యుద్ధం మధ్యలో నువ్వు, నేను, మనందరం!
ABN , Publish Date - May 18 , 2026 | 06:07 AM
యుద్ధంలో వెనుకడుగువేయడం పిరికివాళ్ళ లక్షణమనీ, యుద్ధాన్ని పోరాడి గెలవాలనీ అంటారు. మరి యుద్ధం మనతో మనకే అయితే! మనిషికీ, మనసుకీ జరిగే ఘర్షణ మధ్య మనిషి ఎటుపోవాలి, దేనితో యుద్ధం చేయాలి...
యుద్ధంలో వెనుకడుగువేయడం పిరికివాళ్ళ లక్షణమనీ, యుద్ధాన్ని పోరాడి గెలవాలనీ అంటారు. మరి యుద్ధం మనతో మనకే అయితే! మనిషికీ, మనసుకీ జరిగే ఘర్షణ మధ్య మనిషి ఎటుపోవాలి, దేనితో యుద్ధం చేయాలి? అదిగో సరిగ్గా అలాంటి యుద్ధ భూమిలోనే నేడు నువ్వు, నేను, వాళ్ళు, వీళ్ళు అందరం చిక్కుబడి ఉన్నాం అంటారు కవి అఫ్సర్. యుద్ధం ఎక్కడో జరుగుతోంది, మనమిక్కడ శాంతిగా ఉన్నాం.. అనుకుంటూ భ్రమల్లో బతుకుతూ, కళ్ళ ముందు రగులుతున్న మంటలను చూస్తూ కూడా నిద్రని నటిస్తూ, శాంతిని కల కంటున్నాం అనుకుంటూ, రణరంగంలాంటి మనసుతో ఎటువైపు అడుగేయాలో తెలియక అనుక్షణం మనిషి తనతో తానే ఘర్షణ పడుతున్నాడు; కార్చిచ్చు లాంటి ఆ మంటలు మన కాళ్ళ కింది నేల మీదికి వచ్చేలోగా మత్తులాంటి నిద్ర నుంచి మేలు కోవాలి అని హెచ్చరిస్తున్నాడు కవి ఇక్కడ.
అఫ్సర్ ఆంగ్లంలో రాసిన ‘Fasting Hymns’ను ‘ఉపవాస పద్యాలు’ పేరుతో తెలుగులోకి శ్రీనివాస్ గౌడ్ అనువదించారు. ఆ పద్యాల్లో ఓ చోట ‘‘ఇఫ్తార్ లేదా సహార్ ఏదో ఒక విందులో పళ్ళెం చేతులోకి తీసుకుని ఓ ఖర్జుర పండుని నోట్లో పెట్టుకోబోతాను. ఆ క్షణంలోనే యుద్ధ శరణార్థ శిబిరాల్లో అవయవాలు తెగి, నెత్తుటి గాయాలతో ఆర్తనాదాలు చేసే వేలమందో, వందలమందో తిన్నారో లేదో అనిపిస్తుంది. కన్నవాళ్ళను కోల్పోయి అనాథలైన ఎంతమంది చిన్నారులు ఆకలికి అలమటిస్తున్నారో అని తలపుకు వస్తే చాలు, నోట్లో పెట్టుకున్న ఖర్జుర పండు చేదుగా అనిపిస్తుంది’’ అంటారు. పుట్టిన గడ్డ మీద కూడా పరాయితనాన్ని అంటగట్టే ఆటవిక శక్తులతో నిరంతరం పోరాడాల్సిందే అంటారు. ఆ ఆవేదనకు కొనసాగింపుగా ఈ ‘యుద్ధం మధ్యలో నువ్వు’ అనే శీర్షికతో వచ్చిన కవిత్వ సంపుటిలో– నేటి యుద్ధం మనుషుల మధ్యనే కాదు, ఇప్పుడు మనిషి బతికి బట్టకట్టాలంటే చాల రకాల యుద్ధాలు చేయాలి, కంటికి కనిపించని అరాచక శక్తులతో కూడా పోరాటం జరపాల్సిందే అంటారు.
మరికొన్ని కవితల్లా అనిపించనివి ఉన్నాయి. మనస్సనే యుద్ధ భూమిలో అప్పటికప్పుడు అనుభవించిన సంవేదనలకు అక్షర రూపం కల్పించి చిత్తశాంతిని పొందడానికి ఈ కవితలు రాశారు అనిపిస్తుంది. వచనాలు పేరాగ్రాఫ్ శైలిలో మనల్ని పలకరిస్తాయి. కొమ్మా రెమ్మా కదలని ఓ నిశ్శబ్ద వేసవి మధ్యాహ్నమో, రెప్పవాలని నిశిరాత్రో హృదయాన్ని మెలితిప్పిన ఏ సంఘటనకో మనసులో ఉత్పన్నం అయిన ఏ వేదనకో వచనాక్షరాలు తోడై తెల్లటి పుస్తక క్షేత్రంలో నల్లటి అక్షర విత్తనాలను చల్లుకుంటూ పోయే అక్షర కృషీవలుడు ఈ ‘యుద్ధం మధ్యలో నువ్వు’ సంపుటిలో కనిపిస్తాడు. ఈ సంపుటిలో మనం మూడు విభాగాల్లో కవితల్ని దర్శించవచ్చు. మొదటి విభాగాన్ని ‘కత్తి అంచు మీద నిలబడి’, రెండో విభాగాన్ని ‘ఆరు కాలాలు మాయమైన చోట’, మూడో విభాగాన్ని ‘పంజరాల్ని ఓడించినప్పుడు’ అనే శీర్షికలతో రాశారు.
‘‘Being a good friend means listening... ఒక్క క్షణం, తమ ఒక్క మాటని, ఆవేదనని వినేవాళ్ళు ఒక్కరు ఉన్నా, ఆ ఉన్నవాళ్ళు హృదయ సంపన్నులు అయితే, ఎంతోమంది ఆత్మీయుల బలవన్మరణాలను ఆపవచ్చు. కానీ వినేవారేరి?’’ అంటూ బాధగా రాసారు ‘తెరవెనుక’ అనే కవిత వచనాత్మకమైన చోట.
‘‘దారిలో ఎవరో ఎదురొస్తారని – నువ్వు నడక మొదలుపెట్టలేదుగా – నొప్పించే రాళ్ళ సమూహాలు – అడుగడుక్కీ నీకేం కొత్త కూడా కాదుగా!’’ అంటారు ‘అయిదు నొప్పించే పద్యాలు’ కవితలో. మన ప్రయాణం ఒంటరిదైనా, గమ్యం తెలియనిదైనా, దారి నిండా ముళ్ళూ రాళ్ళూ నడక వేగాన్ని నియంత్రించినా, ప్రయాణాన్ని మాత్రం ఆపకూడదు. అగాధపు జలనిధుల్లో ఆణిముత్యాలు, పగడపు దీవులు ఎదురైనట్లు, పయనపు దారుల్లో నీ వెనుక ఇంకో నాలుగడుగులు తోడవ్వచ్చు. వెలుగు దీపాల్లాంటి ప్రేమమూర్తులు ఎదురు కావచ్చు. మొదలుపెట్టిన ప్రయాణంలో ఎన్నడూ వెనుకడుగు వేయకూడదంటూ ఆశావహ దృక్ఫథంతో ముందుకు పొమ్మంటారు.
‘‘ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయని అనుకుంటూ – ఇక్కడేదో శాంతిలాంటిదేదో ఉంది కదా అని చల్లటి స్పర్శలాగా ఉంటావు కానీ, నువ్వొక రణరంగమైన పెనుమంట అని పొరపాటున కూడా అనుకోవు కదా!’’ ‘యుద్ధం మధ్యలో నువ్వు’ అనే వచన కవిత్వంలో ‘‘యుద్ధం ఎక్కడో జరగడంలేదు. దురాగతాలను, అన్యాయాలను చూసిన చోట నీ మనసే ఒక రణరంగం. నీ అంతరంగం నిండా రగులుతున్న ఆవేదనకు పోరాటపు పదును పెట్టి, బలహీనమైన పక్షం వైపు నీ అడుగులు పడితే, అప్పుడు యుద్ధం మధ్యలో నిలబడ్డ చైతన్యపు శతఘ్నివి నువ్వే అవుతావు’’ అంటారు కవి.
‘‘చెప్పడానికి చాల ఉన్నప్పుడు – పెదాల్ని కుట్టేసేవాళ్ళు పుట్టుకొస్తారు’’ ‘‘...అన్యాయాలను ఎదిరించడానికి ఎత్తిన చేయిని నరికేవాళ్ళు, నాలుగు శాంతివచనాలను ప్రవచించాలని నోరుతెరిచిన వాళ్ళ నాలుకను తెగ్గొట్టే వాళ్ళు, నవ సమాజ నిర్మాణానికి నడుంకట్టే వాళ్ళని పంజరాల్లో బంధించేవాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. అయినా సమానత్వ పురోగమన బాటలో నేను వెలుతురు వైపుకే నడుస్తాను’’ అని తన దృఢ నిశ్చయాన్ని తెలియచేసారు కవి ‘పంజరంలోని పాటలు’ కవితలో.
‘‘తల మీద కాస్త ఆకాశం ఉంది – కాళ్ళ కింద ఇంకొంచం నేల మిగిలే ఉంది – గుండెలో తడిని ఇంకా ఏ యెడారో కావిలించుకోలేదు – పెదవి మీది మాటని ఇంకెవరూ తుంచుకెళ్ళలేదు – కాబట్టి – కాసింత ప్రశాంతంగానే నిద్రమబ్బుల్ని ఈ రోజు తరిమేస్తాను – నీదైన వెలుగులోకి సరాసరి నడిచే వస్తాను’’ – జీవితం నిండా ఆవరించుకున్న ఎన్నో ప్రేమలు, నమ్మకాలు, సంతోషాలు, సమాగమాలు, ఎందరో ఆప్తుల నిష్క్రమణలు ఎన్నింటినో చూసి ఉంటాడు కవి. అట్లే మనసుని మెలిపెట్టే విధ్వంసాలు, యుద్ధాలు, గాయాలు, రోదనలు, వేదనలు, పురిటి గడ్డ మీద ఉనికి కోసం ప్రాణాలను పణంగా పెట్టి జరిపే పోరాటాలను కూడా చూసి ఉంటాము అందరమూ ఏదో ఒక చోట. ‘అన్నీ జరిగిపోయాయి, ఇంకేం మిగల్లేదు శూన్యం తప్ప. చుట్టూ చీకటే ఆవరించి ఉంది’ అనుకున్న చోట కూడా ఒక వెలుగు రేఖ ఏ దిక్కు నుంచో ప్రసరించవచ్చు. మనిషి దారి ఎప్పుడూ వెలుగు వైపే ఉండాలి – అంటారు ‘ఆఖరి పంక్తి మీద’ అనే కవితలో.
సూర్యుడూ కవీ ఎప్పుడూ కునుకు తీయరు. ఓ చోట నిలబడిపోరు. సూర్యుడు నిరంతరం భ్రమణం చెందుతూ విశ్వానికి వెలుగులు పంచితే, కవి మనుషుల హృదయాల నిండా జ్ఞానజ్యోతులను వెలిగిస్తూ ఉంటాడు అనుక్షణం. అఫ్సర్ అక్షరయోధుడిలా యుద్ధాలు లేని నేల కోసం, ఘర్షణ పడని మనసుల కోసం మనుషుల మధ్య నిలబడి శాంతి శతఘ్నిలా ప్రేమ కవితా పుష్పాలను ఇలా నిరంతరం జల్లులుగా కురిపించాలని కోరుకుంటాను.
రోహిణి వంజారి
90005 94630
ఈ వార్తలనూ చదవండి:
ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్ కంపెనీగా టీసీఎస్
బంగారంలో పెట్టుబడులకు గోల్డ్ ఈటీఎఫ్, ఈజీఆర్‌లు