Share News

మాదకద్రవ్యాలొక్కటే ప్రమాదమా?

ABN , Publish Date - Jul 02 , 2026 | 01:02 AM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ, యువతను వాటి బారిన పడకుండా...

మాదకద్రవ్యాలొక్కటే ప్రమాదమా?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ, యువతను వాటి బారిన పడకుండా కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ చర్యలు అభినందనీయమే. అయితే, సాధారణ పౌరుడి మనసులో ఒక ప్రశ్న తలెత్తుతోంది. మాదకద్రవ్యాలపై ఇంతటి అప్రమత్తత చూపుతున్న ప్రభుత్వాలు, మద్యం వల్ల సమాజానికి కలుగుతున్న విపరీతమైన నష్టంపై అదే స్థాయిలో ఎందుకు స్పందించడం లేదు? మాదకద్రవ్యాలే ప్రమాదకరమైనవి, మద్యం కాదన్న భావన ప్రజల్లో ఏర్పడుతోందా?

తెలుగు రాష్ట్రాల్లో మద్యపానం ఆందోళనకరంగా పెరుగుతోంది. గత రెండేళ్లుగా మద్యం విధానాలు, మద్యం కుంభకోణాల గురించే మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ప్రజల ఆరోగ్యానికి మద్యం వల్ల కలుగుతున్న నష్టంపై మాత్రం అంతగా చర్చ జరగడం లేదు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 26 లక్షల మరణాలకు మద్యం కారణమవుతోంది. కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, పక్షవాతం, అనేక రకాల క్యాన్సర్లు, మానసిక సమస్యలు, వ్యసనం వంటి 200కు పైగా ఆరోగ్య సమస్యలకు మద్యంతో సంబంధం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది. రోడ్డు ప్రమాదాలు, గృహహింస, నేరాలు, కుటుంబ కలహాలు, ఉత్పాదకత తగ్గడం వంటి అనేక సామాజిక సమస్యలకు కూడా ఇది ప్రధాన కారణం. మద్యపానాన్ని ప్రోత్సహించే విధానాల కంటే దాన్ని నియంత్రించే విధానాలకే ప్రాధాన్యం ఇవ్వాలని డబ్లుహెచ్‌ఓ సూచిస్తోంది.

మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఎక్సైజ్ ఆదాయం ప్రభుత్వాలకు అత్యంత ముఖ్యం. దానితో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యయాలు నిర్వహిస్తున్నారు. అందువల్ల మద్యం విక్రయాలను పూర్తిగా తగ్గించే నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వాలకు సులభం కాదు. అయితే ఈ పరిస్థితి శాశ్వతం కాకూడదు. పరిశ్రమలు, సేవారంగం, పర్యాటకం, పెట్టుబడులు, మెరుగైన పన్ను వసూళ్ల ద్వారా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను అభివృద్ధి చేసి, మద్యం ఆదాయంపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించాల్సిన అవసరం ఉంది.

యార్లగడ్డ శ్రీధర్‌రావు

ALso Read:

18 నగర వనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

2026 హజ్ యాత్రికులకు రూ. లక్ష సబ్సిడీ విడుదల

Updated Date - Jul 02 , 2026 | 01:02 AM