Share News

నాటకంతోనే కడదాకా!

ABN , Publish Date - Nov 12 , 2026 | 01:11 AM

నాటక రంగానికి జీవితాన్నర్పించి దాదాపు అర్ధ శతాబ్ది కాలం నాటకోద్యమమే శ్వాసగా, ధ్యాసగా, ఆశగా జీవించిన నాటకప్రయోక్త ఎ.ఆర్.కృష్ణ. నటశిక్షణే జీవితధ్యేయంగా రిపర్టరీలను నెలకొల్పారు. రేపు ఆయన శతజయంతి...

నాటకంతోనే కడదాకా!

నాటక రంగానికి జీవితాన్నర్పించి దాదాపు అర్ధ శతాబ్ది కాలం నాటకోద్యమమే శ్వాసగా, ధ్యాసగా, ఆశగా జీవించిన నాటకప్రయోక్త ఎ.ఆర్.కృష్ణ. నటశిక్షణే జీవితధ్యేయంగా రిపర్టరీలను నెలకొల్పారు. రేపు ఆయన శతజయంతి. తెనాలి దగ్గర పెరవలి గ్రామంలో నవంబరు 13, 1926న అడుసుమల్లి నీలకంఠ సుబ్రహ్మణ్యం, యశోదమ్మలకు కృష్ణ జన్మించారు. ఆయన విద్యాభ్యాసం శ్రీకాకుళం, చల్లపల్లి, బందరు, ఉయ్యూరు, హైదరాబాద్‌లో జరిగింది. వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజినీరుగా బాధ్యతలు నిర్వహించారు.

కృష్ణగారు ప్రవృత్తిరీత్యా నాటకమే ఊపిరిగా కొన్ని వందల నాటకాల్లో నటించి, రచించి, దర్శకత్వం వహించి విజయవంతంగా ప్రదర్శించారు. 1960లో లండన్‌లోని ‘బ్రిటిష్ డ్రామా లీగ్‌’కు వెళ్లి, థియేటర్ ఆర్ట్స్ కోర్సులో శిక్షణ తీసుకున్నారు. 1963లో ఫోర్డ్ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌పై అమెరికాలో ఆరు నెలల పాటు థియేటర్స్‌ను సందర్శించారు. ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్–పారిస్‌కు ఎగ్జిక్యూటివ్ మెంబరుగా ఉండి, ప్రతి సంవత్సరమూ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేవారు. ‘ఛాయా థియేటర్’ పేరున ఫ్రాన్స్, ఇతర దేశాల్లో తోలుబొమ్మలాటను ప్రదర్శించారు. థియేటర్ సమావేశాలకు ఆ కాలంలో సుమారు 21సార్లు విదేశీ పర్యటనలు చేశారు.

ఎ.ఆర్.కృష్ణ గారికి ఎన్నో సన్మానాలు జరిగాయి. దాదాపు ప్రతి సన్మాన సందర్భంలోనూ ఒకే మాట అనేవారు: ‘‘ఏదో సాధించానని, కళాసేవ చేశానని నేనెప్పుడూ అనుకోలేదు. కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి, వాళ్లు ఆ పని చేయకుండా ఉండలేరు. అలాగే నాకు నాటకం ఒక వ్యసనం. నాటకం వేయడం కోసం నాకు ప్రభుత్వం, నాటక సంఘాలు సహకరించాయి. లేనప్పుడు నా జేబులోంచి ఖర్చుపెట్టుకున్నాను’’.

నటుడిగా ‘వీలునామా’లో ధర్మారావు, ‘కన్యాశుల్కం’లో రామప్పపంతులు, ‘మృచ్ఛకటికం’లో చారుదత్తుడు, ‘ప్రతాప రుద్రీయం’లో ప్రతాపరుద్రుడు తదితర పాత్రలలో అద్వితీయంగా రాణించారు. ‘మహామంత్రి మాదన్న’లో తానీషా, ‘సంరక్షకుడు’ నాటకంలో దేవల్రాజు పాత్రలను పోషించి మెప్పించారు. రచయితగా ‘నిచ్చెనలు’, ‘అరగంటలో అదృష్టం’, ‘దేశం కోసం’, ‘దాగని సత్యం’, ‘ఆదర్శమూర్తి’, ‘అబ్బాయీ నీ ఖరీదు ఎంత?’, ‘వీధి’, ‘వీరభోజ్య’, ‘వసుంధర’, ‘మహామంత్రి మాదన్న’ నాటకాలు కృష్ణకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టాయి. దర్శకుడిగా కూడా పలు నాటకాలు తీశారు. ఉన్నవ లక్ష్మీనారాయణ నవల ‘మాలపల్లి’ని నాటకంగా మలిచి 1974లో నవరస నట బృందం తరఫున వందకు పైగా ప్రదర్శనలను విజయవంతంగా ప్రదర్శించారు. హైదరాబాద్‌ దూరదర్శన్‌లో ‘సతి దానశూరం’, ‘మహామంత్రి మాదన్న’ ప్రసారం అయ్యాయి. ఆకాశవాణిలోనూ పలు నాటకాలలో నటించి దర్శకత్వం వహించారు. మృణాల్ సేన్ దర్శకత్వంలో ‘ఒక ఊరి కథ’, శ్యామ్ బెనెగల్‌ దర్శకత్వంలో ‘అనుగ్రహం’ చిత్రాల్లో నటుడిగా రాణించారు.


కృష్ణుని మాయలో పడ్డ గోపికల్లాగా ఎ.ఆర్‌.కృష్ణతో స్నేహాన్ని చాలామంది వదలలేకపోయేవారు. ఆయన సలహాలతో తమ జీవితాల్లో సత్సంబంధాలు పెరిగాయని, కుటుంబ సమస్యలు తీరాయని... ఇలా ఆయన చుట్టూ తిరుగుతుండేవారు. ఆయన శిష్యులలో నూతన్ ప్రసాద్, రాళ్లపల్లి, ఈశ్వరరావ్, తెలంగాణ శకుంతల, నారాయణరావు సినిమా రంగంలో రాణించారు. నాటక రంగంలో ఆయనతో పనిచేసినవారిలో దుగ్గిరాల సోమేశ్వరరావు, గుమ్మడి గోపాలకృష్ణ, జె.వి.సోమయాజులు, దేశిరాజు హనుమంతరావు, డి.రామగోపాల్, దేవదాస్ కనకాల, లక్ష్మి, భిక్షు, దీక్షిత్, ఏడిద గోపాల్రావు, సంజీవ్, ప్రసాదరెడ్డి, విజయలక్ష్మి, పార్వతి... తదితరులు ముఖ్యులు.

ఎ.ఆర్‌.కృష్ణ ఒక ఉద్యమ జీవి. స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలుకు వెళ్లారు. నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు. విద్యార్థి నాయకుడిగా ఫీజు పెంపునకు వ్యతిరేకంగా ఊరేగింపులు చేసి విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళాకారుల ఊరేగింపును నిర్వహించి సంగీత నాటక అకాడమి ఏర్పాటుకు ముఖ్య కారకులయ్యారు. 1969లో కళాకారుల ఊరేగింపు చేసి, ముఖ్యమంత్రిని కలిసి నాటక ప్రదర్శనలకు పోలీసు అనుమతిని, వినోద పన్నులను రద్దు చేయించారు.

1970లో ‘రంగస్థల శాస్త్రం’ పుస్తకం ప్రథమ, ద్వితీయ భాగాలకు కృష్ణ రచన, సంపాదకత్వం వహించగా, తెలుగు అకాడమి వారు ప్రచురించారు. 1981లో ఏపీ నాటక అకాడమికి సలహాదారుడిగాను, ఏపీ థియేటర్ ఇన్‌స్టిట్యూట్ అండ్ రిపర్టరీకి డైరెక్టర్‌గాను తన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. 1992 ఏప్రిల్‌లో కృష్ణకు భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ అవార్డును బహూకరించింది. 1992 నవంబరు 10న ఆయన పరమపదించారు. తర్వాతి సంవత్సరం ఎ.ఆర్‌.కృష్ణ మెమోరియల్ ట్రస్టు ఏర్పాటైంది. ఈ ట్రస్టు తరఫున కృష్ణగారి స్మృత్యర్థం నాటక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

ఎ.ఆర్‌.కృష్ణ శతజయంతి వేడుకలు 13వ తేదీ శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు త్యాగరాయ గానసభలో జరుగుతాయి. కె.వి.రమణ, మండలి బుద్ధప్రసాద్‌, గుమ్మడి గోపాలకృష్ణ, కళా జనార్దనమూర్తి, డి.యస్.ఎన్.మూర్తి, కోట్ల హనుమంతరావు, మద్దాళి రఘురామ్, కళా జనార్దనమూర్తి, అడుసుమల్లి ప్రకాశ్‌ నీలం తదితరులు పాల్గొంటారు. సభలో ఎ.ఆర్.కృష్ణ–దుగ్గిరాల పురస్కారాన్ని రంగస్థల కళాకారుడు సంజీవ్ మొదిలి స్వీకరిస్తారు.

ఎ. రామనాథ్‌

రిటైర్డ్‌ ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌, దూరదర్శన్‌

(రేపు ఎ.ఆర్‌.కృష్ణ శతజయంతి)

ఇవి కూడా చదవండి..

యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే...

Updated Date - Nov 12 , 2026 | 01:11 AM