Share News

జ్ఞానదీపం.. వీరేశలింగం గ్రంథాలయం

ABN , Publish Date - Jun 20 , 2026 | 01:08 AM

ఒక సంస్కర్త పేరును గ్రంథాలయానికి పెట్టడం, 1897లో స్థాపించిన ఆ గ్రంథాలయం 129 సంవత్సరాలుగా నిరాఘాటంగా పాఠకులకు జ్ఞానకాంతులు పంచుతూ రావడం ఓ చరిత్రాత్మక విశేషమే. ఈ జ్ఞాననిధికి...

జ్ఞానదీపం.. వీరేశలింగం గ్రంథాలయం

ఒక సంస్కర్త పేరును గ్రంథాలయానికి పెట్టడం, 1897లో స్థాపించిన ఆ గ్రంథాలయం 129 సంవత్సరాలుగా నిరాఘాటంగా పాఠకులకు జ్ఞానకాంతులు పంచుతూ రావడం ఓ చరిత్రాత్మక విశేషమే. ఈ జ్ఞాననిధికి వీరేశలింగం గారి పేరును పెట్టడంలోనే ఔచిత్యం ఉన్నది. కవిగా, పండితునిగా, నాటకకర్తగా పత్రికా సంపాదకునిగా, బడిపంతులుగా, సంఘ సంస్కర్తగా ఆయన కృషి ఎనలేనిది. రాజా రామ్మోహన్‌రాయ్ ప్రభావంతో ఆయన బ్రహ్మసమాజం– ఏకేశ్వరోపాసన వంటి ఆధ్యాత్మిక తత్వ ప్రచారం గావించిన కాలంలోనే ఈ గ్రంథాలయం ‘శ్రీ వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం’గా ఏర్పడింది.

వీరేశలింగం అభిమాని, మహనీయుడు, కథావశేషులు అయిన భూపతిరాజు తిరుపతిరాజు మహత్తర సంకల్పమే ఈ గ్రంథాలయం. ఆనాడు ఏ సుముహూర్తంలో స్థాపించారోగానీ శత, సహస్ర జయంతులు జరుపుకునేలా బలమైన పునాదులు వేశారు. మొదట ఇది చిన్న కుటీరంలో ప్రారంభమై, కొన్నాళ్లకు పెంకుటింట్లోకి మారి, చివరకు అందమైన, విశాల నూతన భవనంలోకి మారింది. ప్రారంభంలో ఈ గ్రంథాలయానికి కృష్ణా, జనానా, ఆంధ్రపత్రిక, భారతి పత్రిక... వంటివి వచ్చేవి. ఇప్పుడు అన్ని పత్రికలూ వస్తున్నాయి. ప్రాచీన కావ్యాలు, నవలలు, నాటకాలు జీవిత చరిత్రలతో పాటు సుమారు 14 వేల పుస్తకాలు ఈ గ్రంథాలయంలో ఉన్నవి. ఈ గ్రంథాలయం నిరంతరం చదువరులతో నిండి ఉంటుంది.

ఓసారి... తన పేరిట స్థాపించిన గ్రంథాలయం ఎలా నడుస్తున్నదో చూద్దామని మహనీయుడు వీరేశలింగం తన సతీమణి రాజ్యలక్ష్మమ్మతో 1906 సంవత్సరంలో కుముదవల్లి గ్రామానికి వచ్చారు. గ్రంథాలయాన్ని, అక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలను చూసి ఎంతగానో సంతోషించారు. అనంతర కాలంలో ఈ గ్రంథాలయాన్ని– కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, అడవి బాపిరాజు, ఉన్నవ లక్ష్మీనారాయణ, చెరుకువాడ నరసింహం పంతులు, పెద్దాడ రామస్వామి, జంధ్యాల పాపయ్యశాస్త్రి, డా॥. సి.నారాయణరెడ్డి, పాతూరి నాగభూషణం, దుగ్గిరాల బలరామకృష్ణయ్య, ప్రముఖ సంగీత విద్వాంసులు ఘంటసాల వెంకటేశ్వరరావు వంటి ప్రముఖులు సందర్శించి ముగ్ధులయ్యారు.


స్వాతంత్ర్య ఉద్యమంలో అంతర్భాగంగా గ్రంథాలయ ఉద్యమం సాగుతూ వచ్చింది. వాడవాడలా గ్రంథాలయాలు స్థాపించి జనాలలో విద్యావ్యాప్తి కలిగించాలనే మహదాశయ సంకల్పంతో, తిరుపతిరాజు ప్రోత్సాహంతో అయ్యంకి వెంకట రమణయ్య, కాళ్లకూరి నరసింహం, వావిలాల గోపాలకృష్ణయ్య, పాలకోడేటి సత్యనారాయణశర్మ.. వంటివారు ఓ పది పదిహేను మంది ఒక యాత్రగా బయలుదేరి గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. కుముదవల్లి గ్రామం స్వాతంత్య్ర పోరాటంలో విశేషంగా పాల్గొన్నది. గ్రామంలోని గ్రంథాలయ స్ఫూర్తితో యువత విద్యారంగంలోకి ప్రవేశించి ఇంజనీర్లుగా, లాయర్లుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా, పారిశ్రామికవేత్తలుగా నవభారత నిర్మాణంలో భాగస్వాములైనారు. ఈనాటికీ శ్రీ వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం విజ్ఞానవంతమైన కాంతులు వెదజల్లుతూ నిత్య కల్యాణం, పచ్చతోరణం వలె విలసిల్లుతున్నది. ఈ గ్రంథాలయం ప్రజల సహకార సౌజన్యంతో నడుస్తున్నది. కుముదవల్లి గ్రామంలో రాజకీయాలు ఉన్నా, గ్రంథాలయం పట్ల అందరిదీ ఒకేమాటగా నడుస్తున్నది.

‘శ్రీ వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం’ అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసరాజు, కార్యదర్శి భూపతిరాజు నాగేంద్రవర్మ, కార్యవర్గ సభ్యుల కృషి, సేవా తత్పరత అభినందనీయం. రాజమహేంద్రవరంలోని గౌతమీ గ్రంథాలయం, విజయవాడలోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం, వేటపాలెంలోని ప్రాచీన గ్రంథాలయం వంటి వాటి సరసన నిలవదగ్గ గొప్ప గ్రంథాలయం ఇది. సాంకేతికంగా ఎంతగా ఎదిగినా, పుస్తకం చదవడం ద్వారా మనకు కలిగే ఆనందం ఉన్నతమైన, దివ్యానుభూతి కలిగిస్తుంది.

l చెరుకువాడ వెంకటరామయ్య

(జూన్‌ 22: శ్రీ వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం వార్షికోత్సవం)

ఇవి కూడా చదవండి..

దుర్గమ్మ భక్తులకు మెరుగైన డిజిటల్ సేవలు: ఈవో శీనా నాయక్

యువతకు ప్రధాని మోదీ 24 కోట్ల ఉద్యోగాలు బాకీ: జగ్గారెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 20 , 2026 | 01:08 AM