ప్రజాపాలనలో అర్ధనారీశ్వర స్ఫూర్తి
ABN , Publish Date - Apr 29 , 2026 | 05:05 AM
ప్రతి మనిషిలోనూ స్త్రీత్వం, పురుషత్వం అనే ద్వంద్వ లక్షణాలు అంతర్లీనంగా సహజసిద్ధంగా ఉంటాయి. సహజ మానవ లక్షణాలైన ధైర్యం, తెగువ, సాహసం వంటి మానసిక లక్షణాలను...
ప్రతి మనిషిలోనూ స్త్రీత్వం, పురుషత్వం అనే ద్వంద్వ లక్షణాలు అంతర్లీనంగా సహజసిద్ధంగా ఉంటాయి. సహజ మానవ లక్షణాలైన ధైర్యం, తెగువ, సాహసం వంటి మానసిక లక్షణాలను పురుష లక్షణాలనీ; మృదుత్వం, సున్నితత్వం, భావోద్వేగం, కరుణ వంటి లక్షణాలను స్త్రీ లక్షణాలనీ వర్గీకరించి సమాజం స్త్రీ–పురుష భేదాలను సృష్టించింది. ఒక స్త్రీ తెగింపుతో ధైర్యంగా మాట్లాడితే మగాడిలా ప్రవర్తిస్తోందంటారు. ఒక మగాడు భావోద్వేగంతో కన్నీరు కారిస్తే ఆడవారిలా ఏడుస్తున్నాడంటారు. భౌతిక లక్షణాలకే పరిమితమైన వైరుధ్యం మానసిక లక్షణాల్లోనూ ఉంటుందనే భావనతో సమాజం ఈ విభజనను సృష్టించింది. కానీ ఈ విభజన మధ్యలో చిక్కుకున్న మనుషుల బాధను గుర్తించలేదు. ఈ బాధలకు, సంఘర్షణకు ప్రతిరూపమే ట్రాన్స్‌జెండర్స్ సమాజం. జీవ వైవిధ్యంలో భాగంగా సహజంగా స్త్రీలు లేదా పురుషులు కాకుండా జన్మించిన వీరు సమాజం అంచుల్లోకి నెట్టబడ్డారు.
మనిషి తన మూలాలను, విలువలను, జీవ వర్గీకరణ స్పృహను విస్మరించడంతో తలెత్తిన సామాజిక దుష్పరిణామమిది. ప్రాచీన భారతీయ తత్వంలో స్త్రీ, పురుష, తృతీయ లింగం (ట్రాన్స్‌జెండర్లు) మధ్య వైరుధ్యాలు మనకు కనిపించవు. అందుకే పురాణాలు, ఇతిహాసాలు ‘జెండర్’ కేవలం ‘ద్వంద్వం’ కాదని, థర్డ్ జెండర్ (ట్రాన్స్‌జెండర్) సాధారణమైనదేననే భావనను ఎప్పుడో స్పష్టం చేశాయి. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు మనిషి అసలు స్వరూపం ఆత్మ అని, అది లింగాతీతమని బోధించాయి. మహాదేవునిగా పూజలందుకునే శివుని అవతారమైన అర్ధనారీశ్వరుని రూపం కేవలం దైవీయం కాదు, అది ఒక సందేశం. ఒకే శరీరంలో స్త్రీ, పురుష తత్వాల సహజ సహవాసం. విష్ణువు మోహినీ అవతారం లింగ మార్పు దైవీయమని, సహజమైనదని చాటితే, మహాభారతంలోని శిఖండి, బృహన్నల వంటి పాత్రలు లింగ మార్పు భావనను, లింగ సమానత్వాన్ని స్పష్టం చేస్తాయి.
జీవుల విలువను కేవలం జీవశాస్త్ర పరమైన వర్గీకరణలతో కొలవడం అసంబద్ధమైనదని ఉపనిషత్తుల వేదాంత సారాంశం ఏనాడో తేల్చి చెప్పింది. మనిషికి గుర్తింపు కేవలం శరీరంతో కాకుండా చైతన్యం, అనుభవం, స్వీయ అవగాహనతో కలుగుతుందని, ఇందులో జెండర్‌కు ప్రాధాన్యం లేదన్న లోతైన సత్యాన్ని భారతీయ తత్వం తెలుపుతుంది. విజ్ఞానశాస్త్రం ప్రకారం కూడా సృష్టిలో కొన్ని జీవులు జీవన అవసరాలకు అనుగుణంగా స్త్రీ జీవులుగా మొదలై తర్వాత పురుష జీవులుగా, పురుష జీవులుగా మొదలై తర్వాత స్త్రీ జీవులుగా రూపాంతరం చెందుతాయి. దీనిని ‘Sequential Hermaphroditism (క్రమానుసార ద్విలింగత్వం లేదా లింగ మార్పు) అంటారు.
ప్రాచీన, మధ్యయుగాల నాటి భారతదేశంలో ట్రాన్స్‌జెండర్లపై వివక్ష, అణచివేత లేదని చరిత్రాధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చు. రాజసభల్లో, దేవాలయాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో వారికి సముచిత స్థానం ఉండేదని చెప్పడానికి తగిన చారిత్రక ఆధారాలున్నాయి. రామాయణంలోని ఒక గాథ ఆధారంగా వీరి ఆశీర్వాదం తమకు భాగ్యాన్ని కలిగిస్తుందని ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు. కాలక్రమంలో ‘క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్–1871’ వంటి చట్టాలను బ్రిటిష్ పాలనలో అమలు చేయడంతో, వారి కదలికలపైన, జీవన విధానంపైన నియంత్రణలు, చట్టపరమైన వివక్ష పెరిగాయి. ఫలితంగా, సమాజ తిరస్కారం తీవ్రరూపం దాల్చి, ట్రాన్స్‌జెండర్ల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు హరించబడి, వారు దయనీయ స్థితిలో కూరుకుపోయారు. కుటుంబ సభ్యుల నిరాకరణ, ఏవగింపు, సమాజం నుంచి అవమానాలు, హింస, అణచివేత, పరిమిత ఉపాధి అవకాశాలు.. వంటి పరిస్థితులు వారి జీవనస్థితిగతులను దిగజార్చాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో పలు కేసుల్లో కోర్టు తీర్పులు ట్రాన్స్‌జెండర్లకు అనుకూలంగా రావడం.. వారికి ఎంతో ఊరటనివ్వడంతో పాటు భద్రతనూ చేకూర్చింది. న్యాయస్థానాలు రాజ్యాంగ సూత్రాలను ఉటంకిస్తూ, ట్రాన్స్‌జెండర్ల హక్కులను గుర్తిస్తూ, పలు కేసుల్లో వారికి అనుకూలంగా తీర్పులను ప్రకటించాయి. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2014) కేసులో సుప్రీంకోర్టు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను ‘మూడవ లింగం (థర్డ్ జెండర్)’గా ప్రకటించింది. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు తమ స్వీయ లింగ గుర్తింపును (self–identification) నిర్ణయించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఆ తర్వాత పలు కేసుల్లోనూ లింగ వైవిధ్యం, గోప్యత, వ్యక్తిగత స్వేచ్ఛలను గుర్తించాలని న్యాయస్థానాలు తీర్పులనిచ్చాయి.
ఫలితంగా ట్రాన్స్‌జెండర్ల సమస్యలను పరిష్కరించి, సాధారణ పౌరుల్లానే వారూ రాజ్యాంగపరమైన హక్కులను పొందేలా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కార్యాచరణను ప్రారంభించాయి. ఈ దిశగా ప్రభుత్వపరంగా సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని తెలంగాణ ప్రజా ప్రభుత్వమూ గుర్తించింది. పురోగతిని కేవలం ఆర్థిక లేదా సాంకేతిక అభివృద్ధితో కొలవడం సరికాదని, అవకాశాలకు, ఆదరణకు దూరంగా సమాజం అంచుల్లో ఉన్న వారి వికాసానికి, సమగ్ర ప్రగతికి కట్టుదిట్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఈ దిశగా చేపట్టిన చర్యలు ట్రాన్స్‌జెండర్లలో భరోసాను నింపి, తామూ సమాజంలో భాగమే అనే విశ్వాసాన్ని కల్పించి వారి వికాసానికి బాటలు పరిచాయి. ట్రాన్స్‌జెండర్ల ఆర్థిక సాధికారతకు వంద శాతం రాయితీతో రుణాల కల్పన, ట్రాఫిక్ అసిస్టెంట్‌లుగా, హైదరాబాద్ మెట్రో రైళ్ళలో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్‌జెండర్ల నియామకం, ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు తదితర చర్యల ద్వారా వారి భవిష్యత్తుకు బాటలు వేసింది. ట్రాన్స్‌జెండర్లకు సమాన అవకాశాల కల్పన దిశగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వేస్తున్న అడుగులు భవిష్యత్తులో వారి హక్కుల సాధనకు పటిష్ఠ పునాదిని ఏర్పరుస్తున్నాయి. వీరికి ప్రభుత్వ శాఖల్లో మరిన్ని అవకాశాలను కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం నిబద్ధతతో ప్రత్యేక కార్యాచరణను అమలుచేస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని తమ రాష్ట్రంలోనూ ట్రాన్స్‌జెండర్లకు ట్రాఫిక్ విభాగంలో హోంగార్డులుగా ఉద్యోగాలు కల్పించామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించడం తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఇప్పటికే కర్ణాటకలో ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వోద్యోగాల్లో 1 శాతం రిజర్వేషన్లను కల్పిస్తుండగా కేరళ, ఒడిషా, బిహార్, జార్ఖండ్ మొదలైన రాష్ట్రాల్లో ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, వారికి ప్రభుత్వోద్యోగాల కల్పనకు పటిష్ఠ అడుగులు పడుతున్నాయి.
కోర్టు తీర్పులకు అనుగుణంగా భారత ప్రభుత్వం Transgender Persons (Protection of Rights) Act, 2019తో పాటు Transgender Persons (Protection of Rights) Rules, 2020ను అమలు చేసినప్పటికీ, ట్రాన్స్‌జెండర్లపై వివక్ష తగ్గడంలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. అంతేగాక, ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన Transgender Persons (Protection of Rights) Amendment Bill, 2026 వారి స్వేచ్ఛ, గౌరవం, వ్యక్తిగత గుర్తింపు హక్కులను పరిమితం చేస్తున్నదన్న ఆందోళనలు ఉన్నాయి. కాబట్టి చట్టాల అమలులోని లోపాలను సరిదిద్దుతూ, వారి హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం మరింత నిబద్ధతతో పనిచేయాలి.
లింగ భేదాలకు అతీతంగా ప్రతి మనిషి సమాన హక్కులు, స్వేచ్ఛతో జీవించే వాతావరణాన్ని కల్పించడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, దీనికి సామాజిక కర్తవ్యమూ తోడుకావాలి. సమాజంలో స్వేచ్ఛ, సమానత్వం అనేవి అత్యున్నత విలువలుగా కొనసాగినప్పుడే ప్రజాస్వామ్యం పరిపూర్ణమవుతుంది.
కొండా సురేఖ
అటవీ, పర్యావరణ,
దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి
ఈ వార్తలు కూడా చదవండి
పెళ్లి పేరుతో రూ.కోట్ల వసూలు.. అషురెడ్డిపై ధర్మేంద్ర తీవ్ర ఆరోపణలు
తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్