Share News

సోలార్, క్లీన్ ఎనర్జీతో ఏపీకి కొత్త వెలుగులు

ABN , Publish Date - May 19 , 2026 | 12:23 AM

సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో అణు ఇంధన కాలుష్యం పెద్ద తలనొప్పిగా మారింది. బొగ్గు, యురేనియం, థోరియం, ఫ్లుటోనియం వంటి అణువులు ఉపయోగించి విద్యుత్ తయారీ చేయడం...

సోలార్, క్లీన్ ఎనర్జీతో ఏపీకి కొత్త వెలుగులు

సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో అణు ఇంధన కాలుష్యం పెద్ద తలనొప్పిగా మారింది. బొగ్గు, యురేనియం, థోరియం, ఫ్లుటోనియం వంటి అణువులు ఉపయోగించి విద్యుత్ తయారీ చేయడం వల్ల పర్యావరణానికి తీరని నష్టం కలుగుతోంది. వాతావరణం విపరీతంగా వేడెక్కడం, సమయానికి వర్షాలు పడకపోవడం, ఆమ్ల వర్షాలు... ఇలా అనేక సమస్యలకు అణు ఇంధన కాలుష్యం కారణం. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి నుంచి వెలువడే హానికరమైన వాయువులతో ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడి హానికరమైన అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిపై పడుతున్నాయి. పర్యవసానంగా చర్మ క్యాన్సర్, మొక్కలు గిడసబారి ఎండిపోవడం, మూగ జీవాలు వింత వ్యాధులతో మరణించడం జరుగుతున్నాయి.

అణు, శిలాజ ఇంధనాలతో పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లక మునుపే ప్రభుత్వాలు పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఎప్పటికీ తరిగిపోని సోలార్, విండ్, టైడల్, పంప్డ్‌ స్టోరేజీ వంటి శక్తి వనరులపై దృష్టి పెట్టాలి. పర్యావరణహిత విద్యుత్ తయారీ రంగాలపై ప్రభుత్వాలు దృష్టి పెడితే విద్యుత్ డిమాండ్ తగ్గించడంతో పాటు, పేద ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గించి మేలు చేకూర్చినవాళ్లం అవుతాం.

సూర్యుని నుంచి వచ్చే కిరణాలతో విద్యుత్ తయారు చేసుకుంటే చాలా లాభా లున్నాయి. ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాలతో పాటు మన దేశం కూడా ఈ సోలార్ విద్యుత్‌పై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఈ తరహా విద్యుత్ ఉత్పత్తి ప్రోత్సాహకంలో మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కోసం సుమారు 14 లక్షల దరఖాస్తులతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందంటే కూటమి ప్రభుత్వం ఈ పథకం పట్ల ఎంత చిత్తశుద్ధి ప్రదర్శిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు పూర్తి రాయితీతో ఉచితంగా 2కేవీ సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయిస్తున్నారు. అలానే బీసీలకు రూ.98వేలు, ఓసీలకు రూ.78వేలు రాయితీ ఇచ్చి 3 కేవీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ రెండేళ్లలో సుమారు 40 లక్షల కనెక్షన్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. ఇంట్లో తయారైన సోలార్ విద్యుత్‌ను గ్రిడ్స్‌కు అమ్ముకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించడంతో చాలా మంది సోలార్ విద్యుత్ తయారీపై ఆసక్తి చూపిస్తున్నారు.


పశ్చిమాసియా యుద్ధం పుణ్యమా అని ప్రపంచ దేశాలు తీవ్ర ఇంధన సంక్షోభంలో చిక్కుకున్నాయి. బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్ల వరకు చేరుకుంది. ఇంధన రంగంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలు ఈ సమయంలో రెన్యూవబుల్‌ ఎనర్జీ రంగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌లకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ సమయంలో క్లీన్ ఎనర్జీ రంగాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. మన రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే విధంగా ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం అభినందించాల్సిన విషయం. ఇప్పటికే రాష్ట్రంలో అనేక చోట్ల క్లీన్ ఎనర్జీ ప్లాంట్స్ నెలకొల్పారు. ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించి పెట్టుబడిదారులను రాష్ట్రానికి తీసు కొస్తున్నారు. ఈ రంగంలో ప్రపంచ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న రీన్యూ ఎనర్జీ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.82,000 కోట్లతో భారీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తుంది. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు కోసం విశాఖపట్నం సమీపంలో సుమారు రూ.1.85 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతోంది. నెల్లూరులో సోలార్ ప్యానెల్ తయారీ ప్లాంట్, చింత గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మన రాష్ట్రంలో అనేక చోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. రాయలసీమలో ఈ తరహా పెట్టుబడులు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. ఇటీవలే జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో బయోమాస్, గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో అనేక వేల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అభినందించాల్సిన అంశం. ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల కొరతను నివారించవచ్చు. అలాగే పర్యావరణ కాలుష్యం తగ్గి లక్షల మంది యువతకు ఉపాధి మార్గం సుగమం అవుతుంది.

ఎన్. నీలంనాయుడు, విజయనగరం

ఇవి కూడా చదవండి..

మహిళలకు ఫ్రీ బస్సు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక శాఖ.. సీఎం సతీశన్

అన్నాడీఎంకేలో అంతర్గత పోరు.. సీనియర్ నేత సెమ్మలై రాజీనామా

Updated Date - May 19 , 2026 | 12:24 AM