Share News

మర్యాద రామన్నలకు మత్తు చురక

ABN , Publish Date - Sep 14 , 2026 | 02:44 AM

ఉదర పోషణార్థం జీవి ఎన్నో అగచాట్లు పడతాడు, ఎన్నో వేషాలు వేస్తాడు. ఈ తిప్పలన్నీ తప్పనివి. సమాజమే ఒక పెద్ద ప్రయోగశాల కనుక ఈ సమాజంలోనే ఈ సమాజపు నకిలీ విలువల్ని...

మర్యాద రామన్నలకు మత్తు చురక

‘‘She does not ask for anything; she is simply there, like the night, vast and full of stars, receiving the broken world into her sanctuary.’’

Rainer Maria Rilke

ఉదర పోషణార్థం జీవి ఎన్నో అగచాట్లు పడతాడు, ఎన్నో వేషాలు వేస్తాడు. ఈ తిప్పలన్నీ తప్పనివి. సమాజమే ఒక పెద్ద ప్రయోగశాల కనుక ఈ సమాజంలోనే ఈ సమాజపు నకిలీ విలువల్ని ఎండగట్టే thinkers, artists కూడా వస్తూంటారు. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రశ్నించినా మనిషికి ఇంకా ముసుగు అవసరంగానే మిగిలింది. కవి శిఖామణి కవితా సంపుటి ‘మువ్వల చేతి కర్ర’లో ఓ కవిత మనిషి సందర్భానుసారం ఒక్కో ముసుగునూ తొడుక్కోవడాన్ని ప్రస్తావిస్తూ నిరుత్సాహాన్ని ప్రకటిస్తుంది. ఈ సమాజపు చీకటి కోణంలో ఉన్నవి కల్లు కాంపౌండ్‌లూ, అనామక నిషిద్ధ సాంగత్యాలూ. మర్యాదా రామన్నలకూ ఈ రెండూ కావాలి. ఎందుక్కావాలంటే భువి నుండి దివికుండే మోక్షద్వారం ఎక్స్‌ప్రెస్‌ వే లాగ signboardsతోనూ, exit markersతోనూ ఉండదు. అది దేహాత్మకు ఏమంత సులువుగా చిక్కేది కాదు. తన కాలంలోనే ఫ్రెంచ్ సింబలిస్ట్ కవీ ఆధునిక కవితా పితామహుడూ అయిన బోద్లేర్ (Charles Baudelaire), ‘‘ఓ పాఠకుడా నువ్వు ఆత్మవంచకుడివి, నా ప్రతిబింబానివి, నా సోదరుడివి’’ అని అన్నాడు. అది విమర్శా హితోపదేశమా confession ఆ అనిపించేటంత నిజాయితీతో తెగేసి చెప్పాడు. వెర్లేఁ (Paul Verlaine) వంటి తదనంతర కవులూ అదే చెప్పారు. అనిల్ బత్తుల గారి ‘మధుశాల’లో ఈ ఆత్మాన్వేషి అన్నీ వదిలేసుకున్నవాడో ఏమీలేనివాడో అయితే అక్కడి దాకా ఈ కవిత్వంలో థీమ్‌ కాస్త పాతదే. సత్యాన్వేషణకు ఏదో చీకట్లోకి పారిపోవడమైనా, ఉత్థానానికి మధువునూ నిషిద్ధ ప్రణయాన్నీ ఆశ్రయించడం వంటి పతనానికి పూనుకున్నా అది మృషానైతికతను నటించే సమాజానికీ పెద్దలకూ చెంపపెట్టుగా మార్పు చెందడం కూడా తెలిసిన విషయమే. కొత్తదనం ఎక్కడా అంటే ఈ పుస్తకం పాఠకులకు అందించే సమగ్రానుభవంలో. కవితకు మాంత్రిక వాస్తవికత (magical realism) అలంకారపు పనిముట్టుగా (aesthetic tool) వాడుకొని, తను ఆగి, పాఠకుల్ని ఆపి, ఆచి తూచి, తెలుగు సరిగమల్ని పలికిస్తూ ప్రసాదగుణప్రధానంగా లేత లేతగా రాశారు అనిల్. ఇందులో ఇది పచ్చిగా ఉంది అనిపించే వాక్యశకలాలు నిజానికి బీభత్సరసం పుట్టే అరుదైన అలంకారాలు. ఈ కవిత్వంలో డజన్లకొద్దీ కనిపించే వైరిసమాసాల వినియోగం నియమోల్లంఘనను ఆదర్శప్రాయంగా చూపిస్తూ మర్యాదా రామన్నలకు చురక తగిలించడం. మొత్తంగా అనిల్ బత్తుల గారి కవిత పాఠకుల దేహాత్మలను లతలా పెనవేసుకుంటుంది. ఆద్యంతరహితమైన విశ్వంలో కవి కవిత ఆద్యంతరహితంగానే ఉంటూ చివరికి మొదటికే చేరుకుంటుంది. ఇది కవిత్వ ప్రయోజనాన్ని అన్యాపదేశంగా నిలబెట్టడం.


‘‘మనుషులు మానని గాయాల్ని చేస్తారు’’ అన్న జ్ఞానం ఈ సంపుటిలో ముఖ్యమైనది. ఇది ముసుగు తొడుక్కోవడమనే అవసరం వల్ల కలిగిన రుగ్మత. కవితల్లో పదాలు, వాక్యశకలాలు కాస్త తెరిపినిచ్చిన తరవాత మళ్ళీ కనిపించడం కవి సంగీతజ్ఞతకే కాక జీవితంలోని నిరవధికంగా కనిపించే నీరసమైన సంఘటనల పౌనఃపున్యానికీ (repetition) నిదర్శనం. ‘‘నా రహస్య శృంగార దేవతా/ దైవం మనకొద్దు/ మోక్షం అసలే వద్దు/ ఈ క్షణం చాలు’’ అన్నప్పుడు కవి ఒక తపస్సమాధిలో ధ్యానిస్తున్నాడు. ఇక్కడ 19వ శతాబ్దపు ఫ్రెంచ్ కవుల లోతైన అంతరంగాన్నీ, రిల్కే భావించిన శరణాలయం వంటి నిశ్శబ్ద విశాల సాంగత్యాన్నీ తలపిస్తూ ఆ అంతరంగ సహచరి పొందు కవిని పవిత్రీకరించింది. దుఃఖం లేని లోకం ఎంత భయానకమైందో, అక్కడి జీవితం ఎంత నరకప్రాయమో కవికి తెలుసును. ఆమె మరణించగానే ‘‘దుఃఖపు ప్రేమ చర్మంతో నా శవపేటికను సిద్ధం చెయ్యండి’’ అన్నప్పుడు ఈ ఆత్మాన్వేషి కేవలం కాముకుడు కాదని, ఆమె అపరిమిత ప్రేమలో తన దేహాత్మను శోధించుకునే సత్యవ్రతుడనే అసలు నిజం బట్టబయలౌతుంది.

ఇందులో అన్నీ ప్రేమికుల మధ్య జరిగే సంగతులు కావు. ‘ధార’ వంటి అనామకుడి ఏకాంతాన్ని పరిచయం చేసే కవితలో రెండున్నాయి. ప్రకృతి కవితలనాలో, ప్రేమ కవితలనాలో గానీ అటువంటివీ కొన్ని ఉన్నాయి. ఆవేదననూ, ఆక్రోశాన్ని వ్యక్తపరిచేవీ ఉన్నాయి. ఏకాకీ న రమతే అని ఉపనిషద్వాక్యం. ఆత్మాన్వేషి రమించడానికేనా ఆ సహచరి ఉన్నది? కవికి స్త్రీ అంటే ఉన్న కళారాధన, గౌరవం ప్రతి మాటలోనూ తొంగిచూస్తాయి. చివరి కవితను చదివిన పాఠకులు తమ బరువు తగ్గి మనసు బరువెక్కి అంతలోనే తేలికపడి కళ్ళు చెమర్చి మసకబారగా రిలాక్స్‌ అవడం కవి విజయం. గ్రీక్ లాక్షణికులు వివరించిన catharsis ఇదే. తెలుగు కవుల్లో ఈ అనుభూతిని పాఠకులకు పంచిచ్చిన అతి కొద్దిమంది కవుల్లో అనిల్ బత్తుల పేరు ఈ సంపుటి ద్వారా నిలుస్తుంది.

వాసు

99011 55133

ఈ వార్తలనూ చదవండి:

బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు

ఈఎంపీ షీల్డులు, హైటెక్ ఎన్‌క్రిప్షన్.. మిసైల్ దాడులనూ తిప్పికొట్టే జిన్ పింగ్ ఫ్లైట్.!

Updated Date - Sep 14 , 2026 | 02:44 AM