Share News

‘సర్‌’ రద్దు ఒక్కటే పరిష్కారం

ABN , Publish Date - Nov 20 , 2026 | 02:10 AM

జ్ఞానేశ్‌ కుమార్ రాజీనామా చేయాలని, 13.37 కోట్ల పౌరుల ఓట్లను తొలగించిన ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్‌)ను రద్దు చేయాలని, 2023 డిసెంబర్‌లో చేసిన ‘ఎన్నికల కమిషనర్ల.....

‘సర్‌’ రద్దు ఒక్కటే పరిష్కారం

జ్ఞానేశ్‌ కుమార్ రాజీనామా చేయాలని, 13.37 కోట్ల పౌరుల ఓట్లను తొలగించిన ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్‌)ను రద్దు చేయాలని, 2023 డిసెంబర్‌లో చేసిన ‘ఎన్నికల కమిషనర్ల ఎంపిక, సర్వీసు నిబంధనల చట్టం’ను ప్రజాస్వామ్యీకరించాలని ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ అక్టోబర్ 2న ముంబయిలో పెద్ద ర్యాలీ నిర్వహించింది. అదే రోజు వామపక్ష, ప్రజాతంత్ర విద్యార్థి, యువజన సంఘాలు ఢిల్లీలో గొప్ప నిరసన ప్రదర్శన చేశాయి. ఆ ప్రదర్శనల్లో పాల్గొన్నవారు తీవ్రమైన నిర్బంధాలను ఎదుర్కొన్నారు. ఇండియా కూటమి ప్రదర్శనలను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం శతవిధాలా యత్నించింది. వివిధ రాష్ట్రాల్లో, వివిధ స్థాయిల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి, జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ విషయాలపై తగినంత స్పందన కనిపించడం లేదు.

బిహార్ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో ‘సర్‌’ను భారత ఎన్నికల సంఘం తీసుకువచ్చింది. తరువాత బెంగాల్‌కు, తదుపరి మొత్తం అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించింది. ఈ సర్‌ ప్రక్రియలో భాగంగా మన రాష్ట్రంలో లక్షల సంఖ్యలో, దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో అసంబద్ధ కారణాలతో పౌరుల ఓట్లను తొలగించారు. అయితే, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పది నెలల కాలంలో 14 అభ్యంతరాలను లేవనెత్తిన విషయం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ బయటపెట్టిన తరువాత ఈ ప్రక్రియ ఎంత అస్తవ్యస్తంగా సాగిందో అందరికీ తెలిసివచ్చింది. ఇద్దరు తోటి కమిషనర్లు అభ్యంతరాలు లేవనెత్తినా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్ అధికారుల సహకారంతో ఈ ప్రక్రియను తన పద్ధతిలోనే కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా ఇదంతా జరగడం సాధ్యం కాదని ఎవరైనా గ్రహిస్తారు.

బిహార్‌లో సర్ ప్రారంభించినప్పుడే, దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వచ్చాయి. చివరకు సుప్రీంకోర్టు బిహార్‌లో ‘సర్‌’పై వ్యాజ్యాన్ని కొట్టివేయడమేగాక, ఎన్నికల కమిషన్ కచ్చితమైన ఓటరు జాబితాలను తయారుచేస్తున్నదని కితాబు ఇచ్చింది. దీంతో ఈ ప్రక్రియ హిమాచల్‌ప్రదేశ్, జమ్ము అండ్ కశ్మీర్, లడఖ్‌ తప్ప దేశమంతా దాదాపు పూర్తయింది. 13.37 కోట్ల ఓట్లు తొలగించారు. ఇప్పుడు సర్‌లో అవకతవకలు బయటపడడంతో, దీనిని అనుమతించినందుకు సుప్రీంకోర్టు తీవ్రమైన ప్రశ్నలు ఎదుర్కొంటున్నది.


ఇదిలా ఉండగా, అధికారవర్గాల ప్రయత్నాలు మరొక రకంగా ఉన్నాయి. సర్‌లో ఓట్లు పోయిన అర్హులైన వారందరినీ తిరిగి ఓటర్లుగా గుర్తిస్తామనీ, వారందరూ ఫారం 6 పెట్టుకోవచ్చని జ్ఞానేశ్‌ కుమార్ చెబుతున్నారు. ఈ విధంగా సర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలను నీరుగార్చవచ్చని చూస్తున్నారు. కానీ ఫారం 6 ఓట్లు పోయిన వారికి పనికిరాదు. సెప్టెంబర్ 2016లో, ఇంకా ప్రధానంగా ఆగస్టు 2022లో ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలెక్టర్స్ రూల్స్‌’కు మోదీ ప్రభుత్వం చేసిన సవరణల ఫలితంగా ఫారం 6లో మౌలికమైన తేడా వచ్చింది. మారిన ప్రస్తుత రూపంలో ఫారం 6ను ఉపయోగించి గానీ లేదా మరొక రూపంలో గానీ ఓటు కోల్పోయిన వారికి తిరిగి ఓటు కల్పించడం సాధ్యం కాదు. సర్‌ రద్దైతే ఓట్లు పోవడమే ఉండదు. అదే సమగ్రమైన పరిష్కారం. ఆపైన ఓటు పోయినవారు తిరిగి ఓటరు జాబితాలో చేరే అవకాశాలను పునరుద్ధరిస్తూ ఫారం 6లో అందుకు అవసరమైన మార్పులను చేయాలి.

ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 45 లక్షల మంది ఓట్లను గైర్హాజరు, శాశ్వతంగా చిరునామా మారినవారు, డూప్లికేట్, చనిపోయినవారు అనే పేరు మీద వారికి లేదా వారి బంధువులకు ఎటువంటి నోటీసులూ ఇవ్వకుండానే తొలగించారు. ఆ ఓట్లు లేకుండానే ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించారు. తొలగించిన వారి పేర్లను పంచాయతీ కార్యాలయాల్లో వేలాడదీశారు. అవి గాలికి కొట్టుకుపోయాయి. ప్రధానంగా వలస కార్మికుల ఓట్లు తొలగించారు. ఆ విషయం ఇప్పటికీ వారికి తెలియదు. క్షేత్రస్థాయి పరిశీలనలో బతికున్నవారిని చనిపోయినట్లు నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి. డూప్లికేట్ కాకపోయినా డూప్లికేట్ అని నమోదుచేసి ఓటు తొలగించారు. ఇక, వలస కార్మికులు బతుకుతెరువు కోసం పట్టణాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్తారు. వారు శాశ్వతంగా చిరునామా మార్చుకోరు. వారి శాశ్వత చిరునామా వారి ఊరే. అక్కడ వారికి ఇల్లు, పొలం కూడా ఉండవచ్చు. లేదా వారి ఓట్లు తమ బంధువుల ఇంటి అడ్రసులో రాయించుకుంటారు. అటువంటి వలస కార్మికులను శాశ్వతంగా చిరునామా మారినవారిగా నమోదుచేసి, వారి ఓట్లను తొలగించి ఎన్నికల అధికారులు పని ముగించుకున్నారు. ముసాయిదా జాబితాకు ముందే తొలగించిన 45 లక్షల ఓట్లలో అత్యధిక ఓట్లు వలస కార్మికులవే.


2026 మే 25 నాటికి మన రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య సుమారు 4.16 కోట్లు. సర్ ప్రక్రియలో భాగంగా సుమారు 44.89 లక్షల మంది ఓటర్లను తొలగించి 3.71 కోట్ల ఓటర్లతో జూలై 31న ముసాయిదా జాబితా ప్రకటించారు. ఈ జాబితాలో ఓటు ఉన్నంత మాత్రాన ఓటు ఖరారు అయినట్లు కాదు. ఈ 3.71 కోట్లలో కూడా 44.28 లక్షల మందికి తమ ఓటును రుజువు చేసుకోమని నోటీసులు ఇచ్చారు. జూలై 31న ప్రారంభమైన ఈ ప్రక్రియ నవంబర్ 20కి పూర్తవుతుంది. వీరిలో సుమారు 1 లక్షా 69 వేల మందిని ఇప్పటికే అనర్హులుగా ప్రకటించారు. ఈ సంఖ్య రెండు లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇవిగాక వివిధ పార్టీల కార్యకర్తలు ఇతర పార్టీల అభిమానుల ఓట్లు తొలగించడానికి ఫారం–7 పెడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తన కంప్యూటర్ వ్యవస్థలోనే ఫారం–7 దరఖాస్తులు సృష్టించి, వాటి ఆధారంగా ఓట్లు తొలగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లో ఎంత ప్రభావం చూపిస్తుందో తెలియదు. ప్రత్యామ్నాయ పద్ధతిలో గణిస్తే, మన రాష్ట్రంలో వయోజనుల జనాభా జూలై 1, 2026 నాటికి 4 కోట్ల 20 లక్షలని అంచనా. సర్ ప్రక్రియ తరువాత తుది ఓటర్ల జాబితాలో 3 కోట్ల 70 లక్షల మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉండరని తెలుస్తోంది. అంటే, మిగిలిన సుమారు 50 లక్షల మంది ఓట్లు వారికి తెలియకుండా తొలగిస్తున్నారు. ఈ క్రమం కొనసాగితే ప్రజాస్వామ్యం మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. మన రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్రాన్ని నిలదీయాలి.

డి. రమేశ్‌ పట్నాయక్

కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ విద్యాపరిరక్షణ కమిటీ

ఈ వార్తలనూ చదవండి:

చెన్నైలో భారీగా హెరాయిన్ పట్టివేత.. రూ.710 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..

నైలాన్ తాడుతో చిన్నారి చేతులు కట్టేసి కొట్టిన టీచర్.. తమిళనాడు స్కూల్లో ఘటన

Updated Date - Nov 20 , 2026 | 02:14 AM