మళ్ళీ కాలుదువ్వుతున్న ‘నాటో’
ABN , Publish Date - Jul 18 , 2026 | 02:31 AM
ఇటీవల అనేక సందర్భాల్లో నాటో మిలిటరీ కూటమి మధ్య ఐక్యత సన్నగిల్లిందన్న భావన అందరికీ కలిగింది. ఉదాహరణకు– గ్రీన్‌ల్యాండ్‌ను ఆక్రమిస్తామని అమెరికా అంటే.. నాటో కూటమిలో ఒక్క సభ్యదేశం కూడా...
ఇటీవల అనేక సందర్భాల్లో నాటో మిలిటరీ కూటమి మధ్య ఐక్యత సన్నగిల్లిందన్న భావన అందరికీ కలిగింది. ఉదాహరణకు– గ్రీన్‌ల్యాండ్‌ను ఆక్రమిస్తామని అమెరికా అంటే.. నాటో కూటమిలో ఒక్క సభ్యదేశం కూడా అమెరికాను బలపర్చలేదు. పైగా సభ్యదేశాలైన జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్ దేశాల సైనికులు గ్రీన్‌ల్యాండ్‌లో దిగి డెన్మార్క్‌కు అండగా నిలిచారు. ‘ఇరాన్‌పై దాడికి కలిసి రండి’ అని ట్రంప్ పిలుపునిస్తే స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, యూకే తదితర నాటో సభ్య దేశాలు తమకేమీ సంబంధంలేదని అమెరికాను ఏకాకిని చేశాయి. నాటో దేశాల ఒప్పందంలోని 5వ ఆర్టికల్ ‘అందరి కోసం ఒక్కరూ, ఒక్కరి కోసం అందరూ’ అన్న హామీ ప్రకారం, ఈ దేశాలపై ఏ దేశం దాడి చేసినా మిగతా దేశాలన్నీ కలిసికట్టుగా ఆ దేశంతో యుద్ధానికి దిగాలి. కానీ ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ తలపెట్టిన దాడికి మద్దతుగా ఈ ఆర్టికల్ అమలు కాలేదు. లోగడ ఇరాక్, అఫ్ఘానిస్థాన్‌లపై దాడికి నాటో దేశాలు తమతో కలిసివచ్చినట్టుగానే ఇప్పుడు ఇరాన్‌పై యుద్ధానికి కూడా కలిసి వస్తాయని ట్రంప్ ఊహించుకొని చివరకు భంగపడ్డాడు. ఎవర్ని అడిగి యుద్ధం ప్రారంభించావని ట్రంప్‌ను నాటో దేశాలు నిలదీశాయి. దీంతో నాటో నిలువునా చీలిపోయిందనే అంతా అనుకున్నారు. కానీ ఇటీవల టర్కీలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశం ఆ కూటమి మళ్లీ పటిష్ఠం అవుతుందన్న భావనను కలిగించింది. ‘‘మరింత బలమైన నాటోతో మరింత బలమైన ఐరోపా’’ అనే నినాదం నాటో 3.0 భావనను సాకారం చేయనుంది. దీని ప్రకారం, ఐరోపా తన రక్షణ బలాన్ని రష్యాకు వ్యతిరేకంగా పెంచబోతోంది. చైనాను ఎదుర్కోవడానికి అమెరికా తన బలగాలను ఆసియా పసిఫిక్‌లో కేంద్రీకరించబోతున్నది.
ఇటీవల టర్కీలో జరిగిన 32 సభ్య దేశాల నాటో కూటమి 36వ శిఖరాగ్ర సమావేశంలో ప్రతి సభ్యదేశం తన సైన్యం కోసం స్థూల దేశీయోత్పత్తిలో 5 శాతాన్ని ఖర్చు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అలాగే రష్యాకు వ్యతిరేకంగా 80 బిలియన్ల విలువ చేసే ఆయుధాల్ని ఉక్రెయిన్‌కు పంపాలని నాటో కూటమి నిర్ణయించింది. ఈ శిఖరాగ్ర సమావేశం కోసం ఎర్డోగాన్ ప్రభుత్వం టర్కీ రాజధాని అంకారాను దిగ్బంధించి, పదమూడు రోజుల పాటు అన్ని ప్రదర్శనలను నిషేధించింది. 225 మందిని అదుపులోకి తీసుకుని, 103 మందిని జైలులో పెట్టింది. సమావేశానికి ముందు మిత్ర దేశాల కంపెనీల మధ్య పదుల బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా అధిక లాభాల వేటకు పరుగెత్తే ఆయుధ కంపెనీలకు పండుగే.
రెండువేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల సుదూర క్షిపణులను నిర్మించడానికి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఈ సమావేశంలో 50 బిలియన్ డాలర్ల కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఈ దూరం మాస్కోను లక్ష్యంగా చేసుకోవడానికే. సిటీ గ్రూప్, డాయిష్ బ్యాంక్, బీఎన్‌పీ పారిబాస్‌తో సహా కొన్ని బ్యాంకులు వీటి నిర్మాణం కోసం ఇప్పటికే 217 బిలియన్ డాలర్లను సమీకరించాయి. అదే సమయంలో అమెరికా బడ్జెట్ 850 బిలియన్ల యూరోలుగా ఉంది. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ 2030 నాటికి పునరాయుధీకరణ కోసం 800 బిలియన్ల యూరోలను మానవ విధ్వంసానికి పాల్పడే ఆయుధాలకు కేటాయించటానికి తహతహలాడుతున్నారు.
నాటో కూటమి ఒకప్పటి సోవియట్ యూనియన్‌కు, సోషలిస్టు దేశాలకు వ్యతిరేకంగా ఏర్పడి, ప్రచ్ఛన్న యుద్ధానికి, ఆయుధ పోటీకి కారణమైంది. 1989లో జీడీఆర్– పశ్చిమ జర్మనీతో విలీనం సందర్భంగా గోర్బచెవ్–బుష్‌ల మధ్య పెద్దమనుషుల ఒప్పందం జరిగింది. దీని ప్రకారం, నాటో కూటమి తూర్పు ఐరోపాకు ఒక్క అంగుళం కూడా విస్తరించకూడదు. 1991 ప్రారంభంలో సోవియట్ యూనియన్, సోషలిస్టు దేశాలు పతనమైన తర్వాత రష్యా వార్సా సంధి కూటమిని రద్దు చేసుకుంది. కానీ, ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినా నాటో రద్దు కాలేదు. పైగా ఒప్పందాన్ని ఉల్లంఘించి రష్యాకు వ్యతిరేకంగా ఒకప్పటి తూర్పు సోషలిస్టు దేశాలకు నాటోను విస్తరించింది. కొన్ని బాల్టిక్ రిపబ్లిక్‌లు కూడా నాటోతో చేరాయి. ఇవన్నీ ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో అంతర్భాగంగా ఉండేవి. రష్యాలో బలహీనమైన ఆర్థిక వ్యవస్థతోపాటు, అప్పటి రష్యా అధ్యక్షుడు ఎల్సిన్ అసమర్థత కారణంగా నాటో చకాచకా పావులు కదిపి విస్తరించింది. ఇప్పుడది ఉక్రెయిన్‌ను అడ్డుపెట్టుకొని రష్యాను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోంది.
బుడ్డిగ జమిందార్
ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం
ఈ వార్తలనూ చదవండి:
130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు బ్రేక్!
భూరికార్డులు పౌరసత్వానికి రుజువులు కావు: కలకత్తా హైకోర్టు