Share News

ఆంధ్రప్రదేశ్ తీరంలో ‘వ్యూహాత్మక’ నిధి

ABN , Publish Date - May 19 , 2026 | 12:29 AM

నేడు ప్రపంచ గమనాన్ని శాసిస్తున్నది కేవలం ఆయుధాలు లేదా చమురు మాత్రమే కాదు; ఒక తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని నడిపించే ‘రేర్ ఎర్త్’ ఖనిజాలు. 21వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థకు ఇవే అసలైన...

ఆంధ్రప్రదేశ్ తీరంలో ‘వ్యూహాత్మక’ నిధి

నేడు ప్రపంచ గమనాన్ని శాసిస్తున్నది కేవలం ఆయుధాలు లేదా చమురు మాత్రమే కాదు; ఒక తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని నడిపించే ‘రేర్ ఎర్త్’ ఖనిజాలు. 21వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థకు ఇవే అసలైన ఇంధనం. మన చేతిలోని స్మార్ట్‌ఫోన్ నుంచి అత్యాధునిక రక్షణ రంగ క్షిపణుల వరకు, పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల మోటార్ల నుంచి క్లీన్ ఎనర్జీటర్బైన్ల వరకు ఈ ఖనిజాలు లేనిదే ఏదీ సాధ్యం కాదు. ఈ అంతర్జాతీయ వ్యూహాత్మక రేసులో, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘రేర్ ఎర్త్ కారిడార్’లో ఆంధ్రప్రదేశ్ కీలక రాష్ట్రంగా నిలవడం మన రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తుకు ఒక గొప్ప సంకేతం.

ప్రస్తుతం భారతదేశం తనకి కావాల్సిన ‘రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్’ (REPMs)లో దాదాపు 90శాతాన్ని చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇది మన రక్షణ, సాంకేతిక రంగాలకు బలహీనతే. పరాయి దేశాల మీద ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.7,280 కోట్ల అంచనాతో కొత్తగా REPM తయారీ పథకాన్ని మొన్నటి బడ్జెట్‌లో తెచ్చింది. ఈ ఆత్మనిర్భర భారత్ లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌కి ఒక అద్భుత అవకాశం. భారతదేశంలో ఉన్న మోనజైట్ నిల్వల్లో సుమారు 30శాతం (దాదాపు 3.69 మిలియన్ టన్నులు) ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరంలో లభ్యమయ్యే రేర్ ఎర్త్ ఖనిజాల నిర్దిష్ట జాబితా చూస్తే, మోనజైట్‌తో పాటు రూటైల్, ల్యూకోక్సీన్, గార్నెట్, సిల్లిమనైట్ అధిక మొత్తంలో ఉన్నాయి. మోనజైట్ నుంచి లభించే నియోడైమియం, ప్రాసియోడైమియం, డిస్ప్రోసియం, టెర్బియం... అత్యంత విలువైనవి. ఇవి ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లలో వాడే ‘సూపర్ మాగ్నెట్స్’ తయారీకి ప్రాణాధారం.

వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సాధారణ ఖనిజాల కంటే వేల రెట్లు ఎక్కువ. ఉదాహరణకు– డిస్ప్రోసియం వంటి ఖనిజాల ధర కిలో కొన్ని వందల డాలర్లలో ఉంటుంది. శ్రీకాకుళం నుంచి భీమునిపట్నం, కాకినాడ తీరం, బాపట్ల, నెల్లూరు దాకా వున్న 1,053 కిలోమీటర్ల తీర ప్రాంతాల్లో ఉన్నవి కేవలం ఇసుక రేణువులు కాదు, వాటిలో ఉన్న మోనజైట్, ఇల్మెనైట్. లిథియం వంటి ఖనిజాలతో ఆ ప్రాంతాలు ‘హెవీ మినరల్ సాండ్స్’కు ప్రధాన కేంద్రాలు. భారత సెమీకండక్టర్, స్వచ్ఛ ఇంధన సార్వభౌమాధికారానికి కావాల్సిన ముడిసరుకులు.


ఖనిజాల అన్వేషణ సాధారణ గనుల తవ్వకంలా కాకుండా, అత్యున్నత సాంకేతికతతో కూడిన ప్రక్రియ. మొదటి దశలో మన తీర ప్రాంత ఇసుకలో ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఖనిజాలు ఉన్నాయో ‘జియో- మ్యాపింగ్’ ద్వారా గుర్తిస్తారు. భారీ ఖనిజ ఇసుక నుంచి మోనజైట్, ఇల్మెనైట్, జిర్కాన్ వంటి వాటిని వేరుచేయడం ఒక క్లిష్టమైన ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్ తన సొంత ‘ఖనిజ అన్వేషణ విధానాన్ని’ కూడా మరింత పటిష్టం చేసుకోవాల్సిన సమయం ఇది. కేవలం ఖనిజాన్ని తీసి పక్క రాష్ట్రాలకో, విదేశాలకో పంపడం కాకుండా, ఇక్కడే ప్రాసెసింగ్ శుద్ధి కేంద్రాలు, విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి. ముడి ఖనిజాన్ని ఎగుమతి చేయడం కంటే, దాన్ని శుద్ధి చేసి విడిభాగాలను తయారు చేయడం ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం పదింతలు పెరుగుతుంది.

భూమి నుంచి కొత్తగా ఖనిజాలను తీయడం ఎంత ముఖ్యమో, ఇప్పటికే వాడి పారేసిన వస్తువుల నుంచి వాటిని తిరిగి పొందడం అనే రిసోర్స్ లూప్ కూడా అంతే ముఖ్యం. ఒక టన్ను ‘నియోడైమియం’ కోసం మనం ఎంతో ఇసుకను తవ్వి, శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఒక టన్ను నియోడైమియం ఖనిజాన్ని నేల నుంచి తీయడం కంటే విశాఖపట్నం వంటి నగరాల్లో ఏర్పాటు చేస్తున్న ‘సర్క్యులర్ ఎకానమీ పార్కు’లలో పాత స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్‌ మోటార్‌ వంటి వాటి నుంచి సేకరించడం ఎంతో శ్రేయస్కరం. దీనివల్ల మన ఖనిజ భద్రత పెరగడంతో పాటు భూమిపై తవ్వకాల ఒత్తిడి తగ్గుతుంది. ఇది పర్యావరణానికి ఆర్థిక వ్యవస్థకు మధ్య ఉండే సమతుల్యమైన ‘హైబ్రిడ్ రిసోర్స్ స్ట్రాటజీ’. దీనికి మనం, వేస్ట్‌తో పాటుగా ఈ-–వేస్ట్, కీలక ఖనిజాల వేస్ట్‌ను సేకరించే సామర్ధ్యాన్ని ప్రస్తుతమున్న అయిదు సర్క్యులర్ ఎకానమీ పార్కులను కనీసం 12కు పెంచేలా టార్గెట్ పెట్టుకోవాలి.

ఈ రేర్ ఎర్త్ అన్వేషణ వల్ల ఉపాధి కల్పనలో మైనింగ్ నుంచి శుద్ధి వరకు, సర్క్యులర్ ఎకానమీ పార్కుల్లో రీసైక్లింగ్ ద్వారా, వేలాది మంది స్థానిక యువతకు ఉన్నత స్థాయి సాంకేతిక ఉపాధి లభిస్తూ మన రాష్ట్రంలో నైపుణ్య మానవవనరుల అభివృద్ధికి దోహదపడుతుంది. రెండు– పారిశ్రామిక వృద్ధిలో సెమీకండక్టర్లు, డిఫెన్స్ పరికరాల తయారీలో ఈ ఖనిజాలు కీలకం కాబట్టి, ఏపీ భవిష్యత్తులో దేశానికే హై-టెక్ హబ్‌గా మారుతుంది. ఇది మనల్ని ప్రపంచ సప్ల్లై చెయిన్‌లో ఒక ముఖ్యమైన భాగస్వామిని చేస్తుంది. కేవలం ముడిసరుకు ఇచ్చే రాష్ట్రంగా కాకుండా, అత్యాధునిక పరికరాలను తయారుచేసే రాష్ట్రంగా మనం ఎదుగుతాం. మూడు– రాష్ట్ర ఆర్థిక పుష్టికి ఖజానాకు పన్నులు, రాయల్టీల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి 2047కి నిర్దేశించిన రూ.225 లక్షల కోట్ల జీఎస్డీపీను సాధించాలంటే వ్యవసాయం, సేవా రంగంతో పాటుగా, ‘రేర్ ఎర్త్’ ఖనిజాల ద్వారా వచ్చే రాయల్టీలు, పన్నులు, విదేశీ పెట్టుబడులు కీలకపాత్ర పోషిస్తాయి.


అయితే, ఈ ఖనిజ సంపద వెలికితీత అనేది ప్రకృతి విధ్వంసానికి దారి తీయకూడదు. అభివృద్ధికి, పర్యావరణానికి మధ్య సమతుల్యత దెబ్బతింటే అది సుదీర్ఘకాలంలో పెనుముప్పుగా మారుతుంది. ఇక్కడే జీవవైవిధ్యం పాత్ర అత్యంత కీలకం. ఖనిజాల అన్వేషణ కోసం భూమిని వాడినప్పుడు, అక్కడ ఉండే స్థానిక మొక్కలు, వృక్షజాలం నేల లోపల ఉండే సూక్ష్మజీవులు నశించకుండా చూడాలి. దీనికోసం మనం ‘బయో-వాల్ట్స్’ వంటి నూతన విధానాలను అనుసరించాలి. గనుల తవ్వకానికి ముందు ఆ నేల మీద ఉన్న జీవజాతుల విత్తనాలు, మొక్కలను సేకరించి భద్రపరిచి, తవ్వకాలు పూర్తయిన తర్వాత తిరిగి అదే నేల మీద వాటిని నాటాలి. ఇది కేవలం మొక్కలు నాటడం కాదు, ఆ ప్రాంతం సహజ జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించడం. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఖనిజ వెలికితీతకు అంతర్జాతీయ స్థాయిలో ‘గ్రీన్ మైనింగ్’ గుర్తింపు లభిస్తే, ఇక్కడి ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుంది.

మరో ప్రధాన అంశం యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్. మన సహజ వనరులను వాడుకునే కంపెనీలు, ఆ లాభాల్లో కొంత వాటాను స్థానిక ప్రజలకు అందించాలి. ఈ నిధులు నేరుగా గ్రామ స్థాయిలో ఉండే ‘జీవవైవిధ్య కమిటీల’ ఖాతాల్లోకి చేరాలి. 2023లో భారత పార్లమెంటు బయోడైవర్సిటీ చట్టాన్ని (సెక్షన్ 7, 41) సవరించడం ద్వారా పారిశ్రామిక మైనింగ్‌లో ఆర్థికాభివృద్ధికి, పర్యావరణ సుస్థిరతకు మధ్య సమతుల్యతను తీసుకువచ్చింది.

ఈ రంగంలో మరిన్ని అవకాశాలను చూస్తే, డీప్ సీ ఎక్స్‌ప్లోరేషన్‌తో తీరం పక్కన లోతైన సముద్ర గర్భంలో, ఈఈజెడ్ పరిధిలో కూడా ఈ ఖనిజాలు సేకరించచ్చు. ఇసుక నుంచి ఖనిజాలను వేరు చేయడానికి ఎలక్ట్రో-స్టాటిక్ మాగ్నెటిక్ సెపరేటర్లను వాడతారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘రేర్ ఎర్త్ ఎక్స్‌ట్రాక్షన్ ప్లాంట్స్’ ఏర్పాటు చేస్తే, మనం ముడి ఇసుకను కాకుండా, 99.9శాతం స్వచ్ఛత కలిగిన ఆక్సైడ్లను విక్రయించవచ్చు. విశాఖపట్నంలో ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ’ వంటి సంస్థల సహకారంతో ఒక ప్రత్యేక ‘రేర్ ఎర్త్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు చేయవచ్చు. ఎలెక్ట్రిక్ వాహనాలు ఎక్కువవుతున్న సమయంలో పాత బ్యాటరీల నుంచి లిథియం, కోబాల్ట్, నికెల్ వేరు చేసే ప్లాంట్లను సర్క్యులర్ ఎకానమీ పార్కుల్లో ఏర్పాటు చేయవచ్చు.


మనం కేవలం ఖనిజాలను వెలికితీయడం లేదు; ఒక సుస్థిరమైన స్వావలంబన కలిగిన భవిష్యత్తును నిర్మిస్తున్నాం. అభివృద్ధి, ప్రకృతి ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు. సంపదను సృష్టించడం ఎంత ముఖ్యమో, సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ ద్వారా ఆ సంపదను పర్యావరణ హితంగా మలచుకోవడం కూడా అంతే ముఖ్యం. మన మట్టిలోని ఈ అపురూప నిధిని శాస్త్రీయ దృక్పథంతో వాడుకుంటే, ఆంధ్రప్రదేశ్ రేపటి ప్రపంచ హై-టెక్ విప్లవానికి ‘వ్యూహాత్మక చిరునామా’గా మారగలదు.

నీలయపాలెం విజయ్‌కుమార్

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి

ఇవి కూడా చదవండి..

మహిళలకు ఫ్రీ బస్సు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక శాఖ.. సీఎం సతీశన్

అన్నాడీఎంకేలో అంతర్గత పోరు.. సీనియర్ నేత సెమ్మలై రాజీనామా

Updated Date - May 19 , 2026 | 12:29 AM