ఆత్మకు పరుగెత్తడమూ ప్రేమించడమూ తెలుసు
ABN , Publish Date - Aug 31 , 2026 | 01:23 AM
జీవితం ఒక్కసారిగా చెదిరిపోయిన రాత్రి నేను ముందుగా వెతికింది మనుషులనే కాదు చల్లని నీడనిచ్చే...
జీవితం ఒక్కసారిగా చెదిరిపోయిన రాత్రి
నేను ముందుగా వెతికింది
మనుషులనే కాదు
చల్లని నీడనిచ్చే ఒక చెట్టును దాని నీడను
తడిసిన మట్టి వాసనను
నన్ను పిలిచిన ఒక నదిని
విజయాల వేటలో ఓటముల భయంతో
ఇతరుల కళ్లలోనూ చూపుల్లోనూ బతకాలనే
అవమానకరమైన ఆశతో
ఎంతకాలమో నాకు నేనే
గోడ కట్టేసుకున్నాను
ఒకరోజు నా ఆత్మ అలసిపోయింది
అప్పుడు వూర్లన్నీ శ్మశానాల్లా కనిపించాయి
ఫోన్లు మోగినా హృదయం స్పందించలేదు
అద్దంలో ముఖం కనిపించింది గానీ
మనిషి కనిపించలేదు
అలాంటి వేళ
భూమి నిన్ను పిలిచింది
‘‘రా!
నీ చెప్పులు విడిచేసి
కొంచెం గడ్డిమీద నడువు
నీ బాధల్ని
నదిలో కడిగేసి
నీ మౌనాన్ని
పక్షుల దగ్గర వదిలేసి రా’’ అంది
నిజానికి మనిషి
మోకాళ్లపై బతకడానికి పుట్టలేదు
ఆకాశం వైపు
తలను ఎత్తి నిలబడటానికే పుట్టాడు
వసంతం ఎప్పుడూ
పూలరెక్కల్ని బలవంతంగా విప్పదు
చెట్టు మీద అరవదు
కేవలం వెలుతురును పరుస్తుంది
గాలిని వీస్తుంది
మిగతాదంతా మొక్కే నేర్చుకుంటుంది
జీవితం కూడా అంతే
నిన్ను మార్చమని కాదు
నీ లోపల బంధించబడిన నిన్ను
విడుదల చేయమని అడుగుతుంది
అన్ని చెదిరిపోయిన తరువాతే
కొన్ని సత్యాలు మొలుస్తాయి
చీకటి చివర్లోనే
మనిషి తన అసలు
ముఖాన్ని చూస్తాడు
అప్పుడు ఎక్కడి నుంచో
ఒక స్వరం వినిపిస్తుంది
‘‘భయపడకు...
నీ ఆత్మకు
నడవడమే కాదు
పరుగెత్తడమూ ప్రేమించడమూ తెలుసు’’
వారాల ఆనంద్
భిన్నత్వంలో ఏకత్వం ఇండియా డీఎన్ఏలోనే ఉంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
దేశానికి డ్రగ్స్ పీడ వదిలిపోవాలి.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని