అనాది ఆత్మగానం ‘అమృత సంతానం’
ABN , Publish Date - May 04 , 2026 | 12:35 AM
అగాధ లోయల చెంత సర్వోన్నత శిఖరాలు. అవనీ ఆకాశాల మధ్య నిరుపమాన ప్రాకృతిక సౌందర్యం. వీటి నడుమ కోదుల నిష్కలంక జీవనం. ఆ కోదుల అనాది ఆత్మగానం ‘గోపీనాథ్ మహంతి’ రచించిన ‘అమృత సంతానం’....
అగాధ లోయల చెంత సర్వోన్నత శిఖరాలు. అవనీ ఆకాశాల మధ్య నిరుపమాన ప్రాకృతిక సౌందర్యం. వీటి నడుమ కోదుల నిష్కలంక జీవనం. ఆ కోదుల అనాది ఆత్మగానం ‘గోపీనాథ్ మహంతి’ రచించిన ‘అమృత సంతానం’.
గోపీనాథ్ మహంతి ఒడియా భాషలో రాసిన ఈ ఉద్గ్రంథాన్ని పురిపండా అప్పలస్వామి తెలుగులోకి అనువదించారు. ఒడిస్సాలోని కొండ ప్రజల జీవనాన్ని ఈ నవల మూలాల నుండి ముచ్చటిస్తుంది. చావు పుటుకల నడుమ పరుచుకున్న విస్తార జీవితాన్ని మనతో ఎడతెగక సంభాషిస్తుంది.
నవలలోనికి ప్రవేశిస్తే– లెక్కా జమాలేని పర్వత పంక్తులపై అంబాలపు కాయ వంటి ఆ ఊరిపేరు ‘మణి అపాయ’. గతించిన కోదు సాంస్కృతిక స్మారక చిహ్నంగా ఆకాశానికి తలెత్తి నుంచుని ఉన్న కొండ శిఖరాలు, వారికి ‘ధర్ము’ (సూర్యుడు) ఉన్నాడు. ‘దర్తని’ (నేల) ఉంది. వీటి నడుమ నాలుగువేల అడుగుల ఎత్తున సమిష్టిగా జీవించే పర్వత ప్రాంతం ఉంది. గంజాం మన్యం నుండి మాల్యవంతగిరి కోదుల పూర్వ పురుషుల విశాల ప్రాంతం. ఎందరో ఈ ప్రాంతానికి వచ్చి వెళ్ళిపోయారు కానీ, ఆదికాలం నుండి కొండల తోడుగా దర్తని కొడుకు కోదు ఉన్నాడు.
నాలుగు ఇరవైల వయసున్న ఊరి కురువృద్ధు సర్దార్ సరబుసావొతా చనిపోవటంతో నవల మొదటి అంకం మొద లవుతుంది. వారాలు, మాసాలు, కార్తెలు, చెట్ల పళ్ళు, నక్షత్రాలు... వీటితోనే కోదుల పేర్లు. సరుబుసావోతా కుటుంబంలోని సావోతా కోడలు పుయు (పూవు), కూతురు పుబిలి (సీతాకోకచిలుక), కొడుకు దివుడు (కార్తీకం) భూమికగా కోదుల జీవితం నమోదు చేసారు రచయిత. ప్రకృతీ జీవితమూ లతమల్లే గాఢంగా అల్లుకుపోయిన అనుభవం దృశ్యమానం అవుతుంది ఈ రచనలో. మనసు ఎండిన మోడుగా మారినా జీవితేచ్ఛల బిగి సడలని కోదు స్త్రీ స్వతంత్ర వ్యక్తిత్వాలు వ్యక్తమవుతాయి. సరళ సుందరమైన వారి సరికొత్త ప్రపంచాలు దర్శనమిస్తాయి మనకు.
కోదు వాడ అందరిదీ, అడవి అందరిదీ. అందరి పిల్లలు యావన్మంది ప్రేమకూ పాత్రులు. ఎడం లేదు వారి నడుమ. శరీరాలే వేరు అంతరాళాలన్నీ ఒకటే వారివి. ఒకరి బిడ్డను మరొకరు లాలిస్తారు. ఇంకొకరి పిల్లలకు మరొకరు తల సాపుతారు. కొండ దేశాన కోదులలో మానవ హృదయ మూల స్వరూపం చెక్కుచెదరలేదని మనకు అవగతమవుతుంది. కోదులు ఎముకలు గుండయ్యేలా పనిచేస్తూ చోల్లు, సావలు, వోలిసెలు, కందులు, నువ్వులు, ఆవదాల పంటలు సాగుచేయడమూ, పక్షులతో కలిసి పంటలను పంచుకు తినడమూ కనిపిస్తుంది. జీలుగు చెట్ల బెరడు, మామిడి టెంకల గుజ్జు, కందగడ్డ, చింతంబలి, గట్టి వేర్లు, తేనె పట్టు వారి ఆహారమనీ, మయిరికా (పులిచీమలు) పొడి చేసి కలుపుకున్న చోడంబలి, కొండముచ్చు మాంసపు మధురమైన రుచిని మరిగి ఉన్నారనీ తెలుస్తుంది. సూదంటు రాయితో నవజాత శిశువు బొడ్డు కోసి మందాకు పసరు పూస్తుంది కోదు మాతృమూర్తి. మందువేరు నమిలి మింగే బాలెంతలు, నల్ల మిరియాలతో జ్వరాల నుండి బాగవటం, పులిచీమలు కుట్టించుకుని నొప్పులు వదిలించుకునే వారి వైద్య విధానం మనకు తెలుస్తుంది. గాయం అక్కడి గాలికే మానుతుంది. వెలుగు పడితే వేదన నిమ్మళిస్తుంది. విశాల ప్రకృతి పంచమణిలా వారి రోగం బాగుపరుస్తుంది.
అనంత శబ్దం వెనక అనాది మంత్ర ధ్వనుల ప్రతిధ్వని వింటున్నారు వారు. ‘ఓ’ అని పిలిస్తే ‘ఓ’ అని ప్రతి పలికే హొరుపేను (వనదేవత) ఒడిలో తలపెట్టుకు నిదురిస్తున్నారు. పెద్దపులిని బయటకు రప్పించే బృంగరాజు పిట్టలు, ఎట్రింట పిట్ట, గువ్వపిట్ట, వానకోయిలలు, పోలుగులు, గోరపిట్టలు, చిలుకలు, మైనగోరలు, జీబుచెట్లపై నాట్యమాడే నెమళ్ళతో కలిసి బతకటం కనిపిస్తుంది. వారి హృదయంలో కోమల రాగం మోగుతుంది. ఏకతార సితార, పిల్లంగోవి దొంబుడోల డొంబుబాకా, రంగోలు టముకు బాజా వారి వాయిద్యాలు. మాఘ మాసం సంజ చీకట్లో చుక్కలు తొంగిచూసే వేళ పాటను వాయిద్యాలతో పెనవేస్తారు వారు. జనన మరణాల నడుమ పనిలో, ప్రయాణంలో, ప్రణయంలో, పరిణయంలో పాట వారితో పెనవేసుకు ఉంది.
నవల చదువుతుంటే అడవిలో బంగరు రంగు ఎండ, హోరున వీస్తున్న చైత్ర గాలి, పేరులేని రంగు రంగుల పూల సువాసన మనల్ని తాకుతాయి. సృష్టి తొలి రాత్రిన పుట్టి ఇవాళ దాకా భూమిని వదలని చీకటీ, మొదటి ఉదయపు వెలుగూ కోదుల నెత్తిన మారుగుళ్ళాడుతూ కనిపిస్తాయి ఈ నవలలో. జీవితం జోరీగలాగా దౌర్జన్యంగా ఉండనీ.. విరక్తి లేదు వారికి. జీవితంలో ఆనందం శ్రేష్టమైనదనే నమ్మకం వారిది. జీవితం సత్యం, సుందరం అనే స్పృహ వారిది. ‘‘జీవనంలో రుచి ఉంది, చావు లేదు దుఃఖం లేదు’’ అని సభ్య సమాజానికి చాటుతుంది ఈ వన జీవితం.
బడుగు భాస్కర్ జోగేష్
& 98666 02325
ఇవి కూడా చదవండి..
కౌంటింగ్ వేళ.. సోషల్ మీడియా ప్రొఫైల్ మార్చిన కేరళం సీఎం
ఓట్ల లెక్కింపు రోజున అవాంతరాలకు బీజేపీ పథకం... ఈసీకి డీఎంకే లేఖ