Share News

ఏఐతో వి‘చిత్ర’ విన్యాసాలు!

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:31 AM

సినిమా ఒక అద్భుత దృశ్యం. గత వందేళ్లలో మనం కెమెరా రీళ్ల నుంచి డిజిటల్ సెన్సార్ల వరకు ఎన్నో మార్పులు చూశాం. అయితే, ఇప్పుడు మనం చూస్తున్న మార్పు కేవలం పరికరాలకు సంబంధించింది కాదు...

ఏఐతో వి‘చిత్ర’ విన్యాసాలు!

సినిమా ఒక అద్భుత దృశ్యం. గత వందేళ్లలో మనం కెమెరా రీళ్ల నుంచి డిజిటల్ సెన్సార్ల వరకు ఎన్నో మార్పులు చూశాం. అయితే, ఇప్పుడు మనం చూస్తున్న మార్పు కేవలం పరికరాలకు సంబంధించింది కాదు; ఇది సినిమా సృష్టి మూలాలనే కదిలిస్తోంది. ఒకప్పుడు వేలమంది శ్రమతో, భారీ బడ్జెట్‌తో సాధ్యమయ్యే దృశ్యాలు నేడు కేవలం ఒక ‘ప్రాంప్ట్’తో కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. కెమెరాల అవసరం లేని, కేవలం కంప్యూటేషనల్ ఆల్గారిథమ్స్ ఆధారంగా నడిచే సింథటిక్ సినిమా యుగంలోకి ప్రవేశించాం. ఇది సాంకేతిక విప్లవమే కాదు, కథలు చెప్పే విధానంలో రాబోయే ఒక చరిత్రాత్మక మలుపు.

సీడాన్స్‌, గూగుల్‌ వ్యోమ్‌ వంటి అనేక ప్లాట్‌ఫామ్‌లు సినిమా నిర్మాణాన్ని డెస్క్‌టాప్ స్థాయికి తీసుకొచ్చాయి. ఒక చిన్న ప్రాంప్ట్‌ ఇస్తే కథ రాయడమే కాక, దానికి కావాల్సిన మల్టీ–వర్స్‌ సెట్టింగ్స్, గెలాక్సీలు, గ్రహాల మధ్య యుద్ధాలనూ ఏఐ సృష్టిస్తోంది. ఈ తరహా ఇంజన్లు వీడియోనే కాకుండా, ఆ దృశ్యానికి కావాల్సిన లైటింగ్, డెప్త్, కెమెరా యాంగిల్స్ కూడా స్వయంగా సెట్ చేస్తున్నాయి. ఫలితంగా, దర్శకుడి సృజనాత్మకతకు బడ్జెట్‌తోనూ, ఇతరత్రా భౌతిక పరిమితులతో ఇక పని లేదు.

పోస్ట్ ప్రొడక్షన్ రంగంలో ఏఐ ప్రభావం ఊహాతీతం. గతంలో భారీ వీఎఫ్‌ఎక్స్‌ బడ్జెట్‌తో, వందలాది మంది టెక్నీషియన్లతో చేసే పనులు ఇప్పుడు సింగిల్ ప్రాంప్ట్‌తో పూర్తి చేస్తున్నారు. నటుడి వయసు తగ్గించడం నుంచి సాధారణ లొకేషన్‌ను డిజిటల్‌గా అత్యంత ఖరీదైన సెట్‌గా మార్చడం వరకూ అన్నీ సులభం. కలర్‌ గ్రేడింగ్‌ నుంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వరకు ప్రతి దశలోనూ ఏఐ తన మార్కు చూపిస్తోంది. డిజిటల్ డబుల్స్ రాకతో ప్రొడక్షన్ వ్యయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. నటుడి 3డీ స్కాన్ ఉంటే చాలు, అతను షూటింగ్ సెట్‌కు రాకపోయినా ఆ డిజిటల్ ప్రతిరూపంతో సీన్లు తెరకెక్కించవచ్చు. దీనివల్ల ప్రొడక్షన్ క్రూ, ట్రావెల్, అవుట్ డోర్ షూట్స్ ఖర్చులు 80 శాతం వరకు తగ్గుతాయట. నటులు వృద్ధాప్యం చెందినా లేక భౌతికంగా మన మధ్య లేకపోయినా, వారి కళను వెండితెరపై పునర్నిర్మించే అద్భుత శక్తి ఏఐకి ఉంది.


ఏఐ తీసుకొస్తున్న అతిపెద్ద మార్పు ఏమిటంటే– సినిమా నిర్మాణాన్ని సామాన్యుడికి చేరువ చేయడం. ఒక మారుమూల గ్రామంలో ఉండి అద్భుతమైన ఊహలున్న రచయిత, తన వద్ద కెమెరా లేకపోయినా, ప్రపంచస్థాయి విజువల్స్ ఉన్న సినిమాను నిర్మించగల అవకాశం దీనితో కలిగింది. గతంలోలాగా సినిమా నిర్మాణానికి భారీ స్టూడియోలు, బలమైన నెట్‌వర్క్ అవసరం లేకుండా, ఒక ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ సాయంతో ఎవరైనా నిర్మాతగా మారవచ్చు. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్‌కు ఇదొక వరం.

ప్రపంచవ్యాప్తంగా అనేక ఏఐ ఆధారిత చిత్రాలు విడుదలై సంచలనం సృష్టిస్తున్నాయి. పూర్తిగా వర్చువల్ ఎన్విరాన్‌మెంట్‌లో తయారైన ఈ చిత్రాలు అద్భుతమైన అనుభూతిని ఇస్తున్నాయి. పురాణాలను ప్రదర్శించాలన్నా, చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించాలన్నా బడ్జెట్ ఒక అడ్డంకి కాదు. ఇంటర్ ప్లానెటరీ సెట్టింగ్స్, ఇతర గెలాక్సీలను సృష్టించడంలో ప్రాంప్ట్ ఆధారిత సినిమా ఇంజన్లు మానవ మేధస్సుకు మించి పనిచేస్తున్నాయి. గతంలో ఒక చారిత్రక యుద్ధాన్ని చూపించడానికి వేలమంది జూనియర్ ఆర్టిస్టులు అవసరమయ్యేవారు. కానీ ఇప్పుడు కేవలం ఒక్క నిమిషం ప్రాంప్టింగ్‌తో కొన్ని లక్షలమంది సైనికులతో కూడిన సన్నివేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించవచ్చు. దీనివల్ల నిర్మాణ వ్యయమే కాదు, సమయమూ ఆదా అవుతుంది. ఏఐ విప్లవంతో సినిమారంగంలో భాషాపరమైన అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. డబ్బింగ్ అవసరం లేకుండానే.. ఒక భాషలోని నటుడి గొంతును, లిప్ సింక్‌ను మరో భాషలోకి ఏఐతో అత్యంత సహజంగా మార్చవచ్చు. దీనివల్ల ప్రాంతీయ సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు సులభంగా చేరువవుతాయి. తెలుగు సినిమా అంతర్జాతీయంగా తన ఉనికిని చాటుకోవడానికి ఇదొక గొప్ప మార్గం అవుతుంది.

సినిమా మేకింగ్‌లోనే కాకుండా, ప్రేక్షకులు సినిమా చూసే విధానంలో కూడా ఏఐ విప్లవం రాబోతోంది. త్వరలో ‘పర్సనలైజ్డ్ సినిమాలు’ కూడా వచ్చే అవకాశముంది. అంటే, ఒకే సినిమాను వేర్వేరు ప్రేక్షకులు వారి అభిరుచులకు తగ్గట్టుగా భిన్నమైన ముగింపులతో, విభిన్నమైన విజువల్స్‌తో చూడవచ్చు. సినిమా థియేటర్లలో కూడా ఏఐ ఇంటరాక్టివ్ ఎక్స్‌పీరియన్స్ మనల్ని కథలో ఒక భాగంగా మారుస్తుంది.


ఇదంతా నాణేనికి ఒకవైపే. ఏఐ విప్లవంతో నైతికతకు సంబంధించిన పలు అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. డీప్‌ఫేక్ టెక్నాలజీ సృష్టిస్తున్న సింథటిక్ మీడియా ప్రేక్షకుల నమ్మకాన్ని సవాల్‌ చేస్తోంది. నటుల అనుమతి లేకుండా వారి ముఖాలను, గొంతులను వాడటం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. సినిమాటోగ్రాఫర్లు, టెక్నీషియన్లు ఉపాధి కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో సినిమా రంగం నిలబడాలంటే, ఏఐ వాడకంపై కచ్చితమైన చట్టాలు, నైతిక నియమావళి అవసరం. అయితే– సినిమా రంగాన్ని ఏఐ పూర్తిగా రీప్లేస్ చేస్తుందా? ఆ కళాత్మక ఆత్మను రీప్లేస్ చేయడం అసాధ్యం. కళ అంటే కేవలం దృశ్యం కాదు, అది మనిషి భావోద్వేగాల కలబోత. ఏఐ అద్భుతమైన విజువల్స్ ఇవ్వగలదు కానీ, మనిషి ఇచ్చే హృదయపూర్వకమైన అనుభూతిని అందించలేదు. అందువల్ల, భవిష్యత్తులో మనం ‘హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్’ను చూడబోతున్నాం. మనిషి విజన్‌కు, ఏఐ వేగం తోడై అద్భుతాలు ఆవిష్కృతం కానున్నాయి. సాంకేతికత ఎంత ఎదిగినా, ఆఖరికి కథ చెప్పేది మనిషే కదా. టెక్నాలజీ మన ఊహలను తెరపైకి తెచ్చే ఒక వాహనం మాత్రమే. అది సేవకుడిలా ఉండాలి తప్ప యజమానిలా మారకూడదు.

డా. కట్కూరి

సైబర్ లా నిపుణులు

ఈ వార్తలనూ చదవండి:

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 05 , 2026 | 12:31 AM