అణుకంపనం
ABN , Publish Date - Nov 23 , 2026 | 01:34 AM
ఇన్నిన్ని అణుమానాలను మోస్తూ బతుకుతున్నామా ఇదిగో ఈ రాత్రి దేహంపై ఏ దాడి చేయకుండా కనికరిస్తే కదా...
ఇన్నిన్ని అణుమానాలను మోస్తూ
బతుకుతున్నామా
ఇదిగో ఈ రాత్రి దేహంపై
ఏ దాడి చేయకుండా కనికరిస్తే కదా
పొద్దున్నే మన ముఖాలు
వెలుగు పువ్వులయి పూసేది
ఒక్కగానొక్క మనిషి ఋతువుకి
ఎన్నెన్ని కలత పూతలు
ఇంత బతుకును రోజు
వేయింగ్ మిషన్లపై తూస్తూ
డైట్‌ను మిల్లీ గ్రాముల్లోకి
కుదించుకుంటున్నాం.
గుండెల్లో కోట్ల అల్పపీడనాలను నిక్షిప్తం చేసుకొని
నిత్యం రక్తపీడనాలను కొలుచుకుంటున్నాం
మనిషి కాదు
సున్నితపు త్రాసులో తూగాల్సింది
మాట కదా
ఇప్పుడెటొచ్చీ ఆ మాటనే మరిచాం సదా
ఇది రేపటి పైన నమ్మకమో
నేటి ఉనికిపై అపనమ్మకమో
అంతుచిక్కని ప్రశ్న
రూం ఫ్రెష్‌నర్ గులాబీ పరిమళంలోనూ
ఏ మూలనో దుర్గంధం ఉన్నదన్న భ్రాంతి
జేబునుండి వెదజల్లే కరెన్సీ వాసన వెనుక
ఎందుకో తెలియని వెలితి వెంటాడుతోంది
దారిలో తారసిల్లే
ప్రతి ముఖం వెనుక ఎన్నిరకాల
తొడుగుల పొరలు
ఇమిడి ఉన్నాయో
వలుస్తూ పోలేము
ఆప్యాయంగా తడుముకునే
కరచాలనాల మధ్య
ఎంతటి పదునైన కరవాలాలున్నాయో
ఆజన్మాంతం పసిగట్టనూ లేము
మణీందర్ గరికపాటి
99483 26270
ఇవి కూడా చదవండి..
భారత్, చైనా కమాండర్ల భేటీ.. అరుణాచల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చ..
రూ.13 లక్షల బ్రెజ్జాకు బదులుగా రూ.9.5 లక్షల కారు ఇచ్చారని.. పెళ్లినే రద్దు చేసుకున్న ఢిల్లీ పోలీస్..