Share News

అమరావతిని శపించిన నేతలకు చెంపపెట్టు

ABN , Publish Date - Aug 18 , 2026 | 03:40 AM

ఆగస్టు 15వ తేదీన ప్రజలు ఆనందంగా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటారు. కానీ రాజధాని ప్రాంత ప్రజలు ఆగస్టు 13నే అంతకు మించిన ఆనందాన్ని చవిచూశారు. శ్మశానం, తొండలు కూడా గుడ్లు పెట్టవంటూ...

అమరావతిని శపించిన నేతలకు చెంపపెట్టు

ఆగస్టు 15వ తేదీన ప్రజలు ఆనందంగా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటారు. కానీ రాజధాని ప్రాంత ప్రజలు ఆగస్టు 13నే అంతకు మించిన ఆనందాన్ని చవిచూశారు. శ్మశానం, తొండలు కూడా గుడ్లు పెట్టవంటూ వ్యాఖ్యానాలు చేసిన నాయకులకు సీడ్ యాక్సెస్ రోడ్డు ఒక చెంపపెట్టుగా భావిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూస్తున్న ప్రజలు తాము గతంలో చేసిన తప్పిదం మళ్లీ చేయకూడదనే నిర్ణయానికి వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు హైదాబాద్ నగరంలో చేసిన అభివృద్ధి, ఆయన విజనరీ గమనించిన అమరావతి ప్రాంత రైతులు... రాజధాని నిర్మాణం నిమిత్తం ఎంతో విలువైన తమ భూములను అప్పగించారు.

మేము అధికారంలోకి వస్తే ప్రజలు ఊహించిన దానికంటే గొప్ప రాజధాని నిర్మిస్తామంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చిన నాయకులు దుర్మార్గంగా వ్యవహరించారు. నిర్మించిన భవనాలు పాడుపెట్టడమే కాకుండా చివరికి సీడ్ యాక్సెస్ రోడ్డుకు వేసిన కంకరను తవ్వుకుపోవడం వరకు అయిదేళ్లపాటు విధ్వంసం కొనసాగింది. ఈ విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రజలు తాము ఎటువంటి పార్టీని, నాయకుడిని ఓడించాం అని పశ్చాత్తాపపడ్డారు. అయిదేళ్లపాటు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేశారు. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో కేవలం రోజుల వ్యవధిలో స్టీల్ బ్రిడ్జిలను నిర్మించి, స్పీడ్ యాక్సెస్ రోడ్డు వాడుకలోకి తీసుకు వచ్చారు.

గత ప్రభుత్వంలో ఎక్కడి పనులు అక్కడ నిలిపివేశారు. భవన నిర్మాణాల కోసం పెట్టిన ఇనుప చువ్వలను ఎత్తుకుపోయారు. అమరావతిపై కక్షతో సగానికిపైగా నిర్మాణం పూర్తిచేసుకొన్న శాసనసభ్యుల, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భవనాల చుట్టూ వర్షపునీటిని నిలిపి ఏ ప్రజా నాయకుడు చేయకూడని రీతిలో ఎంతో విలువైన ప్రజాధనాన్ని నష్టపరిచారు. ఆ చీకటి రోజులకు చరమగీతం పాడుతూ అమరావతిలో ఐకానిక్ టవర్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే శాసనసభ్యుల, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భవనాలు నిర్మాణాలు పూర్తిచేసుకొని తలెత్తి అభివృద్ధి నిరోధకులను వెక్కిరిస్తున్నాయి. చేసిన అన్యాయం చాలదన్నట్టుగా తాజాగా నిర్మాణం పూర్తిచేసుకొన్న భవనాలను చూసి ఓర్వలేక అక్కడ శాసనసభ్యులెవ్వరూ ఉండరు.. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

దేశంలో ఏ రాజధాని నగరంలో లేని విధంగా రహదారులపై ఎక్కడా విద్యుత్, కమ్యూనికేషన్ స్తంభాలు కనిపించవు. కుళాయిల కోసం రోడ్లకు కటింగ్‌లు ఉండవు, మంచినీటి సరఫరా, గ్యాస్ పైపులు, డ్రైనేజీ మురుగునీటిని ఎక్కడికక్కడే శుద్ధిచేస్తారు. వర్షం నీరు రోడ్లపై నిలవకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు. వంటగ్యాస్‌ను పైప్‌లైన్ల ద్వారా ఇళ్లకు అందించే ఏర్పాటు చేశారు. ఈ తరహా సదుపాయాలన్నీ భూమిలోపల ఏర్పాటు చేశారు. వెస్ట్ బైపాస్ రోడ్డుతో మచిలీపట్నం–పూణే, చెన్నై–కలకత్తా జాతీయ రహదారుల మధ్య అనుసంధానం కావడంతోపాటు ఈ జాతీయ రహదారుల మధ్యలో వున్న అమరావతిలో ఎటుచూసినా రహదారులే కనిపిస్తున్నాయి. ఈ రహదారులను చూసి ప్రజలు ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. అంతేకాకుండా భారతదేశంలో ఏ రాష్ట్ర రాజధాని నగరానికి లేని నీటి సదుపాయం అమరావతికి ఉంది. పైగా కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం జరిగే ప్రాంతంలో ఉండటం మరో ప్రత్యేకత. ప్రపంచంలో ఉన్న అనేక వందల రకాల చెట్లను ప్రత్యేకంగా తెప్పించి రాజధాని పరిధిలో నాటుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతిని ఒక బ్లూ సిటీగా, గ్రీన్ సిటీగా నిపుణులు పేర్కొంటున్నారు. అమరావతి నగరాన్ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడం వల్ల ఈ ప్రాంతంలో నివసించే ప్రజల జీవితకాలం కూడా పెరుగుతుందని వారు అంటున్నారు.


దేశంలో హైదరాబాద్, బెంగుళూరు, పూనే వంటి నగరాలు కంప్యూటర్ నగరాలైతే... అమరావతి కంప్యూటర్ అత్యాధునిక రూపమైన క్వాంటమ్ డీప్‌టెక్ సిటీగా రూపుదిద్దుకుంటోంది. దేశంలోనే తొలిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) యూనివర్సిటీ ఏర్పాటు అవుతోంది. ఈ ఆధునికతకు ధీటుగా విట్, ఎస్‌ఆర్‌ఎం, బిట్స్, బేసిల్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ వంటి 18 ఉత్తమశ్రేణి విద్యాసంస్థలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే రాజధాని పరిధిలోని మంగళగిరిలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలు అందిస్తోంది. పేదలకు కేవలం 10 రూపాయల ఫీజుతోనే వైద్యం లభిస్తోంది.

నాడు రాజధానికి సంబంధించి ఎద్దేవా చేసిన అంశాలన్నీ నేడు ఒక్కక్కొటిగా కార్యరూపం దాల్చి చీ కొడుతున్నట్టుగా ఉంది. వైజాగ్ విమానాశ్రయం ఉండగా భోగాపురంలో విమానాశ్రయం అనవసరం అని వ్యాఖ్యానించిన నోటితోనే, ఇప్పుడు ఆ విమానాశ్రయం తన ప్రమేయంతోనే ఏర్పడిందని చెప్పారు. రేపు ఒక మంచి ముహుర్తం చూసుకొని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి అంతా తన పుణ్యమేనని, తాను ముందుగా ఇల్లు కట్టుకోవడం వల్లనే అమరావతిలో ఇంతగా అభివృద్ధి జరుగుతోందని ప్రకటించుకొన్నా ఆశ్చర్యం లేదని రాజధాని ప్రాంత ప్రజలు గుసగుస లాడుకుంటున్నారు!

అన్నవరపు బ్రహ్మయ్య

సీనియర్ పాత్రికేయులు

ఇవి కూడా చదవండి

పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా

Updated Date - Aug 18 , 2026 | 03:40 AM