Share News

సవాళ్ల మధ్య వృద్ధి రేటు సవారీ!

ABN , Publish Date - Jun 18 , 2026 | 03:51 AM

రాష్ట్ర ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు 15శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆధునికతను అందిపుచ్చుకొని రెండంకెల వృద్ధిరేటు సాధించి...

సవాళ్ల మధ్య వృద్ధి రేటు సవారీ!

రాష్ట్ర ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు 15శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆధునికతను అందిపుచ్చుకొని రెండంకెల వృద్ధిరేటు సాధించి నవ్యాంధ్రను ప్రగతిబాట పట్టించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఆయన సమర్థ నాయకత్వంలో ఏపీలో అమలుచేస్తున్న పాలసీలు, విధానాలు రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతున్నాయి. 2024–25లో రాష్ట్రం 8.21శాతం వృద్ధి సాధించడం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే కేంద్రం నివేదిక ప్రకారమే వైసీపీ హయాంలో 2023–24లో వృద్ధిరేటు కేవలం 6.19శాతం మాత్రమే.

2025–26 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.18.3 లక్షల కోట్లకు చేరి 14శాతం వృద్ధి నమోదు అంచనా వెయ్యగా, గత ఆర్థిక సంవత్సరం 2025–26లో 11.75శాతం వృద్ధి రేటు నమోదు అయినట్లు బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026–27 ఏపీ వృద్ధిరేటు 12.94శాతం సాధిస్తుందని అంచనా. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. గత రెండేళ్లలో రాష్ట్రానికి సుమారు రూ.23 లక్షల కోట్ల మేర పెట్టుబడులు తీసుకువచ్చింది. 2026–27లో మూలధన వ్యయం గత ఏడాదితో పోలిస్తే 47శాతం పెంచారు. నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న అధిక వడ్డీ భారాన్ని తగ్గించేందుకు ఆర్థిక సంస్థలతో చర్చలు జరిపి ఏడాదికి సుమారు రూ.327 కోట్ల వడ్డీని ఆదా చేశారు. రానున్న సంవత్సరాల్లో ఇదే వేగాన్ని కొనసాగించగలిగితే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రభుత్వం దీర్ఘకాలికంగా సంవత్సరానికి 15శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

పారిశ్రామిక పార్కులు, ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. 2025–26 తొలి త్రైమాసికంలోనే పరిశ్రమల రంగం దాదాపు 12శాతం వృద్ధిని నమోదు చేయడం ఈ మార్పునకు నిదర్శనం. ఐటీ, పర్యాటకం, రవాణా, ఆర్థిక సేవలు వంటి రంగాలతో కూడిన సేవారంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోంది. విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలను సేవారంగ అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. సేవారంగం 10శాతానికి పైగా వృద్ధి నమోదు చేయడం వల్ల రాష్ట్ర ఆదాయ వనరులు, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. 2025–26 తొలి త్రైమాసికంలో వ్యవసాయరంగం దాదాపు 10శాతం వృద్ధిని నమోదు చేయడం ఆశాజనక పరిణామం. ముఖ్యంగా మత్స్య, ఆక్వా రంగాల్లో నమోదైన రెండు అంకెల వృద్ధి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త బలాన్ని అందిస్తోంది.


గత ప్రభుత్వ ఆర్థిక అరాచకంతో వృద్ధి రేటు ఆరు శాతానికి పడిపోయింది. ఐదేళ్లలో రూ.7 లక్షల కోట్ల విలువైన రాష్ట్ర స్థూల ఉత్పత్తిని (జీఎస్‌డీపీ) కోల్పోయి సుమారు రూ.76,195 వేల కోట్ల ఆదాయం తగ్గిపోయింది. నేడు కూటమి ప్రభుత్వం రెండేళ్లలో రెండు అంకెల వృద్ధి రేటు సాధించడం, సమర్థ ఆర్థిక విధానాల ఫలితమే. పరిశ్రమలు, వ్యవసాయం, సేవల రంగం, మూడు విభాగాలు వేగంగా ముందుకు సాగినప్పుడు మాత్రమే రాష్ట్రంలో ఇంతటి వృద్ధి సాధ్యం అవుతుంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు, పాలసీలు ఆంధ్రప్రదేశ్‌ను రెండు అంకెల వృద్ధి రేటుతో దేశ ఆర్థిక పటంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రంగా నిలిపాయి. రెండు అంకెల వృద్ధి రేటు, రాష్ట్ర ఆర్థిక శక్తికి, సమర్థ పాలనకు, పెట్టుబడుల సాధన, ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు నమ్మకమైన సంకేతం. ఈ వృద్ధి స్థిరంగా కొనసాగాలంటే వచ్చిన పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటై యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించాలి. పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులు త్వరగా పూర్తికావాలి. వృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరినప్పుడే అభివృద్ధి సంపూర్ణం అవుతుంది.

నీరుకొండ ప్రసాద్

ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Updated Date - Jun 18 , 2026 | 03:51 AM