Share News

మన పార్టీలకు అమెరికా ఎన్నికల పాఠం!

ABN , Publish Date - Nov 13 , 2026 | 03:28 AM

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు కాంగ్రెస్‌ను తిరిగి కైవసం చేసుకున్నారు. అక్కడ గెలిచిన అభ్యర్థులు మాట్లాడిన విషయాలు మన రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా ప్రతిపక్షాలకు,...

మన పార్టీలకు అమెరికా ఎన్నికల పాఠం!

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు కాంగ్రెస్‌ను తిరిగి కైవసం చేసుకున్నారు. అక్కడ గెలిచిన అభ్యర్థులు మాట్లాడిన విషయాలు మన రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా ప్రతిపక్షాలకు, ఎంతో నేర్పుతాయి. అమెరికాలో ఓటర్లు ఈ ఎన్నికల్లో ఆర్థిక పరిస్థితుల పట్ల ఆందోళనతో పోలింగ్ బూత్‌లకు వెళ్లారు. ఎన్‌బీసీ ఎగ్జిట్‌పోల్ ప్రకారం, 88శాతం మంది నిత్యావసర సరుకుల ధరల గురించి; 86శాతం మంది కరెంటు, నీటి బిల్లుల గురించి; 85శాతం మంది వైద్య ఖర్చుల గురించి ఆందోళన చెందారు. గెలిచిన అభ్యర్థులూ వీటి గురించే మాట్లాడారు. నార్త్ కరోలినాలో రాయ్ కూపర్ ‘ధరలు తగ్గిద్దాం’ అనే నినాదంతో ప్రచారం మొదలుపెట్టారు. సౌత్ కరోలినాలో అనీ ఆండ్రూస్ అందరికీ అందుబాటులో వైద్యం, తక్కువ ఖర్చు అనే అంశాలపై పోటీ చేశారు. ఇంకా చాలామంది అభ్యర్థులు ఇలాంటి సమస్యలపైనే మాట్లాడారు. అలా అని వాళ్లు అమెరికాలో పెరుగుతున్న జాతి విద్వేషాల గురించీ, హింస గురించీ మాట్లాడలేదని కాదు. అమెరికన్‌ ఓటర్ల ఆందోళనలో ఆర్థిక వ్యవస్థ తర్వాత రెండో స్థానంలో ప్రజాస్వామ్యమే ఉంది. గెలిచినవాళ్లు చేసింది ఏమిటంటే, ఈ రెండింటినీ కలిపి చెప్పడం. వాళ్లందరి సందేశం సరళమైనది. అధికారం కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిందంటే దాని ఫలితంగా మీ ఇంటి అద్దె పెరుగుతుంది, ఆసుపత్రి బిల్లులు పెరుగుతాయి. ఈ సందేశం ఎలా పనిచేసిందంటే– విలువల గురించి మాట్లాడితే అప్పటికే ఆ విలువల గురించి ఆందోళన చెందే కొందరి సమ్మతి మాత్రమే లభిస్తుంది. అదే ఆ విలువలను వంటింటి సమస్యలతోనో పెరుగుతున్న ధరలతోనో ఆరోగ్య వసతితోనో కలిపి చెప్తే అప్పుడు అందరూ కదులుతారు.

మన దేశంలో ఈ సమస్యలు మరింత దారుణంగా ఉన్నాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.09శాతానికి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం 8.94శాతానికి ఎగబాకింది. నగరాల్లో ద్రవ్యోల్బణం 5.41శాతం ఉంటే, గ్రామాల్లో అది 6.63శాతం. ఒక రోజువారీ కూలీకి కూరగాయలు, పప్పుల మీద పెరిగే ప్రతి రూపాయి, పిల్లల పుస్తకాల నుంచో, ఆసుపత్రికి వెళ్లే ఖర్చు నుంచో కోత పడుతున్నది. నగరాల్లో యువత నిరుద్యోగం 19శాతానికి చేరింది. జాతీయ ఆరోగ్య సంస్థ తాజా అంచనాల ప్రకారం, ప్రస్తుత ఆరోగ్య వ్యయంలో దాదాపు సగాన్ని ప్రజలు తమ జేబు నుంచే భరిస్తున్నారు. ఈ సమస్యలకు నగరాల్లో అద్దెలు, పాఠశాల ఫీజులు, ప్రభుత్వ శిశు సంరక్షణ సౌకర్యాల కొరత కలిపితే... సామాన్య భారతీయుడి జీవితాన్ని ప్రభావితం చేసే అసలు ఎజెండా ఏమిటో అర్థమవుతుంది.

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు సీఎస్‌డీఎస్‌–లోక్‌నీతి సర్వేలో 27శాతం మంది నిరుద్యోగాన్ని తమ ప్రధాన సమస్య అని చెప్పారు. 23శాతం మంది ధరల పెరుగుదల అని చెప్పారు. ఇందుకు భిన్నంగా రామమందిరం తమ ఓటును నిర్ణయించే ప్రధాన అంశమని చెప్పింది 8శాతం మంది మాత్రమే. భారతదేశ సామాజిక, సాంస్కృతిక, మత స్వరూపంలో వస్తున్న మార్పులు ముఖ్యం కాదని అనలేం. కానీ మీ జీవితాన్ని, మీ ఓటును ఏది నిర్ణయిస్తుందని ప్రజలను అడిగినప్పుడల్లా వాళ్ల సమాధానం మళ్లీ మళ్లీ ఉద్యోగాలు, ధరల దగ్గరకే వస్తోంది.


ఈ ఏడాది పేపర్‌ లీక్‌ కారణంగా దేశ యువత రోడ్ల మీదకు వచ్చింది. వారి నిరసనలు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చేంత పెద్దవయ్యాయి. సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ఈ నిరసనలు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ దాకా విస్తరించాయి. పరీక్షల విశ్వసనీయత, న్యాయమైన ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవే. కానీ యువత ఆగ్రహం లోతుల్లోకి చూస్తే నిరుద్యోగం, ఆర్థికంగా ఎదిగే అవకాశాలు లేకపోవడమే ఈ నిరసనలకు దారితీసిందని అర్థమవుతుంది.

నగర విద్యార్థుల ఉద్యమం ఎంత ప్రభావవంతంగా ఉన్నప్పటికీ అది ఒక్కటే రాజకీయ ఎజెండాను మార్చలేదు. గ్రామీణ భారతం కూడా అందులో కలవాలి. గ్రామాలు ఇప్పటికీ అవే సమస్యలతో సతమతమవుతున్నాయి. గ్రామీణ యువత నిరుద్యోగం నానాటికీ పెరుగుతూనే ఉంది. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న యువకుడు, కోచింగ్ ఫీజు కట్టలేని యువతి, నీట్ పేపర్ వాట్సాప్‌లో లీకవడం చూసిన రైతు కొడుకు... వీళ్లందరిలోనూ ఢిల్లీ విద్యార్థిలోని ఆగ్రహమే ఉంది. కానీ వ్యక్తం చేయడానికి వాళ్లకు వేదికలు తక్కువ. నగర –గ్రామీణ ప్రపంచాల మధ్య బంధం బలపడినప్పుడు, గ్రామీణ పేదలు, నగర యువత ఒకేలాంటి విషయాల గురించి మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు, అప్పుడవి ‘యువత సమస్యలు’గానో, ‘రైతుల సమస్యలు’గానో మిగలవు. రాజకీయ పోటీకి కేంద్ర బిందువులు అవుతాయి. రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాల చుట్టూ ప్రజలను సంఘటితం చేయాలి. పప్పు ధర, నగరంలో గది అద్దె, ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవ ఖర్చు, డిగ్రీ తర్వాత ఎప్పటికీ రాని ఉద్యోగం ఇలాంటి రోజువారీ సమస్యలను న్యాయం, అధికారం అనే పెద్ద ప్రశ్నలతో ముడిపెట్టాలి. పేదల తరఫున మాట్లాడాలనుకునే ఏ పార్టీ అయినా అమెరికా మధ్యంతర ఎన్నికల నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఇదే.

డా. ఎ.చంద్రశేఖర్‌రెడ్డి

మిజోరం సెంట్రల్ యూనివర్సిటీ

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?

ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 13 , 2026 | 03:28 AM