Share News

రంగా సృజించిన ‘హరిజన నాయకుడు’

ABN , Publish Date - Nov 05 , 2026 | 03:46 AM

గోగినేని రంగనాయకులు ఆచార్య ఎన్‌.జి.రంగాగా సుప్రసిద్ధులు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు గ్రామంలో నవంబర్‌ 7న రైతు కుటుంబంలో జన్మించారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో...

రంగా సృజించిన ‘హరిజన నాయకుడు’

గోగినేని రంగనాయకులు ఆచార్య ఎన్‌.జి.రంగాగా సుప్రసిద్ధులు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు గ్రామంలో నవంబర్‌ 7న రైతు కుటుంబంలో జన్మించారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో విద్యనభ్యసించారు. గాంధీజీ చంపారన్‌ రైతు ఉద్యమంతో ప్రభావితుడై ఉద్యమనేతగా ఎదిగారు. భారత రైతాంగ ఉద్యమ పితామహులలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన ఆచార్య రంగా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఖాదీ దుస్తులు ధరించి, బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచారు.

ఆచార్య ఎన్‌.జి.రంగా సామాజిక సంస్కర్తగా రచనలు కూడా చేశారు. మహాత్ముడి స్ఫూర్తితో ‘హరిజన నాయకుడు’ నవలను రచించారు. ఆయన అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా అమలు చేశారు. హరిజనులను జాతీయోద్యమంలో భాగం చేయడం ద్వారా వారికి తగిన గౌరవం లభిస్తుందని భావించి, అందుకు తగిన ప్రయత్నం చేశారు. అప్పటికే తెలుగు సాహిత్యంలో మంగిపూడి వెంకటశర్మ ‘నిషిద్ధ భారతం’, ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు ‘మాలపల్లి’ పెద్ద సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలోనే రంగా రచించిన ‘హరిజన నాయకుడు’ హరిజనోద్ధరణ అంశంపై వచ్చిన నవల. రైతు గ్రంథమండలి వారు 1933లో నవలను తొలిసారి ముద్రించారు. ఈ నవలలో ఆనాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల గురించి చర్చించారు. నవల ప్రధానంగా– భారత స్వాతంత్ర్యం, అంటరానితనం నిర్మూలన, దేశ ప్రజల మధ్య సమభావన, స్వదేశీ వస్తు ప్రేమ, స్త్రీ జనోద్ధరణ వంటి అంశాలపై ప్రధాన దృష్టితో రాశారు.

నవలలో బసవలింగయ్య పాత్ర నేటి కాలానికి ప్రాసంగికత కలిగినది. హరిజన నాయకుడైన బసవలింగయ్య పాత్ర ద్వారా హరిజనోద్ధరణ కార్యక్రమం సామరస్య సిద్ధాంతంపై జరిగినట్లు చిత్రించారు రచయిత. ఈ సైద్ధాంతికతను గాంధీజీ సిద్ధాంతాల నుంచి ఆచార్య రంగా గ్రహించారు. మరోవైపు రమణయ్య పాత్ర ద్వారా– ‘గాంధీ మహాత్ముని ధర్మసూత్రాల ప్రచారం ఎక్కువవుతున్న కొద్దీ యువకులు కూడా సాధువులు అవుతున్నారు. పూర్వాచార పరాయణులు కూడా ఉదారభావ సమన్వితులవుతున్నారు’ అని చెబుతారు. గాంధీ ప్రభావంతో ఒక ఆదర్శ సామాజిక వ్యవస్థను చిత్రించారు ఆచార్య రంగా. గాంధీ హరిజనోద్ధరణ కార్యక్రమాన్ని గాంధీ మార్గంలోనే వివిధ పాత్రల ద్వారా చెప్పించారు. హిందూ సమాజాన్ని జాగృతం చేయడం ద్వారా సామాజిక మార్పులకు ప్రయత్నించడం, ప్రతి మనిషి పట్లా ప్రేమ, సహానుభూతి పెంపొందించడం, దళితులు తమంతట తాము ఒక ప్రయత్నంగా శుభ్రతను పాటించడం, ఆరోగ్యం, విద్య పట్ల జాగరూకతతో ఉండడం వంటి విషయాలను చర్చించారు.


అగ్రవర్ణాల ద్వారా కూడా హరిజనులకు తోడ్పాటును అందించే విధంగా నవలను చిత్రీకరించారు. ఈ విధంగా మార్పు అనేది రెండు వైపుల నుంచి ఉండాలనే కోరిక ఆచార్య రంగా ‘హరిజన నాయకుడు’ నవలలో కనిపిస్తుంది. బసవలింగయ్య పాత్ర ద్వారా హరిజనులు తమ సమాజానికి తామే నాయకత్వం వహించి పిల్లల విద్య, మద్యపాన నిషేధం వంటి సామాజిక మార్పులకు ఎలాంటి కృషి చేయాలో చెప్పించారు. వాస్తవానికి సంఘ సంస్కరణ అనేది మన సంస్కరణతో ముడిపడి ఉన్నది. భారతదేశం స్వాతంత్ర్యం సాధించి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా, ఆశించిన స్థాయిలో మత సంస్కరణలు అమలు కాలేదు. ఇంకా మూఢనమ్మకాలు, ప్రతి చెడు భావాన్ని విదేశీ పాలనకు అన్వయించడం ప్రబలంగానే ఉంది. ఇవే సంస్కరణలకు అడ్డుగా నిలుస్తున్నాయి. నేటికీ దళితులకు ఆలయ ప్రవేశం లేని గ్రామాలు దేశంలో చాలానే ఉన్నాయి. అస్పృశ్యత నివారణకు, కులవ్యవస్థలోని అంతరాలను రూపుమాపడానికి హిందూ మత పీఠాధిపతులు నడుం బిగించాలి. గ్రామగ్రామాన దేవాలయ ప్రవేశ ఉద్యమాలను ఆధ్యాత్మికవేత్తలు చేపట్టాలి. వీరు కేవలం ఉపదేశాలకు పరిమితం కాకుండా దేశానికి మచ్చగా ఉన్న ఈ దుర్మార్గ వ్యవస్థను పారద్రోలేందుకు తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాలి. అప్పుడే మహాత్ముడు కలగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. ఆచార్య రంగా వంటి నాయకుల రచనలకు సార్థకత చేకూరుతుంది.

ఈ నవల పునర్ముద్రణ ద్వారా మరలా చరిత్రలో ఒక నాయకుడిని ముఖ్యంగా గుంటూరు వాసి అయిన ఎన్‌.జి.రంగాను మననం చేసుకోవచ్చు. అంతేగాక నాటి సామాజిక స్థితిగతులను, నేటి సామాజిక వాస్తవికతతో బేరీజు వేసుకొని పురోగతి మూల్యాంకనం చేసుకునేందుకు ఒక సదవకాశంగా భావిస్తున్నాను.

డొక్కా మాణిక్య వరప్రసాద్ (మాజీ మంత్రి)

(గుంటూరు జేకేసీ కళాశాల ఆడిటోరియంలో రేపు ఉదయం 10.30కి ‘హరిజన నాయకుడు’ ఆవిష్కరణ సభ. యలమంచిలి శివాజీ ఆవిష్కర్త. పరుచూరి గోపీచంద్‌, మండలి బుద్ధప్రసాద్‌, కొరివి వినయ్‌ కుమార్‌, కందిమళ్ల శివప్రసాద్‌ పాల్గొంటారు)

ఇవి కూడా చదవండి..

అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..

అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్‌ పరిస్థితేంటి.

Updated Date - Nov 05 , 2026 | 03:47 AM