Share News

‘దొర’ వంటి అధికారి దొరకడం కష్టమే!

ABN , Publish Date - Mar 15 , 2026 | 01:17 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు అధికారిగా ఎనలేని సేవలందించిన హెచ్‌.జె.దొర మరణం మార్చి 13న సంభవించింది. ఆయనతో అనేక హోదాలలో పనిచేసిన ఎంతోమందికి పోలీసు శాఖలో ఒక శకం ముగిసినట్లనిపించింది....

‘దొర’ వంటి అధికారి దొరకడం కష్టమే!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు అధికారిగా ఎనలేని సేవలందించిన హెచ్‌.జె.దొర మరణం మార్చి 13న సంభవించింది. ఆయనతో అనేక హోదాలలో పనిచేసిన ఎంతోమందికి పోలీసు శాఖలో ఒక శకం ముగిసినట్లనిపించింది.

పోలీసులలో ఆయన నిజమైన దొరగా భాసిల్లారు. ‘దొర’ అర్థం మరో విధంగా తీసుకోవటం వీరి విషయంలో కుదరదు. పేరుకు దొరే కానీ పోలీసు శాఖలో మానవత్వంతో పాటు వృత్తి నియమాలు వర్ధిల్లేలా చేసిన అధికారి. ఆయన ఏఎస్పీగా వరంగల్‌లో పనిచేసినా, ఎస్పీగా కృష్ణా జిల్లాలో పనిచేసినా, హైదరాబాద్‌ డీసీపీ, సీపీగా, డీజీపీగా వివిధ హోదాలలో పనిచేసినా చిరునవ్వు చెరగనివ్వకుండా శాఖాపరంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి అత్యంత నైపుణ్యాన్ని ఎలా పొందారో తెలియదు. కానీ అధికారిగా దొర– రాజకీయ నాయకులకు, అధికార గణానికీ, చిరుద్యోగులకు, ఏ శాఖలో పనిచేసే వారికైనా అత్యంత ప్రీతిపాత్రుడైన అధికారిగా పేరు తెచ్చుకోవడానికి కారణం... వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావం! ఏదీ కష్టం కాదు అని అభిప్రాయపడే వ్యక్తిత్వం– నిర్ణయాలను సాధికారికంగా అమలుచేసే అనునయంతో కూడిన ఓపిక ఆయన రిటైర్‌ అయ్యేంతవరకూ చేదోడువాదోడుగా ఉన్నది. అధికారంలో ఉన్న వారిని గౌరవించడం తెలుసుకొని, వారిని నొప్పించకుండా, వారి నిర్ణయాలను మార్చుకొనే రీతిలో ఒప్పించగల సామర్థ్యంతో ఉద్యోగం చేయడం వల్ల దాదాపు అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు.

ఆయన వృత్తిపరంగా అందరికీ సమంగా గౌరవాన్ని ఇవ్వడం తెలుసు! ఆయన ఇంటెలిజెన్స్‌ విభాగంలో డీఐజీగా ఉన్నప్పుడు, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో రాజీవ్‌గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా పెద్ద బహిరంగసభ పెట్టారు. సభ చివర్లో పెద్ద వర్షం రావడంతో చాలామంది పెద్దవారు, కాంగ్రెస్‌ నాయకులు కార్ల దగ్గరకు పోలేని పరిస్థితి. అదే విభాగంలో ఎస్పీగా ఉన్న నన్ను చూసి– ‘‘మన కార్లు దగ్గర్లోనే ఉన్నాయిగా! అటు చూడండి, విజయభాస్కరరెడ్డి, రోశయ్య లాంటి వారు వారి వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. అవి ఇప్పట్లో ఈ హడావిడిలో రాలేవు కానీ, వెళ్లి వారికి చెప్పి, మన కార్లలో వారిని పంపించి రండి’’ అన్నారు. రోశయ్య దగ్గరకు వెళ్లి ‘‘మా కార్లు ఉన్నాయి. మీరు డ్రాప్‌ అయ్యి, తిరిగి పంపించండి’’ అని చెప్పినప్పుడు... దూరంగా ఉన్న దొరను చూస్తూ– ‘‘అందుకే దొరను అందరూ అభిమానిస్తారు! నేను చూస్తూనే ఉన్నాను. డీఐజీ ఎరేంజ్‌ చేశారుగా, ఆయనకు థాంక్స్‌ చెప్పండి’’ అని మా కార్లలో వెళ్లిపోయారు. దొరలో భేషజాలు లేకుండా, ఏదైనా వృత్తిలో భాగంగా స్వీకరించే మనస్తత్వం ఉండడం చేతనే డీజీపీగా, అయిదు సంవత్సరాలు అప్రతిహతంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో రాణించగలిగారు.


నక్సలైట్ల సమస్యను ఎదుర్కోవటంతో పాటు, గ్రేహౌండ్స్‌ లాంటి సంస్థను ప్రోత్సహించిన అధికారి ఆయన. అన్నిటికంటే, అందరు పోలీసులూ అభిమానించే ‘భద్రత’ ఆర్గనైజేషన్‌ ఆయన రూపకల్పన చేసినదే! ఏ మాత్రం ఎదురుచూడకుండా, ఎవరి సహాయాన్నీ ఆశించకుండా ఇన్నాళ్లూ పోలీసుల ఆరోగ్యాన్ని కాపాడుతున్న సంస్థ ‘భద్రత’. ఇది ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

కొద్ది రోజుల్లో దొర డీజీపీగా చార్జి తీసుకుంటారనుకుంటున్నప్పుడు... ఆదిలాబాద్‌ జిల్లాలోని సిరిపూర్‌–ఉట్నూర్‌ పోలీసుస్టేషన్‌పై నక్సలైట్లు దాడి చేసి, 16 మంది పోలీసులను చంపేశారు. ఒక డీఎస్పీ (కమ్యూనికేషన్స్‌)ను వరంగల్‌– హైదరాబాద్‌ రోడ్డుమీద ల్యాండ్‌మైన్‌ పెట్టి చంపేశారు. ఆయన వద్ద తుపాకులు ఉంటాయని వారు అలా చేశారు. ఆయన శాంతిభద్రతలకు సంబంధించిన అధికారి కాకపోవడంతో నక్సలైట్లకు ఆయుధాలు ఏమీ దొరకలేదు. ఆ ఘటనతో పోలీసుల మనోస్థైర్యం మాత్రం బాగా దెబ్బతిన్నది. దొర డీజీపీగా చార్జి తీసుకున్న వెంటనే నక్సలైట్లు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా కరకగూడెం పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి, పదహారు మంది పోలీసులను చంపేసి, ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఇవి చూశాక, పోలీసు అధికారిగా ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందో దొరకు పూర్తిగా అర్థమైంది. ఖమ్మం జిల్లా టూర్‌ సందర్భంగా ఘటనా స్థలాన్ని ప్రత్యేకంగా పరిశీలించడానికి వెళ్లినప్పుడు ఒక అంశం ఆయన దృష్టికి వచ్చింది. దీంతో, ‘నక్సలైట్లను ఎదుర్కోవడానికి పోలీసులు సరైన శిక్షణ లేకుండా ఉన్నారు’ అని ఆయనకు అర్థమైంది. అదేంటంటే... ఒక పోలీసు స్టెన్‌గన్‌తో వెళ్తుండడం గమనించి, కారు ఆపి ఆ గన్‌ను ఏ విధంగా ఉపయోగిస్తారో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కానీ, అతను దాన్ని సరిగ్గా ఉపయోగించలేకపోవడంతో, అతనికి సరైన శిక్షణ లేదు అన్న విషయం దొరకు అవగతమైంది. ఆయుధాలు సరిగ్గా ఉపయోగించలేని పోలీసులు స్టేషన్లను, ప్రజలను ఎలా కాపాడగలరు అన్న ప్రశ్న ఆయనను తొలిచివేసింది. దాంతో ఆయన అన్ని ర్యాంకుల పోలీసులకు ఆయుధాల శిక్షణ కోసం సెంట్రల్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్‌ను సంప్రదించి, శిక్షణ కార్యక్రమం మొదలుపెట్టారు. డీజీ, బీఎస్‌ఎఫ్‌; డీజీ, సీఆర్‌పీఎఫ్‌ ఈ విషయంలో తగిన సహకారం అందించడం కేవలం దొర చొరవ వల్లనే జరిగింది.

గ్రేహౌండ్స్‌ అనే ప్రత్యేక దళానికి శిక్షణ కోసం స్పెషల్‌ సర్వీసెస్‌ బ్యూరో నుంచి ఎన్‌.ఎస్‌.భట్టి అనే నిష్ణాతుడైన రిటైర్డ్‌ అధికారిని కౌంటర్‌ ఇన్‌సర్జెంట్‌ కన్సల్టెంట్‌గా నియమించారు. దాంతో గ్రేహౌండ్స్‌కు సిసలైన శిక్షణ దొరికి, వారు నక్సలైట్‌ మూమెంట్‌ను నియంత్రించడంలో నిష్ణాతులయ్యారు. దొర ముందు చూపు వల్లే అది సాధ్యపడింది! నక్సల్స్‌ చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సముచిత గౌరవాన్ని పోలీసు శాఖ ఇచ్చేది. అలా చనిపోయిన వారి అంత్యక్రియలకు సీనియర్‌ అధికారి హాజరుకావడాన్ని దొర నియమంగా పెట్టడంతో పోలీసులలో మనోధైర్యం బాగా పెరిగింది. ఈ విషయంలో ఎన్నో సహాయక చర్యలు తలపెట్టడంతో దొర హయాంలో పోలీసులు ప్రాణాలకు తెగించి పోరాడారు. ధైర్యంతో పాటు కలిసికట్టుగా అన్ని సమస్యలను ఎదుర్కొనేలా పోలీసు శాఖను దొర తీర్చిదిద్దారు.


గ్రేహౌండ్స్‌ బలమైన ఫోర్స్‌గా తయారుకావడానికి కారణం– దొర ఆ దళాన్ని అనేకసార్లు సందర్శించి వారిలో మనోనిబ్బరాన్ని కలిగించారు. వ్యాస్‌ వంటి సమర్థుడైన అధికారికి డీజీపీగా దొర ఇచ్చిన సహకారంతో గ్రేహౌండ్స్‌ దేశంలోనే గణనీయమైన ఫైటింగ్‌ ఫోర్స్‌గా పేరు తెచ్చుకుంది. అరమరికలు లేకుండా ప్రభుత్వానికి అవగాహన కల్పించడం వల్ల అప్పటి ప్రభుత్వం దొరను శాఖాపరంగా ప్రోత్సహించింది. ఆయన అసాధారణ రీతిలో నక్సలైట్లను, మతకల్లోలాలను అదుపుచేశారు. దీంతో తన ప్రాణాలకు హై రిస్క్‌ ఏర్పడినా ఆయన వెరవలేదు. మరణించే చివరి క్షణం వరకూ దొరకు ప్రభుత్వం జెడ్‌ప్లస్‌ కేటగిరీలో సెక్యూరిటీ ఇచ్చిందంటే అధికారిగా ఆయన చూపిన చొరవ, ధైర్యం, తెగింపు వల్లనే.

పోలీసులకు దొర లాంటి అధికారి దొరకటం కష్టమే! కానీ అలాంటి అధికారి అవసరమే పోలీసు శాఖకు ప్రస్తుతం ఎంతగానో ఉంది.

రావులపాటి సీతారామారావు

ఇవి కూడా చదవండి...

గ్యాస్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ

కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే

Updated Date - Mar 15 , 2026 | 01:18 AM