Share News

మిలీనియం చివరి మెట్టు మీద...

ABN , Publish Date - Mar 23 , 2026 | 01:03 AM

ఆత్మిక ఘర్షణలో వెలిగే అనుభవాన్ని అక్షరాల్లోకి తర్జుమా చేయడంలోని వైఫల్యం గాయంలా సలపరించే దశ ఒకటి ఉంటుంది. అప్పుడు అంతదాకా రాసిందంతా...

మిలీనియం చివరి మెట్టు మీద...

‘‘నేను నీలోంచీ

నీవు నాలోంచీ

మనిద్దరమూ మరెవడిలోంచో

సామూహిక ఆత్మల సహస్ర విచ్ఛేదనల్లోంచి...’’

– Monistic idealism నుంచి విచ్ఛిన్నమై తెలుగు కవిత్వం బహుళ అస్తిత్వాలతో గొంతు చించుకుంటూ broken narratives లో ప్రతిబింబాల్ని వెతుక్కుంటున్న 90ల మధ్యలో పుట్టిన ఈ వాక్యాలకు పెట్టిన పేరు ‘అనేకవచనం’.

ఆత్మిక ఘర్షణలో వెలిగే అనుభవాన్ని అక్షరాల్లోకి తర్జుమా చేయడంలోని వైఫల్యం గాయంలా సలపరించే దశ ఒకటి ఉంటుంది. అప్పుడు అంతదాకా రాసిందంతా poor imitations లాగానో, తలకెత్తుకున్న influencesను poetry skillsతో ముస్తాబు చేసినట్లుగానో అనిపిస్తుంది. దస్తాల కొద్దీ కవిత్వం అనుకుని రాసిందంతా disown చేసుకోగల ధైర్యం అప్పుడే వస్తుంది. అప్పటికి నా 30 ఏళ్ళ జీవితంలో దాదాపు పదేళ్ళుగా రాసిన కవిత్వంలో, ప్రముఖ పత్రికల్లో సాహిత్య పేజీల్లో అచ్చయిన వాటిని కూడా లెక్క చేయక పారేసుకోగా మిగిలినవి 45 కవితలు. ‘‘నల్ల సముద్రంలో రాలిన తెల్లచంద్రుడు తీరంవేపు కొట్టుకొస్తున్నాడు/ సహారా ఎడారిని వెంటేసుకొచ్చిన వైణికుడు నక్షత్రాల్ని రాల్చుతున్నాడు.../ అన్నింటికన్నా భాషే నన్ను ఎక్కువగా బాధించింది/ అక్షరాలకు అపరిచితుడిలా నేనో మరి ఎవరో?’’ అనే సందిగ్ధ వర్ణంలో నా రూపం నాకు కనిపించింది. అపరిచితుడి ఆనవాళ్లు కనిపించాయి. అప్పుడు అనిపించింది ఈ మిగిల్చుకున్న కవితలతో ఓ పుస్తకం వేయాలి అని. ‘అపరిచితుడు ఆనవాళ్ళు’ అనే కవితతోనే ఈ సంకలనం మొదలవ్వాలని.

‘‘కానీ, పుస్తకం పేరు మాత్రం ‘అనేకవచనం’ అంతే...’’ అన్నాడు అఫ్సర్. అప్పటికే ఆ కవితను అఫ్సర్ తాను ఇంచార్జిగా ఉన్న ఒక పత్రిక సాహిత్య పేజీలో ప్రచురించారు. ఈ పదబంధం నీది, ఈ కాలానిది అన్నారు. సిద్ధార్థ మురిసిపోయాడు. చిక్కడపల్లిలో చీకటి ఉదయిస్తున్న శీతల సాయంకాలంలో అలా టైటిల్ ఖరారైంది.


ఇదంతా, హైదరాబాద్ కవి సాయంకాలాలను వదిలి ‘ఇండియా టుడే’లో ట్రెయినీ జర్నలిస్టుగా చేరడానికి 1995 ఫిబ్రవరిలో మద్రాసుకు వెళ్ళిపోయిన రెండేళ్ళకు జరిగింది. ముందు మాట ఎవరితో రాయించాలనే విషయంలో నాకు రెండో థాట్ కూడా లేదు. రాత ప్రతిని పట్టుకుని మొదటిసారి కాకినాడలో దిగాను. మిత్రులతో కలిసి చెట్టుకవి ఇస్మాయిల్ గారి ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక సైకిల్ స్టాండ్ వేసి ఉంది. ఒక చక్రం నేల మీద, మరొకటి గాల్లో! ఈ రాతలకు మీరు ముందుమాట రాయాలని కోరాను. ఆయన హాయిగా ఒప్పుకున్నారు. తరువాత రెండు మూడు నెలల మా ఇద్దరి మధ్య పోస్టు కార్డుల మీద ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో అక్షరాలను సెలబ్రేట్ చేస్తున్నట్లుగా వచ్చి వాలేవి ఆ చెట్టుకవి ఉత్తరాలు. ఓ రోజున పోస్టు కార్డు కాకుండా, కవర్ వచ్చింది. అది చేతిలోకి తీసుకుని తెరుస్తుంటే కాళ్ళు నేల మీద లేవని తెలుస్తూనే ఉంది. అది ‘అనేకవచనం’ సంపుటికి ఇస్మాయిల్ కానుక చేసిన ‘పూర్వవచనం’. ఆ రోజుల్లో పెద్ద కవుల వద్దకు వెళ్ళి కవిత్వ ప్రతులను చేతుల్లో పెట్టడం, వారి ముందుమాటల కోసం ఎదురు చూడడం ఓ గొప్ప ఎక్సయిట్మెంట్‌. ఇక అది మొదటి పుస్తకమైతే చెప్పక్కర్లేదు.

ఆ ముందుమాటను తీసుకుని మద్రాసు నుంచి హైదరాబాద్‌లో వచ్చి వాలాను. సిద్ధార్ధ, నరేశ్ నున్నా, ముక్కామల చక్రధర్, చల్లా శ్రీనివాస్, దుర్గం రవిందర్, ఆర్టిస్ట్ ఏలే లక్ష్మణ్‌లతో కలిసి మీటింగ్. మరో రెండు మూడు నెలల్లో పుస్తకం అచ్చయిపోవాలని తీర్మానం. ఇస్మాయిల్ ‘పూర్వవచనం’ రాసిస్తే, నా సొంత మాటను ‘అనిర్వచనం’ పేరుతో రాసుకుని, డీటీపీ ప్రతిని లక్ష్మణ్ అన్న చేతిలో పెట్టాను. పొయెట్రీ బుక్‌ను కొత్తగా చూపించాలనే ఆలోచనతో లక్ష్మణ్ పుస్తకం సైజు, కవర్ డిజైన్ విషయంలో ఓ ట్రెండ్ సెట్ చేశారు. ఒక్కో పొయెంకు ఎంతో శ్రద్ధగా స్ట్రిప్ డ్రాయింగ్స్ వేశారు. ప్రతి కవితకు ఎడమ వైపున పేజీలో పై నుంచి కింది వరకూ సన్నగా సాగిన ఆ సృజనాత్మక రేఖలు కవితలకు ఒక gentle aura ను క్రియేట్‌ చేశాయి. మరో వైపు కవి మిత్రుడు సిద్ధార్థ ఈ సంకలనానికి ఎంతో ఇష్టంగా రాసిన చివరి మాట ‘నక్షత్రపురం తోవ’తో ఫైనల్ టచ్ ఇచ్చారు. తనకు అలవాటైన స్టైల్లో చివరిదాకా లాగి నన్నెంత టెన్షన్ పెట్టాడన్నది వేరే సంగతి. ప్రింటింగ్ ప్రెస్ పనులు, లామినేషన్ వర్క్ అంతా దుర్గం రవిందరన్న తన భుజాల మీద వేసుకుని చేశాడు. ఇన్ని హృదయావేశాలు కలిస్తే ‘అనేకవచనం’కు ఒక రూపం వచ్చింది.


‘The pious poet’ అని నన్ను ప్రేమగా పిలిచే కవి, మానవతామూర్తి సి.వి. కృష్ణారావుగారి అధ్యక్షతన రవీంద్రభారతి మినీ హాలులో 1999 డిసెంబర్ 18న ఆవిష్కరణ జరిగింది. ఎన్.గోపి ముఖ్యఅతిథిగా ‘అనేకవచనం’ సంపుటిని ఆవిష్కరించారు. నా చేయి పట్టుకుని ప్రపంచ కవిత్వంలోకి నడిపించిన సుమనశ్రీ, ఆధునికోత్తర విమర్శకుడు బి. తిరుపతిరావు ఆ సభలో వక్తలు. వారి మాటల్లో నా పట్ల ధ్వనించిన ‘హామీ’ నాలో భయంతో కూడిన నమ్మకాన్ని నింపింది. The unsaid is often the truest అనే నమ్మకంతో అవ్యక్తాన్ని వేటాడమే జీవితంగా మార్చింది.

One dimensionality ని ఖండించిన ‘అనేకవచనం’ అంటూ బి. తిరుపతిరావు రాసిన వ్యాసం ఆంధ్రజ్యోతి ‘సాహిత్యవేదిక’లో 2000 ఫిబ్రవరి 28న అచ్చయింది. ఒక కవి మొదటి పుస్తకానికి లభించిన అతి పెద్ద గుర్తింపు అది. ‘‘శ్రీధర్‌బాబూ.. మీ కవిత్వం చదివి నా కళ్ళు ధన్యమయ్యాయి. భాషను మీరు ప్రేయసిని చేసుకున్నారు’’ అంటూ ప్రఖ్యాత కవి వేగుంట ‘మో’హన్ ప్రసాద్ గారు రాసిన లేఖ నాకెంత శక్తినిచ్చిందో చెప్పలేను. ‘‘ఇక ముందు కూడా ఇంతకన్నా బాగా రాయగలిగితేనే రాయండి. లేకపోతే వద్దు’’ అని కూడా హెచ్చరించారు. ఆ తరువాత కూడా రాసిన కవిత్వం ‘మో’ హెచ్చరికను బేఖాతరు చేయడం కాదనే నమ్ముతున్నాను.

కవిత్వమొక తీరని దాహమనే వాతావరణాన్ని నేను 90లలో బలంగా చూశాను. ఆ ఉద్విగ్న సందర్భంలో నేను నేనుగా ధ్వనించాలన్న తపనతోనే అనేకంగా మార్మోగాను. ‘‘మిలీనియం చివరి మెట్టు మీద నిలబడి మెలకువలో కలలుకనేవాడు తుది చరణాన్ని గురి పెడుతున్నాడు’’ అంటాడు సిద్ధార్థ తన ముందుమాటను ప్రారంభిస్తూ. ఈ ‘అనేక వచనం’ కేవలం నా తొలి పుస్తకం మాత్రమే కాదు. నా ప్రయాణం మొదలైందని చేసిన బహిరంగ ప్రకటన.

పసునూరు శ్రీధర్‌బాబు

81213 03903

ఇవి కూడా చదవండి

వాట్సాప్ కంటే హైప్డ్ సంవాదినీ చాలా మంచి యాప్: అనువాదిని సంస్థ సీఈఓ

నిరుపేదను ఆదుకోవాలన్న సంకల్పంతోటే జీవిత భీమా: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

Updated Date - Mar 23 , 2026 | 01:04 AM