తర్వాతి స్టేషన్ ఎస్ నో నగర్... తలపులు ఎడమ వైపు తెరుచుకుంటాయి
ABN , Publish Date - Feb 09 , 2026 | 02:13 AM
హార్మోన్ల మధ్య hormony కుదిరేంతవరకూ ఓపిక పట్టాలి infatuation స్థితి నుండి congratulation దిశవైపు...
హార్మోన్ల మధ్య hormony
కుదిరేంతవరకూ ఓపిక పట్టాలి
infatuation స్థితి నుండి
congratulation దిశవైపు
మనసుని మాయ చేయనివ్వకుండా
నడిపించాలి
కలసినవి చూపులు కాదు
ఆత్మల తొలి నిశ్శబ్ద పలకరింపులు అని
కాలపరీక్షలో తేలేవరకూ కనీసం ఆగాలి
చెవికి వినిపించిన
ఆమె/ అతని మొదటిమాట
క్రితం జన్మ చివర ఆగిపోయిన
మిగతా సగం పాట అని
విశ్వసంగీత కళాశాల ఆవరణ లోని
పురాతన వృక్షపు గాలి ధ్రువీకరించేంతవరకూ
వేచి చూడాలి
‘ఒక్క రోజు తను కనిపించకపోయినా
రక్తప్రసరణలో వచ్చే మార్పు వల్ల
హృదయానికి మేలే కానీ కీడు జరగదు–
అన్న ఎరుకతోనే పని చేయండి’
అని ఊపిరితిత్తులకి శిక్షణనివ్వాలి
ఒక్క రాత్రయినా నీ కలలో
తను బాల్యపు ముఖంతో కనిపిస్తే–
ఉదయం తెరిచిన నీ కనురెప్పల్లోంచి
అప్పటి తన అమాయకపు పాదాలతో
ఈ ప్రపంచంలోకి
వెళ్లడాన్ని చూడగలగాలి
ఆ కల తర్వాత–
కలిసి జీవితపు చివరి స్టేషన్ వరకూ
ప్రయాణించగలిగే వరం దొరికినా–
వచ్చే స్టేషన్ లోనే వీడ్కోలు తీసుకొని
దిగిపోవాల్సిన ప్రాప్తం కలిగినా
‘నిన్ను చూసిన క్షణపు
తొలి వానచినుకు తడిని మాత్రమే
నాలో మిగుల్చుకొని
ఆ తర్వాత వచ్చే అన్ని తుఫాన్లనూ
జీవితేచ్ఛతో ఎదుర్కొంటాను’
అన్న వికాసాన్ని సాధన చేయాలి.
అదుగో... అప్పుడు
అప్పుడు మాత్రమే చెప్పాలి
దయచేసి అద్వితీయమైన ఆ మాటను
ఆత్మిక ప్రయోజనం కోసం కాకుండా
మామూలు ప్రయోజనాల కోసం
వాడకండి–
అని చాన్నాళ్ల నుండి నక్షత్రాలు
మానవజాతికి మొరపెట్టుకుంటున్న మాట.
చెవిలో గుసగుసగా చెప్పినా
అంతరిక్షంలోని ఆఖరి చీకటి అంచు వరకూ
ప్రయాణించగలిగిన కాంతివంతమైన... మాట
‘నిన్ను ప్రేమిస్తున్నాను’
అనే మాట.
భగవంతం
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్‌కు సూటి ప్రశ్నలు వేసిన నాగబాబు..
సైబర్ నేరగాళ్లపై ఉక్కు పాదం.. రూ. 65 కోట్ల లావాదేవీల గుట్టు రట్టు
Read Latest Telangana News And AP News