Andhra Pradesh Emerges:పెట్టుబడుల సాధనలో అగ్రస్థానం
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:20 AM
పెట్టుబడుల సాధనపై ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. అన్ని రాష్ట్రాలను అధిగమించి జాతీయ, అంతర్జాతీయ సంస్థల్ని ఆకట్టుకుని పెట్టుబడులు సాధించడం సామాన్యమైన....
పెట్టుబడుల సాధనపై ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. అన్ని రాష్ట్రాలను అధిగమించి జాతీయ, అంతర్జాతీయ సంస్థల్ని ఆకట్టుకుని పెట్టుబడులు సాధించడం సామాన్యమైన విషయం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిన దూరదృష్టి, ప్రణాళిక, కృషి కారణంగా రాష్ట్రం పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారింది. దేశంలో పెట్టుబడులు సాధించడంలో ఆంధ్రప్రదేశ్‌ను మొదటి స్థానంలో నిలిపారు. రాష్ట్రానికి పెట్టుబడుల పోటెత్తడానికి చంద్రబాబు బ్రాండ్, విశ్వసనీయతే ప్రధాన కారణం. ఏ రాష్ట్రం వేగంగా అనుమతులు ఇస్తుందో, ఏ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందో, ఏ ప్రభుత్వంపై నమ్మకం ఉంటుందో అక్కడికే పెట్టుబడులు బారులు తీరుతాయి. మిగతా రాష్ట్రాలు కళ్లు తెరిచే లోపే లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి రాష్ట్రాన్ని ఛాంపియన్‌గా నిలిపిన ఒకే ఒక్కడు చంద్రబాబు. ఏపీకి పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడానికి కారణం రాష్ట్రంపై దేశీ–విదేశీ మార్కెట్ల విశ్వాసం. ప్రధానంగా విజన్ ఉన్న నాయకత్వం పాలనకు వచ్చిన గుర్తింపు. పరిశ్రమలే సంపద సృష్టిస్తాయి. పెట్టుబడిదారులకు అవసరమైనది స్థిరత్వం, స్పష్టత... ఈ రెండు రాష్ట్రంలో ఉన్నాయి. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు, సింగిల్ డెస్క్ క్లియరెన్స్ టైం బౌండ్ అనుమతులు, భూమి, విద్యుత్, నీరు, లాజిస్టిక్స్ సౌలభ్యం, వివిధ రంగాల్లో మౌలిక వసతులు విస్తరణతో పెట్టుబడిదారులకు రాష్ట్రం దారి చూపుతున్నది.
2025–26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వచ్చాయని, ఇతర రాష్ట్రాల కంటే అధిక వాటాను ఏపీ సొంతం చేసుకుందని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ఇచ్చింది. ఒడిశా 13.1 శాతం, మహారాష్ట్ర 12.8 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దేశంలో ఈ 9 నెలల కాలంలో రూ.26.60 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని.. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో వచ్చిన పెట్టుబడుల కంటే ఇది 11.5శాతం ఎక్కువని నివేదిక తెలిపింది.
అయిదేళ్ళ జగన్‌రెడ్డి వికృత పరిపాలనలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పూర్తిగా పడకేసింది. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉపాధి కల్పన లేదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం 14వ స్థానానికి పడిపోయింది. ఏది ఏమైనా ఏపీ పెట్టుబడుల మ్యాప్‌లో ముందంజలో ఉండటం రాష్ట్ర విజయమే కాదు. దేశానికి ఇచ్చే సందేశం కూడా.
నీరుకొండ ప్రసాద్
Also Read:
చలికాలం.. ఎక్కువగా ఆకలి వేయడానికి కారణం ఇదే
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!