గాజా మారణహోమంలో మన సాయమా!?
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:02 AM
భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ రక్షణ రంగంతో ఎలా సన్నిహితమైన, లాభదాయకమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుందో, ఆ దేశ సైనిక కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే సరఫరా గొలుసులకు ఎలా ఒక ముఖ్యమైన సహకారిగా...
భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ రక్షణ రంగంతో ఎలా సన్నిహితమైన, లాభదాయకమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుందో, ఆ దేశ సైనిక కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే సరఫరా గొలుసులకు ఎలా ఒక ముఖ్యమైన సహకారిగా మారిందో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తాజా నివేదిక ‘మేడ్ ఇన్ ఇండియా: ది సప్లయ్ ఆఫ్ వెపన్స్ అండ్ అమ్యునిషన్ టు ఇజ్రాయెల్’ వివరిస్తోంది.
ఇజ్రాయెల్ సైన్యానికి ఆయుధాలు సరఫరా చేసే అక్కడి కంపెనీలకు భారతదేశం ఆయుధాలను, మందుగుండు సామగ్రిని, విడిభాగాలను, ఇతర పరికరాలను ఎలా రవాణా చేస్తున్నదో వెల్లడించడానికి ఈ నివేదిక భారత్–ఇజ్రాయెల్ దేశాల మధ్య రవాణా స్థాయి వాణిజ్య డేటాను వాడుకున్నది. నేరుగా భారత ప్రభుత్వ యాజమాన్యంలోను, నియంత్రణలోను ఉన్న కంపెనీలను కూడా ఇది గుర్తించింది.
‘‘సంవత్సరాలుగా గాజాలో మారణహోమం జరుగుతున్నప్పటికీ, ఆ వివరాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ ప్రసారమవుతున్నప్పటికీ భారతదేశం మాత్రం ఇజ్రాయెల్ సైనిక, రక్షణ రంగానికి మద్దతు కొనసాగిస్తూనే ఉన్నదని మా పరిశోధన వెల్లడిస్తున్నది’’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కల్లమార్డ్ తెలిపారు. ‘‘ప్రధాన సప్లయ్ కంపెనీలపై తనకున్న యాజమాన్యాన్ని, నియంత్రణనూ వాడుకుని భారతదేశం ఇజ్రాయెల్‌కు ఆయుధాలను తయారు చేసి సరఫరా చేస్తోంది. అంతర్జాతీయ చట్టాలు, ప్రమాణాలకు అనుగుణంగా ప్రైవేట్ కంపెనీల ద్వారా ఇజ్రాయెల్‌కు జరిగే ఆయుధ ఎగుమతులను నియంత్రించడంలో భారతదేశం విఫలం కావడమే కాదు, పైపెచ్చు ఇజ్రాయెల్‌తో రక్షణ భాగస్వామ్యాన్ని మరింతగా బలపరుచుకుంది’’ అని ఆమె పేర్కొన్నారు. ‘‘గాజాలోని పాలస్తీనియన్లపై జాతి నిర్మూలన జరిగే ప్రమాదం ఉందన్న వాస్తవాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం గుర్తిస్తూ తాత్కాలిక చర్యలకు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో– ఇజ్రాయెల్‌కు ఆయుధాల బదిలీని అనుమతిస్తూ, దాన్ని మరింత సులభతరం చేస్తున్న భారత అధికారులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు’’ అని ఆమె స్పష్టం చేశారు.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పరిశోధకులు 7 అక్టోబర్ 2023 మొదలుకొని భారతదేశం నుంచి ఇజ్రాయెల్‌కు రవాణా అయిన 2,596 ఆయుధాలు, మందుగుండు సామగ్రి, భాగాలు, విడిభాగాల సరుకులను విశ్లేషించారు. రికార్డుల ప్రకారం, ఇజ్రాయెల్ సైన్యానికి ప్రత్యక్ష సరఫరాదారులైన అక్కడి పెద్ద కంపెనీలకు మన భారతీయ కంపెనీలు కనీసం 3,90,516 చిన్న ఆయుధ విడిభాగాలను, 5,64,970 పేలుడు పదార్థాల భాగాలను (డ్రోన్ వార్‌హెడ్‌లు, ఫిరంగి గుండ్ల కేసింగ్‌లు వంటివి), 298 సైనిక వాహనాలకు సంబంధించిన విడిభాగాలను సరఫరా చేశాయి. దాడుల నుంచి పౌరులను రక్షించడానికి పనికివచ్చే క్షిపణి నిరోధక రక్షణ సాంకేతికత కోసం వాడే అవకాశం ఉన్న ఆయుధాలు, భాగాలు, మందుగుండు సామగ్రి సరఫరాను ఈ నివేదిక మినహాయించింది.
జూన్, జూలై 2026లో, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ నివేదికలోని వివరాలను తెలియజేస్తూ భారత ప్రభుత్వానికి, నివేదికలో పేర్కొన్న తొమ్మిది కంపెనీలకు లేఖ రాసింది, కానీ ఎటువంటి స్పందన రాలేదు. అమెరికా, జర్మనీ వంటి అనేక కీలక దేశాల నుంచి దాదాపు నిరంతరాయంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా కావడం, అలాగే స్లోవేనియా, ఫ్రాన్స్‌ల ద్వారా ఇజ్రాయెల్‌కు ఆయుధాలు రవాణా కావడం వంటి కారణాల వల్ల ఇజ్రాయెల్ ఈ నేరాలకు, అంతర్జాతీయ చట్ట ఉల్లంఘనలకు పాల్పడగలిగిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నమోదు చేసింది.
‘‘ఇజ్రాయెల్‌కు ఆయుధాల బదిలీని తెలిసి కూడా అనుమతించడం ద్వారా, జాతి నిర్మూలనను నిరోధించాల్సిన తన విధిని, జెనీవా కన్వెన్షన్‌లను గౌరవించేలా చూడాల్సిన తన బాధ్యతను భారతదేశం స్పష్టంగా ఉల్లంఘిస్తున్నది’’ అని ఆగ్నెస్ కల్లమార్డ్ స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ చట్టవిరుద్ధ ఆక్రమణకు, దాని నేరాలకు తాము దోహదపడటం లేదని నిరూపించుకునే వరకు సదరు కంపెనీలపై సమగ్ర ఆయుధ నిషేధాన్ని విధించాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చాలా కాలంగా పిలుపునిస్తోంది. భారత ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు అందిస్తున్న ఈ సహకారాన్ని తక్షణమే నిలిపివేయాలని ఈ సంస్థ డిమాండ్ చేసింది.
చలసాని నరేంద్ర
ఇవి కూడా చదవండి...
కిడ్నాప్ కేసు.. గుజరాత్‌లో వైసీపీ నేత ముస్తఫా అరెస్ట్
పెద్దపులి మృతి కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్
Read Latest AP News And Telugu News