కడపటి వీడ్కోలు
ABN , Publish Date - Feb 09 , 2026 | 02:17 AM
ఈ చింత చెట్టు దగ్గరే ఈది బాగోతపోళ్లు లాగి లాగి పద్యాలు పాడుతుంటే నిట్టనిలువుగా పద్య కుటీరం లేచి నిలబడేది జీవితాన్ని...
ఈ చింత చెట్టు దగ్గరే
ఈది బాగోతపోళ్లు
లాగి లాగి పద్యాలు పాడుతుంటే
నిట్టనిలువుగా
పద్య కుటీరం లేచి నిలబడేది
జీవితాన్ని
లెక్కచేయని
పొగరుబోతు గొంతుల్లో
రెక్కలెత్తిన పద్యం
ఆకలి విడిచి, దుఃఖాన్ని మరచి,
పొంగుతున్న వాగులా ఉరికేది
పద్యాన్ని ప్రసవిస్తున్న
స్వరపేటికల్లో
గడ్డిపరకల పదును
గాల్లో ఊరేగుతున్న పద్యాన్ని
సగం ఊరు గుండెల్లో పెట్టుకునేది
సీతమ్మ కష్టాల్ని దిగులుగా
పాడుతున్న గొంతు విని
ఆడోళ్ళేనా మగోళ్ళకి కూడా
కన్నీటి తొక్కిసలాట
రాజాధి రాజులకు
రాజ యోగూలకు యోగూలకు
బాగ సెప్పేదను సెప్పేదను అంటూ
ఎరుకలసాని గొంతులో
మొలకెత్తిన దరువు
విల్లు నుండి బాణం విడిచినట్టే
దరువు వెనక దరువు
వాయునాళం నుండి పుట్టి
సరాసరి వింటున్నవారి చెవుల్లో
రాగాలు తీగలై పూసేవి
ఒక్కో వేషగాడు వేదిక దిగి వెళ్లినట్టు
ఒక్కొక్క గొంతు
మట్టి కిందకెళ్తుంటే
చింతచెట్టు చిగిరించడం మానేసింది
దక్షయజ్ఞం బాగోతంలో
ఈరభద్రుడు పూనకం వచ్చి
కోడి మెడ కొరికినట్టే
కాలం ఒకొక్క స్వరాన్ని
మోసుకెళ్ళిపోయాక
అక్కడంతా అమాస క్షణాలు
శ్రుతులు తెగిన
పద్యకళేబరాలు
రగడలు పూసిన
చిట్టచివరి గొంతు
ఈమధ్యనే రాలిపోయాక
ఆఖరి పదాల్ని పేర్చుకున్న
వారసుల్లేని పద్యానికి
ఈ చెట్టుకిందే
కడపటి వీడ్కోలు
సుంకర గోపాలయ్య
94926 38547
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్‌కు సూటి ప్రశ్నలు వేసిన నాగబాబు..
సైబర్ నేరగాళ్లపై ఉక్కు పాదం.. రూ. 65 కోట్ల లావాదేవీల గుట్టు రట్టు
Read Latest Telangana News And AP News