అమరావతి: ఆంధ్రకు ఆర్థిక రక్షణ కవచం
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:31 AM
చంద్రబాబు అనే విజనరీకి రేపటి రాజధాని అమరావతి కనిపిస్తుంటే, ఆ దూరదృష్టి లేని వారికి ఈ రోజు పెట్టే ఖర్చు మాత్రమే కనిపిస్తున్నది. గత ఐదేళ్ల వైసీపీ తీరు భయంకరమైన ‘ఆలోచనా శూన్యత’కు ఋజువు. అమరావతి అభివృద్ధికి...
చంద్రబాబు అనే విజనరీకి రేపటి రాజధాని అమరావతి కనిపిస్తుంటే, ఆ దూరదృష్టి లేని వారికి ఈ రోజు పెట్టే ఖర్చు మాత్రమే కనిపిస్తున్నది. గత ఐదేళ్ల వైసీపీ తీరు భయంకరమైన ‘ఆలోచనా శూన్యత’కు ఋజువు. అమరావతి అభివృద్ధికి ఎకరాకు రూ.2 కోట్ల ఖర్చు అవుతుందని, ఈ అప్పు భారం మోయలేమనీ వైసీపీ వాదన. ఇది మౌలిక సదుపాయాలను ‘తిరిగి రాని ఖర్చు’ (Sunk Cost)గా చూసే పాతకాలపు ఆర్థిక దృక్పథం. అమరావతిని ఒక స్వయం సమృద్ధ సంపద సృష్టి కేంద్రంగానే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ప్రధానాంశం, రూ.2 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లు కానే కాదు. అసలా ఆలోచన కూడా ఎప్పుడూ లేదు.
అమరావతి ఎప్పుడూ ఒక ‘స్థూల మూలధన కల్పన’ (Gross Capital Formation) లక్ష్యంగానే ముందుకు వెళ్ళింది. అంటే భూమి నగదీకరణ (Monetization), వివిధ సంస్థల నుంచి వచ్చే నిధులు, ప్రైవేట్ ఈక్విటీ ద్వారా నిర్మితమయ్యే ఒక ఆర్థిక వ్యవస్థల మొత్తం విలువ అది. ఆ విలువను ముందుగానే లెక్కేసుకొని ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టేస్తోంది అని గగ్గోలు పెట్టడం కుతర్క రాజకీయం. అమరావతి అంటే లక్షల కోట్ల అప్పు అని భయపెట్టే వికృత రాజకీయ క్రీడ ఒక పక్క, దాన్ని ఒక నిర్మాణాత్మక ఆస్తి సృష్టిగానూ (Structural Asset Creation), సంపద ఉత్పాదక మూలధనంగానూ (Wealth Generative Capital) నిరూపించే ఆధునిక ఆర్థిక దృక్పథం మరోపక్క– ఈ రెండిటి ఘర్షణ నడుమ అమరావతి ముందుకు సాగుతున్నది.
రెండు లక్షల కోట్ల అప్పు అనే అంకెను భయాన్ని సృష్టించే ఒక రాజకీయ సాధనంగా వాడుతున్నారు. అమరావతిని అర్థం చేసుకోవాలంటే పెట్టుబడి అసలు స్వభావాన్ని విశ్లేషించగలగాలి. రూ.2లక్షల కోట్లలో ప్రతి రూపాయి రాష్ట్ర ఖజానా నుంచే రావాలని లెక్కలు వేస్తున్నారంటే వారు మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ప్రాథమిక సూత్రాన్నే అర్థం చేసుకోనట్టు భావించాలి! 2026లో ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన పాత్ర ప్రాథమిక మౌలిక సదుపాయాల కోసం తొలి రూ.50,000–60,000కోట్లు సమకూర్చడం మాత్రమే. ఈ పునాది ఆలంబనగా, మిగిలిన రూ.1.4 లక్షల కోట్లు ప్రైవేట్ రంగ పెట్టుబడులు, ప్రభుత్వ– ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా వస్తాయి.
తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఆర్డీఏకు కేంద్రం నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి ఆసియన్ అభివృద్ధి సంస్థ వంటి సంస్థల నుంచి అమరావతి రూపకల్పన కోసం వచ్చిన పెట్టుబడులు వాడుకొని ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన చేయాలి. ఒక్కసారి ఈ ప్రాథమిక మౌలిక సౌకర్యాలు పూర్తయిన తర్వాత, రాష్ట్రం ఇచ్చే చిన్న మూలధనం, అంతర్జాతీయ ఫండ్స్, సావరిన్ వెల్త్ ఫండ్స్ నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఇది రాజధానిని బడ్జెట్ ఖర్చుగా కాకుండా, ఒక స్వతంత్ర వాణిజ్య సంస్థగా మారుస్తుంది. ఆర్థిక శాస్త్రంలో, ‘రెవెన్యూ ఖర్చు’ (వినియోగం), ‘మూలధన ఖర్చు’ (ఆస్తి సృష్టి) మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది. ట్రంక్ రోడ్లు, అండర్ గ్రౌండ్ యూటిలిటీ డక్ట్‌లు, 24/7 పవర్ గ్రిడ్‌లు, ఐసీటీ మౌలిక సదుపాయాల కోసం ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు చేయడం.. ఇవి మూలధన కల్పన విభాగంలోకి వస్తాయి. ఇక్కడ మల్టిప్లయర్ ఎఫెక్ట్ 1:5గా ఉంటుంది. అంటే ప్రభుత్వం పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడీ ఐదు రూపాయల ప్రైవేట్ పెట్టుబడిని ఆకర్షిస్తుంది. ఈ పునాది భవిష్యత్తులో పెరిగే ఆస్తిని సృష్టిస్తుంది. చేసే అప్పు తరుగుతుంది.
అమరావతికి అసలైన ‘ఆర్థిక ఇంజన్’ ల్యాండ్ పూలింగ్ స్కీమ్. ఇది భారతదేశంలోనే అత్యంత వినూత్నమైన భూసేకరణ నమూనా. ప్రభుత్వం భూమిని కొనుగోలు ద్వారా కాకుండా, భాగస్వామ్యం ద్వారా సేకరించి, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు తిరిగి ఇచ్చేసిన తర్వాత, ప్రభుత్వం వద్ద వాణిజ్య, సంస్థాగత అవసరాల కోసం భారీగా భూమి మిగిలి ఉంటుంది. ఇప్పుడు ఆర్థిక సూత్రాలు తెలియని మన వైసీపీ మిత్రులు చెబుతున్న ఆ రూ.2కోట్ల ఖర్చుతో మౌలిక సదుపాయాల కల్పన వల్ల, ప్రభుత్వం వద్ద ఉన్న పదివేల ఎకరాల పైచిలుకు భూముల విలువ అమాంతం పెరుగుతుంది. అప్పటికే పూర్తి స్థాయిలో హై ఎండ్ మౌలిక సౌకర్యాలు ఉండడం వలన; క్వాంటం వ్యాలీ లాంటి అధునాతన రీసెర్చ్ సంస్థలు రావడం వలన; పలు యూనివర్సిటీలు, ఫైవ్ స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ హాళ్ళు, విద్యాలయాలు, ఆసుపత్రులు... అప్పటికే అక్కడ ఉండడం వలన– ఎకరా విలువ ఆటోమాటిక్‌గా పెరుగుతుంది. ప్రభుత్వం తన వద్ద ఉన్న భూమిలో కేవలం కొద్ది భాగాన్ని లీజుకు ఇవ్వడం లేదా అమ్మడం ద్వారా తదుపరి మొత్తం నగర నిర్మాణానికి కావాల్సిన నిధులను సమకూర్చుకోగలదు. ల్యాండ్ పూలింగ్ ద్వారా 29వేల మందికి పైగా రైతులు నగర విజయంలో భాగస్వాములు అయ్యారు, భూసేకరణ ఖర్చు గణనీయంగా తగ్గింది.
అమరావతి కోసం తీసుకొంటున్న రుణాల స్వభావాన్ని పరిశీలిస్తే, అప్పుల ఊబి అనే వాదన అర్థరహితమని తెలుస్తుంది. ఏప్రిల్ 2026 నాటికి, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణ ప్యాకేజీతో ఆర్థిక నిర్మాణం స్థిరపడింది. ఇవి సాధారణ వాణిజ్య రుణాలు కావు, వీటిని ఆర్థిక భాషలో గుడ్ డెట్స్ అంటారు, ఇవి ‘ప్రోగ్రామ్–ఫర్–రిజల్ట్స్’ ప్రాతిపదికన ఉంటాయి. అంటే నిర్దిష్ట మైలురాళ్లు పూర్తయిన తర్వాతే నిధులు విడుదలవుతాయి.
2026 ప్రారంభం నాటికే ప్రగతి ఆధారంగా రూ.5,100కోట్లు విడుదలయ్యాయి. ఇవి 20–30ఏళ్ల దీర్ఘకాలిక, తక్కువ వడ్డీ రుణాలు. రాష్ట్ర GSDP వృద్ధితో పోలిస్తే వీటి వడ్డీ భారం చాలా తక్కువ. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం–2026 ఆర్థిక రక్షణ కవచాన్ని ఇచ్చింది. కేంద్రం కేటాయించిన రూ.15,000 కోట్లు ఒక వారధిలా పనిచేస్తాయి, తద్వారా రాష్ట్రం తన సంక్షేమ పథకాల నిధులను రాజధాని పనుల కోసం మళ్లించాల్సిన అవసరం ఉండదు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మేధో వలస, పన్ను ఆదాయం తరలింపుతో నష్టపోతోంది. రాష్ట్రంలోని ప్రతిభావంతులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు వెళ్తున్నారు. ఒక టైర్–1 నగరాన్ని నిర్మించడం ద్వారా, ప్రస్తుతం పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న బిలియన్ల కొద్దీ జీఎస్‌టీ, ప్రొఫెషనల్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులను రాష్ట్రం తిరిగి పొందవచ్చు. 2030 నాటికి అమరావతి రాష్ట్రం మొత్తం GSDPలో 12–15శాతం వాటాను అందిస్తుందని ఆర్థికవేత్తల అంచనా. ఇది 26 జిల్లాల్లోని సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చే ఒక ఆదాయ కర్మాగారం. అమరావతి క్వాంటం వ్యాలీ వంటి కార్యక్రమాలు రాజధానిని భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ కోసం నిర్మిస్తున్నారని నిరూపిస్తున్నాయి. ఇవి కేవలం ప్రభుత్వ కార్యాలయాలు కావు; అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే హై–వాల్యూ ఆర్థిక కేంద్రాలు.
ఏమీ చేయకపోవడం వల్ల కలిగే నష్టమే ఎక్కువ అనేది వ్యాపార సిద్ధాంతం. 2019–24 మధ్య జగన్ పరిపాలనా కాలం మనకు నేర్పిన పాఠం ఏమిటంటే, అమరావతిని నిర్లక్ష్యం చేయడం అనేది దాన్ని నిర్మించడం కంటే ఖరీదైన వ్యవహారం. నిలిచిపోయిన ప్రాజెక్టులు ‘డెడ్ క్యాపిటల్’గా మారి, అప్పటికే ఖర్చు చేసిన వేల కోట్లకు ఫలితం లేకుండా చేశాయి. గత ఐదేళ్లలో అమరావతిని ఆపివేయడం వల్ల రాష్ట్రం సుమారు రూ. 15,000 కోట్ల జీఎస్టీ ఆదాయాన్ని, ఒక తరం సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను పొరుగు రాష్ట్రాలకు కోల్పోయింది. ఈ రోజు ఎకరాకు రూ.2కోట్ల చొప్పున ఖర్చు చేయడం ద్వారా, రాష్ట్రం ఇతరులపై ఆధారపడటాన్ని ముగించి, తన స్వంత ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకొనే ప్రయత్నంలో ఉంది. రాజధాని నిర్మాణం అనేది ఐదేళ్ల బడ్జెట్ అంశం కాదు. ఒక తరానికి చేసే పెట్టుబడి.
వందల ఏళ్ల చరిత్ర ఉన్న నగరాలు తమ ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతున్న వేళ, ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని ఒక జాతి ఆర్థిక రక్షణ కవచంగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒక అద్భుతమైన కట్టడం నిర్మాణంలో ఉన్నప్పుడు, దాని అంతిమ నిర్మాణాత్మక ఫలితం మామూలు వ్యక్తులకు కనపడదు. కానీ అదే చోట నిలబడిన దాని ‘ఆర్కిటెక్ట్’కు మాత్రం, ఆ ధూళి మేఘాల వెనుక ఆకాశాన్ని తాకే శిఖరాలు, వెలుగులీనే కిటికీలు, ఆ నగరం సృష్టించబోయే అద్భుతమైన భవిష్యత్తు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. సరిగ్గా అమరావతి విషయంలోనూ ఇదే జరుగుతోంది! ఆ ఆర్కిటెక్ట్ చంద్రబాబు నాయుడు!
నీలయపాలెం విజయకుమార్
చైర్మన్, ఏపీ బయోడైవర్సిటీ బోర్డ్
ఇవి కూడా చదవండి..
పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, 6 నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు: రాహుల్
బెంగాల్ స్టార్ క్యాంపెయినర్ లియాండర్ పేస్‌కు ఎక్స్ కేటగిరీ భద్రత