Share News

ఓపీఎస్‌తోనే ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:34 AM

‘పెన్షన్ అనేది ప్రభుత్వ దానం కాదు; ఉద్యోగి జీవితకాల ప్రజాసేవకు లభించే చట్టబద్ధమైన హక్కు’– భారత సుప్రీంకోర్టు డీఎస్‌ నకారా చరిత్రాత్మక తీర్పులో పేర్కొన్న ఈ సూత్రం పెన్షన్ వ్యవస్థ ఆవశ్యకతను స్పష్టంగా తెలియజేస్తోంది....

ఓపీఎస్‌తోనే ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా

‘పెన్షన్ అనేది ప్రభుత్వ దానం కాదు; ఉద్యోగి జీవితకాల ప్రజాసేవకు లభించే చట్టబద్ధమైన హక్కు’– భారత సుప్రీంకోర్టు డీఎస్‌ నకారా చరిత్రాత్మక తీర్పులో పేర్కొన్న ఈ సూత్రం పెన్షన్ వ్యవస్థ ఆవశ్యకతను స్పష్టంగా తెలియజేస్తోంది.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం 2026 జూలై 13న జారీ చేసిన జీవో 53 ఉద్యోగుల సంక్షేమ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి. 2004 సెప్టెంబర్ 1కి ముందు నియామక ప్రకటన వెలువడినా, ప్రభుత్వ పరిపాలనా జాప్యాల వల్ల ఆ తేదీ తరువాత ఉద్యోగంలో చేరి, సీపీఎస్ పరిధిలోకి వెళ్లిన అర్హులైన ఉద్యోగులకు ఒకే ఒక్కసారి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్‌)లోకి మారే అవకాశం కల్పించడం ద్వారా.. ప్రభుత్వం వారికి జరిగిన అన్యాయాన్ని కొంతవరకు సరిదిద్దింది.

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రకాల పెన్షన్ విధానాలు అమలులో ఉన్నాయి. ఒకటి ఓపీఎస్‌ కాగా, మరొకటి సీపీఎస్‌/ఎన్పీఎస్‌ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్/ నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌). ఓపీఎస్ ద్వారా ఉద్యోగికి జీవితాంతం నిర్ధారిత పెన్షన్, డియర్‌నెస్ రిలీఫ్, కుటుంబ పెన్షన్ వంటి ప్రయోజనాలను ప్రభుత్వం హామీ ఇస్తుంది. దీనివల్ల ఉద్యోగి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతతో, గౌరవప్రదంగా జీవించే అవకాశం లభిస్తుంది. దీనికి భిన్నంగా, సీపీఎస్ అనేది నిర్దిష్ట విరాళాల విధానం. అందువల్ల ఉద్యోగికి భవిష్యత్తులో ఎంత పెన్షన్ లభిస్తుందో ముందుగానే నిర్ధారించలేని పరిస్థితి. ఈ అనిశ్చితే సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనకు ప్రధాన కారణం. ఏపీ ప్రభుత్వం జీవో 53 ద్వారా ఒక వర్గానికి ఓపీఎస్‌లోకి మారే అవకాశం కల్పించడం అభినందనీయం. అయితే, ఇది సమస్యకు పూర్తి పరిష్కారం కాదు. కేవలం నియామక తేదీ ఆధారంగా ఒకరికి ఓపీఎస్, మరొకరికి సీపీఎస్ వర్తించడం ‘సమాన పనికి సమాన సామాజిక భద్రత’ అనే సూత్రానికి అనుగుణంగా లేదు.

సీపీఎస్ ఉద్యోగుల సమస్యను పరిష్కరిస్తామని, వారికి న్యాయం చేస్తామని గత ఎన్నికల ముందు కూటమి స్పష్టమైన హామీ ఇచ్చింది. ఆ హామీ సంపూర్ణంగా నెరవేరాలంటే, మిగిలిన సీపీఎస్ ఉద్యోగులందరికీ ఓపీఎస్‌ను వర్తింపజేయడం లేదా అదే స్థాయి సామాజిక భద్రతను కల్పించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయడం అవసరం.

టి.ఎం.బి. బుచ్చిరాజు

చైర్మన్‌, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సంక్షేమ ట్రస్ట్

Also Read:

చికెన్‌ 65 అనే పేరు ఎలా వచ్చింది?

‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు.. నా కల నెరవేరింది: వైభవ్ సూర్యవంశీ

Updated Date - Jul 28 , 2026 | 12:34 AM