అమ్మ చుట్టూ తారాడే కవిత
ABN , Publish Date - Jun 15 , 2026 | 02:26 AM
కొంచెం ప్రయత్నిస్తే పూర్తి చేయగలిగే పజిల్స్, గళ్ళ నుడి కట్టు, పద ప్రహేళికల్లా ఉంటుంది శ్రీకాంత్ కవిత్వం. మనసు ‘భాష’ తెలిసిన వారికి అది సులభంగాను, తెలియని వారికి కఠినంగాను అనిపిస్తుంది....
కొంచెం ప్రయత్నిస్తే పూర్తి చేయగలిగే పజిల్స్, గళ్ళ నుడి కట్టు, పద ప్రహేళికల్లా ఉంటుంది శ్రీకాంత్ కవిత్వం. మనసు ‘భాష’ తెలిసిన వారికి అది సులభంగాను, తెలియని వారికి కఠినంగాను అనిపిస్తుంది. మేధావితనం ఇక్కడ ఖచ్చితంగా పూర్తిగా ఓడిపోతుంది.
***
కవితావరణంలో కొన్ని సమాధానాల్ని వెదజల్లుతాడు. వాటిని సంతృప్తిపరిచే అన్వయాల్ని, వాటి వెంట కోడిపిల్లల్లా తరుముతాడు. సహేతుక కారణాలను ఎగరేస్తాడు. చివరిగా ప్రశ్నల్ని పట్టుకున్న దారపు చేతిని మృదువుగా స్పృశిస్తాడు.
‘‘ఏమీ లేదు/ ఈ ఉదయం ఇంటికి వెళ్లాను/ ఒక అతిథి వలె అమ్మని చూసొచ్చాను’’ (‘అతిథి’)
ఒక్కోసారి పాక్షిక సంభాషణ సైతం మొత్తం కవితను వెలిగిస్తుంది. అయితే సంధించే ప్రశ్నకు సమాధానం పరిసర దృశ్య శకలాల రూపంలో ఎదురవుతుంది. ఒక వృత్తం చుట్టడం పూర్తవుతుంది. ఇకపై ఆవృత సన్నివేశం రక్తి కడుతుంది.
***
సాధారణ వాక్యానికి, కవితాత్మక వాక్యానికి ఉన్న తేడా ఈ కవిత్వంలో స్పష్టంగా గమనించవచ్చు.
అ) మూడు రోజులుగా తన దేహం అలసిపోయి మంచం పైకి వాలిపోయింది (సాధారణ వాక్యం)
ఆ) మూడు రోజులుగా తన దేహం అలసిపోయి వేర్లు వెలుపలికి వచ్చి ఒరిగిపోయిన వృక్షంలా, మంచం పైకి రాలిపోయింది (కవితాత్మక వాక్యం)
ఒక పోలికతో (ఉపమ) సాధారణ వాక్యం, కవితాత్మక వాక్యంగా మారిపోయింది. ఒక క్రియ ఎలా జరిగిందో చెప్పబడింది (మూర్తం).
ఇ) మోకాళ్ళ మధ్య నొప్పిరా కన్నా (సాధారణ వాక్యం)
ఈ) మోకాళ్ళ మధ్య నుంచి నలువైపులా నరాలు చీలిపోతున్నట్టు భరించలేని నొప్పి రా కన్నా (కవితాత్మక వాక్యం)
ఒక నొప్పి తీవ్రత ఎటువంటిదో కన్వే చేయబడింది (అమూర్తం)
ఇక్కడ మూర్త, అమూర్త విషయాల్నీ మూర్త విషయాలతో పోల్చి చెప్పటం ప్రధానంగా కనిపిస్తుంది.
***
‘‘అమ్మ, ఉద్యోగానికి వెళ్లడం/ లేదిప్పుడు–/ అయినా, అన్నం పప్పూ/ కానీ, కర్రీ పాయింట్లో/ అదే నల్లని ఆ ప్రేమ రాహిత్యపు నీడ/ ఇప్పటికీ తన చుట్టూ చిరిగిన పర్సులో దాచుకున్న అతని ప్రియమైన ముఖంలాగా!’’ (‘నీడ’)
‘‘ఇక్కడ కవిత దేదీప్యమానంగా వెలిగింది’’ అని చెప్పుకునే చోటే ఆ వాక్యాల్ని తద్విరుద్ధమైన అనుభూతి పట్టి పీడించే అవస్థ ఎంతటి పారడాక్సో కదా!
‘‘ఇదే రాత్రి/ అలసిన అమ్మ అటువైపుకి తిరిగి నిదురోయింది’’
‘‘రాత్రి తనువుని పెనవేసుకుని/ అటువైపుకు తిరిగి నిదురోయే అమ్మని ఎందుకైనా/ ఎవరైనా ఎలా కదపటం?’’ (‘అమ్మ’)
రెండు వాక్యాల మధ్య సంచరిస్తున్న ఒంటరితనపు దిగులు నిశ్శబ్దం కథలు కథలుగా రూపాంతరం చెందుతున్న స్్థితి! ఒకటి ఎత్తుగడ. రెండోది ముగింపు లేని వాక్యం. ఇక్కడ ‘రాత్రి తనువుని పెనవేసుకుని’ అనే అర్థం అసలు కారణాన్ని ముందుకు తోస్తుంది.
***
ఈ ‘M/Other’ పుస్తకంలోని ప్రతి కవితకూ ఒక ఇంటర్నల్ కో రిలేషన్ ఉంది. మొదటి కవిత (‘అమ్మ కళ్ళు’)లో ప్రస్తావించిన ఎత్తుగడ (‘‘చీకట్లో వెలిగించిన రెండు దీపాల్లా వెలుగుతాయి నీ కళ్ళు’’)కు, చివరి కవిత (‘ముగింపు’)లో చెప్పబడిన వాక్యాలకు (‘‘ఏం ప్రయోజనం నీ కవిత్వంతో? వెలిగే దీపాలను చేయగలవా మళ్ళా కళ్ళను?’’) మధ్యగల సహసంబంధాన్ని గుర్తిస్తే ఈ విషయం అర్థమవుతుంది. మొత్తంగా అంతర్దహనం లాంటి అంతర్మథనంతో కొనసాగిన కవిత అంతర్లీనంగా వాస్తవ జీవిత పరంపరగా కనిపిస్తుంది.
‘‘ఇక తన గొంతు మీదుగా జారి, నింపాదిగా తన అరచేతుల్లోకి చేరి ఒదిగి కూర్చుంది ఎండ, కోడిపిల్లై,–’’
సూక్ష్మాతి సూక్ష్మమైన దృశ్యాన్ని ఫ్రేముల్లో బంధించడం శ్రీకాంత్‌కు సులువైన పని. అసమానమైన ప్రతీకలేవీ కనపడి అబ్బురపరచకపోవచ్చు. కానీ ఇవే నిజమని అంతకుముందరి సిద్ధ ప్రతీకలన్నీ భోగిమంటల్లో పడేసి బూడిద చేస్తాం. ఈ కవి ఆ ప్రాసెస్‌ను అబ్జర్వేషన్లో పెడతాడు కూడా.
‘‘సరిగ్గా అప్పుడే, సరిగ్గా ఇప్పటిలాగే పిలిచింది నీ తల్లి/ మరి నిన్ను; అన్నం ఉడికిందనీ/ ఆడిన ఆటలు ఇక చాలించి, త్వరగా ఇంటికి రమ్మనీ–/మరి ఇన్నాళ్లకయినా, నీ తల్లికి కానీ, మీ ఇంటికి కానీ/నీకు కానీ దారి కనుక్కొని, చేరుకోగలిగావా నువ్వు?!’’ (‘home’)
పుస్తకంలోని ప్రతి కవితకు ఒక కీ పాయింట్ ఉంటుంది. అది ఒక సందర్భమో, సంభాషణో, జ్ఞాపకమో, వర్తమానమో ఏదైనా అయి ఉండొచ్చు. ఆ పాయింట్‌ను పట్టుకొని చుట్టూ ఒక ఎమోషనల్ టచ్ ఉండే వాతావరణాన్ని సృష్టించడం, చివరికి అనుకున్న అంశం గురించి మాట్లాడటం– ఏదో ఒకటి తేల్చి పడేయడం– రాను రాను అది ఫలవంతమై పరిపక్వ దశను దాటి తాత్విక స్థాయికి చేరుకోవడం– ప్రతీసారి మొత్తం పుస్తకంలో ఆ కీ పాయింట్ ‘అమ్మ’ కేంద్రంగానే ఉండటం ఈ కవిత్వం ఆసాంతం మనం చూడవచ్చు.
***
తేలికైన పదాలతో హృదయాన్ని బరువెక్కించగల తడి తడి వాక్యాల ఈ కవిత్వానికి చెమ్మగిల్లి నయనాలతో సాగిలపడతారు పాఠకులు. ఒక ప్రతీకను (‘‘పిల్లి కూనలాంటి అమ్మ’’) తీసుకుంటే దాన్ని సమర్థించే కథనం మొత్తం కవిత్వమై కాళ్లల్లా మెదులుతుంటది. ‘‘అందరూ గెలలు కోసుకున్నాక, తెగనరికిన అరటి చెట్టు లాంటి అమ్మ’’ లాంటి ప్రతీకతో మొదలైన కవిత అనిర్వచనీయమైన భావోద్వేగానికి గురిచేస్తూ ‘‘ఐదారేళ్ల పాప కళ్ళతో అట్లా చూసే అమ్మ’’తో ముగుస్తుంది.
***
‘అమ్మా నేనిక వెళ్తాను’ అని అంటే (‘లిప్తకాలం’)– నిస్తేజంగా చూసే అమ్మలు, అపురూపంగా చూసుకున్న అమ్మల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసే కొడుకులు (‘అమ్మీ’), పిల్లలు అమ్మను తినమని అడిగినప్పుడు– వాళ్ళమ్మతో ఎప్పుడైనా అలా మాట్లాడానా? అని తండ్రి మథనపడటం (‘ఒక క్షణం’); చాలా రోజులకి ఇంటికెళ్లిన కొడుకును కావలించుకుని బావురుమనే ఓ తల్లి (‘గుర్తు’) ఇలా చాలా కనిపిస్తాయి ఈ పుస్తకంలో. ఎందరో తల్లులు తారసపడతారు. మరలా మరలా పురుషాంగం అవుతున్న దేశాన్ని, రాజ్యం పీలికలు చేస్తున్న యోనుల్ని గురించి కూడా మాట్లాడతాడు కవి (‘మన/ తల్లులు’). ‘‘ఎలా రాయటం నొప్పిని?’’ అని నిత్యం సంఘర్షించే కవి శ్రీకాంత్!
బండారి రాజ్ కుమార్
89195 56560
ఇవి కూడా చదవండి..
కుమార్తెపై ఆన్‌లైన్ ప్రచారం.. బీజేపీ పనేనంటూ మండిపడిన డింపుల్ యాదవ్
అఖిలేష్ యాదవ్ కుమార్తెపై ట్రోలింగ్.. ఎఫ్ఐఆర్ నమోదుకు యోగి ఆదేశం