అనంతపురంలో చైనా పాఠం పాటిద్దాం
ABN , Publish Date - Jun 26 , 2026 | 02:05 AM
అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో భూ క్షీణత, ఇసుక వలసలు, ఎడారీకరణపై శాస్త్రవేత్తలు వెల్లడించిన పరిశోధన పత్రం ఒకటి నేను ఇటీవల చదివాను. బొమ్మనహాల్, బెళుగుప్ప, కణేకల్ మండలాలలో...
అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో భూ క్షీణత, ఇసుక వలసలు, ఎడారీకరణపై శాస్త్రవేత్తలు వెల్లడించిన పరిశోధన పత్రం ఒకటి నేను ఇటీవల చదివాను. బొమ్మనహాల్, బెళుగుప్ప, కణేకల్ మండలాలలో నేల క్షీణత, ఇసుక ఆక్రమణ, హగరి(వేదవతి) నది ఎండిపోవడం వంటి పరిస్థితులు భవిష్యత్తులో వ్యవసాయానికి ముప్పుగా మారతాయని ఆ పరిశోధకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎడారులను సైతం వ్యవసాయ భూములుగా మార్చిన చైనా అనుభవాన్ని మనం పరిశీలించాలి.
1990 ఏప్రిల్ 3–9 తేదీలలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్), అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ప్రతినిధి బృందంలో సభ్యునిగా నేను చైనాను సందర్శించే అవకాశం పొందాను. ఆ సందర్భంగా చైనాలో వ్యవసాయ ఆధునికీకరణ ప్రారంభదశను ప్రత్యక్షంగా పరిశీలించగలిగాను. అది చైనాలో ఆర్థిక సంస్కరణలు వేగం పుంజుకుంటున్న కాలం. ఆ దేశం వ్యవసాయం, పరిశ్రమ, శాస్త్ర సాంకేతిక రంగాలను సమన్వయం చేస్తూ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ, అంతర్జాతీయ వాణిజ్యంపై దృష్టి సారించి, దేశాభివృద్ధికి కొత్త దిశను ఏర్పాటు చేసుకుంటున్నది.
బీజింగ్ శివార్లలో మేము సందర్శించిన గ్రీన్‌హౌస్ వ్యవసాయ క్షేత్రం ఇప్పటికీ నా జ్ఞాపకాలలో నిలిచిపోయింది. శీతాకాలంలో కూడా కూరగాయలు, పండ్లు ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో చైనా ప్రభుత్వం ఈ గ్రీన్‌హౌస్ విధానాన్ని ప్రోత్సహించింది. ప్లాస్టిక్ కవర్లతో నిర్మించిన సోలార్ గ్రీన్‌హౌస్‌లు; బిందు సేద్యం, నియంత్రిత సాగు పద్ధతులు అప్పట్లో నాకు ఎంతో వినూత్నంగా కనిపించాయి. రైతులు కుటుంబ బాధ్యతా వ్యవస్థలో పంటలు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను పొందారు. ప్రభుత్వ మద్దతు, మార్కెట్ సదుపాయాలు, శాస్త్రీయ సలహాలు తోడై వ్యవసాయ ఉత్పత్తిని పెంచాయి.
మూడున్నర దశాబ్దాల తరువాత నేడు గ్రీన్‌హౌస్ వ్యవసాయంలో చైనా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. ప్రపంచ గ్రీన్‌హౌస్ సాగు విస్తీర్ణంలో సుమారు 60శాతం చైనాలోనే ఉన్నట్లు అంతర్జాతీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. చైనా మొత్తం సాగుభూమిలో గ్రీన్‌హౌస్‌ల విస్తీర్ణం శాతం పరంగా తక్కువగా ఉన్నప్పటికీ– ఇక్కడి కూరగాయల, పండ్ల, ఉద్యానవన పంటల ఉత్పత్తిలో గ్రీన్‌హౌస్ వ్యవసాయం అత్యంత కీలకపాత్రను పోషిస్తోంది. టమాటా, దోసకాయ, క్యాప్సికమ్, ఆకుకూరలు, స్ట్రాబెర్రీ వంటి పంటల ఉత్పత్తి గణనీయంగా పెరగడానికి ఇక్కడి గ్రీన్‌హౌస్ వ్యవస్థలు ఎంతో దోహదపడ్డాయి. నియంత్రిత వాతావరణం కారణంగా నీటి వినియోగం తగ్గడం, తెగుళ్ల ప్రభావం అదుపులో ఉండటం, ఏడాది పొడవునా ఉత్పత్తి సాధ్యమవడం ఈ గ్రీన్‌హౌస్ విధానానికి ప్రధాన బలాలు. నేడు అక్కడ స్మార్ట్ గ్రీన్‌హౌస్‌లు, హైడ్రోపోనిక్స్, ఆటోమేటెడ్ నీటిపారుదల, సెన్సార్ ఆధారిత పర్యవేక్షణ, కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతలతో సాగు నిర్వహిస్తున్నారు. పరిమిత భూమిలో అధిక దిగుబడులు సాధిస్తూ ఆహార భద్రతను బలోపేతం చేయగలిగారు.
చైనా విజయానికి ప్రధాన కారణం దీర్ఘకాలిక ప్రణాళిక. ప్రపంచ జనాభాలో ఐదోవంతు చైనాలో నివసిస్తున్నప్పటికీ, సాగుభూమి పరిమితంగానే ఉంది. పట్టణీకరణ, నీటి కొరత, నేల క్షీణత, ఎడారీకరణ వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు గ్రీన్‌హౌస్ సాగును వ్యూహాత్మకంగా అభివృద్ధి చేసింది. శాస్త్రీయ పరిశోధన, సబ్సిడీలు, గ్రామీణ రుణాలు, మౌలిక సదుపాయాలు, రైతుల శిక్షణకు ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టింది.
చైనా అనుభవం మరో ముఖ్యమైన పాఠాన్ని కూడా చెబుతోంది. ఆ దేశం ఎడారీకరణ, నీటి కొరత, నేల క్షీణత వంటి సమస్యలను కేవలం పర్యావరణ సమస్యలుగా గాక, అభివృద్ధి సవాళ్లుగా గుర్తించి, శాస్త్రీయ పరిష్కారాలను అన్వేషించింది. ‘గ్రీన్ గ్రేట్ వాల్’ కార్యక్రమం ద్వారా కోట్లాది చెట్లను నాటి, ఇసుక తుపానులను నియంత్రించింది. బిందు సేద్యం, సౌరశక్తి వినియోగం, రక్షిత సాగు పద్ధతులు కలిసి ఎడారిప్రాంతాలలో కొత్త అవకాశాలను సృష్టించాయి. జిన్‌జియాంగ్, ఇన్నర్ మంగోలియా, నింగ్జియా, గాన్సు వంటి ప్రాంతాలలో భారీ అటవీకరణ, బిందు సేద్యం, గ్రీన్‌హౌస్ వ్యవసాయం, చేపల పెంపకం, సౌరశక్తి ప్రాజెక్టులను సమన్వయం చేసింది. గతంలో బీడుభూములుగా ఉన్న కొన్ని ప్రాంతాలు నేడు వ్యవసాయ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి.
అనంతపురం జిల్లాలో భూ క్షీణత, ఇసుక వలసలు, నీటి కొరత, ఎడారీకరణ హెచ్చరికలు పెరుగుతున్న నేపథ్యంలో చైనా అనుభవం ఒక విలువైన పాఠంగా నిలుస్తుంది. శాస్త్రీయ పరిశోధన, నీటి నిర్వహణ, అటవీకరణ, బిందు సేద్యం, రక్షిత సాగు, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని సమగ్ర అభివృద్ధి వ్యూహంగా అమలు చేయడం ద్వారా చైనా గణనీయమైన ఫలితాలను సాధించింది. ప్రకృతి పరిమితులు అభివృద్ధికి అడ్డంకులు కావని; సరైన ప్రణాళిక, రాజకీయ సంకల్పం, ప్రభుత్వ పెట్టుబడి, ప్రజల భాగస్వామ్యం ఉంటే కరువు ప్రాంతాలను కూడా సుసంపన్న ప్రాంతాలుగా మార్చవచ్చని చైనా నిరూపించింది. అనంతపురం జిల్లాలోని బొమ్మనహాల్, బెళుగుప్ప, కణేకల్ ప్రాంతాల భవిష్యత్తును రక్షించడానికి కూడా ఇదే తరహా దీర్ఘకాలిక దృక్పథం, శాస్త్రీయ కార్యాచరణ అత్యవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను యుద్ధ ప్రాతిపదికన అమలుచేయాలి. ఎండిపోయిన హగరి నదిని పునరుజ్జీవింపజేయాలి. కరువు ప్రాంతాలను కూడా ఉత్పాదక ప్రాంతాలుగా మార్చడం సాధ్యమేనన్న సంకల్పాన్ని, విశ్వాసాన్ని ప్రజల్లో పాదుకొల్పాలి.
టి. లక్ష్మీనారాయణ
ఈ వార్తలనూ చదవండి:
పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీ విచారం
వెలుగులోకి సంచలన విషయాలు.. హత్య ఎలా చేయాలో ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి..