Share News

పక్కా ప్రణాళికతోనే వైసీపీ మద్యం వ్యాపారం

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:46 AM

‘కాదేదీ కవితకు అనర్హం’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. కాదేదీ అవినీతికి అనర్హం అంటోంది వైసీపీ. కొండలు, గుట్టలు, గనులు, మట్టి, ఇసుక, మద్యం....

పక్కా ప్రణాళికతోనే వైసీపీ మద్యం వ్యాపారం

‘కాదేదీ కవితకు అనర్హం’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. కాదేదీ అవినీతికి అనర్హం అంటోంది వైసీపీ. కొండలు, గుట్టలు, గనులు, మట్టి, ఇసుక, మద్యం... ఇలా బెల్లం చుట్టూ ఈగల్లా ఆర్థిక వెసులుబాటు ఉన్నచోట అవినీతి ఉంటుంది. ఆయా సందర్భాల్లో అవినీతికి పాల్పడిన వాళ్లలో వేళ్లపై లెక్కించగలిగినంత మందే చట్టాలకు, విచారణ సంస్థలకు, న్యాయస్థానాలకు దొరికిపోతుంటారు. దొరికిన వాళ్లు దొంగలుగా, దొరకని వాళ్లు దొరలుగా రాజకీయాల్లో చలామణి అవుతుంటారు. కానీ వీటన్నింటి కంటే భిన్నంగా ఒక ప్రభుత్వం ప్రణాళికతో, పక్కా వ్యూహంతో ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయటం చరిత్రలో ఎన్నడూ జరగలేదు. అంతటి మహా పాపానికి పాల్పడిన చరిత్ర ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క ముఖ్యమంత్రికీ లేదు. కానీ, వైసీపీ ప్రభుత్వం ఆ పాపానికి పాల్పడింది. ఏపీలో మద్యం ముడుపులపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు, అందులో వెలుగు చూస్తున్న విషయాలను చూస్తుంటే, కాసుల కోసం ఇంతటి కక్కుర్తికి, ఘాతుకానికి కూడా ‘పాలకులు’ ఒడిగడతారా అనిపిస్తుంది.

2019లో అధికారంలోకి వచ్చేందుకు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసిన ప్రధాన వాగ్దానం రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం. అయితే ముఖ్యమంత్రి అయ్యాక ఆయన చేసిన పని– అప్పటివరకు ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో ఉన్న మద్యం అమ్మకాలను ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవటం. దీనికోసం మద్యం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, మద్యం పాలసీని, బ్రాండ్లను మార్చి, నగదు రూపంలో లావాదేవీలు జరిగేలా చేయటం. ఫలితంగా ‘నీకింత–నాకింత’ అన్న క్విడ్‌ప్రో కో విధానానికి మార్గం సుగమం చేయటం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్యం ముడుపులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సిట్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయటంతో, తీగ లాగితే డొంక కదిలింది. పక్కా ఆధారాలు, సాక్ష్యాలు, వాంగ్మూలాలతో రూ.3,500 కోట్లపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే కొందరు జైలుకు పోయారు. కొందరు బెయిళ్లపై బయటకు వచ్చారు. ఒకరిద్దరు అప్రూవర్లుగా మారేందుకు అంగీకరించారు.


రాష్ట్రంలో వైసీపీ హయాంలో మద్యం వ్యాపారం దాదాపు రూ.90 వేల కోట్ల పైమాటే. అందులో 35 వేల కోట్ల మేర అవినీతి జరిగిందన్నది బలమైన ఆరోపణ. సిట్ చేస్తున్న విచారణ కేవలం రూ.3,500 కోట్ల ముడుపులపై మాత్రమే. నిజానికి మొత్తం మద్యం అవినీతి లోతెంత? ప్రభుత్వ ఆదాయానికి పడిన గండి ఎంత? ఇవన్నీ తేలాల్సిన లెక్కలు. చార్టెడ్ ఫ్లైట్‌లు, విదేశాల్లో సొమ్ము పొదుపు, విదేశీ విహార యాత్రలు, బంగారం షాపులు, సినిమాల్లో పెట్టుబడులు, విల్లాల కొనుగోళ్లు, భార్యల ఖాతాల్లో సొమ్ములు, అట్టపెట్టెల్లో నోట్ల కట్టలు. ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులకు కీలక బాధ్యతలు ఇచ్చి, వారిని పావులుగా చేసుకొని ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్‌లు దర్శకత్వం వహించారు. మద్యం ముడుపుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవాళ్లు సామాన్యులు కాదు. ఆర్థికంగా, రాజకీయంగా బలపడినవాళ్లు. చట్టాలలోని లొసుగులను వినియోగించుకోవటంలో ఆరితేరిన ఘనులు. ముడుపుల కేసులో మొదటి నిందితుని నుంచి చివరి నిందితుని వరకు దోషులు తేలాలంటే విచారణ సంస్థకు సమర్థత, నీతిమంతమైన దక్షత చాలా అవసరం.

అయితే మద్యం తయారు చేసే సంస్థలు ఇన్ని వేల కోట్ల రూపాయలను లంచాలుగా చెల్లించాయంటే మద్యం సరఫరా చేశాయా? విషాన్ని పంపిణీ చేశాయా? అన్నది ప్రధానమైన ప్రశ్న. ఈ విషాన్ని సేవించటం ద్వారా ఎన్ని పుస్తెలు తెగిపడ్డాయో! ఎంతమంది విగతజీవులు అయ్యారో? ఎందరు రోగాల బారిన పడ్డారో... ఈ గణాంకాలు ఎంతో ముఖ్యమైనవి. ఆనాడు మందు నాణ్యతను ప్రశ్నించిన మదనపల్లికి చెందిన ఓం ప్రకాశ్‌ అనే యువకుడు రెండో రోజు అనుమానాస్పదంగా మృతి చెందాడు. 2022 మార్చి 14న ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం కారణంగా 18 మంది నిరుపేదలు మృతిచెందారు. కొవిడ్ మహమ్మారిలో మద్యం ధరలు పెరగడంతో శానిటైజర్‌ తాగి మృతి చెందిన సంఘటనలూ ఉన్నాయి. రహదారి ప్రమాదాలు ఎన్నో జరిగాయి. వీటన్నింటి వెనుక కల్తీ మద్యం ఉంది.


‘మద్యంలో భారీ అవినీతిని తొలి నెలలోనే గుర్తించానని, అలా చేయకపోతే ఉద్యోగ భద్రత లేద’ని ప్రత్యేక అధికారి సిట్‌కు వాంగ్మూలం ఇవ్వటం మద్యం వ్యాపారానికి తిరుగులేని ఆధారం. ఇందుకు సంబంధించి అన్ని వాంగ్మూలాల వేళ్లూ ‘తాడేపల్లి’ వైపే చూపుతున్నాయి. మాజీ సీఎంకు తెలియకుండా అప్పట్లో ఆకు కూడా కదిలేది కాదు. అయినా ‘భేతాళ స్క్రిప్ట్’, ‘ఎల్లో కుట్ర’ అంటూ ప్రజల్లో సానుభూతి కోసం, ఓట్ల రాజకీయం కోసం ఎదురుదాడి చేస్తున్నారు. దొంగిలించిన సొత్తును రికవరీ చేసి దొంగ ముందు పెట్టినా... తాను దొంగనని ఏ దొంగా ఒప్పుకోడు. అవినీతికి పాల్పడిన ఏ ఒక్క రాజకీయ నాయకుడూ ‘నేను తప్పు చేశాను’ అని ఒప్పుకున్న చరిత్ర లేదు. ఇది కూడా అంతే. రక్త మాంసాల వ్యాపారానికి అంతర్ సూత్రం ఏమిటంటే, అప్పటి అధికార పార్టీ ఆర్థికంగా బలపడి, ప్రత్యర్థి పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బ తీసి, తద్వారా ప్రజలను నవరత్నాల భజనలో భ్రమింపజేసి తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే. నియంతలకు మాత్రమే ఈ లక్షణం ఉంటుంది. నమ్మితేనే ప్రజలు ఓట్లేస్తారు. నిజాలను అబద్ధాలుగా ప్రచారం చేస్తే వేయరు. ప్రజలు 2019లో ఒకసారి మోసపోయారు. 151 సీట్లు ఇచ్చి అధికారాన్ని బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చారు. కానీ 2024లో మోసపోలేదు. 11 సీట్లు ఇచ్చి గోడకు కోళ్ల కొక్కెర వేయించారు. రక్త మాంసాల వ్యాపారం కారణంగా విగతజీవుల సంఖ్య తెలిస్తే, ఆ పాపానికి పాల్పడిన వైసీపీ కూడా విగతజీవి అవుతుంది.

పోతుల బాలకోటయ్య

చైర్మన్, ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు

ఇవి కూడా చదవండి..

బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..

మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..

Updated Date - Oct 06 , 2026 | 04:46 AM