అమరావతి వ్యయంపై దుష్ప్రచారం!
ABN , Publish Date - Apr 10 , 2026 | 02:47 AM
అవినీతి అనే ఒకే మాటతో అమరావతిని మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు జగన్. రాజధానిలో జరుగుతున్న నిర్మాణాల్లో అవినీతి జరిగిపోతోందని, అడ్డగోలుగా ఖర్చు...
అవినీతి అనే ఒకే మాటతో అమరావతిని మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు జగన్. రాజధానిలో జరుగుతున్న నిర్మాణాల్లో అవినీతి జరిగిపోతోందని, అడ్డగోలుగా ఖర్చుపెడుతున్నారని, ప్రభుత్వంపై పెనుభారం పడుతోందని, కళ్లముందు అవినీతి జరిగిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని జగన్‌రెడ్డి సుద్దపూస విమర్శలు వినడానికే రోతగా ఉన్నాయి.
అమరావతిలో సచివాలయం, విభాగాధిపతుల ఆఫీసులు, అధికారుల నివాస సముదాయాల నిర్మాణం చేస్తున్న విషయం తెలిసిందే. చదరపు అడుగు నిర్మాణానికి రూ.10వేల నుంచి 13వేల దాకా ఖర్చు పెడుతున్నారని జగన్ ఆరోపించారు. కానీ అమరావతిలో నిర్మాణం చేసే ఏ భవనంపైనా అంత ఖర్చు లేనే లేదు. అధికారిక లెక్కల ప్రకారం, సవరించిన ధరల మేరకు చదరపు అడుగు నిర్మాణానికి కనిష్ఠంగా రూ.5 వేలు, గరిష్ఠంగా రూ.6,884 మాత్రమే ఖర్చవుతున్నట్లు సమాచారం. 2018లో అనుకున్న అంచనా వ్యయానికి, 2024–25లో చేసే ఖర్చుకు చాలా తేడా ఉంటుంది. సిమెంట్, స్టీల్ గత ఐదేళ్ళలో నిర్మాణ సామాగ్రి ధరలు 40శాతానికి పైగా పెరిగాయి. కూలీల ఖర్చు, నైపుణ్యం కలిగిన కార్మికుల వేతనాలు కూడా భారీగా పెరిగాయి. ప్రధానంగా జగన్‌రెడ్డి అమరావతి పనులను నిలిపివేయడం వల్లే ఈ అదనపు భారం పడిందన్న విషయం జగన్ ఆండ్ కో తెలుసుకోవాలి. ఒక సాధారణ ఇల్లు కట్టుకునే ధరతో, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణాన్ని పోల్చడం వారి అజ్ఞానానికి, కుట్రపూరిత ఆరోపణలకు నిదర్శనం. సచివాలయం 1, 2 టవర్లలో నిర్మాణం, వసతులు, ఫర్నిచర్, ఇతర సదుపాయాలతో కలిపి చదరపు అడుగుకు అవుతున్న ఖర్చు గరిష్ఠంగా రూ.5వేలు. 2014–19 నడుమ ప్రతిపాదించిన నిర్మాణ వ్యయం రూ.3,200గా ఉంటే, ఇప్పుడు పెరిగిన ధరలతో 5 వేలకు చేరింది. అంటే సగటున రూ.1,800 పెరిగింది. ఇందుకు కారణం జగన్ రెడ్డే. ఆనాడు రాజధాని పనులను ఆపకుండా ఉంటే ఈ పాటికి సచివాలయం బ్లాకుల నిర్మాణం పూర్తయి అదనపు ఖర్చు భారం ప్రభుత్వంపై పడేది కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాల కోసం పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ జగన్ చెబుతున్న ఖర్చు ఎక్కడా లేదు. అమరావతి నిర్మాణ వ్యయం పెరగడానికి తనే కారణమై ఉండి కూడా జగన్‌రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్‌రెడ్డి విశాఖలోని రుషికొండపై రాజసౌధం నిర్మించుకున్నారు. అక్కడ ముందు టూరిజం రిసార్ట్ అని చెప్పి రూ.500 కోట్లతో నిర్మాణం చేపట్టి, చివరకు దానిని సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చాలని ప్రయత్నించిన ఘనత ఆయనదే. రుషికొండ ప్యాలెస్‌ను ప్రభుత్వ ఖర్చుతోనే నిర్మించారు. సగటున ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి అయిన ఖర్చు రూ.15,293. ఆ ప్యాలెస్‌లో ఒక బాత్‌రూం ఇంటీరియర్ ఖర్చే రూ.16 లక్షలని సమాచారం. ఇంటీరియర్ టెండర్‌ను సొంత మనుషులకు, బంధువులకు కట్టబెట్టిన ఉదంతం కూడా వెలుగులోకి వచ్చింది.
అమరావతిలో నిర్మిస్తున్నవి కేవలం ఇటుక, సిమెంట్ కట్టడాలు కావు. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ టవర్ల నిర్మాణానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇవి శతాబ్దాల పాటు నిలిచి ఉండేలా, భూకంపాలను తట్టుకునే గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మిస్తున్నవి. ప్రతి పైసా ఖర్చు కూడా అంతర్జాతీయ స్థాయి టెండర్ల ప్రక్రియ ద్వారానే నిర్ణయించబడింది. ఎల్ అండ్ టి, షాపూర్జీ పల్లోంజీ వంటి దిగ్గజ సంస్థలు ఈ పనులను చేపట్టాయి. మార్కెట్ రేట్ల ప్రకారమే ఈ అంచనాలు ఉంటాయి తప్ప, వ్యక్తులు ఇష్టానుసారంగా పెంచేవి కావు. ఒక భవనం ఖర్చు అంటే అందులో ఉండే సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్, ఐటీ నెట్‌వర్కింగ్, ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్, పవర్ బ్యాకప్, ఇంటీరియర్ ఫినిషింగ్ అన్నీ కలిపి ఉంటాయి. అమరావతి నిర్మాణం ఒకేసారి ఖర్చు చేసే, ఒక్కసారిగా మీద పడే భారంగా ఎప్పుడూ ప్రణాళిక చేయలేదు. ఇది దశల వారీగా, అవసరానికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టే లాంగ్–టర్మ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. జగన్ వర్గం దీన్ని ఉద్దేశపూర్వకంగా లక్షల కోట్లు వెంటనే పెట్టే ఖర్చు అన్నట్టుగా చూపిస్తూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. భూముల విలువ పెరగడం, కమర్షియల్ డెవలప్‌మెంట్ ద్వారా వచ్చే ఆదాయం, అంతర్జాతీయ సంస్థల రుణాలు, ఇవన్నీ కలిసి ప్రభుత్వం మీద నేరుగా భారం పడకుండా ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లే విధంగా రూపుదిద్దుకున్నాయి. ఇది దాచిపెట్టి, ప్రజలపై అప్పుల భారం అని చెప్పడం నిస్సందేహంగా దుష్ప్రచారమే.
నీరుకొండ ప్రసాద్
ఈ వార్తలు కూడా చదవండి..
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స
ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం
Read Latest AP News And Telugu News