Share News

ఆ చారిత్రక దీప్తి కనిపించాలి

ABN , Publish Date - Apr 07 , 2026 | 04:14 AM

చరిత్ర పునరావృతమై, వేల ఏళ్ల క్రితం వర్ధిల్లిన ఆంధ్రుల కీర్తి తిరిగి రాజధాని అమరావతి ద్వారా విశ్వవ్యాప్తం కాబోతున్నది. అమరావతి– ఈ పేరు వింటేనే ప్రతి ఆంధ్రుని హృదయం ఉప్పొంగుతుంది. ప్రాచీన కాలం నాటి...

ఆ చారిత్రక దీప్తి కనిపించాలి

చరిత్ర పునరావృతమై, వేల ఏళ్ల క్రితం వర్ధిల్లిన ఆంధ్రుల కీర్తి తిరిగి రాజధాని అమరావతి ద్వారా విశ్వవ్యాప్తం కాబోతున్నది. అమరావతి– ఈ పేరు వింటేనే ప్రతి ఆంధ్రుని హృదయం ఉప్పొంగుతుంది. ప్రాచీన కాలం నాటి విజ్ఞాన వైభవానికి, శిల్పకళా ప్రాభవానికి అఖండ బౌద్ధ సంస్కృతికి గురుపీఠమై దేశ, విదేశాలలో ఆంధ్రుల సంస్కృతీ వైభవాన్ని ప్రసరింపజేసిన అమరావతి కేవలం ఆంధ్రులకే కాదు భారతీయులందరికీ ఆరాధ్యమైన పవిత్ర ప్రదేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరంగా దేశ అత్యున్నత చట్టసభల్లో ఆమోదం పొందిన అమరావతి ఆంధ్రుల ప్రాచీన యుగ చరిత్ర ఆనవాళ్లకు, సంస్కృతికి ప్రధాన కేంద్రంగా అలరారుతున్నది.

ఈ ప్రాంతాన్ని శాతవాహనులు మొదలుకొని రెడ్డి రాజులు వరకు ఎన్నో రాజ వంశాలు తమ సాంస్కృతిక ప్రధాన కేంద్రంగా చేసుకొని పాలించాయి. ఈ నూతన రాజధాని ప్రాంతంలో మధ్యయుగ కాలం నాటి పాత తరహా కట్టడాలు లేకపోయినా, ఆధునిక కాలపు నవీన రీతి భవనాలకు నేటి ఆధునిక విజ్ఞానం ద్వారా అనేక సంస్థలకు ప్రధాన కేంద్రంగా మారబోతున్నది. ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా వెలుగొందింపజేసిన రైతులు సహృదయంతో తమ పంట పొలాలను నూతన రాజధాని నగర నిర్మాణానికై ప్రభుత్వానికి అప్పగించారు. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య అద్భుత సుందర దృశ్యం ఆవిష్కృతమవుతున్నది. ఆనాటి అమరావతిలోని చారిత్రక ఆనవాళ్ళు నూతన రాజధాని నిర్మాణాల్లో ప్రస్ఫుటంగా కనిపించాలి. అమరావతి శిల్పం కృష్ణాతీరంలోని ఆంధ్రుల ప్రత్యేకతకు విశ్వవిఖ్యాతిని తెచ్చింది. అమరావతి స్తూప శిల్ప అవశేషాలు కొన్ని మద్రాస్ మ్యూజియంలోనూ, మరికొన్ని లండన్ మ్యూజియంలోనూ, ఇంకొన్ని కలకత్తా మ్యూజియంలోనూ ఉన్నాయి. ఆనాటి ఆంధ్ర శిల్పులు అమరావతి స్తూప ఫలకాల మీద బౌద్ధ జాతక కథలు అతి మనోహరంగా చిత్రీకరించారు.


ఆధునిక నాగరికతతో పాటు ఆంధ్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అమరావతి రాజధాని ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో వారసత్వ, చారిత్రక అభిలాషుల్లో ఆశలను, ఉత్సాహాన్ని రేకెత్తించి అలనాటి ఆంధ్ర వైభవాన్ని చాటే సంస్కృతిపై, తరతరాల ఆంధ్ర చరిత్రపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. రాజధాని ప్రాంతంలో విజ్ఞాన, వినోద సౌకర్యాలను, సుందర ప్రదేశాలను నిర్మించాలనే ప్రభుత్వ ఆశయం మనకు మహదవకాశం. ఆంధ్ర ప్రాంతానికి, బౌద్ధ సంస్కృతికి గల పరస్పర సంబంధాన్ని తెలుపడానికి ఈ నూతన రాజధాని ద్వారా పెద్ద ఎత్తున కృషి, ప్రచారం జరగాలి. నూతన రాజధాని నగర నిర్మాణంలో అలనాటి చారిత్రక గత వైభవ స్మృతి చిహ్నాలను రూపొందించడానికి ఆంధ్ర శిల్పుల నిర్మాణ కౌశలం, శిల్ప చాతుర్యాన్ని పెంపొందించడానికి నేటి శిల్పులకు ప్రత్యేక తర్ఫీదును ఇచ్చి, వారికి అవకాశం కల్పించాలి. తెలుగు భాషకు విశేష ప్రాధాన్యమిస్తూ ఆనాటి ఆంధ్ర శిల్పులు తమ భావాలను శిల్పాల రూపంలో వ్యక్తపరిచారనే దానికి ఉదాహరణ అమరావతి స్తూపంపై లిఖించిన ‘నాగబు’ అనే తొలి తెలుగు పదం. విదేశీ పాలనలో ఆంధ్రుల వారసత్వ శిథిల ఫలకాలు ఖండాంతరాలకు తరలిపోయాయి. వాటిని తిరిగి ఆంధ్ర ప్రాంతానికి రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా కృషి చేయాలి. ఆంధ్ర ప్రజల చిరకాల వాంఛ అయిన ‘అమరావతి రాజధాని’ని అభివృద్ధి పరచుకోవడం, దీని నిర్మాణం ద్వారా ఆంధ్ర సంస్కృతిని విస్తృతపరచుకోవడానికి సమష్టి కృషి జరగాలి.

డాక్టర్ గోవిందు సురేంద్ర

ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్

ఇవి కూడా చదవండి..

పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, 6 నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు: రాహుల్

బెంగాల్ స్టార్ క్యాంపెయినర్ లియాండర్ పేస్‌కు ఎక్స్ కేటగిరీ భద్రత

Updated Date - Apr 07 , 2026 | 04:14 AM