మనసులను శాసించే స్థాయికి ఏఐ చేరితే..?
ABN , Publish Date - Oct 15 , 2026 | 01:47 AM
మానవ చరిత్రలో ఎన్నడూ లేనంతగా నేడు ప్రపంచం సాంకేతికత ద్వారా అనుసంధానమైంది. చేతిలోని స్మార్ట్‌ఫోన్‌తో ప్రపంచంలో ఎక్కడి వ్యక్తితోనైనా క్షణాల్లో మాట్లాడవచ్చు. కానీ విచిత్రమేమిటంటే...
మానవ చరిత్రలో ఎన్నడూ లేనంతగా నేడు ప్రపంచం సాంకేతికత ద్వారా అనుసంధానమైంది. చేతిలోని స్మార్ట్‌ఫోన్‌తో ప్రపంచంలో ఎక్కడి వ్యక్తితోనైనా క్షణాల్లో మాట్లాడవచ్చు. కానీ విచిత్రమేమిటంటే, ఇదే కాలంలో డిజిటల్ అనుసంధానాల మధ్య ఒంటరితనం కూడా పెరుగుతోంది. ఈ మానసిక శూన్యతను ఆసరాగా చేసుకుని ఓ కొత్త సాన్నిహిత్యం ముందుకొస్తోంది. అదే ఏఐ సహచరి (AI Companion). ఈ సహచరి మనిషి ఒంటరితనానికి పరిష్కారమా, లేక మనిషికి మనిషి అవసరాన్ని క్రమంగా తగ్గించే కొత్త బంధమా?
ఏ ఇద్దరి మధ్య బంధమైనా నిలవాలంటే ఓపిక, త్యాగం, సర్దుబాటు అవసరం. మన ఆలోచనలు ఎదుటివారి ముందు ఉంచడం, వారి అభిప్రాయాలతో విభేదిస్తూనే వారిని అర్థం చేసుకోవడం– ఇదే మానవ సంబంధాల ప్రాథమిక సూత్రం. ఇక్కడ కోపాలు, అసంతృప్తులు, ఘర్షణలు, సంతోషాలు అన్నీ ఉంటాయి. కానీ ఈ చాట్బాట్లు అందించే ‘కల్పిత ప్రేమ’లో ఈ కష్టాలు కనిపించవు. అది మిమ్మల్ని ప్రశ్నించదు. మీ తప్పులను వేలెత్తి చూపదు. మీరు ఎప్పుడు పిలిచినా ‘నేను నీ కోసమే’ అన్నట్టు స్పందిస్తుంది. ఇంట్లో వాళ్లకు చెప్పలేని మాటను, స్నేహితుడితో పంచుకోలేని బాధను కొందరు చాట్‌బాట్‌తో చెప్పుకుంటున్నారు. ఈ సాన్నిహిత్యం ఇప్పుడు మాటలకే పరిమితం కాలేదు. Character.AIపై 2026లో జరిగిన ఒక అధ్యయనంలో, పరిశీలించిన దాదాపు 1500 ప్రముఖ చాట్బాట్లలో 63శాతం రొమాంటిక్ సంభాషణల కోసం రూపొందించినట్టు తేలింది. కొన్ని బాయ్‌ఫ్రెండ్, భర్త, ప్రేమికుడి వంటి పాత్రలను కూడా అనుకరిస్తున్నాయి. మనిషి కోరుకునే సాన్నిహిత్యం కూడా క్రమంగా ఒక డిజిటల్ సేవగా మారుతోంది. అది మన భావాలకు అనుగుణంగా స్పందిస్తుంది. మన అభిప్రాయాన్ని మెచ్చుకోవడం, మన మాటకు అంగీకారం తెలపడం వంటి ప్రవర్తనను పరిశోధకులు ‘ఏఐ సైకోఫాన్సీ’ (ముఖస్తుతి)గా పేర్కొంటున్నారు. స్టాన్‌ఫర్డ్–కార్నెగీ మెలన్ పరిశోధకుల అధ్యయనంలో 11 ప్రముఖ ఏఐ మోడళ్లు మనుషుల కంటే సగటున 49శాతం ఎక్కువగా తమను వాడేవారి చర్యలను సమర్థించాయి. ఇలాంటి చాట్‌బాట్‌తో సంభాషించిన తర్వాత ఆ మనుషుల్లో తమ ప్రవర్తనే సరైనదన్న నమ్మకం పెరగడం, తప్పును అంగీకరించి సంబంధాన్ని చక్కదిద్దుకునే ఆసక్తి తగ్గింది. మనుషులు సహజంగా ప్రవర్తించే తీరు కూడా ఇలాగే ఉంటుంది. ఎవరు మనల్ని ఎప్పుడూ ‘నువ్వు కరెక్టే’ అని చెప్తారో, వారి దగ్గరకే మనం వెళ్తాం. అప్పుడు అసలు ప్రశ్న– మనకు కావాల్సింది మనతో ఎప్పుడూ ఏకీభవించే తోడా? లేక విభేదించినా మన శ్రేయస్సు కోరే మనిషా?
ఫ్లోరిడాలో పద్నాలుగేళ్ల బాలుడు ఒక చాట్‌బాట్‌తో తీవ్ర భావోద్వేగ అనుబంధం పెంచుకున్న తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తల్లి దాఖలు చేసిన కేసులో చాట్‌బాట్ పాత్రపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆత్మహత్యకు చాట్‌బాట్‌నే కారణమని నిర్ధారించడం సాధ్యం కాలేదు. కానీ ఈ ఘటన కృత్రిమ తోడు ఒక పిల్లవాడి జీవితంలో ఎంత లోతుగా ప్రవేశించగలదో చూపించింది.
బ్రిటిష్ కొలంబియా పరిశోధకుల 12 నెలల అధ్యయనంలో 2 వేల మందికి పైగా పెద్దలను పరిశీలిస్తే, ఒంటరితనం అనుభవించేవారు చాట్బాట్ల వైపు మొగ్గుచూపడం కనిపించింది. మరో అధ్యయనంలో చాట్‌బాట్ వినియోగం తర్వాత ఒంటరితనం పెరిగినట్లు సంకేతాలు కనిపించినా, విస్తృత సామాజిక అనుబంధం తగ్గిందని మాత్రం నిర్ధారించలేకపోయారు.
మనుషుల ఒంటరితనం ఇప్పుడు క్రమంగా ఒక మార్కెట్‌గా మారుతోంది. వినియోగదారుడికి నచ్చే స్పందనే నమ్మదగినదిగా అనిపిస్తే, తక్షణ సంతృప్తిని పెంచే ఈ లక్షణమే దీర్ఘకాలంలో సమస్యగా మారొచ్చు. కంపెనీకి వినియోగదారుడు సంతోషంగా ఉండటం వ్యాపార ప్రయోజనం. కానీ ఆ సంతోషం అతన్ని మరింతగా దీనిపై ఆధారపడేలా చేస్తే, తక్షణ సంతృప్తికి, దీర్ఘకాలిక శ్రేయస్సుకు మధ్య సంఘర్షణ మొదలవుతుంది. యూజర్లు తమ భయాలు, బలహీనతలు, భావోద్వేగాలను ఈ ఏఐ వ్యవస్థలతో పంచుకున్నప్పుడు, అవి డేటాగా మారే అవకాశం ఉంది. మనిషి ఒంటరితనం వ్యాపార అవకాశంగా మారినప్పుడు, అతని భావోద్వేగాలు డేటా పాయింట్లుగా, అతను కేవలం ‘వినియోగదారుడి’గా మిగిలిపోతే– అప్పుడు ఆ సాన్నిహిత్యం ఎవరి కోసం?
చైనా 2026 జూలై 15 నుంచి మానవ సంబంధాలను అనుకరించే ఏఐ సేవలకు కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. వినియోగదారులు ఏఐపై అతిగా భావోద్వేగంగా ఆధారపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వినియోగం వ్యసనంగా మారే పరిస్థితుల్లో హెచ్చరికలు ఇవ్వాలని ఈ నిబంధనలు చెబుతున్నాయి. ఏఐ మానసిక ఆరోగ్యానికి సహాయకంగాను, నిపుణుల సాయం దొరకని సందర్భాల్లో తోడుగాను, వృద్ధుల ఒంటరితనాన్ని తగ్గించే సాధనంగాను ఉపయోగపడవచ్చు. కానీ అది మానవ సంబంధాలకు ప్రత్యామ్నాయం కాదు. ఇప్పుడిక ఏఐని నిషేధించడం సాధ్యం కాదు, ఆ అవసరం కూడా లేదు. అయితే మనుషులు ఏఐపై ఆధారపడటాన్ని మాత్రం అర్థం చేసుకోవడం ముఖ్యం. పిల్లలకు, యువతకు డిజిటల్ లిటరసీతో పాటు ‘రిలేషన్షిప్ లిటరసీ’ కూడా నేర్పించాలి. అంటే ఘర్షణ, విభేదాలను ఎదుర్కోవడం నేర్పే నైపుణ్యం. అవతలి వ్యక్తి మాటను ఆగ్రహించకుండా వినడం, మన తప్పును ఒప్పుకోవడం, తిరస్కరణను తట్టుకోవడం, సర్దుబాటు చేసుకోవడం... ఇవన్నీ అందులో భాగమే.
సాంకేతికత ఎంత వేగంగా విస్తరించినా, స్పర్శలోని వెచ్చదనాన్ని, ఒకరి కళ్లలో చూసి చెప్పే ఓదార్పును, కష్టసుఖాల్లో తోడుండే నిజమైన మనుషులను ఏ కృత్రిమ మేధా ఇవ్వలేదు. యంత్రాలు మన పనులను సులభతరం చేయడానికి ఉపయోగపడాలి గానీ, మన మనసులను శాసించే స్థాయికి చేరకూడదు. మనిషికి యంత్రం అవసరం కావచ్చు. కానీ మనిషికి మనిషి అవసరాన్ని యంత్రం భర్తీ చేయకూడదు.
వంగవోలు రవి
ఈ వార్తలూ చదవండి
రేపటి నుంచే విజయవాడ ‘సరస్ మేళా’.. పనులను పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని
క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్
అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో