Share News

సవాళ్లు దాటుతూ సమాజసేవలో...

ABN , Publish Date - Jun 20 , 2026 | 01:14 AM

బసవతారకం ఆసుపత్రికి పాతికేళ్లు నిండుతున్న ఈ సందర్భం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ ఆసుపత్రి ఆలోచన పురుడు పోసుకున్న రోజు నుంచి జరిగిన అనేక సంఘటనలకు, కార్యక్రమాలకు, అభివృద్ధికి నేను ప్రత్యక్ష సాక్షిని...

సవాళ్లు దాటుతూ సమాజసేవలో...

బసవతారకం ఆసుపత్రికి పాతికేళ్లు నిండుతున్న ఈ సందర్భం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ ఆసుపత్రి ఆలోచన పురుడు పోసుకున్న రోజు నుంచి జరిగిన అనేక సంఘటనలకు, కార్యక్రమాలకు, అభివృద్ధికి నేను ప్రత్యక్ష సాక్షిని. ఎన్టీఆర్‌ సినీ రంగంలో ఉన్నప్పుడే నాకు ఆయనతో కొంత పరిచయం ఉంది. కానీ వ్యక్తిగతంగా కలిసింది తక్కువే. ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం క్యాన్సర్‌ బారినపడటంతో ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు అమెరికా వచ్చారు. ఆ సమయంలో నేను ‘స్లోన్‌ కేటరింగ్‌’లో పనిచేసేవాడిని. నేను ఆమెకు క్యాన్సర్‌ తగ్గించటానికి వైద్యం ప్రారంభించాను. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వైద్య నిపుణులు ఉండగా– ఎన్టీఆర్‌ కుటుంబం నన్ను ఎంపిక చేసుకోవటం గర్వకారణమనే చెప్పాలి. నాకు వారి కుటుంబంతో మంచి సంబంధం ఏర్పడింది. ఒక రోజు ఆమె, తన కుటుంబ సభ్యులు మా ఇంటికి వచ్చారు. అప్పుడు ఆమె తన మనసులో ఉన్న ఆవేదనను నాతో పంచుకున్నారు. ‘‘డాక్టర్‌ గారు.. నేను ఒక ముఖ్యమంత్రి భార్యను కాబట్టి ఇంత దూరం వచ్చి వైద్యం చేయించుకోగలిగాను. కానీ మన రాష్ట్రంలోని సామాన్యుల పరిస్థితి ఏమిటి? వాళ్ల కోసం మీరే ఒక పెద్ద క్యాన్సర్‌ ఆసుపత్రి కట్టించాలి.. నేను ఎన్టీఆర్‌ గారికి కూడా చెబుతాను’’ అన్నారు. ఆసుపత్రికి బీజం పడటానికి ఆమె మాటలే కారణం. ఆమె ఇండియాకు తిరిగి వెళ్లిన తర్వాత ఎన్టీఆర్‌తో తన కోరిక గురించి చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆమె మరణించారు. కానీ బసవతారకం కోరిక మాత్రం ఎన్టీఆర్‌ మనసులో నిలిచిపోయింది. దీనితో ఆయన ఆసుపత్రి ప్రారంభానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆసుపత్రిని ఎలా స్థాపించాలి? ఎలా నిర్వహించాలి? లాంటి అనేక విషయాల కోసం ఆయన నన్ను సంప్రదించటం మొదలుపెట్టారు.

ఎన్టీఆర్‌ సీఎంగా– బసవతారకం ఆసుపత్రికి హైదరాబాద్‌లో స్థలాన్ని కేటాయించారు. కొండలు, రాళ్లు, రప్పలతో ఉన్న ఆ ప్రాంతాన్ని పది రోజుల్లోనే శుభ్రం చేయించి శంకుస్థాపనకు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. తాజ్‌ కృష్ణ హోటల్‌ నుంచి బంజారాహిల్స్‌ దాకా ‘యూఎస్‌ఏ నుంచి వస్తున్న డాక్టర్‌ నోరికి స్వాగతం’ అనే పోస్టర్లు పెట్టించారు. ఆ రోజు వేదికపై ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘నేను అందరికీ హీరో కావొచ్చు. కానీ వైద్య రంగంలో మన తెలుగువాడైన డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడుగారే మనందరికీ హీరో’ అని ప్రశంసించడం నా జీవితంలో మర్చిపోలేను. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఎన్టీఆర్‌ నన్ను లంచ్‌కు ఆహ్వానించారు. ఎన్టీఆర్‌ భోజన ప్రియుడు. అందరికీ కొసరి కొసరి వడ్డించటం ఆయనకు ఒక సరదా! నేను అమెరికాలో ఉన్నాను కాబట్టి నాన్‌వెజిటేరియన్‌ అనుకున్నారేమో.. నా కోసం ప్రత్యేకంగా వైజాగ్‌ నుంచి రొయ్యలు తెప్పించారు. నేను స్వచ్ఛమైన వెజిటేరియన్‌ను. ‘డాక్టర్‌ గారు.. మీ కోసం ప్రత్యేకంగా రొయ్యలు తెప్పించాం..’ అని ప్లేటులో వడ్డించారు. నా చుట్టుపక్కల క్యాబినెట్‌ మంత్రులు కూర్చున్నారు. నాకు ఎలా రియాక్ట్‌ కావాలో అర్థం కాలేదు. టేబుల్‌ కింద ఒక చిన్న గిన్నె పెట్టి– ఆయన పక్కకు చూస్తున్నప్పుడు రొయ్యలు దాంట్లో వేసేవాడిని! అలా ఆ రోజు లంచ్‌ను మేనేజ్‌ చేశా!


విధి ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. చెన్నారెడ్డి ప్రభుత్వం రావడంతో ఈ ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. ఒక దశలో ప్రాజెక్ట్‌ పూర్తిగా ఆగిపోయి, సరిహద్దు గోడలు మాత్రమే మిగిలాయి. మాకు తీవ్ర నిరాశ ఎదురయింది. ఒక రోజు నేను, డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు, డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ కలిసి ఎర్రమంజిల్‌లోని ఒక ఇరానీ హోటల్‌లో కూర్చుని టీ తాగుతున్నాం. ‘నోరి గారు.. ఇది ఇక ముందుకు వెళ్లేలా లేదు. ఎవరూ ముందుకు రావట్లేదు’ అని వాళ్లిద్దరూ నాతో అన్నారు. కొద్దిసేపు ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకువెళ్లాలో మాట్లాడుకున్నాం. ‘ఆ పెద్దాయన ఎంతో ఆశతో పునాది వేశారు. దీనిని మనం ఎలాగైనా ముందుకు తీసుకువెళ్లాలి. ఒక ఆరు నెలలు గట్టిగా ప్రయత్నిద్దాం.. ఏదో ఒకటి చేద్దాం’ అన్నాను. కానీ ఏం చేయాలో.. ఎలా చేయాలో నాకు కూడా అర్థం కాలేదు.

నేను అమెరికాకు వచ్చేశాను. అక్కడి నుంచి ఒక అంతర్జాతీయ లెక్చర్‌ కోసం జెరూసలేంలోని ‘హదాసా’ క్యాన్సర్‌ సెంటర్‌కు వెళ్లాను. ఆ సెంటర్‌ హెడ్‌ నా స్టూడెంట్‌. అతనిని– ‘మీది పెద్ద డబ్బున్న దేశం కాదు కదా, ఇంత పెద్ద ఆసుపత్రి ఎలా కట్టారు?’ అని అడిగాను. ‘‘మాకు వాషింగ్టన్‌లో ఒక మహిళా సంఘం (హదాసా విమెన్స్‌ ఆర్గనైజేషన్‌) ఉంది. వారు మాకు ఫండ్స్‌ సేకరించి పంపుతారు’ అని చెప్పాడు. ఆ మాటలు నాలో కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. అమెరికాకు వచ్చిన వెంటనే ఇతర మిత్రులతో కలిసి ‘అమెరికన్‌ తెలుగు విమెన్స్‌ ఆర్గనైజేషన్‌’ (అట్వా)ను రిజిస్టర్‌ చేశాను. ఆ సంస్థకు మహిళలనే బాధ్యులుగా చేశాం. డాక్టర్‌ తులసి పోలవరపును అధ్యక్షురాలిగా, నా సతీమణి డాక్టర్‌ సుభద్ర నోరిని వైస్‌ ప్రెసిడెంట్‌గా నియమించాం. బసవతారకం ఆసుపత్రికి నిధుల కోసం ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాలు ప్రారంభించాం. మొదటి కార్యక్రమంలోనే సుమారు ఐదు కోట్ల రూపాయల నిధులు సమకూరాయి. ఆ తర్వాతి కాలంలో కూడా అనేకసార్లు ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాలు నిర్వహించాం. కేవలం డబ్బులు పంపటం మాత్రమే కాకుండా అత్యాధునిక మిషన్లను, టెక్నాలజీని కొనుగోలు చేసి ఆసుపత్రికి పంపటం మొదలుపెట్టాం.


‘ఇంతింతై వటుడింతై..’ అన్నట్లు ఆసుపత్రి నా కళ్ల ముందే పెరుగుతూ వచ్చింది. అనేక మంది దాతలు ఆసుపత్రి అభివృద్ధిలో తోడ్పడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌, ఎంపీల నుంచి ఫండ్స్‌ ఇప్పించడమే కాకుండా టాటా ఇనిస్టిట్యూట్‌ ద్వారా రూ.15 కోట్లతో ఒక రీసెర్చ్‌ వింగ్‌ను కూడా ఏర్పాటు చేయించారు. ఈ ఆసుపత్రికి మొదట డాక్టర్‌ శివప్రసాద్‌, ఆ తర్వాత డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు చైర్మన్లుగా వ్యవహరించారు. ఆ తర్వాత బాలకృష్ణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నందమూరి కుటుంబం నుంచి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తి ఆయనే. ఆసుపత్రి నిర్వహణలో కూడా స్టార్‌నని బాలకృష్ణ నిరూపించుకున్నారు. సబ్జెక్టును చురుగ్గా అర్థం చేసుకుంటూ, ఎన్నో ఒత్తిళ్లు తట్టుకుంటూ ఒక సమర్థవంతమైన అడ్మినిస్ట్రేటర్‌గా ఆసుపత్రి అభివృద్ధిలో క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రయాణంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి కూడా మాకు తోడ్పాటును అందిస్తున్నారు.

సాధారణంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులలో ‘క్యాన్సర్‌ కేర్‌’ ఒక విభాగం మాత్రమే. కానీ బసవతారకం ఆసుపత్రిని కేవలం క్యాన్సర్‌ చికిత్స, నివారణల కోసమే ప్రారంభించాం. అతి తక్కువ ఖర్చుతో సమర్థమైన క్యాన్సర్‌ చికిత్సను అందించే ఆసుపత్రిగా మంచి పేరు తెచ్చుకుంది. ఒక సాధారణ కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఏడాది పొడవునా చూసే క్యాన్సర్‌ కేసులు.. బసవతారకం ఆసుపత్రిలో ఒక నెలలోనే చూస్తారు. ఇక ఆసుపత్రి ప్రారంభంలో ఉన్న పాత తరం బోర్డు మెంబర్లలో మిగిలింది నేనొక్కడినే! పాతకు.. కొత్తకు మధ్య ఉన్న సంధానకర్తను కూడా నేనే!

ఈ ఆసుపత్రి ఏ ఆశయాలతో, విలువలతో ప్రారంభమైందో– వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా నాపై ఉందనేది నా ప్రగాఢ నమ్మకం. ఈ ఆసుపత్రిని మరింత ముందుకు తీసుకువెళ్లాలనేది మా లక్ష్యం. దీనిలో భాగంగానే ‘అట్వా’ను ‘ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆర్గనైజేషన్‌’గా మార్చాం. దీనికి నా భార్య సుభద్ర నోరి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. దీని ద్వారా అమెరికా నుంచి ఫండ్స్‌ సేకరించి హైదరాబాద్‌ ఆసుపత్రితో పాటు అమరావతిలో నిర్మిస్తున్న ఆసుపత్రికీ ఇవ్వబోతున్నాం. హైదరాబాద్‌ ఆసుపత్రిలో చేసిన అద్భుతాలను అమరావతిలోనూ పునరావృతం చేయాలనేదే మా లక్ష్యం. మంచిని కోరే ప్రజలందరి సహకారంతో దానిని సాధించగలమనే నమ్మకం ఉంది.

ఇవి కూడా చదవండి..

దుర్గమ్మ భక్తులకు మెరుగైన డిజిటల్ సేవలు: ఈవో శీనా నాయక్

యువతకు ప్రధాని మోదీ 24 కోట్ల ఉద్యోగాలు బాకీ: జగ్గారెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 20 , 2026 | 01:14 AM