అమరావతే అక్షయ పాత్ర
ABN , Publish Date - Feb 17 , 2026 | 03:13 AM
ఎప్పటికీ తరగని ఆహారాన్నిచ్చే దైవికమైన పాత్రను అక్షయ పాత్ర అంటారు. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఎంత మంది ఆకలినైనా తీర్చేందుకు ధర్మరాజు వరంగా అడిగితే, సూర్యభగవానుడు....
ఎప్పటికీ తరగని ఆహారాన్నిచ్చే దైవికమైన పాత్రను అక్షయ పాత్ర అంటారు. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఎంత మంది ఆకలినైనా తీర్చేందుకు ధర్మరాజు వరంగా అడిగితే, సూర్యభగవానుడు అక్షయ పాత్రను ప్రసాదించాడట. పురాణ కథను కాసేపు పక్కన పెడితే, ఆధునిక ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్‌కు సరిగ్గా అలాంటి అక్షయ పాత్ర అమరావతే!
అవకాశాలను అందిపుచ్చుకోవటం, ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలచుకోవటంలో ముఖ్యమంత్రి చంద్రబాబుది అందెవేసిన చెయ్యి. నిజానికి రాజధాని అంటే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ఐఏఎస్, ఐపీఎస్ పరిపాలనా కార్యాలయాలు. ఏ ముఖ్యమంత్రయినా ఇంతకు మించి ఆలోచన చేయరు. విభజన చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రధాన పాలనా అంగాలకే ఆర్థిక సహాయం అందిస్తుంది. కానీ చంద్రబాబు రాజధానిని పరిపాలనా కేంద్రంగా మాత్రమే చూడలేదు, దానిని ఆధునిక నగరంగా భావించారు. రాష్ట్రానికి ఆర్థిక వనరుగా, రాష్ట్ర భవిష్యత్తుకు చూడచక్కని మహానగరంగా ఉండాలన్నది చంద్రబాబు సంకల్పం. అందుకు అనుగుణంగానే రాష్ట్ర నడిబొడ్డున రాజధాని నిర్ణయం చేశారు. రైతుల నుంచి 34,348 ఎకరాలను భూ సమీకరణ పద్ధతిలో సేకరించారు.
రాజధానికి రైల్వే, విమాన, ప్రధాన రహదారి కనెక్టివిటీ సౌకర్యాలతో పాటు వందేళ్ళు గడిచినా తాగునీటికి కటకట లేకుండా కృష్ణా తీరాన్ని ఎంపిక చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో మానవ జీవన నాగరికత, అభివృద్ధిని ఇతివృత్తంగా భావించారు. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌కు ఆ ఆవశ్యకతను గుర్తించి రైతులు పూర్తిగా సహకరించి, భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అడ్డుపుల్లలు వేసినా, ముఖ్యమంత్రి అంటే ఇష్టం లేని ‘మేధావులు’ అమరావతిపై విషం చిమ్మినా పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు నడిచారు. అన్ని అడ్డంకులను అధిగమించి 2017–19లోనే పరిపాలనకు సంబంధించిన ప్రధాన అంగాలను పూర్తిచేసి పాలన చేపట్టారు. రాష్ట్రానికి కొత్త రాజధానిగా అమరావతిని భారతావనిపై నిలబెట్టారు.
2019లో రాజధాని యజ్ఞానికి ఊహించని రీతిలో విఘాతం ఏర్పడింది. అమరావతిని అన్నం గిన్నెగా భావించేందుకు ఇష్టం లేని ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చారు. అమరావతి అభివృద్ధి చెందితే చంద్రబాబు సంకల్పం నెరవేరినట్టే అని దిగులుపడ్డారాయన. అమరావతిని అంతం చేసేందుకు ‘మూడు రాజధానులు’ అనే వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. మూడు ప్రాంతాల ప్రజల్ని ఊహాలోకాల్లో తిప్పారు. అందుకోసం అక్షయ పాత్రకు కొత్త పేర్లు పెట్టి దుమ్ము, ధూళి నింపి దాని ఔన్నత్యాన్ని మట్టితో కప్పెట్టేలా యుద్ధం చేశారు. వెరసి భూములు దానం చేసిన రైతులు కష్టాలు పడ్డారు. చెరసాలల్లో పడ్డారు. 1631 రోజుల చారిత్రకమైన ఉద్యమ బాట పట్టారు. సువర్ణలిఖిత చరిత్రను రాశారు. ఫలితంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అమరావతికి రక్షణగా నిలబడ్డారు. రాజధానిపై కత్తి కట్టిన వాళ్ళను అధికారం నుంచి గద్దె దింపారు.
2024 నుంచి అమరావతి పునరుజ్జీవన సంకల్పం మొదలైంది. పనులు వేగంగా జరగడానికి శ్రీకారం చుట్టారు. చీకటి పాలనకు నకళ్ళుగా ఉన్న అడవిని తొలుత నరికి శుభ్రం చేశారు. ఎన్జీవో, గెజిటెడ్ అధికారుల నివాస టవర్లు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ మౌలిక సదుపాయాల కల్పన చేపట్టారు. నాలుగువేల మంది ప్రభుత్వ ఉద్యోగుల గృహాలకు రూపకల్పన చేశారు. కొండవీటి వాగు, పాలవాగు వరద నియంత్రణ పనులు చేపట్టారు. శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండ ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోంది. రూ.250 కోట్లతో రాజధాని పరిపాలనా కేంద్రం సీఆర్‌డీఏ భవనం అందుబాటులోకి తెచ్చారు. రూ.2,245 కోట్ల కేంద్రం నిధులతో 57 కిలోమీటర్ల రైల్వేలైన్ అమరావతికి అనుసంధానం జరుగుతోంది. రూ.250 కోట్లతో అతిపెద్ద ఎక్స్‌ఎల్ఆర్ఐ ఏర్పాటు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, జాతీయ విద్యాలయాలు, అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా నగరం, టూరిజం, 4 స్టార్ హోటళ్ళ పనులు చకచకా జరుగుతున్నాయి. రూ.212 కోట్లతో రాజ్‌భవన్, రూ.16 వేల కోట్లతో 70 మీటర్ల నుంచి 140 మీటర్ల వరకు ఔటర్ రింగ్ రోడ్డు, సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణ వేగం పుంజుకుంది. రూ.150 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంథాలయం ఏర్పాటవుతున్నది. రూ.369 కోట్లతో ఎల్ అండ్ టీ కన్‌స్ట్రక్షన్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, రూ.99.62 కోట్లతో క్వాంటమ్ సెంటర్, రూ.260 కోట్లతో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులతో పాటు 15 జాతీయ బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాలకు ఏకకాలంలో శంకుస్థాపనలు జరిగాయి. దీని ద్వారా రూ.1320 కోట్ల పెట్టుబడులు, 6541 మందికి ఉద్యోగాల భర్తీ. రూ.80 కోట్లతో తపాలా శాఖ ప్రాంతీయ కార్యాలయం, కాగ్ కార్యాలయం, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, నేచురోపతి ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు వంటి ప్రణాళికలు ఆచరణ రూపంలోకి వచ్చాయి.
అమరావతి బంతిపూల తోటల్లో క్వాంటమ్ వాలీ పూసింది. బిట్స్ పిలానీ సువాసనలు వచ్చాయి. ఆధునిక ప్రపంచ అమరావతి నగరీకరణలో ఎలాంటి అద్భుతమైనా జరగొచ్చు. ఎలాంటి అభివృద్ధి కోణాన్నైనా చూడొచ్చు. వీటన్నింటికీ ఏకైక కారణం లాండ్ బ్యాంక్. దేశంలోని ఏ రాష్ట్రానికి లేని భూ సంపద ఒక్క అమరావతిలోనే ఉంది. అన్ని అభివృద్ధి ఫలాలు వచ్చాక అమరావతిని అక్షయ పాత్ర అనటంలో సందేహం ఏముంటుంది?
పోతుల బాలకోటయ్య
చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..
ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And AP News And Telugu News