Share News

34వ జాతీయ నాస్తిక మేళా

ABN , Publish Date - Feb 12 , 2026 | 01:50 AM

దేవుడి ఉనికిలో, దైవ భావంలో విశ్వాసం ఉంచేది ‘ఆస్తికత్వం’. అందుకు విరుద్ధంగా, వాటిని కచ్చితంగా తిరస్కరించేది ‘నాస్తికత్వం’. అయితే నాస్తికత్వం అనేది దేవుడు లేడు అనే దగ్గరే ఆగిపోతే...

34వ జాతీయ నాస్తిక మేళా

దేవుడి ఉనికిలో, దైవ భావంలో విశ్వాసం ఉంచేది ‘ఆస్తికత్వం’. అందుకు విరుద్ధంగా, వాటిని కచ్చితంగా తిరస్కరించేది ‘నాస్తికత్వం’. అయితే నాస్తికత్వం అనేది దేవుడు లేడు అనే దగ్గరే ఆగిపోతే విశ్వాసం, అవిశ్వాసాల మధ్య సంఘర్షణగానే మిగిలిపోతుంది తప్ప, సామాజిక ప్రయోజనం ఉండదు. ఆస్తిక భావజాలం ప్రజావ్యతిరేకమైనది, మనిషిని నిర్వీర వ్యక్తిగా, నిస్సహాయకుడిగా, బలహీనుడిగా మారుస్తుంది. క్రియారహితుడిగా భావదాసుణ్ణి చేస్తుంది. మార్కిస్టు గతితార్కిక చారిత్రక భౌతికవాదం ప్రాతిపదికగా ఉన్న క్రియాశీలక నాస్తికవాదం... దోపిడీ రహితమైన, మనిషిని మనిషిగా జీవించే మానవీయ సమాజ నిర్మాణం... నాస్తిక సమాజ లక్ష్యం. మన దేశంలో వేల సంవత్సరాల క్రితమే పీడిత ప్రజల సిద్ధాంతంగా ముందుకొచ్చిన లోకాయతం, చార్వాక స్ర్తీలను వారసత్వంగా స్వీకరించి శ్రమజీవుల సంస్కృతిగా ‘నాస్తిక మేళా’ను చార్వాక రామకృష్ణ మాస్టారు తీర్చిదిద్దారు. ఇవాళ దేశంలో ఫాసిస్టు శక్తులు స్వైర విహారం చేస్తున్నాయి. అఖండ భారత్ మహా కలల్లో విహరించే మతోన్మాద సంఘాలిప్పుడు సాంస్కృతిక పెత్తనం కోసం ప్రశ్నించే గొంతుల్ని, అసమ్మతి తెలిపే బుద్ధిజీవుల్ని, అనాగరికపు ఆచారాన్ని ఎదిరించే హేతువాదుల్ని, పుక్కిటి పురాణాలు ప్రజల చరిత్ర కాదన్న చరిత్రకారుల్ని వేధించి ప్రాణాలు తీస్తున్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి (ప్రస్తుతం మాజీ) బీఆర్ గవాయ్‌పై దాడి, హర్యానా ఏడీజీ వై.పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలు మన దేశంలో నెలకొన్న వ్యవస్థీకృత కులోన్మాదం, దానికి వెన్నుదన్నుగా నిలిచిన మతోన్మాద దుస్థితిని తెలుపుతున్నాయి.


ఈ నేపథ్యంలో ఈ నెల 14, 15 తేదీలలో గుంటూరు జిల్లా, మంగళగిరి సమీపంలోని చార్వాక ఆశ్రమంలో 34వ జాతీయ నాస్తిక మేళా జరుగుతున్నది. 14న ‘సమకాలీన సందర్భాల్లో భగత్‌సింగ్, పెరియార్ నాస్తిక ఆలోచనల ప్రాసంగికత’ అంశంపై బి.రంగస్వామి, ‘ప్రాచీన భారతంలో చార్వాకం’ అంశంపై ఎంవీఎస్ శర్మ, ‘పురాణ ప్రలాపం’ అనే అంశంపై జె.లక్ష్మీరెడ్డి, ‘దాచేస్తే దాగని సత్యం.. జీవ పరిణామం’ అంశంపై కట్టా సత్యప్రసాద్‌, ‘మతాలు–మూఢవిశ్వాసాలు’ అంశంపై ముళ్ళై వేందన్‌, ‘ఖగోళ శాస్త్ర విజ్ఞానం’ అంశంపై రవిరాజా పోతినేని ప్రసంగిస్తారు. 15వ తేదీన ‘ప్రైవేటీకరణ విధానాలు–మన దృక్పథం’ అంశంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, ‘భారత రాజ్యాంగం – లౌకికవాదం – సవాళ్లు’ అంశంపై డా. చెన్నుపాటి దివాకర్ బాబు, ‘సంక్షోభ కాలంలో బుద్ధిజీవుల పాత్ర’ అంశంపై ఎన్‌.వేణుగోపాల్‌, ‘ఫాసిజం–భారతీయ సమాజం’ అంశంపై డా. బి.వి.రాఘవులు, ‘వైజ్ఞానికతకు మతభావాలకు పొసగని మైత్రి’ అంశంపై డా. జయకుమార్‌ తదితరులు ప్రసంగిస్తారు.

నాస్తిక సమాజం

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ

ఇవి కూడా చదవండి..

వందేమాతరం కొత్త ప్రోటోకాల్.. జనగణమన కంటే ముందే వందేమాతరం ఆలాపన

ఎప్‌స్టీన్‌ను కలిసాను కానీ.. రాహుల్ ఆరోపణలపై హర్దీప్ సింగ్ పూరి

Updated Date - Feb 12 , 2026 | 01:50 AM