Share News

వయసా, సమర్థతా?

ABN , Publish Date - May 02 , 2026 | 12:35 AM

ప్రజాస్వామ్యంలో నాయకత్వానికి అర్హత ఏమిటి? వయస్సా లేక సామర్థ్యమా? ఈ ప్రశ్న మళ్లీ మళ్లీ ముందుకు వస్తోంది. ముఖ్యంగా 70 ఏళ్లు దాటిన వారు ఎన్నికల్లో పోటీ...

వయసా, సమర్థతా?

ప్రజాస్వామ్యంలో నాయకత్వానికి అర్హత ఏమిటి? వయస్సా లేక సామర్థ్యమా? ఈ ప్రశ్న మళ్లీ మళ్లీ ముందుకు వస్తోంది. ముఖ్యంగా 70 ఏళ్లు దాటిన వారు ఎన్నికల్లో పోటీ చేయకూడదనే అభిప్రాయం కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. కానీ ఇండియా మొదలుకొని అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ వంటి దేశాల వరకు ఎక్కడా ఎన్నికల్లో పోటీ చేయడానికి గరిష్ట వయో పరిమితి లేదు. ప్రజాస్వామ్య సూత్రం ప్రకారం ‘ఎవరు పోటీ చేయాలి?’ అన్నది చట్టం నిర్ణయించదు; ప్రజలే నిర్ణయిస్తారు. కనిష్ఠ వయస్సు మాత్రం ఉంటుంది, ఎందుకంటే అది బాధ్యతను అర్థం చేసుకునే వయస్సు.

అయితే, వృద్ధ నాయకుల సామర్థ్యంపై చర్చకు కారణాలు ఉన్నాయి. అనుభవం అనే అస్త్రం వారికుంది. ఎన్నో దశాబ్దాల రాజకీయ పరిజ్ఞానం, నిర్ణయాల్లో స్థిరత్వం, సంక్షోభాల్లో సమతుల్యత... ఇవన్నీ వయస్సుతో వస్తాయి. జో బైడెన్‌ 80 ఏళ్లు దాటినా అమెరికాను నడిపించగలిగారు. నరేంద్ర మోదీ 70 దాటినా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మలేసియాలో ఎక్కువ కాలం సేవలందించిన ప్రధాని మహాతిర్ బిన్ మొహమ్మద్. 90 దాటిన వయస్సులో కూడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించిన సంఘటన. వయస్సు పెరిగినా నాయకత్వ సామర్థ్యం ఉండొచ్చు కానీ, అదే సమయంలో ఆరోగ్యం, సమకాలీన ఆలోచనలపై అవగాహన కూడా అవసరం అని మహాతిర్ నిరూపించారు.

ఇంకోవైపు, వయస్సుతో వచ్చే పరిమితులు కూడా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు, వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంతో అనుసంధానం కష్టతరం కావడం, యువత సమస్యలపై దూరం పెరగడం వంటి అంశాలు పాలనపై ప్రభావం చూపవచ్చు. ఈ నేపథ్యంలో ‘వయస్సు పరిమితి అవసరమా?’ అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కానీ వయస్సుకు గీతలు వేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఎందుకంటే, ఓటు హక్కు ఉన్న ప్రజలే తమ నాయకుడిని ఎంచుకోవాలి. ఒకవేళ వృద్ధ నాయకుడు పనికిరాడని ప్రజలు భావిస్తే, ఎన్నికలే అతనికి సమాధానం చెబుతాయి. చట్టం ముందుగానే తలుపులు మూయాల్సిన అవసరం ఏముంది?


అందుకే ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్య స్థితి వెల్లడించడం తప్పనిసరి చేయడం, పార్టీల్లో యువతకు అవకాశాలు పెంచడం, పదవీకాల పరిమితులు అమలు చేయడం వంటి మార్గాలు ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తాయి. ఇవి వయస్సు ఆధారంగా వివక్షను తగ్గించడమే కాకుండా, సమర్థ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాయి. మొత్తానికి, ‘70 దాటిన వారు రాజకీయాలకు అనర్హులు’ అనడం ఎంత తప్పో, ‘వయస్సు అసలు అంశమే కాదు’ అనడం కూడా అంతే అసంపూర్ణం.

– శ్యాంమోహన్

ఇవి కూడా చదవండి..

మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు

భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌‌ను తోసిపుచ్చిన ఈసీ

Updated Date - May 02 , 2026 | 12:35 AM