ఆ ఆలయాల్ని చరిత్రలో నిలిచేలా నిర్మించాలి
ABN , Publish Date - Oct 30 , 2026 | 04:32 AM
శ్రీవాణి ట్రస్ట్ నుంచి పాక్షిక నిధులతో ఐదు వేల ఆలయాలు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అరుదైన నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి 750 కోట్ల రూపాయలను ట్రస్ట్ నుంచి...
శ్రీవాణి ట్రస్ట్ నుంచి పాక్షిక నిధులతో ఐదు వేల ఆలయాలు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అరుదైన నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి 750 కోట్ల రూపాయలను ట్రస్ట్ నుంచి విడుదల చేయదలిచారు. ఈ ధనాన్ని సముచితంగా ఎలా ఖర్చు చేస్తారన్నదే అసలు విషయం.
పర్యవేక్షణ దేవాదాయ శాఖదయినా, ఈ ఆలయాలన్నీ వివిధ వ్యక్తుల, సంస్థల, స్థానిక ప్రజల ఇష్టాయిష్టాలు, అభిరుచులకు అనుగుణంగా నిర్మితమవుతాయి. ఈ ఆలయాలను నాలుగు రకాలుగా వర్గీకరించారు. ఐదు నుంచి ఎనిమిది సెంట్ల స్థలంలో కట్టేవి, ఎనిమిది నుంచి పది సెంట్ల స్థలంలో కట్టేవి, పది సెంట్ల కంటే ఎక్కువ స్థలంలో కట్టేవి, మోడల్ ఆలయాలు. వీటికి గ్రాంట్లు కూడా పది, పదిహేను, ఇరవై, ముప్పై లక్షల రూపాయలుగా నిర్ణయించారు. అయితే ధనికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో బ్రహ్మాండమైన ఆలయాలు... మిగతా చోట మామూలుగానో, లేక నాసిరకంగానో నిర్మిస్తారు.
శ్రీవాణి ట్రస్ట్ ఆమోదించిన ఆలయ నిర్మాణ నమూనాలు ఆధునిక భవన నిర్మాణ పద్ధతిలో ఉండే కాంక్రీటు ఆలయాలు. ఇవి ఇటుకలు, కాంక్రీటుతో నిర్మితమవుతాయి. ఇలా నిర్మించడం తప్పు కాదు. ఎందుకంటే, ఇవి ఈ రోజుల్లో వాడుతున్న నిర్మాణ పద్ధతులు. కాకపోతే, కాంక్రీటు భవనాల ఆయువు గరిష్ఠంగా నూరు సంవత్సరాలే. సామాజికంగా వెనుకబడిన ప్రజల కోసం కోవెలలు నిర్మించాలనుకోవడం వెయ్యేళ్లలో ఒకసారి తీసుకునే నిర్ణయం. మరి అవి కూడా ఈ నిర్ణయం లాగే చరిత్రలో నిలిచి ఉండాలి కదా!
ఈ రోజుకూ మనం ఎంతో గర్వంగా చెప్పుకునే, దర్శించే కోవెలలన్నీ శిలానిర్మితాలే. సమాజంలో సమానత్వం ఉండాలని ప్రబోధిస్తున్నప్పుడు, దళితుల కోసం నిర్మించే కోవెలలు కూడా మిగతావాటి లాగే, అవే ప్రమాణాలతో నిర్మిస్తే ఈ ప్రభుత్వం పేరు చోళ చక్రవర్తుల లాగా ఆచంద్రతారార్కం నిలిచి ఉంటుంది. ఈ రోజుకీ చోళుల ఆలయ నిర్మాణ చాతుర్యం, శిల్పకళా నైపుణ్యాల గురించి కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటున్నారంటే, దానికి కారణం ఆ ఆలయ నిర్మాణాలు జరిపేటప్పుడు వారు పాటించిన ప్రమాణాలు, నిబద్ధతే.
అంతదాకా ఎందుకు? బ్రిటిషు వారి కాలంలో కట్టిన శిలా భవనాలు ఇప్పటికీ అలాగే ఉండగా, సిమెంటుతో కట్టిన కట్టడాలు చరిత్రలో కలిసిపోయాయి. కాంక్రీట్ కట్టడాలలో సిమెంటు, ఇసుకల నిష్పత్తిని పాటించారా లేదా అన్నదాని నుంచి, సిమెంటు నాణ్యత, కట్టడం నాణ్యత వరకూ చాలా చోట్ల తప్పులు జరగడానికి ఆస్కారం ఉంది. కొన్ని వర్షాభావ ప్రాంతాలలో క్యూరింగ్ కోసం తగినంత నీరు లేకపోతే నాణ్యత బాగా దెబ్బతింటుంది. కాంక్రీటుతో నిర్మితమైన కోవెలలు పది, పదిహేను సంవత్సరాలలో పెచ్చులూడి, స్లాబులోని ఇనుప చువ్వలు కనిపించడం సర్వసాధారణం. ఈ నిర్మాణాల నిర్వహణ కూడా ఖర్చుతో కూడుకున్నదే.
దేవాలయాలను రాతితో నిర్మించడం వల్ల పైన పేర్కొన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అన్నింటి కంటే ముందు శాస్త్ర ప్రామాణికత. సహజమైన శిలలే దేవాలయపు నిర్మాణానికి ఉపయోగించాలి. వేల కొద్దీ కాంక్రీట్ దేవాలయాలు గత కొన్ని దశాబ్దాలలో శిథిలమైపోవడం చూస్తూనే ఉన్నాం. కాంక్రీట్ లాగా గ్రానైట్ శిలలు ఉష్ణోగ్రతలోని మార్పులతో సంకోచ వ్యాకోచాలు చెందవు. ఈ మధ్య కాలంలో గ్రానైట్ శిలలతో కట్టినా, వాటిని అనుసంధానించడానికి కాంక్రీటును వాడుతున్నారు. శతాబ్దం కిందటి వరకూ లాజును వాడేవారు.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రానైట్ శిలలతో ఒకే విధమైన డిజైనుతో దేవాలయాలు నిర్మిస్తే, అందుకు కావలసిన వివిధ భాగాలను రెండు, మూడు చోట్ల తయారు చేయవచ్చు. ఉదాహరణకు కనిగిరి ప్రాంతం గ్రానైట్ పెద్ద స్తంభాల తయారీకి అనువైనది. ఆళ్లగడ్డ వద్ద ఉండే గ్రానైట్ గోపురాలకు బాగుంటుంది. పలమనేరు వద్ద ఉండే శిలలు మూర్తిని చేయడానికి అనువుగా ఉంటాయి. కాబట్టి, స్థలాన్ని బట్టి వివిధ పరిమాణాలలో దేవాలయాలు నిర్మించడం కన్నా, ఒకే నమూనాతో నిర్మిస్తే బాగుంటుంది. ఒక కేంద్రీకృత ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో వివిధ భాగాల నమూనాలు తయారు చేసి, ఈ భాగాలన్నీ సిద్ధమైన తరువాత ఆయా ప్రాంతాలకు తరలిస్తే, నిర్మాణ సమయం బాగా తగ్గుతుంది. వీటి నాణ్యత కూడా స్థిరంగా ఉంటుంది.
ఈ గ్రానైట్ దేవాలయాల వల్ల పరోక్ష ప్రయోజనాలున్నాయి. ఐదు వేల ఆలయాల కోసం గ్రానైట్ కటింగ్, పాలిష్ చేయడానికి కనీసం రెండు, మూడు పెద్ద వర్క్‌షాపులు తయారవుతాయి. దాంతో ఎంతోమంది యువతకు నైపుణ్య ఉద్యోగాలలో శిక్షణ, ఉపాధి లభిస్తుంది. అదే కాంక్రీట్ ఆలయాలైతే, కేవలం కన్స్ట్రక్షన్ లేబరుగా మాత్రమే ఉపాధి దొరుకుతుంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ముడి గ్రానైట్ మాత్రమే ఎగుమతి అవుతోంది. చాలా తక్కువ శాతం కటింగ్, పాలిష్ అయి తయారవుతున్నాయి. ముడి గ్రానైట్ మూలంగా వచ్చే ఆదాయం కన్నా, తయారైన గ్రానైట్‌కు వచ్చే ఆదాయం చాలా ఎక్కువ.
మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్నా ఆంధ్రప్రదేశ్ గ్రానైట్ వ్యాపారంలో తొంభై శాతం కేవలం మైనింగ్‌కు మాత్రమే పరిమితమైంది తప్ప, ఉపయోగార్హమైన ఉత్పత్తులను రూపొందించే పరిశ్రమగా ఎదగలేదు. ఈ దేవాలయాల ప్రాజెక్ట్ ఒక విధంగా కొత్త పరిశ్రమకు శ్రీకారం చుట్టడానికి తగిన అవకాశం. ఎంతోమంది ఇంజినీర్లకు, సూపర్వైజర్లకు, టెక్నీషియన్లకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఒక్కసారి ఈ రంగంలో అనుభవం సాధించిన తరువాత, చిన్న చిన్న గుడులు కట్టడానికి, శిల్పాలను అందించడానికి ఈ రంగం వృద్ధి చెందుతుంది. మన రాష్ట్రంలోనే తయారు చేయించడం వల్ల గ్రానైట్ దేవాలయాలకు అయ్యే ఖర్చు ఒక్క పైసా కూడా బయటికి పోదు. ఇది స్థానికంగా ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది. ఐదు వేల ఆలయాలు కట్టిన అనుభవం ఉన్న సంస్థలకు దేశ విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తాయి.
గ్రానైట్ దేవాలయాలంటే అందరూ భయపడే విషయం– వ్యయం. చోళులు కట్టినంత పెద్ద కోవెలలు కట్టడం అసాధ్యం. గర్భగృహం, దానికి ముందు ఒక మండపం కడితే చాలు. స్థలం ఎక్కువగా ఉండి, స్థానికులు కావాలనుకుంటే గణపతి, నవగ్రహాల మండపాలు కట్టుకోవచ్చు. ఒకటీ, రెండూ కడితే ఈ ఆలయాలకు దాదాపుగా యాభై నుంచి అరవై లక్షల వరకూ ఖర్చవుతుంది. కానీ, ఐదు వేల ఆలయాలు, అదీ అన్నీ ఒకే విధంగా రూపకల్పన చేసి, ఒక పారిశ్రామిక వాతావరణంలో, ప్రీఫ్యాబ్రికేషన్, ఇంటర్‌లాకింగ్ పద్ధతిలో కడితే ఈ ఖర్చు పాతిక, ముప్పై లక్షలకు మించదు.
ఏదో మొక్కుబడిగా కాకుండా, ఒక పద్ధతిగా, నాలుగు కాలాలు నిలిచేటట్టు ఈ ఆలయాలను నిర్మించాలి. అన్ని మంచి పనులకూ ముందుండే ఆంధ్రులు, ఈ పవిత్ర కార్యానికీ విరాళాలు ఇస్తారు. నేటికీ రాజుల కాలపు నిర్మాణాల తర్వాత, బ్రిటిష్ కాలపు నిర్మాణాల నాణ్యత గురించి ప్రజలు చెప్పుకుంటారు. అలా ప్రస్తుత ప్రభుత్వం గురించీ చెప్పుకోవాలంటే, దానికి తగ్గట్టుగా నిర్మించాలి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ శిల్పకళా వైభవాన్ని వ్యాప్తి చేయడంలో తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలు మాత్రమే ముందున్నాయి. ఇప్పుడు మన రాష్ట్రానికి ఈ దేవాలయాల నిర్మాణం శ్రీవారు ఇచ్చిన మహదవకాశం.
కె.ఎం. రామకృష్ణప్రసాద్ (కణ్ణన్)
ఈ వార్తలు కూడా చదవండి..
ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం.. ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు..!
ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు