ఏఐతో ముప్పు మన జ్ఞానానికి కాదు..!
ABN , Publish Date - Aug 18 , 2026 | 03:46 AM
మనిషికి ఒక గొప్ప చెత్త లక్షణం ఉంది. తను ఒకటి సృష్టిస్తాడు. దానికే భయపడతాడు. దాన్ని నిర్మూలించాలనుకుంటాడు. దానికే బానిసవుతాడు. మనిషిది విజయాల చరిత్ర కాదు. భయాల చరిత్ర. నిప్పును, యంత్రాన్ని...
మనిషికి ఒక గొప్ప చెత్త లక్షణం ఉంది. తను ఒకటి సృష్టిస్తాడు. దానికే భయపడతాడు. దాన్ని నిర్మూలించాలనుకుంటాడు. దానికే బానిసవుతాడు. మనిషిది విజయాల చరిత్ర కాదు. భయాల చరిత్ర. నిప్పును, యంత్రాన్ని, కరెంటును, టెలిఫోన్‌ను, కంప్యూటర్‌ను, మొబైల్ ఫోన్‌ను, రోబోను చూసి భయపడ్డాడు. ఇప్పుడు ఏఐని చూసి భయపడుతున్నాడు.
ప్రతి కొత్త ఆవిష్కరణ మనిషిని అనివార్యంగా అభద్రతలోకే నెట్టింది. ఇది వచ్చాక నేను ఏమవుతాను? అని ప్రతిసారీ మనిషి భయం. కానీ విచిత్రమేమిటంటే కొన్ని వేల సంవత్సరాలుగా ఆ ప్రశ్న పదే పదే అడుగుతూనే మనిషి ఇంకా అదే వలయంలో చిక్కుకున్నాడు. మారింది అతని పని, పనిముట్టు, వేగం, జీవన విధానం. కానీ మనిషి ఏ దశలోనూ ధ్వంసం కాలేదు. ముద్రణ యంత్రం, రైలు, విద్యుత్తు, ఫోటోగ్రఫీ, సినిమా, ఏటీఎం, ఇంటర్నెట్, గూగుల్, స్మార్ట్ ఫోన్, ఏఐ వరకూ ప్రతి దశలో అదే భయం.
ఏఐ గురించిన చాలా భయాలు మనకు వినపడుతున్నాయి. అయితే, అనవసరంగా తీవ్రంగా భయపడుతున్నారు. నిజంగా భయపడాల్సిన కోణం అది తాగుతున్న నీరు గురించి. ఏఐ నీటి వాడకం పర్యావరణానికి చేయబోతున్న ముప్పు గురించి. అది సర్వర్లను చల్లబరచడానికి తాగుతున్న నీళ్ల క్వాంటిటీ గురించి భయపడాలి. కొన్ని లక్షల టీఎంసీల నీరు ఏఐ తాగేస్తోందన్నది చాలామందికి తెలియని నిజం. ఆ నీళ్లు లేకుంటే ఏఐ సమాధానాలు చెప్పలేదన్నదీ నిజం. అయితే ఆ నీళ్ల వినియోగం వల్ల వచ్చే ముప్పు ఎంత, దానికి పరిష్కారం ఏమిటి?
నిజానికి ఏఐ నీటిని తాగడం సమస్యేనా? మనిషి తాగే నీటినే ఏఐకి ఇవ్వాల్సి వచ్చే విధంగా దాన్ని నిర్మిస్తే అది సమస్య కాదా? సముద్రంలోని ఉప్పు నీటిని ఈ చల్ల బరచడానికి వాడడం సాధ్యమా అనే విషయాల గురించి ఆలోచించాలి. తాగు నీరు కాకుండా, భూజలం కాకుండా ఏ నీటిని సర్వర్ల కోసం వాడాలి అనేది తెలుసుకోవల్సిందీ తేల్చాల్సిందీ మనిషే. సాంకేతికతకు దాహం ఉండదు. దాన్ని ఎక్కడ నిర్మించాలి, ఏ నీటితో చల్లబరచాలి, మనిషి అవసరానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి అనేది నిర్ణయించేది మనిషే. అంటే ఏఐ నుంచి వచ్చే ముప్పు కూడా చివరికి ఏఐ తెలివిలో కాదు, మనిషి తీసుకునే తెలివి తక్కువ నిర్ణయాల్లో ఉందనమాట!
ఇక ఏఐ గురించిన మనిషి ఇంకో భయం దాని జ్ఞానం. అయితే భయాన్ని జయించడం అంటే దాన్ని నాశనం చేయడం కాదు, అర్థం చేసుకోవడం. నిప్పు మనిషి మొదటి భయం, మొదటి స్నేహితుడు కూడా. మొదట దాన్నుంచి పారిపోయాడు. తర్వాత అర్థం చేసుకున్నాడు. చివరకు అదే నిప్పుతో ఆహారం వండుకున్నాడు, చలిని తరిమాడు, చీకటిని జయించాడు. చక్రం మనిషి కాళ్లకు సవాలుగా వచ్చింది. కానీ కాళ్లను నిరుపయోగం చేయలేదు. చేరలేని దూరాలకు తీసుకెళ్లింది. యంత్రానికి వేగం ఉండొచ్చు, గమ్యం మాత్రం మనిషిదే. పారిశ్రామిక విప్లవంతో యంత్రాలు వచ్చాక ఉద్యోగాలు పోతాయని కార్మికులు భయపడ్డారు. Luddites యంత్రాలను ధ్వంసం చేశారు. వారి భయం యంత్రాల మీద మాత్రమే కాదు. జీవనోపాధి కోల్పోతామన్న ఆందోళన మీద.
ఇప్పుడు ఏఐ విషయంలోనూ అదే ప్రశ్న– మా ఉద్యోగాలేమవుతాయి అని. చరిత్ర చెప్పేది మాత్రం స్పష్టం. కొన్ని పనులు పోతాయి, కొత్త పనులు పుడతాయి. ప్రొక్లెయిన్ వందమంది పని ఒక్క యంత్రంతో చేసింది. కానీ అదే యాంత్రీకరణ రోడ్లు, కాలువలు, ఆనకట్టలు, భారీ నిర్మాణాలను వేగవంతం చేసింది. యంత్రం మనిషిని అవమానించలేదు. అతని కఠిన శ్రమను తగ్గించింది. రాత వచ్చినప్పుడు జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని భయపడ్డారు. ఇప్పుడు గూగుల్, స్మార్ట్ ఫోన్, ఏఐ గురించి కూడా అదే భయం. వ్యంగ్యం ఏమిటంటే రాత జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుందని చెప్పిన మాట కూడా మనకు రాత ద్వారానే తెలిసింది. టెలిఫోన్ సంబంధాలను చంపుతుందని అనుకున్నాం. కానీ అది దూరాన్ని చంపింది. కంప్యూటర్ ఉద్యోగాలను మింగేస్తుందని భయపడ్డాం. కొన్ని ఉద్యోగాలు తగ్గాయి, కానీ సాఫ్ట్‌వేర్, డేటా, డిజిటల్ వ్యాపారాల వంటి కొత్త ప్రపంచాలు పుట్టాయి. ప్రతి కొత్త సాంకేతికత ముందూ మనిషి మొదట భయపడ్డాడు. తర్వాత దాన్ని అర్థం చేసుకున్నాడు. చివరకు తన సాధనంగా మార్చుకున్నాడు. ఏఐ కూడా ఆ చరిత్రలో మరో అధ్యాయం మాత్రమే.
ఏఐ ఇప్పుడు మన ముందున్న కొత్త భయం. ఇది పాత వస్తువుల కంటే కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. ఎందుకంటే పాత యంత్రాలు ప్రధానంగా మనిషి శరీరానికి పోటీ. ఏఐ మాత్రం మనిషి మెదడుకు పోటీ. ఇది మనిషికి కొత్త అనుభవం. అందుకే ఎక్కువ భయం. ఏఐ రచన చేస్తోంది. బొమ్మ గీస్తోంది. సంగీతం స్వరపరుస్తోంది. కోడ్ రాస్తోంది. భాషలు అనువదిస్తోంది. రోగ నిర్ధారణలో సహాయపడుతోంది. డేటాను విశ్లేషిస్తోంది. మనిషితో సంభాషిస్తోంది. అందుకే ఈసారి ప్రశ్న మరింత భయపెట్టేదిగా ఉంది. యంత్రం ఆలోచించగలిగితే మనిషి ఎందుకు? అనేది తాజా ప్రశ్న. అయితే తెలివి ఒక్కటే మనిషిని మనిషిగా చేయలేదు. ఏఐ సమాధానం తెలుసుకుంటుంది. మనిషికి ప్రశ్న తడుతుంది.
ఒక ఏఐ లక్షల పుస్తకాల్లోని సమాచారాన్ని ప్రాసెస్ చేయగలదు. కానీ నేను ఎవరు అని మొదట అడిగింది యంత్రం కాదు, మనిషి. నక్షత్రాలను లెక్కపెట్టే కంప్యూటర్ ఉండొచ్చు. కానీ రాత్రి ఆకాశాన్ని చూసి అక్కడ ఇంకెవరైనా ఉన్నారా? అని ఆశ్చర్యపోయింది మనిషి. ఏఐ చెత్తదో డొక్కుదో ప్రేమ కవిత రాయగలదు. కానీ ప్రేమించిన మనిషి కోసం రాత్రంతా నిద్రపోకుండా ఎదురుచూడదు. విరహగీతం తయారు చేయగలదు. విరహాన్ని అనుభవించదు. సమాచారం అనుభవం కాదు. లెక్కించడం జీవించడం కాదు. సమాధానం చెప్పడం జ్ఞానం కాదు. మరి ఈ కోణంలో ఏఐ ప్రమాదం కాదా? అంటే కాదనలేం. ఏఐతో ఉద్యోగాలు మారవచ్చు. కొన్ని ఉద్యోగాలు తగ్గవచ్చు. నకిలీ సమాచారం, మోసాలు, పర్యవేక్షణ, అధికార కేంద్రీకరణ, సృజనాత్మక హక్కులు వంటి తీవ్రమైన సమస్యలు రావచ్చు. అందువల్ల ఏఐ గురించి ప్రశ్నించాలి. చట్టాలు కావాలి. నైతిక పరిమితులు కావాలి. నియంత్రణ కావాలి. కానీ భయం వల్ల దాన్ని తిరస్కరించడం పరిష్కారం కాదు.
ఒకప్పుడు యంత్రాలను పగలగొట్టడం వల్ల పారిశ్రామిక విప్లవం ఆగలేదు. ఏఐని తిడితే ఏఐ ఆగదు. దాన్ని అర్థం చేసుకోవాలి. దాని మీద అధికారం ఎవరిదో ప్రశ్నించాలి. దాని ప్రయోజనాలు కొద్దిమంది కంపెనీలకే కాక సమాజానికి ఎలా అందాలో నిర్ణయించాలి. మనిషి పని పోకుండా మాత్రమే కాదు, మనిషి గౌరవం పోకుండా చూసుకోవాలి. ఎందుకంటే యంత్రానికి ఒక పరిమితి ఉంది. ప్రొక్లెయిన్ కొండను తవ్వగలదు. కానీ ఆ కొండను తవ్వాలా వద్దా అని నిర్ణయించాల్సింది మనిషే. కంప్యూటర్ కోట్ల లెక్కలు చేయగలదు. కానీ ఏ లెక్క న్యాయమైనదో నిర్ణయించాల్సింది మనిషే. రోబో తుపాకీ పేల్చగలదు. కానీ ఎవరి మీద తుపాకీ ఎత్తకూడదో చెప్పాల్సింది మనిషే. ఏఐ ఒక తీర్పుకు అవసరమైన సమాచారాన్ని విశ్లేషించగలదు. కానీ న్యాయం అంటే ఏమిటి? అనే ప్రశ్నకు సమాజం సమాధానం చెప్పాలి. ఇక్కడే మనిషి ఆధిక్యం ఉంది. అది ఐక్యూలో కాదు. వేగంలో కాదు. జ్ఞాపకశక్తిలో కాదు. లెక్కల్లో కాదు. విలువలను సృష్టించగలగడంలో ఉంది.
అందుకే ఏఐ యుగంలో మనిషి అడగాల్సిన ప్రశ్న ‘ఏఐ మనిషిని మించిపోతుందా?’ అని కాదు. ఏఐని ఉపయోగించి మనల్ని మనం ఎంత మెరుగుపరుచుకుంటాం? అన్నది. ఎందుకంటే నిప్పు గొప్పది కాదు. దాన్ని అదుపులోకి తెచ్చిన మనిషి గొప్పవాడు. చక్రం గొప్పది కాదు. దానికి గమ్యం ఇచ్చిన మనిషి గొప్పవాడు. యంత్రం గొప్పది కాదు. దానికి పని చెప్పిన మనిషి గొప్పవాడు. కంప్యూటర్ గొప్పది కాదు. దానికి భాష నేర్పిన మనిషి గొప్పవాడు. ఏఐ శ్రీశ్రీని తయారు చేయలేదు, డావిన్సీని పుట్టించలేదు. మనిషి కంటే తెలివైన యంత్రం ఉంటుంది, మనిషి కంటే గొప్ప యంత్రం ఉండదు. తన తెలివిలోంచి తనకే పోటీ అయ్యే మరో తెలివిని సృష్టించగలిగిన మనిషే గొప్పవాడు.
బహుశా మానవ నాగరికత మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే ‘మనిషి ప్రతి కొత్త శక్తిని చూసి మొదట భయపడ్డాడు. తర్వాత దాన్ని తన పనిముట్టుగా మార్చుకున్నాడు’ అని చెప్పాలేమో. ఏఐ విషయంలోనూ జరగాల్సింది అదే. ఏఐ మనిషికి ప్రత్యామ్నాయం కావాల్సిన అవసరం లేదు. అది మనిషి చేతిలో మరో పరికరం కావచ్చు. ఎందుకంటే యంత్రానికి తెలివి, వేగం, జ్ఞాపకశక్తి, భాష ఇవ్వగలం. కానీ మనిషి దగ్గర ఉన్న ఒక అత్యంత విలువైన విషయం యంత్రానికి ఇవ్వడం అంత సులభం కాదు. ‘నేను ఏం చేయాలి?’ అని తనను తాను ప్రశ్నించుకునే నైతిక చైతన్యం మాత్రం ఇవ్వలేం. ఆ ప్రశ్న ఉన్నంతకాలం మనిషి అవసరం తీరదు. మనిషి కథ ముగియదు. మరో కొత్త సాంకేతికత వస్తుంది. మనిషి మళ్లీ భయపడతాడు. కొంతకాలం దాన్ని తిడతాడు. తర్వాత దాన్ని అర్థం చేసుకుంటాడు. చివరకు దానితోనే చేయి కలిపి ‘సరే... ఇప్పుడు మనం మనం భాయి భాయి’ అంటాడు. అక్కడి నుంచి నాగరికత మరో అడుగు ముందుకు వేస్తుంది. అయినా అప్పుడూ ఇంకో కొత్త భయం సిద్ధంగానే ఉంటుంది.
ప్రసేన్
ఇవి కూడా చదవండి
పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి
స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా