Share News

సీఎస్‌డీఎస్‌ భవిష్యత్తేమిటి?

ABN , Publish Date - Jul 17 , 2026 | 03:11 AM

ఉన్నత విద్యా సంస్థలకు వ్యతిరేకంగా కూడా బుల్డోజర్‌ న్యాయం అమలవుతోంది! న్యూఢిల్లీలోని ‘అభివృద్ధి చెందుతున్న సమాజాల అధ్యయన కేంద్రం’ (సెంటర్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ డెవెలపింగ్‌ సొసైటీస్‌– సీఎస్‌డీఎస్‌)కు...

సీఎస్‌డీఎస్‌ భవిష్యత్తేమిటి?

ఉన్నత విద్యా సంస్థలకు వ్యతిరేకంగా కూడా బుల్డోజర్‌ న్యాయం అమలవుతోంది! న్యూఢిల్లీలోని ‘అభివృద్ధి చెందుతున్న సమాజాల అధ్యయన కేంద్రం’ (సెంటర్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ డెవెలపింగ్‌ సొసైటీస్‌– సీఎస్‌డీఎస్‌)కు ప్రభుత్వ ఆర్థిక సహాయంలో భారీ కోత విధించేందుకు ప్రభుత్వం పూనుకున్నట్టు ఈ నెల 10న వార్తలు వెలువడ్డాయి. సీఎస్‌డీఎస్‌ ఉనికిని రూపుమాపేందుకే ఆర్థిక సహాయం నిలిపివేతకు ప్రభుత్వం పూనుకున్నదనడంలో సందేహం లేదు.

బుల్డోజర్‌ న్యాయంలో వలే ఇక్కడ కూడా చట్ట నియమాలను తలకిందులు చేయడం జరిగింది. నేర న్యాయ నిర్ణయం (క్రిమినల్‌ జస్టిస్‌) ఒక నిర్దిష్ట క్రమంలో ఉంటుంది: ఒక నేరం సంభవిస్తుంది; దానికి రుజువులు లభిస్తాయి; అవి సంశయాత్మకంగా ఉంటాయి; సంశయాలు విచారణకు దారి తీస్తాయి; విచారణ నేర నిర్ధారణకు, శిక్షకు దోహదం చేస్తుంది. సీఎస్‌డీఎస్‌ విషయంలో ఈ ప్రక్రియ ముందుగానే గుర్తించిన అపరాధిపై బహిరంగంగా నేరారోపణతో ప్రారంభమయింది. న్యాయ సమర్థనకు అవసరమైన సాకులు సృష్టించారు. శిక్షను ఇంకా అమలుపరచకపోయినా ముందుగానే నిర్ణయమయింది. సామాజిక శాస్త్రాల అధ్యయనం, పరిశోధనలతో సంబంధమున్న సంస్థలు, వ్యక్తులు అందరికీ హెచ్చరికగా ఉండేలా ఆ శిక్ష విస్తృత ప్రభావశీలంగా ఉంటుంది.

భారతీయ వైజ్ఞానిక శాస్త్రాలకు ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌), బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్‌సీ) ఎలాంటివో భారతీయ సామాజిక శాస్త్రాలకు సీఎస్‌డీఎస్‌ అలాంటిది. దేశంలోను, విశాల ప్రపంచంలోను అగ్రశ్రేణి మేధావిగా సుప్రసిద్ధుడైన రజనీ కొఠారి 1963లో స్థాపించిన ఈ ఉన్నత విద్యాసంస్థలో స్వతంత్ర భారతదేశ మొదటి రెండు తరాల విఖ్యాత సామాజిక శాస్త్రవేత్తలు ఎందరో అధ్యాపకులుగా ఉన్నారు. ఆర్థికవేత్తలు, ప్రస్తుత అధ్యాపకులను మినహాయిస్తే ఆ ప్రముఖుల జాబితాలో అశీస్‌ నంది, డి.ఎల్‌ శేథ్‌, రామాశ్రయ్‌ రాయ్‌, గోపాల్‌ కృష్ణ, బషీరుద్దీన్‌ అహ్మద్‌, గిరి దేశింగ్‌కార్‌, సుధీర్‌ కాకర్‌, శివ్‌ విశ్వనాథన్‌, హర్ష్‌ సేథీ, సురేశ్‌ శర్మ, డి.ఆర్‌ నాగరాజ్‌, వి.బి సింగ్‌, రాజీవ్‌ భార్గవ, షయిల్‌ మాయారామ్‌, ఆదిత్య నిగమ్‌, అభయ్‌ దూబె తదితర మేధా దిగ్గజాలు ఉన్నారు. ఇంకా సుఖ్మొయ్‌ చక్రవర్తి, టి.ఎన్‌ మదన్‌, దీపక్‌ నయ్యర్‌, జేపీఎస్‌ ఓబరాయ్‌, మనోరంజన్‌ మొహంతి, పాట్రిషియా ఓబరాయ్‌, సుహాస్‌ పల్సీకర్‌ మొదలైన పండిత ప్రకాండులు కూడా సీఎస్‌డీఎస్‌ విస్తృత విద్యా కుటుంబంలోని వారే. రాజకీయాలు, సమాజం, సంస్కృతిపై మనదేశంలోను, ప్రపంచవ్యాప్తంగాను మేధా చర్చలలో సీఎస్‌డీఎస్‌ ఎందుకు ఒక ముఖ్య కేంద్రంగా ఉన్నదో ప్రస్తావిత అధ్యాపకుల జాబితా విశదం చేస్తుంది.


ప్రచ్ఛన్నయుద్ధ కాల సైద్ధాంతిక సమరంలో సీఎస్‌డీఎస్‌ ఒక మార్క్సిస్టేతర ఆలోచనా స్రవంతికి పేరుపొందింది. మార్క్సిస్టు భావజాలాన్ని అదెప్పుడూ వ్యతిరేకించలేదు. సామాజిక శాస్త్రాలను వలసవాద ఆలోచనలు, ప్రభావాల నుంచి విముక్తం చేసే అజెండా సీఎస్‌డీఎస్‌ మేధా ప్రస్థానంలో ఒక ముఖ్య భాగం. భారతీయ భాషలలో సామాజిక శాస్త్రాల అధ్యయనానికి పథ నిర్దేశం చేసింది కూడా సీఎస్‌డీఎస్ కావడం విశేషం. 1970 దశకంలో ఇందిర విధించిన ఎమర్జెన్సీని సీఎస్‌డీఎస్‌ తీవ్రంగా ప్రతిఘటించింది. అయితే 2014 నుంచి మారిన రాజకీయ పరిస్థితులలో ఈ సంస్థ ఉద్దేశపూర్వకంగానే తన రాజకీయ కార్యకలాపాలను తగ్గించుకున్నది.

సీఎస్‌డీఎస్‌ను బుల్డోజర్‌ దాడికి ఎందుకు ఎంపిక చేసుకున్నారో అర్థం చేసుకోవడం కష్టం. భారత ప్రజాస్వామ్య రాజకీయాలు, ఓటింగ్‌ ప్రవర్తనను అధ్యయనం చేసేందుకు 1997లో సీఎస్‌డీఎస్‌ ప్రారంభించిన లోక్‌నీతి కార్యక్రమమే ప్రధాన కారణమని నేను భావిస్తున్నాను. సర్వేల నిర్వహణలో ప్రామాణిక పద్ధతులకు, సమాచార నివేదనలో పారదర్శకతకు ఎటువంటి మినహాయింపులు లేకుండా నిబద్ధమై ఉన్న ఆ పరిశోధనా కార్యక్రమం గత మూడు దశాబ్దాలుగా దేశ పరిపాలనపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు విశ్వసనీయమైన ఆధారంగా ఉన్నది. పాలకుల వ్యక్తిగత అభిప్రాయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పరిశోధనా పద్ధతులను మార్చడం ఎట్టి పరిస్థితులలోను జరగదు. నిరంకుశ ప్రభుత్వాలు ఇటువంటి పరిశోధనలను హర్షించవు. ప్రజల్లో అశాంతి పెచ్చరిల్లుతున్న పరిస్థితులలో ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పుడు లోక్‌నీతి సర్వేలను పాలకులు సహిస్తారా? గతంలో సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌ను తీవ్ర ఆంక్షలకు గురి చేసినట్టుగానే ప్రపంచవ్యాప్తంగా సామాజిక శాస్త్ర జగత్తులో పేరు ప్రతిష్ఠలు ఉన్న సీఎస్‌డీఎస్‌ను కూడా పూర్తిగా కట్టడి చేస్తే విద్యావేత్తలు, మేధావులకు ఒక గట్టి సందేశాన్ని పంపవచ్చని పాలకులు భావించి ఉంటారు. సీపీఆర్‌, సీఎస్‌డీఎస్‌ను లక్ష్యంగా చేసుకున్నప్పుడు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేవారికి ఎటువంటి భద్రత ఉండబోదు అన్నదే ఆ సందేశం.


సీఎస్‌డీఎస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. దానిపై చర్యకు ఒక కారణాన్ని కనుగొనాలి. హాస్యాస్పదమైన అల్ప కారణమొకటి లభించింది. మహారాష్ట్రలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల సంఖ్యలో హెచ్చు తగ్గులు అసాధారణంగా ఉన్నాయంటూ సంబంధిత గణాంకాలను ప్రొఫెసర్‌ సంజయ్‌ కుమార్‌ ఆగస్టు 17, 2025న సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఓటర్ల సంఖ్య పెరుగుదల, తగ్గుదలను గణించడంలో తప్పులు జరిగాయి. ఇది గ్రహించిన ప్రొఫెసర్‌ సంజయ్‌ 48 గంటలలోనే జరిగిన తప్పుకు క్షమాపణ చెప్పి, సోషల్‌ మీడియా నుంచి ఆ గణాంకాల పోస్ట్‌ను తొలగించారు వాటి గురించి ఆయన ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు, వ్యంగ్య విమర్శలు చేయలేదు. చాలా సౌమ్య రీతిలో ఆ సమాచారాన్ని వెల్లడించారు. అప్పటికే ‘ఓట్‌ చోరీ’పై ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని సమర్థించేదిగా ఆ సమాచారం లేదు. ఒక పరిశోధనా కార్యక్రమ సమాచారాన్ని సంస్థాగతంగా వెల్లడించడం కూడా కాదది. ఏది ఏమైనా ఆ గణాంకాలలో తప్పు దొర్లిన మాట వాస్తవం. అయితే అది ఏమంత ప్రాధాన్యమున్నది కాదు. తప్పును గ్రహించిన వెంటనే దాన్ని సరిదిద్దుకోవడం జరిగిందన్నది గమనార్హం. సీఎస్‌డీఎస్‌పై చర్యకు మరో కారణం కూడా అధికార వర్గాలకు లభించింది. ఇదీ ఏమంత ప్రాధాన్యమున్న సమస్య కానేకాదు. ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియ అమలుపై నిర్వహించిన ఒక ఒపీనియన్‌ పోల్‌ ఫలితాలను సీఎస్‌డీఎస్‌ ఇటీవల వెల్లడించింది. ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై ప్రజల విశ్వాసం గణనీయంగా తగ్గిందన్నది ఆ సర్వే ఫలితాల సారాంశం. ఈ ఒపీనియన్‌ పోల్‌ వెల్లడించిన విషయాలలో విస్మయం కలిగించేవి ఏవీ లేవు. అయితే బీజేపీ శ్రేణులు ప్రొఫెసర్‌ సంజయ్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌ను, ఈ ఒపీనియన్‌ పోల్‌ ఫలితాలను తెలివిగా కలగలిపి సీఎస్‌డీఎస్‌పై విమర్శలకు ఉపక్రమించాయి. ఆ పార్టీ ట్రోల్‌ ఆర్మీ రంగంలోకి దిగింది. అలాగే విధేయ మీడియా కూడా. సీఎస్‌డీఎస్‌కు గుణపాఠం చెప్పాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి.

ట్రోల్‌ ఆర్మీ విమర్శలు వెల్లువెత్తిన వెన్వెంటనే అధికారిక నేరారోపణ జరిగింది. సీఎస్‌డీఎస్‌ లాంటి సామాజిక శాస్త్ర పరిశోధనా సంస్థలు అన్నిటికీ ఆర్థిక సహాయమందించే భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధనా మండలి (ఐసీఎస్‌ఎస్‌ఆర్‌) రంగంలోకి దిగింది. ‘సీఎస్‌డీఎస్‌ తన పరిశోధనా కార్యక్రమాల సమాచారాన్ని తారుమారు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, భారత ఎన్నికల సంఘం పవిత్రతకు కళంకం కలిగించే కథనాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, ఇవి నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమేనని ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ సామాజిక మాధ్యమాలలో ఆరోపించింది. విచారణ ప్రారంభం కాక మునుపే తీర్పు వచ్చేసింది!


బుల్డోజర్‌ న్యాయంలో వలే లక్ష్యం ఎంపికయింది. శిక్ష ఖరారయింది. అందుకు కారణాన్ని కూడా నిర్ణయించారు. ముందుగానే తీసుకున్న నిర్ణయం అమలుకు రంగాన్ని సిద్ధం చేసేందుకు ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ ఒక కమిటీని నియమించింది. ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ ఆరోపణలకు కాకుండా సమస్త ఇతర విషయాలపై కమిటీ సీఎస్‌డీఎస్‌ను తప్పుపట్టి, దానిపై నేరారోపణ చేసినట్టు మీడియా వార్తలు వెల్లడించాయి. ప్రతిపాదిత శిక్ష, సమాచారాన్ని తారుమారు చేసినందుకు కాదు. సర్కారీ వ్యవస్థలో ఎవరినైనా చిక్కుల్లో పెట్టేందుకు ఉపయోగించుకునే విషయాలనే సీఎస్‌డీఎస్‌కు వ్యతిరేకంగా ఉపయోగించుకున్నారు: నియామకాల నిబంధనల ఉల్లంఘన, ఉద్యోగులకు జీతభత్యాల చెల్లింపు లేదా చెల్లించకపోవడం, సమావేశాలను సక్రమంగా నిర్వహించకపోవడం, నిర్వహించిన వివరాలను నమోదు చేయకపోవడం మొదలైనవి.

ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ నియమించిన కమిటీ నివేదిక ఇంకా విడుదల కాలేదు. అయినప్పటికీ సీఎస్‌డీఎస్‌కు నిధుల మంజూరును ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ వెన్వెంటనే నిలిపివేసింది. ఏడాది కాలంగా అధ్యాపకులకు వేతనాలు చెల్లించేందుకు ఆ సంస్థ నానా ప్రయాసలు పడుతోంది. వారిలో అత్యధికులు ఎన్నికల వ్యవహారాలపై పరిశోధన చేస్తున్నవారు కాదు. ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ విధించిన శిక్షకు తీవ్ర బాధితులు బోధనేతర సిబ్బంది. పరిశోధనలతో ఎటువంటి సంబంధం లేని ఉద్యోగులు వారు. అనుషంగిక నష్టాలను, ప్రతికూల పరిణామాలను ఎవరు పట్టించుకుంటారు? సీఎస్‌డీఎస్‌ ప్రశస్త మేధా చరిత్ర నిలిచిపోనున్నదా?

యోగేంద్ర యాదవ్

(యోగేంద్ర యాదవ్‌ 1997 నుంచి 2003 వరకు సీఎస్‌డీఎస్‌ లోక్‌నీతి ఫౌండర్‌ డైరెక్టర్‌గా,

2004 నుంచి 2016 వరకు ఆ సంస్థ సీనియర్‌ ఫెలోగా ఉన్నారు)

ఈ వార్తలనూ చదవండి:

వెనక్కి తగ్గిన మెటా.. ఇన్‌స్టాగ్రామ్‌లో వివాదాస్పద ఏఐ ఫీచర్ తొలగింపు..

మరో ఏఐ మోడల్‌‌ను లాంచ్ చేసిన స్పేస్ఎక్స్ఏఐ

Updated Date - Jul 17 , 2026 | 03:11 AM