పెట్టుబడుల స్వర్గధామంగా రాష్ట్రం
ABN , Publish Date - Nov 12 , 2026 | 01:08 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్, మంత్రి నారా లోకేశ్ అనుసరిస్తున్న ‘3S’ (Speed, Service, Stability) వ్యూహం ద్వారా అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రానికి తరలిరావడంతో...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్, మంత్రి నారా లోకేశ్ అనుసరిస్తున్న ‘3S’ (Speed, Service, Stability) వ్యూహం ద్వారా అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రానికి తరలిరావడంతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల స్వర్గధామంగా మారనుంది. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరగనున్న సీఐఐ సదస్సు పెట్టుబడుల జాతరగా జరగనుంది. రూ.11లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు 160కి పైగా సంస్థలు ఈ సదస్సులో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. వీటి ద్వారా సుమారు రెండున్నర లక్షలమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. దీనంతటి వెనుకా యువనేత నారా లోకేశ్ కృషి ఎంతో ఉంది.
2024 జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 2026 అక్టోబర్ నాటికి రూ.22.6 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు 714 ఎంఓయూలను వివిధ సంస్థలు ఒప్పందం కుదుర్చుకోవడంతోనే రాష్ట్ర దశ పూర్తిగా మారిపోయింది. వాటిలో 526 ప్రాజెక్టులకు భూ కేటాయింపులు పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే! ముఖ్యంగా లోకేశ్ చూపిన చొరవ వల్లే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థల చూపు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లిందనడంలో సందేహం లేదు.
లోకేశ్ కేవలం రాష్ట్రానికి పరిమితం కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతున్నారు. ఆయన కృషి వల్ల ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్లకు మన రాష్ట్రంపై గట్టి నమ్మకం ఏర్పడింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో లోకేశ్ పర్యటించి అక్కడి దిగ్గజ కంపెనీలతో మాట్లాడారు. ఫలితంగానే కాగ్నిజెంట్, డేటా సెంటర్లు వంటివి రాష్ట్రానికి వస్తున్నాయి. దావోస్ పర్యటనలో ఆర్.ఎం.జడ్ లాంటి సంస్థలను ఒప్పించి భారీ పెట్టుబడులు సాధించారు. అమరావతిని కేవలం రాజధానిగానే కాకుండా, భవిష్యత్ తరాల కోసం క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ కేవలం ఉద్యోగాలే కాదు, అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం, నైపుణ్యం కూడా యువతకు అందుతాయి. గతంలో పనులు సులభంగా అవ్వాలని ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనేవారు. కానీ లోకేశ్ ఒక అడుగు ముందుకు వేసి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నినాదంతో పనులను వేగవంతం చేస్తున్నారు. పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రోత్సాహకాల విషయంలో ఎటువంటి ఆలస్యం లేకుండా, వెంటనే చెల్లించేలా ‘ఎస్క్రో అకౌంట్లు’ ఏర్పాటు చేసి ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచారు. కేవలం ఐటీ మాత్రమే కాదు, ఆర్సిలర్ మిట్టల్ వంటి స్టీల్ దిగ్గజం రెండువేల ఎకరాల్లో భారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా లోకేశ్ అడుగులు వేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆశయం ప్రకారం ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలి. ఒక పెద్ద కంపెనీ వస్తే దాని చుట్టూ వందలాది చిన్న అనుబంధ పరిశ్రమలు వస్తాయి. తద్వారా స్థానికులకు అపారమైన అవకాశాలు దక్కుతాయి. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు సమానంగా పంచడం (వికేంద్రీకరణ), యువతకు నైపుణ్యాన్ని అందించడం, పారిశ్రామిక వేగంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా లోకేశ్ చేస్తున్న కృషికి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు రావడం ముదావహం. ప్రతిపక్షం ఫేక్ ప్రచారాలతో ఇన్వెస్టర్లను భయపెట్టాలని చూస్తున్నా, లోకేశ్ మీద ఉన్న నమ్మకంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు ఏపీకి రావడానికి ఉత్సాహం చూపుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ‘రాష్ట్రంలో పరిశ్రమలు పెడితే మాకేమిస్తారు?’ అని అడిగే విష సంస్కృతిని చూశాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం మీరు పెట్టుబడులు పెడితే రాష్ట్రానికి ఏమిస్తారు, ప్రజలకు ఏమి చేస్తారు? అని అడిగే సత్సంప్రదాయంతో పనిచేస్తోంది. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టే ముందు భూమి గురించో, సౌకర్యాల గురించో, అనుమతుల గురించో కాదు, అంతకంటే ముఖ్యంగా సుస్థిరమైన, సమర్థవంతమైన పాలన గురించి చూస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుండడంతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు నమ్మకంగా ముందుకు వస్తున్నారు. గత ప్రభుత్వంలో కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాకపోగా ఉన్న పరిశ్రమలు వేరే రాష్ట్రానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న లోకేశ్, రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను అందించే దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే తపనతో పనిచేస్తున్నారు. పెట్టుబడుల సాధనలో మన రాష్ట్రం రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది.
వాసంశెట్టి సుభాష్
రాష్ట్ర కార్మికశాఖ మంత్రి
ఇవి కూడా చదవండి..
యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే...