ప్రజానేత చొరవతో ‘ప్రగడ’ జయంతి అధికారికం
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:33 AM
చేనేత వర్గాల ప్రయోజనాల కోసం సత్యాగ్రహం చేపట్టి, నిత్యం వారి సంక్షేమం కోసమే పనిచేసిన చేనేతోద్యమ సూర్యుడు ప్రగడ కోటయ్య. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ వీవర్స్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా...
చేనేత వర్గాల ప్రయోజనాల కోసం సత్యాగ్రహం చేపట్టి, నిత్యం వారి సంక్షేమం కోసమే పనిచేసిన చేనేతోద్యమ సూర్యుడు ప్రగడ కోటయ్య. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ వీవర్స్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పార్లమెంటు సభ్యులుగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా విశిష్ట సేవలందించారు. భారత ప్రభుత్వ చేనేతరంగ ప్రతినిధిగా శ్రీలంక, బ్రిటన్, చైనా, హాంకాంగ్ తదితర దేశాలు సందర్శించి చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలులో ప్రగడ వీరభద్రుడు, కోటమ్మ దంపతులకు 1915, జూలై 26న కోటయ్య జన్మించారు.
1935లో ఏర్పడిన మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘంలో ప్రొడక్షన్ ఇన్‌ఛార్జిగా ఉద్యోగంలో చేరి సర్కారు జిల్లాల్లో ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేసేందుకు విశేషంగా కృషి చేశారు. అసంఘటితంగా ఉన్న చేనేతరంగ అభివృద్ధికి, వారు నేసిన బట్టలకు గిట్టుబాటు ధర లభించడానికి, కార్మికుల కష్టాలు కడతేర్చడానికి ప్రగడ కోటయ్య చేసిన కృషి మరువలేనిది. 1937 జూన్‌లో నిడుబ్రోలులో జరిగిన గుంటూరు జిల్లా చేనేత మహాసభను వెనుక ఉండి నడిపించింది కోటయ్యే. 1941లో బ్రిటిష్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేనేతరంగం స్థితిగతులను అధ్యయనం చేసేందుకు థామస్ కమిటీని నియమించింది. ఈ కమిటీని గుంటూరు జిల్లాకు ఆహ్వానించి, వంద పేజీల మెమొరాండాన్ని కోటయ్య అందజేశారు. చీరాల, నెల్లూరు, రాజమండ్రి పట్టణాలలో సహకార నూలు మిల్లులు ఏర్పాటు చేయడంలోనూ కోటయ్య ఎంతో కృషి చేశారు. నూలు కొరతను అధిగమించేందుకు నూలు ధరల స్థిరీకరణ కోసం చేనేత రక్షణ యాత్రలు నడిపారు.
కోటయ్య 70వ జన్మదినం సందర్భంగా చీరాలలో జరిగిన సభలో ఆనాటి ఉత్తరప్రదేశ్ గవర్నర్ బెజవాడ గోపాలరెడ్డి, ఆయనకు ‘ప్రజాబంధు’ బిరుదునిచ్చి సత్కరించారు. కోటయ్య మరణానంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంకటగిరిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు ప్రగడ కోటయ్య పేరు పెట్టి గౌరవించింది. చేనేతల కోసం జీవితాన్ని పణంగా పెట్టిన ప్రగడ కోటయ్య జయంతిని జూలై 26న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా జరపడం హర్షించదగినది. ఇది చేనేత కుటుంబాల మీద ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది.
మంగళగిరిలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పార్కుకు ప్రగడ కోటయ్య పేరు పెట్టి, అక్కడే ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ తలంచడం, వెంటనే అమలు దిశగా చర్యలు చేపట్టడం చేనేత సమాజం గొప్ప గౌరవంగా భావిస్తోంది. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని జాతీయ చేనేత దినోత్సవ వేదికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనుమతితో ప్రకటించి వెంటనే అమల్లోకి తీసుకురావడం చేనేతల పట్ల మంత్రి లోకేష్‌కి, కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. ‘ఎన్టీఆర్ చేనేత భరోసా’ పేరుతో ప్రతి చేనేత కుటుంబానికి రూ.25,000ల ఆర్థిక చేయూతను అందించడం ఆ కుటుంబాలకు లోకేష్ చొరవతో కూటమి ప్రభుత్వం అందిస్తున్న గొప్ప కానుకగా చేనేత సమాజం భావిస్తోంది.
అలాగే చేనేత సమాజానికి చెందిన పలువురు నాయకులకు ఎంతో ఉన్నతమైన పదవులిచ్చి గౌరవించడం, ఒక క్లస్టర్ ఇన్‌ఛార్జిని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుణ్ని చేయడం... టీడీపీ చేనేతల పక్షపాతి అని నిరూపించేందుకు ప్రత్యక్ష సాక్ష్యం. దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయలేని పనిని తెలుగుదేశం చేసి చూపించింది. జూలై 26న ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న ప్రగడ కోటయ్య జయంతి సభను నిడుబ్రోలు, బాపట్ల, చీరాల ప్రాంతాల్లో నిర్వహిస్తే సమంజసంగా ఉంటుంది. ఆ సభలో ఆయన ఆశయాలను, లక్ష్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఆయన పేరుతో సాహిత్య, సాంస్కృతిక, సేవా పురస్కారాలను అందజేస్తే ఆయనకు పూర్తి గౌరవం అందినట్టవుతుంది.
కలిమిశ్రీ
మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ అధ్యక్షుడు
ఇవి కూడా చదవండి
మీరు ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటున్నారా? కేబినెట్ మంత్రులకు ప్రధాని ప్రశ్న
ఐపీఎల్‌లో కోహ్లీతో హ్యాండ్‌షేక్ వివాదం.. స్పందించిన ట్రావిస్ హెడ్