కొత్త టెక్నాలజీతో భూ వివాదాలకు పరిష్కారం
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:52 AM
గత వైసీపీ ప్రభుత్వం... ప్రజల, ప్రభుత్వ భూములు కాజేసేందుకు భూ రికార్డులను గందరగోళంగా మార్చింది. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించింది. లక్షల కొద్దీ ప్రభుత్వ, ప్రైవేట్ భూములను వైసీపీ నేతలు ఆక్రమించుకున్నారు....
గత వైసీపీ ప్రభుత్వం... ప్రజల, ప్రభుత్వ భూములు కాజేసేందుకు భూ రికార్డులను గందరగోళంగా మార్చింది. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించింది. లక్షల కొద్దీ ప్రభుత్వ, ప్రైవేట్ భూములను వైసీపీ నేతలు ఆక్రమించుకున్నారు. ఈ నేపథ్యంలో నిజమైన భూ యజమానుల హక్కులకు భద్రత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో రెవెన్యూ శాఖలో 40కి పైగా సంస్కరణలు అమలు చేసింది. కొత్త కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టింది. రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కూడా ఉపయోగించుకుని అత్యాధునిక టెక్నాలజీ ద్వారా భూ వివాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టేలా పనిచేస్తోంది. అలాగే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ సేవలను సులభతరంగా, పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా అందించేలా కృషి చేస్తోంది.
భూ రికార్డులను ఎవరూ తారుమారు చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం బ్లాక్‌చెయిన్ విధానాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా రికార్డుల్లో ఏ చిన్న మార్పు చేసినా సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఇది హ్యాకింగ్‌కు, డేటా టాంపరింగ్‌కు అవకాశం లేని అత్యంత సురక్షితమైన వ్యవస్థ. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను రియల్ టైమ్‌లో అనుసంధానించారు. వెబ్‌ల్యాండ్, రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్‌లను సమర్థవంతంగా అనుసంధానించారు. ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ కాగానే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ (పేరు మార్పిడి) జరిగి, రెవెన్యూ రికార్డులు తక్షణమే అప్‌డేట్ అవుతున్నాయి. దీనివల్ల ఒకే భూమిని ఇద్దరికి అమ్మే మోసాలకు అడ్డుకట్ట పడింది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ లాకింగ్ సదుపాయాన్ని కల్పించారు. రైతులు తమ వేలిముద్ర లేదా ఓటీపీ ద్వారా తమ భూమిని ‘లాక్’ చేసుకునే విప్లవాత్మక సదుపాయం తెచ్చారు. దీంతో యజమాని అనుమతి లేకుండా భూమి బదిలీ లేదా మ్యుటేషన్ ఇంకెవరూ చేయలేరు. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ–కేవైసీని అమలు చేస్తున్నారు. కొనుగోలు, అమ్మకందారుల గుర్తింపును బయోమెట్రిక్ విధానం (వేలిముద్రలు, ఐరిస్) ద్వారా పక్కాగా నిర్ధారిస్తున్నారు. దీనివల్ల బినామీ, నకిలీ వ్యక్తులతో జరిగే రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రీ సర్వే తప్పులను సరిదిద్ది కూటమి ప్రభుత్వం పటిష్ఠంగా రీ సర్వేను నిర్వహిస్తోంది. ఇందులో భూముల సరిహద్దు వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కచ్చితమైన కొలతలతో మ్యాపింగ్ చేయడానికి డ్రోన్లు, కంటిన్యూయస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (CORS) సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. వందల ఏళ్ల నుంచి ఉన్న పాత భూ రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేస్తున్నారు. ఏఐ సహకారంతో 2026 చివరి నాటికి రాష్ట్రంలో ఉన్న పాత రికార్డులన్నింటినీ శాశ్వత డిజిటల్ గుర్తింపుతో భద్రపరుస్తారు.
ప్రజలు సులభంగా భూముల రిజిస్ట్రేషన్ చేసుకునేలా రిజిస్ట్రేషన్ శాఖ స్లాట్ బుకింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్‌లో ముందుగానే స్లాట్‌ను బుక్ చేసుకొని కార్యాలయానికి వచ్చిన పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రకియ పూర్తయి, వారి మొబైల్స్‌కు వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ వస్తుంది. అలాగే డాక్యుమెంట్ హార్డ్ కాపీ కూడా గంటలో అందజేస్తున్నారు. ఇక ఎన్నారైలు తమ భూముల అమ్మకం, కొనుగోళ్లకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసుకోవడంలో అవకతవకలను నిరోధించేందుకు వీడియో ఈ–కేవైసీని ప్రవేశపెట్టారు. కుల, ఆదాయ, నివాస పహాణీ/ అడంగల్ వంటి రెవెన్యూ ధ్రువపత్రాల జారీని పూర్తిగా ఆన్‌లైన్ చేశారు. గ్రామ/ వార్డు సచివాలయాల ద్వారా వచ్చే దరఖాస్తులను నిర్ణీత సమయంలో డిజిటల్ సంతకాలతో మంజూరు చేస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సర్టిఫికెట్లు నేరుగా దరఖాస్తుదారుల మొబైల్‌కు, డిజిలాకర్‌కు చేరేలా వ్యవస్థను సులభతరం చేశారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా, మధ్యవర్తులు లేకుండా అందేలా ‘మన మిత్ర’ అనే వాట్సాప్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా 26 రకాల రెవెన్యూ సేవలను పొందవచ్చు. దరఖాస్తు చేయడం, స్థితిని ట్రాక్ చేయడం, సర్టిఫికెట్లు పొందడం వంటివన్నీ డిజిటల్ పద్ధతిలోనే జరుగుతాయి.
రానున్న కాలంలో మరిన్ని టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు సులభంగా సేవలు అందించడంతో పాటు భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించబోతున్నారు. భవిష్యత్తులో తీసుకురాబోయే టెక్నాలజీలతో రాష్ట్రంలో నూరు శాతం అవినీతి రహిత, వివాద రహిత రెవెన్యూ వ్యవస్థ సాకారం కానుంది.
l అనగాని సత్యప్రసాద్
రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులశాఖ మంత్రి
(నేడు ఏపీ రెవెన్యూ డే)
ఇవి కూడా చదవండి..
దుర్గమ్మ భక్తులకు మెరుగైన డిజిటల్ సేవలు: ఈవో శీనా నాయక్
యువతకు ప్రధాని మోదీ 24 కోట్ల ఉద్యోగాలు బాకీ: జగ్గారెడ్డి
Read Latest Telangana News And Telugu News