామాజిక స్పృహను కాపాడుకునే అస్తిత్వ పోరాటం. మనిషి గుండె చప్పుడు లేని ఏ కవిత్వమూ, మనిషి చెమట వాసన లేని ఏ కళా చరిత్రలో నిలబడదు. కార్పొరేట్ శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మారిన ఈ కృత్రిమ మేధపై, మనిషి సజీవ మేధస్సే అంతిమ విజయం సాధిస్తుంది. అంతిమ సృష్టికర్త ఎప్పుడూ మనిషే.
ఎం.కె. కుమార్
సామాజిక కార్యకర్త
ఇవి కూడా చదవండి..
రాహుల్ గాంధీ సర్‌ప్రైజ్ ట్రిక్.. పోలీసుల ప్లాన్‌ను ఎలా మార్చారు..
యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..